తన కుమార్తెల చదువు కోసం ఉత్తకాళ్లతో పరుగుపందెం గెలిచిన ఈ తల్లి కథ ఏంటి, ఆమె ఏం చెబుతున్నారు?

రమాబాయి, మారథాన్ పరుగు పందెం, కుమార్తెల చదువులు, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Kiran Sakle/BBC

    • రచయిత, శ్రీకాంత్ బంగాలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

" నా ఊపిరున్నంతవరకు నా పిల్లలను చదివిస్తాను. నా ప్రాణం పోయాక ఏం జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది. తల్లిగా నా కర్తవ్యాన్ని తప్పకుండా నెరవేరుస్తా"

రమాబాయి రణ్‌వీర్ చెప్పిన ఈ మాటలు కేవలం ఆమె అభిలాషే కాదు, జీవితాంతం ఆమె పడుతున్న కష్టాల నుంచి పుట్టుకొచ్చిన దృఢ సంకల్పాన్ని చూపుతున్నాయి.

బీడ్ జిల్లాలోని అంబాజోగైకి చెందిన 47 ఏళ్ల ఈ తల్లి 2026 ఆగస్టు 29న చెప్పులు లేకుండా మూడు కిలోమీటర్ల పరుగు పందెంలో గెలుపొందడాన్ని మహారాష్ట్ర ప్రజలంతా చూశారు.

అయితే ఈ కథ కేవలం పందెం గెలవడం గురించి కాదు. తన కూతుళ్లను చదివించేందుకు ఓ తల్లి చేసిన పోరాటానికి సంబంధించినది.

ఆగష్టు 29న అంబాజోగైలో అమృత్ దావూద్ మారథాన్ జరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రమాబాయి ఏనాడూ పరిగెత్తడం ప్రాక్టిస్ చేయలేదు. కనీసం ఆమె దగ్గర స్పోర్ట్స్ షూ కానీ, ట్రాక్‌సూట్ కానీ లేవు. ఆమె చీర, మామూలు చెప్పులతోనే మారథాన్‌లో పాల్గొన్నారు.

"పొద్దున్నేమా అమ్మాయి నా దగ్గరకొచ్చి 'అమ్మా నేను పరుగెత్తాలనుకుంటున్నా అని చెప్పింది' అని రమాబాయి వివరించారు.

"ఎక్కడ?" అని అడిగాను.

"దగ్గరలోనే ఒక పోటీ ఉంది. అందులో బహుమతి ఉంటుంది. నేను రాతపుస్తకాలు, పెన్ను కొనాలి" అని ఆమె చెప్పారు.

రమాబాయి, మారథాన్ పరుగు పందెం, కుమార్తెల చదువులు, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, UGC/BBC

పరుగు పందెంలో విజేత

రమాబాయి చిన్నకుమార్తె నాందేడ్‌లో చదువుకుంటున్నారు. కొన్ని రోజులుగా పుస్తకాలు కొనుక్కోవడానికి తల్లిని డబ్బులు అడుగుతున్నారు.

"డబ్బులు ఇవ్వలేదని మా అమ్మాయి నాతో ఎనిమిది రోజులుగా మాట్లాడలేదు. పోటీ గురించి విన్నప్పుడు నేను పరుగు పందెంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. ఎలాగైనా గెలవాల్సిందే" అని భావించానని రమాబాయి అన్నారు.

మూడు కిలోమీటర్ల పరుగులో భాగంగా పరుగెత్తేటప్పుడు ఆమె ధరించిన చెప్పులు కాళ్ల నుంచి పదే పదే జారిపోతూ ఉన్నాయి. దీంతో ఆమె వాటిని చేతిలో పట్టుకుని పరుగు పందెంలో పాల్గొన్నారు.

పందెం ముగిసే సరికి ఆమె మొదటి స్థానంలో నిలిచి 3వేల రూపాయల బహుమతి అందుకున్నారు.

"ఆ డబ్బుతో ఏం చేశారు?" అని అడిగినప్పుడు ఆమె ఓ మాట చెప్పారు.

"నేను మా అమ్మాయికి పుస్తకాల కోసం ఆ డబ్బులు ఇచ్చాను’’ అని చెప్పారు.

రమాబాయి, మారథాన్ పరుగు పందెం, కుమార్తెల చదువులు, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Kiran Sakle/BBC

ఓ తల్లి జీవితంలో రెండో పరుగు పందెం

రమాబాయి జీవితంలో అసలైన పరుగు చాలా కాలం క్రితమే మొదలైంది.

2012లో ఆమె భర్త కన్నుమూశారు. ఆ తర్వాత ఇద్దరు చిన్న కూతుళ్లు కుటుంబం బాధ్యత ఆమె భుజాలపై పడింది.

ఆమె ఏడో తరగతి వరకే చదువుకున్నారు. తన కుమార్తెలు ఉన్నత చదువులు చదువుకోవాలని కోరుకున్నారు.

"నాన్న చనిపోయినప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం. మా అమ్మ కోరుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకోగలిగేది, కానీ ఆమె అలా చేయలేదు. ఆమె మా కోసం జీవితాంతం కష్టపడాలని నిర్ణయించుకుంది" అని ఆమె చిన్న కుమార్తె పూజా రణ్‌వీర్ చెప్పారు.

కుటుంబ ఖర్చుల కోసం తనకు ఏ పని దొరికినా చేస్తున్నట్లు రమాబాయి చెప్పారు.

"నేను పొలాల్లో పనిచేశాను. సోయాబీన్ పంట కాంట్రాక్టులు తీసుకున్నా. శనగల పంట కాంట్రాక్టు తీసుకున్నా. పొలంలో పసుపుకొమ్ములు ఏరి వాటిని ఉడకబెట్టి అమ్మాను. ఏ పని దొరికితే అది చేశా" అని ఆమె అన్నారు.

ప్రస్తుతం ఆమె అంబాజోగైలోని జ్ఞానదీప్ అకాడమీలో వంట మనిషిగా పనిచేస్తున్నారు. గత ఏడాదిగా విద్యార్థులకు భోజనం తయారుచేస్తున్నారు.

ఆమె పెద్ద కుమార్తె అదే అకాడమీలో పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు, చిన్న కుమార్తె నాందేడ్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

"ఆమె మహారాష్ట్రకే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కోవచ్చని నిరూపించారు" అని జ్ఞానదీప్ అకాడమీ ప్రొఫెసర్ దత్తా దరాడే అన్నారు.

రమాబాయి, మారథాన్ పరుగు పందెం, కుమార్తెల చదువులు, మహారాష్ట్ర

"నా కూతుళ్లకు మంచి జీవితం అందించాలి"

రమాబాయి కలలు మరీ పెద్దవి కావు. కానీ అవి చాలా స్పష్టమైనవి.

"డాక్టర్ బాబాసాహెబ్ ప్రపంచానికి ఇచ్చిన చల్లని నీడ లాంటిదే నేనూ నా ఇద్దరు కుమార్తెలకు ఇవ్వాలనుకుంటున్నా" అని ఆమె చెప్పారు.

వారికి 'చల్లని నీడ' అంటే సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితం.

"వాళ్లు ఒకే ఇంటి కప్పు కింద సుఖంగా జీవించాలి. బురదలోకి వెళ్లాల్సిన అవసరం గానీ, ఎండ లేదా వానలో పని చేయాల్సిన అవసరం గానీ రాకూడదు. నా మాదిరిగా నా కూతుళ్లు పని చేయకూడదు" అని రమాబాయి ఆశిస్తున్నారు.

తన కుమార్తెలు అధికారులుగా ఎదిగి తమ కాళ్ళ మీద తాము నిలబడాలని వెట్టిచాకిరి జీవితం గడపకూడదన్నదే ఆమె ఏకైక కోరిక.

రమాబాయి చెప్పులు లేకుండా పరిగెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహారాష్ట్రలో అనేక ప్రాంతాల నుంచి ఆమెకు అభినందనలు అందాయి.

ఆమె పోరాట గాథ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.

ది హిందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ వంటి వార్తాపత్రికలు ఆమె గురించి కథనాలు ప్రచురించాయి.

మారథాన్ పోటీలో ఆమె చెప్పుల్లేకుండా పరుగెత్తడం, పోటీలో గెలవడం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి బహుశా ఆమెకు తెలియకపోవచ్చు.

ఇందులో ఆమెకు అత్యంత ముఖ్యమైనది ఒక్కటే.

తన కుమార్తెల ఫీజులు, పుస్తకాలు, వాళ్ల పై చదువులు.

రమాబాయి, మారథాన్ పరుగు పందెం, కుమార్తెల చదువులు, మహారాష్ట్ర

సమాజానికి ప్రశ్నలు

రమాబాయి కథ వెలుగులోకి వచ్చిన తర్వాత, చాలా మంది దానిని "ఒక తల్లి స్ఫూర్తిదాయకమైన పోరాటం" అని పిలిచారు.

అయితే రచయిత, పరిశోధకుడు సోమనాథ్ ఘోలవే ఈ కథను భిన్నమైన కోణంలో చూస్తున్నారు.

"భారత్‌లోని మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక ఆవేశం, పోరాట గాథలా అనిపించవచ్చు. చాలామంది ఆ తల్లి కష్టాన్ని, త్యాగాన్ని మెచ్చుకుంటారు. కానీ ఆమెకు అలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందని ఎంతమంది ఆలోచిస్తారు?" అని ఆయన ప్రశ్నించారు.

రమాబాయి కేవలం ఒక పోటీలో పాల్గొనడం లేదు. ఆమె తన కుమార్తెలను చదివించడానికి సమాజం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థతో కూడా పోరాడుతున్నారనేది ఆయన అభిప్రాయం.

"మనం తల్లి పడుతున్న కష్టాన్ని చూస్తాం. కానీ మరో కోణాన్ని చూడలేం. ఈ సంఘటన ప్రభుత్వం, సామాజిక, ఆర్థిక వ్యవస్థలలోని లోపాలను కూడా ఎత్తి చూపింది" అని ఆయన చెప్పారు.

సోషల్ మీడియాలో రాసిన తన పోస్ట్‌లో ఆయన ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తారు. రేసులో గెలిచినందువల్లే రమాబాయి వెలుగులోకి వచ్చారు.

కానీ, వ్యవసాయం, కూలిపనులు, అసంఘటిత రంగంలో పనిచేస్తూ ప్రతిరోజూ తమ పిల్లలకు విద్యను అందించే తల్లులు లెక్కలేనంత మంది ఉన్నారు. వారి కష్టాలను సమాజం పట్టించుకుంటుందా? అన్నదే ఆ ప్రశ్న.

రమాబాయి, మారథాన్ పరుగు పందెం, కుమార్తెల చదువులు, మహారాష్ట్ర

"తన పిల్లల చదువు కోసం పరుగెత్తడం వల్ల ఈ తల్లి గురించి అందరికీ తెలిసింది. కానీ ప్రతిరోజూ ఇలా పరుగెత్తే తల్లులు ఎంతో మంది ఉన్నారు" అని ఘొలవ్ అన్నారు.

రమాబాయి కథలో ఒక కలవరపరిచే ప్రశ్న కూడా దాగి ఉంది.

తన కుమార్తెల పుస్తకాల కోసం 3వేల రూపాయల బహుమతి గెలుచుకోవడానికి ఒక తల్లి పరుగెత్తాల్సి రావడం కేవలం వ్యక్తిగత పేదరికం కథ మాత్రమేనా?

"ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలను ప్రకటించడంతో సరి పెట్టకూడదు. వాటిని అవసరమైన వారికి చేర్చడం కూడా ముఖ్యం" అని ఘొలవ్ అభిప్రాయపడ్డారు.

"కేవలం పథకాల ప్రకటనే ప్రజలకు ప్రయోజనాలు అందించినట్టుగా భావించలేము. వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి" అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)