గుంటూరు బాలిక కిడ్నాప్ కేసు: ‘దమ్ముంటే పట్టుకోండి’ అంటూ ఇన్‌స్టాలో సవాల్ చేసిన నిందితుడు, పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
గుంటూరు నగరంలో కలకలం సృషించిన ఓ బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడిని హరియాణాలో అదుపులోకి తీసుకుని బాలికను సురక్షితంగా తీసుకువచ్చామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బీబీసీతో చెప్పారు.
ఈ ఏడాది జూన్ 10వ తేదీన బాలిక మిస్సింగ్ కేసు నమోదైంది. దీనిపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు సెప్టెంబర్ 3వ తేదీన విచారించిన సందర్భంగా దాదాపు మూడు నెలలవుతున్నా బాలికను కనిపెట్టడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించిందని, బాలిక ఆచూకీని త్వరగా కనిపెట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్టు స్టేట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఎస్జీపీ) తిరుమాను విష్ణుతేజ బీబీసీకి చెప్పారు.
బాలిక జాడ తెలుసుకోవడానికి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారని, ఉన్నతాధికారులు సిట్ కూడా ఏర్పాటు చేశారని కోర్టుకు నివేదించినట్టు ఆయన తెలిపారు.
అయితే సెప్టెంబర్ 4వ తేదీన నిందితుడిని పట్టుకున్నట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పూర్తి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తామని చెప్పారు.
ఈ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లోని ఓ ఉన్నతాధికారితో పాటు కేసు నమోదైన పట్టాభిపురం పోలీసు స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు, బాపట్ల జిల్లా పర్చూరు పోలీసులతో బీబీసీ మాట్లాడింది. వారు వెల్లడించిన ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.

‘బంగారం, డబ్బు తీసుకుని’
గుంటూరు నగరానికి చెందిన ఓ వస్త్ర వ్యాపారి కుమార్తె పదో తరగతి చదువుతోంది.ఈ బాలికతో బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన షేక్ జాన్ సైదా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. కొంతకాలంగా గుంటూరులోనే ఉంటూ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న సైదా దాదాపు ఏడాదిన్నరకాలంగా ఆ బాలికతో చాటింగ్, ఫోన్‌లో మాట్లాడటం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థినికి ‘‘మాయమాటలు చెప్పి జూన్ 9వ తేదీన తనతోపాటు తీసుకెళ్లిపోయాడని’’ పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు బీబీసీకి తెలిపారు.
''జూన్ 9వ తేదీ ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన బాలిక.. క్లాత్ షాపు వద్దకు వెళ్తున్నానని అమ్మమ్మకు చెప్పి, ఇంట్లోని బంగారం, నగలతో వెళ్లిపోయింది. అయితే షాపు వద్దకు బాలిక రాకపోవడంతో తండ్రి చుట్టుపక్కల గాలించారు. తరువాత ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా ఆ రాత్రంగా తీవ్రంగా గాలించారు. పట్టాభిపురం సమీపంలోనే బాలిక ఫోన్ సిగ్నల్ కనిపిస్తుండటంతో పరిసర ప్రాంతాలన్నీ వెతికామని’’ సీఐ చెప్పారు.
‘‘మరుసటి రోజు ఉదయం సమీపంలోని ఓ పార్కులో ఆ బాలిక ఫోన్ కనిపించింది కానీ, తన ఆచూకీ దొరకలేదు. ఫోన్ అక్కడ వదిలేసి వెళ్లిపోయారని భావించి జూన్ 10న బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం'' అని సీఐ బీబీసీకి తెలిపారు.
ఎక్కడెక్కడ వెతికినా...
జూన్ 10వ తేదీ తర్వాత బాలిక ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ క్రమంలో బాలిక ఆచూకీ కోసం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు.
బాలిక తల్లిదండ్రులతో కలిసి సిట్ బృందం ముమ్మరంగా గాలించింది. పర్చూరు, నెల్లూరు, తమిళనాడులోని కోయంబత్తూరు, కేరళలోని పాలక్కాడ్ తదితర ప్రాంతాల్లో గాలించారు. తమిళనాడులోని ఓ లాడ్జిలో వీరు ఉన్నట్టు సీసీ ఫుటేజీలో గుర్తించారు. అక్కడి నుంచి పాలక్కాడ్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని, సికింద్రాబాద్ రైలు ఎక్కినట్టు గుర్తించారు. సికింద్రాబాద్ నుంచి బేగంపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆటోలో వెళ్లిపోయినట్టు నిర్థరించారు. ఆ తర్వాత బాలిక ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది.
బాలిక ఇంటి నుంచి వెళ్లే సమయంలో భారీగా డబ్బు, నగలు తీసుకువెళ్లడంతో.. నిందితుడు సెల్ ఫోన్లు మార్చుతూ, వివిధ ప్రాంతాలు తిరుగుతుండటంతో ఆచూకీ కనిపెట్టడం క్లిష్టంగా మారిందని ఓ పోలీసు అధికారి బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN
హైకోర్టులో బాలిక తండ్రి పిటిషన్
జూన్ 10న కేసు నమోదు కాగా మూడు నెలలవుతున్నా.. పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టలేదంటూ ఆ బాలిక తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
సెప్టెంబర్ 3న ఈ పిటిషన్‌ను జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ తుహిన్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ ప్రారంభం కాగానే, బాలిక ఆచూకీ ఇంకా దొరకలేదని స్టేట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఎస్జీపీ) తిరుమాను విష్ణుతేజ కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై డీజీపీ సిట్ ఏర్పాటు చేశారని చెప్పారు. మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మార్చామని వివరించారు. ఈ వివరాలను పరిశీలించిన ధర్మాసనం బాలిక ఆచూకీ కనుగొనడంలో జాప్యంపై అభ్యంతరం వ్యక్తం చేసిందని, వెంటనే బాలిక జాడ కనిపెట్టాలని ఉత్తర్వులు జారీచేసినట్టు విష్ణుతేజ తెలిపారు.
యాధృచ్ఛికమే కావొచ్చు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన మరుసటి రోజే సెప్టెంబర్ 4వ తేదీన హరియాణాలోని కర్నాల్ నగరంలో సైదాను అదుపులోకి తీసుకున్నట్టు సిట్‌లోని ఓ కీలక అధికారి బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, ugc
‘చేతనైతే పట్టుకోమంటూ సవాల్’
నిజానికి నిందితుడు జాన్ సైదా సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు తరచుగా మారుస్తుండడంతో ఆచూకీ కనుక్కోవటం కష్టమైంది. సిగ్నల్ ఆధారంగా పోలీసులు అక్కడకు వెళ్లేసరికి అక్కడినుంచి వెళ్లిపోతున్నారు.
వారం రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జాన్ సైదా మెసేజ్ చేశారు.
'మీకు చేతనైతే నన్ను పట్టుకోండి' అంటూ సవాల్ విసిరారు. అదే ఇన్‌స్టా ఖాతా నుంచి గురువారం రాత్రి బాలిక తల్లికి మిస్డ్ కాల్ వచ్చింది. ఆ సిగ్నల్ హరియాణాలోని కల్నాల్ ప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తించి వెంటనే అక్కడికి బయలుదేరాం. అక్కడి పోలీసులు చాలా బాగా సహకరించారు. దీంతో ఓ ఇంట్లో తలదాచుకున్న బాలిక, నిందితుడు సైదాను అదుపులోకి తీసుకున్నాం'' అని ఆ అధికారి వివరించారు.
హరియాణాలో ఇల్లు అద్దెకు తీసుకుని...
ఈ మూడు నెలల వ్యవధిలో బాలికను తీసుకుని వివిధ ప్రాంతాలు తిరిగిన సైదా 15రోజుల కిందట కల్నాల్ ప్రాంతం చేరుకున్నారు. అక్కడో ఇల్లు అద్దెకి తీసుకుని టీవీ, ఫ్రిడ్జ్, టూవీలర్ సహా అన్ని సామాన్లు కొనుక్కున్నారు.
‘‘గురువారం రాత్రి ఇన్‌స్టా ఖాతా నుంచి బాలిక పొరపాటుగానే మిస్డ్ కాల్ ఇచ్చారు. కానీ అదే మనకు ఆధారమైంది’’ అని సిట్ అధికారి తెలిపారు.
ఏడాదిన్నరగా ఈ బాలికతో సైదాకి పరిచయం ఉందని అతని కుటుంబ సభ్యులకు తెలుసు.. ఈ క్రమంలోనే సైదా తల్లి, చెల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని సిట్ అధికారి తెలిపారు.

ఫొటో సోర్స్, ugc
గతంలోనూ సైదాపై కేసులు..
కల్నాల్‌లో సైదా ఉన్న ఇల్లంతా మద్యం బాటిళ్లు, సిగరెట్లు ఉన్నాయి. గతంలోనూ సైదాపై కేసులు ఉన్నాయని పర్చూరు పోలీసులు బీబీసీతోచెప్పారు.
మరోవైపు ప్రస్తుతం సైదాను అదుపులోకి తీసుకున్న కల్నాల్ ప్రాంతం నుంచి చాలామంది యువకులు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వచ్చి ఫలూదా బండ్లు నడుపుతుంటారని, వారితో పరిచయాల మేరకే సైదా అక్కడికి వెళ్లాడని భావిస్తున్నామని, ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నామని ఆ అధికారి తెలిపారు.
కాగా బాలిక తండ్రితో మాట్లాడేందుకు బీబీసీ యత్నించింది. అయితే ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. సైదా కుటుంబసభ్యులు పోలీసుల అదుపులో ఉండటంతో వారితో మాట్లాడటం కూడా సాధ్యపడలేదు. అందుబాటులోకి వస్తే మాట్లాడి వారి వివరణను అందిస్తాం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































