తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఆంధ్రప్రదేశ్‌కు లీకయ్యాయా, గైడెన్స్ సంస్థలో ఏం జరుగుతోంది?

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లోకేశ్, కీర్తన, పెట్టుబడులు, గైడెన్స్ సంస్థ, సీక్రెట్స్
ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రి విజయ్‌తో తమిళనాడు పరిశ్రమల శాఖామంత్రి కీర్తన
    • రచయిత, యలనియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

తమిళనాడులో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించే 'గైడెన్స్ తమిళనాడు' సంస్థలో భారీగా ఉద్యోగులను తొలగించారని, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సంబంధించిన రహస్య సమాచారం లీక్ అయిందని కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన ధృవీకరించని వార్తలపై తీవ్ర వివాదం చెలరేగింది.

ఈ ఆరోపణలను ఖండిస్తూ గైడెన్స్ సంస్థ వివరణ ఇచ్చింది.

ఈ ఏడాది జులైలో సంస్థలో ఎలాంటి సామూహిక రాజీనామాలు జరగలేదని ఉన్నత విద్య, మెరుగైన ఉద్యోగాలు, స్థల మార్పిడి, కుటుంబ పరిస్థితులు వంటి వ్యక్తిగత కారణాలతోనే కొందరు ఉద్యోగులు తప్పుకున్నారని గైడెన్స్ సంస్థ స్పష్టం చేసింది.

ఇతర సంస్థల్లో ఉద్యోగాలు వెతుక్కునే ఉద్యోగుల వృత్తిపరమైన ప్రాధాన్యాలను తాము గౌరవిస్తామని గైడెన్స్ పేర్కొంది.

దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు తమిళనాడు ఇప్పటికీ అనువైన రాష్ట్రంగా ఉందని పెట్టుబడులను ఆకర్షించడంలో పొరుగు రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీ ఉందని ఆ వివరణలో తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లోకేశ్, కీర్తన, పెట్టుబడులు, గైడెన్స్ సంస్థ, సీక్రెట్స్
ఫొటో క్యాప్షన్, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సదస్సులో లోకేష్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి పోస్ట్.. మంత్రి కీర్తన కౌంటర్

ఈ వివాదాల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం తన 'ఎక్స్' ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.

"బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అత్యంత రహస్య పెట్టుబడుల వ్యూహం లీక్ అయింది. అదేంటంటే 'పెట్టుబడిదారుల విషయంలో సత్వర స్పందన'. మీరు కూడా దీన్ని స్వేచ్ఛగా అనుసరించవచ్చు!" అని ఆ పోస్ట్‌లో రాశారు.

మంత్రి లోకేశ్ పోస్ట్‌పై తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన స్పందించారు

"వేగంగా స్పందించడం మంచిదే. కానీ అంతకంటే వేగంగా కార్యాచరణలోకి దిగడం ఇంకా మంచిది! 'సక్సెస్‌ఫుల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ కాన్ఫరెన్స్ 2026' రెండో ఎడిషన్‌కు తమిళనాడు సిద్ధమవుతోంది!" అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాశారు.

"మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. పెట్టుబడుల ఒప్పందాలు, వాటి అమలుకు లక్ష్యాలు, క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యే ప్రాజెక్టులు, తద్వారా ఉపాధి కల్పన. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నాయకత్వంలో పెట్టుబడుల ఒప్పందాలను క్షేత్రస్థాయిలో వాస్తవ రూపంలోకి తీసుకురావడంపైనే మేం దృష్టి సారించాం" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లోకేశ్, కీర్తన, పెట్టుబడులు, గైడెన్స్ సంస్థ, సీక్రెట్స్
ఫొటో క్యాప్షన్, హోసూరు వంటి అభివృద్ధి చెందుతున్న కేంద్రాల్లో అవకాశాలను విస్తరిస్తూనే, చెన్నై అంతటా ప్రపంచ స్థాయి జీసీసీ కారిడార్లను నిర్మించడంపై దృష్టి సారించినట్లు మంత్రి కీర్తన ఎక్స్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో తెలిపారు.

వివాదం ఏంటి?

గత కొన్ని రోజులుగా గైడెన్స్ సంస్థలో పనిచేస్తున్న సుమారు 15 మంది ఉద్యోగులను తొలగించారని, మరికొందరిని సస్పెండ్ చేశారనీ పలు మీడియా సంస్థల్లో ధృవీకరించని వార్తలు వచ్చాయి.

గైడెన్స్ సంస్థలోని కొందరు ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెట్టుబడులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించారనీ వారిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థల్లో చేరారని కథనాలు వెలువడ్డాయి.

అయితే ఈ ఆరోపణలేవీ ఇప్పటివరకు అధికారికంగా నిర్ధరణ కాలేదు.

గైడెన్స్ నుంచి బయటకు వెళ్లినవారు ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తెలంగాణలోని పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థల్లో చేరినట్లు ఈ మీడియా కథనాలు తెలిపాయి.

దీనిపై మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎక్కువ మంది ఉద్యోగులు జూన్‌లోనే ఉద్యోగాలకు రాజీనామా చేశారని అందులో తెలిపారు.

జూన్ 29, 2026 నే వారికి రిలీవింగ్ లెటర్లు ఇచ్చారని, వేరే రాష్ట్రాల్లో పని చేస్తున్న వారిని తప్పుగా చిత్రీకరించడం సమంజసం కాదని ఆయన అన్నారు.

జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన గైడెన్స్ సంస్థలో అన్నాడీఎంకే హయాంలో నియమితులైన ఉద్యోగులను డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగనిచ్చారని ఆయన పేర్కొన్నారు.

తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోవడానికి ప్రస్తుత ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, వైఖరే కారణమని పళని స్వామి తెలిపారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లోకేశ్, కీర్తన, పెట్టుబడులు, గైడెన్స్ సంస్థ, సీక్రెట్స్
ఫొటో క్యాప్షన్, 1992లో గైడెన్స్ సంస్థ ఏర్పాటైంది.

గైడెన్స్ సంస్థ చరిత్ర ఏంటి?

తమిళనాడుకు విదేశాలతో పాటు ఇండియాలోని ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 1992లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత హయాంలో 'గైడెన్స్' సంస్థను ఏర్పాటు చేశారు.

తమిళనాడులో వ్యాపారం ప్రారంభించాలనుకునే కంపెనీలకు మార్గనిర్దేశం చేయడం, పెట్టుబడిదారులతో చర్చలు జరపడం, వ్యాపార అనుమతులు పొందడంలో సహాయపడటం, భూమి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేయడం వంటి బాధ్యతలను ఈ సంస్థ నిర్వహిస్తుంది.

తమిళనాడు పారిశ్రామిక పెట్టుబడి విధానాలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడంలో, అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

దీని కోసం తమిళనాడు ప్రభుత్వం అనేక పెట్టుబడిదారుల భేటీలు, ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులను నిర్వహించింది.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లోకేశ్, కీర్తన, పెట్టుబడులు, గైడెన్స్ సంస్థ, సీక్రెట్స్
ఫొటో క్యాప్షన్, గైడెన్స్ సంస్థ ఉద్యోగులపై విమర్శలు సమంజసం కాదని మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి అన్నారు.

రాజకీయ పార్టీల విమర్శలు

గైడెన్స్ వ్యవహారంపై గత డీఎంకే ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన టి.ఆర్.బి. రాజా, మాజీ ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ తదితరులు స్పందించారు.

గైడెన్స్ వివరణను ప్రస్తావించిన మాజీ మంత్రి టీఆర్‌బీ రాజా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారనే వార్తలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారనే వార్తలకు మధ్య చాలా తేడా ఉందని అన్నారు.

"గైడెన్స్ సంస్థ వివరణ ప్రకారం ఎలాంటి సామూహిక రాజీనామాలు జరగలేదు. కానీ, మీడియా కథనాలు మాత్రం సామూహిక తొలగింపుల గురించి మాట్లాడాయి" అని ఆయన ఎత్తిచూపారు.

ఏళ్ల తరబడి తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి కోసం పనిచేసిన అనుభవజ్ఞులైన అధికారులున్న సంస్థను రాజకీయ వివాదంలోకి లాగడం విచారకరమని ఆయన అన్నారు.

ప్రభుత్వాలు మారినా గైడెన్స్ ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, తమిళనాడు పారిశ్రామికాభివృద్ధే వారి ప్రధాన లక్ష్యం కావాలని రాజా నొక్కిచెప్పారు.

"నిర్ణయాధికారం లేని కొద్దిమంది కాంట్రాక్ట్ మధ్యస్థాయి ఉద్యోగులు ఒక రాష్ట్ర పెట్టుబడుల వృద్ధిని నిర్ణయించగలరా?" అని మాజీ ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాల్లో గైడెన్స్ సీఈఓ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమల మంత్రి, పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ, మంత్రివర్గానికే కీలక బాధ్యతలు ఉంటాయని ఆయన గుర్తుచేశారు.

కంపెనీలు ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలా లేదా మరో రాష్ట్రానికి వెళ్లాలా అని నిర్ణయించుకునేటప్పుడు ఆ రాష్ట్ర విధానాలు, మౌలిక సదుపాయాలు, రాయితీలతో సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయని ఆయన అన్నారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లోకేశ్, కీర్తన, పెట్టుబడులు, గైడెన్స్ సంస్థ, సీక్రెట్స్
ఫొటో క్యాప్షన్, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి టి.ఆర్.పి. రాజా

రహస్య సమాచారం ఉంటుందా? మాజీ ఐఏఎస్ అధికారులు ఏమంటున్నారు?

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో గోప్యంగా ఉంచాల్సిన పత్రాలు, సమాచారం ఉంటాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి. శివగామి బీబీసీతో చెప్పారు. ఇందుకు బడ్జెట్‌ను ఉదాహరణగా చూపారు.

బడ్జెట్‌లో ప్రకటించబోయే ముఖ్యమైన రాయితీలు, సంస్కరణలు ముందే బయటకు వస్తే, ఇతర రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ రాయితీలను ప్రకటించి పెట్టుబడిదారులను తమ రాష్ట్రాలకు ఆకర్షించే అవకాశం ఉందని ఆమె అన్నారు.

అదేవిధంగా పరిశ్రమల స్థాపన కోసం వచ్చే పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీలు, భూముల ధరలు, ఉచిత భూమి, తాగునీరు సహా మౌలిక సదుపాయాలపై చర్చలు జరుగుతుంటాయని అలాంటి సమాచారం ఇతర రాష్ట్రాలకు చేరితే పెట్టుబడులను ఆకర్షించడంలో పోటీ ఎదురవుతుందని వివరించారు.

గైడెన్స్‌లో పనిచేసేవారు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పటికీ, రహస్య సమాచారాన్ని కాపాడాల్సిన చట్టపరమైన బాధ్యత వారిపై ఉంటుందని శివగామి స్పష్టం చేశారు. "అధికారిక రహస్యాల చట్టం, సమాచార సాంకేతిక చట్టం వంటి చట్టాల కింద వారికి బాధ్యతలు వర్తిస్తాయి. అనుమతి లేకుండా అలాంటి సమాచారాన్ని పంచుకోవడం నేరపూరిత చర్య అవుతుంది" అని ఆమె అన్నారు.

గైడెన్స్ ఉద్యోగులు ఇతర రాష్ట్రాల్లో నియమితులైనంత మాత్రాన రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు భావించలేమని మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనవేల్ బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మొదటి పదవీకాలంలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి తీవ్రంగా కృషి చేశారని, శ్రీసిటీ వంటి పారిశ్రామికాభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు.

ఆ కాలంలో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి భారీ స్థాయిలో రాయితీలు ఇచ్చారని, నేడు ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

తమిళనాడులో కూడా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయని, ఒకవేళ పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటే అందుకు గల కారణాలను పారిశ్రామిక విధానాలు, రాయితీలు, పెట్టుబడి వాతావరణం కోణంలో పరిశీలించాలని ఆయన అన్నారు.

పెట్టుబడిదారులతో జరిగే ముఖ్యమైన చర్చలను మంత్రులు, పరిశ్రమల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు నేరుగా నిర్వహిస్తారని, కేవలం కొద్దిమంది మధ్యస్థాయి ఉద్యోగుల సమాచారం ఆధారంగానే అలాంటి నిర్ణయాలు తీసుకోరని ధనవేల్ స్పష్టం చేశారు.

ఉద్యోగులు ఇతర రాష్ట్రాల్లోని పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థల్లో పనిచేయడానికి వెళ్లడం సహజమైన ఉపాధి మార్పు అని తమ గత అనుభవాన్ని ఉపయోగించి వారు అవే కంపెనీలతో కలిసి పనిచేయవచ్చని ఆయన వివరించారు.

కాబట్టి, వారు ఇతర రాష్ట్రాల్లో చేరినంత మాత్రాన వారిని గూఢచారులుగానో లేదా తమిళనాడుకు వ్యతిరేకంగా పనిచేసిన వారిగానో ముద్ర వేయలేమని ఆయన అన్నారు.

రహస్య సమాచారం బయటకు పొక్కిందనే అనుమానం ఉంటే ప్రభుత్వం విచారణ జరిపి ఇందులో ఎవరి ప్రమేయం ఉందో బయటపెట్టాలని ఇప్పటివరకు అలాంటి విచారణ ఫలితాలేవీ బహిర్గతం కాలేదని ఆయన ఎత్తిచూపారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లోకేశ్, కీర్తన, పెట్టుబడులు, గైడెన్స్ సంస్థ, సీక్రెట్స్
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించిన ఎంఓయూలలో ఎన్ని కార్యరూపం దాల్చాయో చెప్పాలని బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ డిమాండ్ చేశారు.

మరో ‘సదస్సు’ ఎందుకు : తమిళిసై

ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే నవంబర్ 25న రెండో 'సక్సెస్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కాన్ఫరెన్స్' నిర్వహించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

పెట్టుబడుల ఒప్పందాలను ఆచరణాత్మక ప్రాజెక్టులుగా మార్చడం, పారిశ్రామికాభివృద్ధిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

అయితే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సదస్సు అవసరాన్ని ప్రశ్నించారు.

తమిళనాడు నుంచి పారిశ్రామిక పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే వార్తలు వస్తున్న తరుణంలో మరో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆమె నిలదీశారు.

కొత్త పెట్టుబడులను ఆకర్షించడం కంటే ఇప్పటికే ఉన్న పరిశ్రమలను నిలుపుకోవడానికి తమిళనాడు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇప్పటివరకు ప్రకటించిన ఎంఓయూలలో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ అంశంపై పరిశ్రమల శాఖ మంత్రి కీర్తనను బీబీసీ సంప్రదించింది.

అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

గైడెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ దీపక్ జాకబ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినా ఆయన కూడా స్పందించలేదు.

తమిళనాడు పరిశ్రమల శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ బీబీసీ అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ ప్రస్తుతం తాను పర్యటనలో ఉన్నానని, తిరిగి వచ్చిన తర్వాత సమాధానం ఇస్తానని తెలిపారు.

ఆయన స్పందన రాగానే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)