‘‘మొదటిసారి విత్‌డ్రా చేసుకున్నప్పుడు కంపెనీ వాళ్లు ఇంటికొచ్చి డబ్బులిచ్చే వాళ్లు’’... అది చూసే చాలామంది ఆశపడ్డారా?

- రచయిత, ప్రభురావు ఆనందన్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
యాప్‌లలో పెట్టుబడి పెడితే 40 నుంచి 45 రోజుల్లో డబ్బు రెట్టింపు అవుతుందని తమను నమ్మించడంతో...పెట్టుబడి పెట్టి డబ్బు కోల్పోయామని వేలమంది బాధితులు ఆందోళనకు దిగారు. ఎఫ్‌క్యూఎల్, వీజీ వంటి యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోయామని తమిళనాడులోని మదురై, దిండిగల్, శివగంగ, విరుదునగర్ జిల్లాలకు అనేకమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మల్టీ-లెవల్ మార్కెటింగ్, క్రిప్టో ట్రేడింగ్ పేరిట ఎఫ్‌క్యూఎల్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్, ఎఫ్‌క్యూఎల్ ఎక్స్చేంజ్ యాప్, వీజీ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ సిండికేట్ అనే పేర్లతో ఈ స్కీమ్‌ను నడిపారని తమిళనాడు పోలీసులు చెప్పారు.
అయితే, ఎంత మొత్తంలో సొమ్మును ప్రజలు మోసపోయారో పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
కాసంపట్టి గ్రామంలోని చాలా కుటుంబాలు దీన్ని వల్ల ప్రభావితమయ్యాయని బీబీసీ తెలుసుకుంది. వారు ఇందులో ఎలా చిక్కుకుపోయారో తెలుసుకోవడానికి బీబీసీ అక్కడికి వెళ్లింది.
మదురై రోడ్డులో నాథమ్ నగర్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో కాసంపట్టి ఉంది.

‘‘చిన్నవారి నుంచి పెద్దవారి వరకు పెట్టుబడులు పెట్టారు’’
కొంతమంది గ్రామస్థులతో మాట్లాడటానికి బీబీసీ ప్రయత్నించినప్పుడు, వారిలో కొందరు డబ్బులు కోల్పోయి తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని చెప్పారు. కొందరు దీనిపై మాట్లాడటానికి విముఖత చూపుతూ.. ''ఇప్పటికే మేం డబ్బులు పోగొట్టుకున్నాం. ఎలా మోసపోయామో చెబుతూ మా పరువు కూడా పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు'' అని అన్నారు.
గ్రామంలో 600 కుటంబాలకు పైగా ఉంటున్నాయని అదే గ్రామానికి చెందిన ముత్తు స్వామి అనే వృద్ధుడు చెప్పారు. చాలా కుటుంబాలకు చెందిన ఒకరి కంటే ఎక్కువ మందే ఈ యాప్‌లలో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అయితే ఎంతమంది పెట్టుబడి పెట్టారో అధికారికంగా తమకు తెలియదన్నారు.
"మా బంధువు ఒకరు, ఆన్లైన్ యాప్‌లో డబ్బు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుందని చెప్పారు. జనవరిలో రూ. 50,000 చెల్లించి అకౌంట్ తెరిచిన చాలామంది రూ. 1 లక్ష వరకు పొందారు. అది చూసి మా గ్రామంలోని చాలా మంది అందులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు" అని ముత్తుసామి తెలిపారు.

‘పెట్టుబడి పెట్టేందుకు బంగారం తనఖా పెట్టాం’
మూడు అకౌంట్లు తెరిచి, మొత్తం నాలుగున్నర లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ముత్తు స్వామి చెప్పారు. "గత మార్చిలో మొదట రూ. 50,000 పెట్టుబడి పెట్టాను. దానికి నాకు రూ. 1 లక్ష వచ్చాయి. నేను ఆ మొత్తాన్ని కూడా తిరిగి యాప్‌లోనే పెట్టుబడిగా పెట్టాను. కానీ, తర్వాత నాకు డబ్బు రాలేదు" అని తెలిపారు.
కాసంపట్టిలో టీ దుకాణం నడుపుతున్న సెల్వం, తన భార్య బంధువు చెప్పారని ఎఫ్‌క్యూఎల్ యాప్‌లో చేరినట్లు తెలిపారు.
"నా భార్య బంగారు గొలుసును ఒక దుకాణంలో తాకట్టు పెట్టాను. దానితో పాటు వచ్చిన రూ. 50,000 పెట్టుబడిగా పెట్టాను. 45 రోజుల్లో నాకు లక్ష రూపాయలు వచ్చాయి. ఎఫ్‌క్యూఎల్ కంపెనీ తరఫున వచ్చానని చెప్పుకున్న ఒక వ్యక్తి, డబ్బును తీసుకుని, నా సెల్ఫోన్లో యాప్‌ను డౌన్లోడ్ చేశారు. మొదట్లో నా అకౌంట్లో 500 డాలర్లు (రూ.47,245) ఉన్నట్లు చూపించింది" అని సెల్వం చెప్పారు.
యాప్‌లో రోజుకు మూడుసార్లు వచ్చే 'సిగ్నల్' నోటిఫికేషన్లపై ట్యాప్ చేసినప్పుడు, తన అకౌంట్లో చూపించిన మొత్తం పెరిగిందని తెలిపారు. అది నిజమైన యూఎస్ డాలర్లా, యూఎస్డీటీ వంటి క్రిప్టో అసెట్నా, లేదా కేవలం యాప్‌లో చూపిన అకౌంట్ బ్యాలెన్స్నా అనేది ఆయన చెప్పలేకపోయారు.
అలా వచ్చిన మొదటి లక్ష రూపాయలను, వీజీ యాప్‌లో తన కూతురి పేరు మీద కొత్త అకౌంట్ తెరిచి తిరిగి పెట్టుబడిగా పెట్టినట్లు సెల్వం చెప్పారు.
"నా మొదటి పెట్టుబడిపై రెట్టింపు లాభం రావడంతో, నా దుకాణానికి వచ్చే సుమారు 20 మందిని ఈ యాప్‌లో చేర్చాను. అందుకుగాను నాకు వారానికి రూ. 1,500, లేదా నెలకు రూ. 6,000 చెల్లించారు" అని ఆయన తెలిపారు.
కొత్త అకౌంట్లు తెరిచినప్పుడు, కంపెనీ సభ్యులుగా పరిచయం చేసుకున్న వ్యక్తులు స్వయంగా వచ్చి డబ్బు తీసుకునేవారని, అలాగే మొదట డబ్బు విత్‌డ్రా చేసినప్పుడు కూడా స్వయంగా వచ్చి ఇచ్చేవారని చెప్పారు.
''ఈ యాప్ ద్వారా డబ్బు సంపాదించి, జీవితంలో ముందుకు సాగవచ్చనే ఆశతో.. లక్షల రూపాయలు చెల్లించి మేం మోసపోయాం. మేం దిండిగల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాం'' అని సెల్వం తెలిపారు.

యువకుడి మరణంపై కుటుంబం అనుమానం
ఈ పెట్టుబడి పథకంలోకి ఇతరులను రిక్రూట్ చేసుకున్న కాసంపట్టికి చెందిన రాసు అనే యువకుడు మరణించారు. రాసు ద్వారా ఈ స్కీమ్‌లోకి 200 మందికి పైగా చేరినట్లు ఆయన కుటుంబం తెలిపింది. బీబీసీ దీన్ని స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. రాసు కుటుంబాన్ని బీబీసీ కలిసింది.
"ఆయన చాలామందిని ఈ స్కీమ్‌లోకి చేర్చినప్పటికీ, దాని ద్వారా చెప్పుకోదగ్గ డబ్బు ఏమీ సంపాదించలేదు" అని రాసు సోదరుడు పోతియాన్ చెప్పారు.
ఆ యాప్‌ను మోసాలకు వాడుతున్నారనే వార్త వ్యాపించడంతో రాసు కొత్తవారిని చేర్చుకోవడం ఆపేశాడని తెలిపారు.
యాప్‌ను మూసివేసిన తర్వాత, రాసు ద్వారా డబ్బు చెల్లించిన వారు తమ ఇళ్లకు వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేశారని పోతియాన్ తెలిపారు.
''ఆరోజు మధ్యాహ్నం రాసు ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత బయటికి వెళ్లాడు. సాయంత్రం వరకు తిరిగి రాలేదు. చివరికి గ్రామంలోని ఒక ప్రాంతంలో నా సోదరుడి మృతదేహం దొరికింది'' అని పోతియాన్ చెప్పారు.

రాసు మరణంతో మదురై-నాథమ్ జాతీయ రహదారిపై గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. తమ డబ్బులను తిరిగి రికవరీ చేయించాలని, దీనిలో ప్రమేయం ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
కొడుకు మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు రాసు తల్లి అంజమ్మల్.
"నా కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. అతని మరణానికి కారణమైన వారిపై, అలాగే డబ్బును మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి" అని కోరారు.
కుటుంబ సభ్యుల ఆరోపణలపై నాథమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గుణశేఖరన్‌తో బీబీసీ మాట్లాడింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేయడంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
పోలీసుల దర్యాప్తులో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లభించలేదని, ఆత్మహత్య ప్రాతిపదికన దర్యాప్తు కొనసాగుతోందని గుణశేఖరన్ చెప్పారు.

'25 ఏళ్లు వెనక్కి వెళ్లా'
కాసంపట్టి గ్రామానికి చెందిన వారు మాత్రమే కాకుండా.. ఇతర ప్రాంతాల వారు కూడా దీనికి ప్రభావితులయ్యారు. మదురై జిల్లాలోని ఒత్తకడాయికి చెందిన షేఖ్ అబ్దుల్లాతో బీబీసీ మాట్లాడింది.
నిర్మాణ రంగంలో పనిచేసే తన అత్త, యాప్ ద్వారా చెల్లింపులు చేసి రెట్టింపు లాభాలు పొందుతున్నారని తెలుసుకున్న తర్వాత తాను ఆ యాప్‌లో చేరానని ఆయన చెప్పారు.
తన పేరు మీద, తన భార్య పేరు మీద రెండు అకౌంట్లు తెరిచినట్లు తెలిపారు. తన నగలను తాకట్టు పెట్టి, రుణం తీసుకున్నట్లు చెప్పారు.
''కొత్త వారిని చేర్చితే, అదనంగా డాలర్లు పొందుతానని నాకు చెప్పడంతో.. అది నమ్మి ముగ్గుర్ని ఈ స్కీమ్‌లోకి చేర్చాను. వారు కూడా వారి ఆభరణాలను తనఖా పెట్టి, పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. నేను అకౌంట్ తెరిచిన 25 రోజుల తర్వాత యాప్ డిసేబుల్ అయింది. ఈ పెట్టుబడి వల్ల నా జీవితంలో 25 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర చిల్లుగవ్వ కూడా లేదు'' అని అబ్దుల్లా చెప్పారు.

'సిగ్నల్ నొక్కితే చాలు, డాలర్లు పడేవి'
ఆన్లైన్ యాప్ ద్వారా డబ్బు చెల్లించి మోసపోయిన మదురైలోని ఒత్తకడాయికి చెందిన ఆనంది బీబీసీతో మాట్లాడారు.
''నాన్న ఈ యాప్‌లో డబ్బులు పెట్టి, రెండింతలు ఎక్కువ లాభాలు పొందారు. అదే ఆశతో, నా సోదరి, నేను కూడా ఈ యాప్‌లో నాలుగున్నర లక్షలు పెట్టుబడిగా పెట్టాం. దీనిలో చేరతామని ఏజెంట్లకు మేం చెప్పినప్పుడు, వారు నేరుగా మా ఇంటికి వచ్చి, ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసి, ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకుని, అకౌంట్ తెరిచారు'' అని ఆనంది తెలిపారు.
ఈ యాప్ ఎలా పనిచేసేదో ఆనంది బీబీసీకి వివరించారు. ''మేం చెల్లించే ప్రతి రూ.50 వేలకు మా అకౌంట్లోకి 500 డాలర్లు క్రెడిట్ అయ్యేవి. రోజుకు మూడుసార్లు సిగ్నల్స్ వచ్చేవి. ప్రతిసారి 4 డాలర్ల నుంచి 6 డాలర్లు అకౌంట్లోకి క్రెడిట్ అయ్యేవి'' అని చెప్పారు.
''డబ్బులు రావడం చూసి రెండు యాప్‌లలో మేం ఇన్వెస్ట్ చేశాం. ప్రతి ఒక్కరిలాగానే, మేం కూడా ఆశపడి దీనిలో చేరాం. ఇందులో దాచడానికి ఏమీ లేదు'' అని ఆనంది అన్నారు.
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆనంది కోరారు. కనీసం తాము చెల్లించిన డబ్బులన్నా వెనక్కి వచ్చేలా చేయాలన్నారు.
మదురై, దిండిగల్‌తో సహా 4 కంటే ఎక్కువ జిల్లాల్లో జరిగిన ఈ మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులను ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు.

పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందగలరా?
పోలీసు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కొందరి నుంచి నగదు రూపంలో, మరికొందరి నుంచి జెడ్పే, యూపీఐ రూపంలో డబ్బులు తీసుకున్నారు. అందులో కొంత భాగాన్ని యూఎస్‌డీటీగా (టెథర్) మార్చి ఎఫ్‌క్యూఎల్, వీజీ వాలెట్లలో జమ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కుంభకోణానికి సంబంధించి మదురైలో మూడు, దిండిగల్, విరుదునగర్, శివగంగలలో ఒక్కొక్కటి చొప్పున నమోదైన ఆరు కేసులను ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు.
సెప్టెంబర్ 1న విడుదల చేసిన పోలీసు నివేదిక ప్రకారం, 17 మందిని అరెస్టు చేయగా, 13 బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేశారు. ఇందులో క్రిప్టో వాలెట్లు, విదేశీ సంబంధాలు ఉన్నాయేమోనని కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తక్కువ సమయంలో తమ పెట్టుబడిని రెట్టింపు చేస్తామని చెప్పే స్కీమ్‌లను ప్రజలు నమ్మొద్దని, క్రిప్టో పెట్టుబడులు అధిక ప్రమాదమని సైబర్ క్రైమ్ లాయర్ కార్తికేయన్ హెచ్చరించారు.
"భారత్‌లో స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లాగా క్రిప్టో ఆస్తులు పూర్తిగా సెబీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి రావు. కానీ, క్రిప్టో సర్వీసు ప్రొవైడర్లకు ఎలాంటి రూల్స్ లేవన్నది కూడా నిజం కాదు. వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్లు తప్పనిసరిగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో నమోదు చేసుకోవాలి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేవైసీతో సహా నియమాలను పాటించాలి. ఆ రిజిస్ట్రేషన్ అనేది పెట్టుబడి భద్రతకు ప్రభుత్వ హామీ కాదు" అని వివరించారు.
" డిజిటల్ లావాదేవీ ద్వారా చెల్లింపులు జరిగితే, వెంటనే ఫిర్యాదు చేసినప్పుడు, డబ్బు వెళ్లిన బ్యాంకు అకౌంట్లను గుర్తించి, అందులోని మొత్తాన్ని స్తంభింపజేయొచ్చు. కానీ, అకౌంట్ స్తంభింపజేసినంత మాత్రాన పూర్తి మొత్తం తిరిగి వస్తుందనే హామీ లేదు. ఒకవేళ డబ్బును అప్పటికే నగదు రూపంలో విత్ డ్రా చేసుకున్నా లేదా పలు అకౌంట్లకు లేదా క్రిప్టో వాలెట్లకు బదిలీ చేసినా, దానిని రాబట్టడం కష్టతరం కావచ్చు" అని చెప్పారు.
"బాధితులు చెల్లింపు రశీదులను, బ్యాంకు లేదా యూపీఐ రికార్డులను, యాప్ స్క్రీన్షాట్లను, ఏజెంట్లతో జరిపిన సంభాషణలను, ఇతర పత్రాలను దాచి, దర్యాప్తు కోసం వాటిని పోలీసులకు లేదా ఆర్థిక నేరాల విభాగానికి అందించాలి" అని పోలీసులు సూచించారు.
ఆన్లైన్ ఆర్థిక మోసంలో డబ్బు పోగొట్టుకున్న వారు వెంటనే 1930కు కాల్ చేయాలి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి.
ముఖ్య గమనిక
- మానసిక ఆరోగ్య సమస్యలను మెడికేషన్, థెరపీతో సులభంగా నయం చేయవచ్చు. ఇందుకోసం హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
- స్నేహ ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ - 044 -24640050 (24 గంటలు)
- రాష్ట్ర ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ - 104 (24 గంటలు)
- సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ – 1800-599-0019
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























