అప్పుడు జగన్ కోసం మంత్రివర్గం నుంచి తప్పుకొన్నారు.. ఇప్పుడు రేవంత్ తప్పించారు

ఫొటో సోర్స్, konda surekha/facebook
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కొండా సురేఖను తొలగించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించి, గవర్నర్‌కు సూచించారు. కొండా సురేఖ పూర్తి కాలం మంత్రిగా చేయకుండా అర్థంతరంగా పదవి నుంచి తప్పుకోవడం ఇది రెండోసారి. గతంలో వైయస్ జగన్ కోసం ఆమె స్వచ్ఛందంగా మంత్రి పదవి వదులుకున్నారు. ఈసారి ముఖ్యమంత్రే ఆమెను తప్పించారు.
కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర రావు (మురళి)లు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో పేరున్న నేతలు. తమను ఆశ్రయించిన వారి కోసం ఎంతదూరమైనా వెళ్తారనీ, ఫైర్ బ్రాండ్ అనీ అభిమానులు చెబుతుంటారు. కానీ అదే సమయంలో వారిని నిత్య అసమ్మతి వాదులు అని విమర్శించిన వారూ ఉన్నారు.
మురళి గ్రామ సర్పంచిగా తన రాజకీయ జీవితం ప్రారంభించి ఎమ్మెల్సీగా పనిచేశారు. కొండా సురేఖ స్థానిక సంస్థల నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యే, తరువాత మంత్రి అయ్యారు.
1999లో శాయంపేట నుంచి మొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు సురేఖ. తరువాత 2004లో మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత పరకాల నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే పదవీకాలం పూర్తికాకముందే 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి, అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
తిరిగి 2014లో టీఆర్ఎస్లో చేరి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు. 2018లో కాంగ్రెస్ తరఫున పరకాల నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
2023లో వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.

రాంగోపాల్ వర్మ ‘కొండా’ మురళి గురించే
ఇక మురళి 2009-2015 మధ్య కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తరువాత 2015లో అప్పటి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయినా, 2018లో పార్టీ మారినప్పుడు రాజీనామా చేశారు.
ఆయన యూత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవారు.
1992లో కొండా మురళి వాహనంపై మావోయిస్టులు (అప్పటి నక్సలైట్లు) దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
కొండా మురళి నేపథ్యం, వరంగల్ రాజకీయాల్లో ఆయన పాత్ర, నక్సలైట్ల దాడి వంటి సంఘటనల ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ 2022లో 'కొండా' అనే సినిమాను తీశారు.
కొండా సురేఖ, మురళిలు ఒకే కళాశాలలో కలసి చదువుకున్నారు. సురేఖ పద్మశాలి కులం, మురళి మున్నూరు కాపు కులానికి చెందిన వారు. వారి కుమార్తె సుస్మిత ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్నారు. గతంలో మావోయిస్టులకు లాజికల్ సపోర్ట్ ఇచ్చారన్న ఆరోపణలతో మురళిపై పోటా చట్టం కింద కేసు నమోదైంది.
కొంతకాలంగా కొండా మురళి అనారోగ్యం కారణంగా చురుగ్గా తిరగడం లేదు.

ఫొటో సోర్స్, konda surekha/facebook
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ధర్నా
కొండా సురేఖ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ వరంగల్‌లో పాతతరం పాత్రికేయులు గుర్తుంచుకునే ఒక సంఘటన ఉంటుంది.
వరంగల్ నగరంలోని ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్ ముందు అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే హోదాలో ఆందోళన చేసి, బైఠాయించారు సురేఖ.
తన భర్త మురళిపై ఉన్న పోటా కేసు రద్దు చేయాలన్నది ఆమె డిమాండ్. భర్తపై కేసు ఎత్తేయాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవడం అప్పట్లో ఒక సంచలనం.
ఇక సురేఖ రాజకీయాల్లో ఎదుగుతున్న రోజుల్లో ఒక సమావేశంలో రైతు ఆత్మహత్యల గురించి ఆమె ప్రసంగానికి ముగ్ధులైన సోనియా గాంధీ ఆమెను గుర్తు పెట్టుకుని పలకరించడం వారెంతో గర్వంగా చెప్పుకునేవారు.
కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఆ అనుబంధాన్ని జగన్ కోసం వదులుకున్నారు సురేఖ దంపతులు. మొత్తంగా తమ రాజకీయ ప్రస్థానం తొలినాళ్ల నుంచి 2011 వరకు ఈ జంట కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ తో కలసి నడవడం కోసం కాంగ్రెస్‌ను విడచిపెట్టి వైఎస్సార్సీపీలో చేరారు సురేఖ, మురళి.
ఆమె మూడుసార్లు మంత్రి పదవి చేపట్టగా, మూడుసార్లూ కాంగ్రెస్ హయాంలోనే చేపట్టారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి తన మంత్రివర్గంలో సురేఖకు మహిళా సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇచ్చారు.
ఆయన మరణం తర్వాత రోశయ్య కేబినెట్లో కూడా సురేఖ చేరారు.
2023లో రేవంత్ రెడ్డి అటవీ, దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని డిమాండుతో ఆమె అప్పట్లో మంత్రి పదవిని వదులుకోగా, ఈసారి వారి కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఫొటో సోర్స్, konda surekha/facebook
సురేఖ గురించి రోశయ్య ఏం చెప్పారు?
మొదటిసారి పార్టీ మారే సమయంలో ''రోశయ్యను నేను సీఎంగా అంగీకరించను, ఆయన మొహం చూడను'' అంటూ అప్పటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి బహిరంగంగా వ్యాఖ్యానించారు సురేఖ.
అప్పటి తన మంత్రి పదవికి రాజీనామా కూడా ఇచ్చారు. ఆ మాటలు అన్న తరువాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత కాలం ఉండి, తరువాత వైయస్ జగన్ వైపు చేరారు.
2009 మేలో మంత్రి కాగా, సెప్టెంబరులో రోశయ్య కేబినెట్లో మరోసారి చేరి, అక్టోబరులో రాజీనామా చేశారామె.
ఈ ఘటన గురించి రోశయ్య ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ఇంటర్వ్యూలో ఒక వ్యాఖ్య చేశారు.
''తరువాత వైఎస్ జగన్ నాతో మాట్లాడుతూ సురేఖను కేబినెట్లోకి తీసుకోమని కోరాడు. నేను ఒప్పుకోలేదు. నా ముఖమే చూడనన్న మనిషి, నాతో ఎలా పనిచేస్తుంది?'' అని రోశయ్య అన్నారు.
నిజానికి తెలంగాణ, అందునా వరంగల్‌లో తెలంగాణ ఉద్యమం వేడిగా ఉన్న రోజుల్లో వారు జగన్ కోసం పనిచేశారు. అప్పటికి జగన్ సమైక్య వాదం వైఖరి తీసుకున్నారు.
2010లో జగన్ వరంగల్‌కు రైల్లో బయల్దేరినప్పుడు, తెలంగాణవాదులు ఆ పర్యటనను వ్యతిరేకించినప్పుడు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులు జరిగాయి. జగన్‌కోసం అంత తీవ్రంగా పనిచేసిన సురేఖ, మురళిలు, తరువాత అదే జగన్‌తో విబేధించి, పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
2013 జూలైలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ వైఎస్ విజయమ్మకు కొండా సురేఖ సుదీర్ఘమైన లేఖ రాశారు. తాము కష్టకాలంలో జగన్‌కి అండగా నిలిచినా, తమకు తగిన గుర్తింపు ఇవ్వకుండా అవమానించారనీ, కేవలం జగన్ చుట్టూ ఉండే కొద్దిమంది వ్యక్తుల కోటరీ చెప్పినట్లే పార్టీ నడుస్తోందనీ ఆరోపణలు చేశారు.
ఇక తెలంగాణ రావడానికి కాస్త ముందు అంటే 2013లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీలో చేరిన సురేఖ, ఆమె భర్త మురళి, 2018 వరకూ అక్కడ ఉన్నారు. 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీతో విభేధించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర రావు వంటి వారితో వారికి విభేధాలు ఉండేవి.
2018 సెప్టెంబర్‌లో కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రెస్ మీట్లో మాట్లాడారు.
''కేసీఆర్ పాలన దొరల గడీలను తలపిస్తోంది. టీఆర్ఎస్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీస స్వేచ్ఛ లేదు. వాళ్లందరినీ కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారు. తాను బీసీ మహిళను కాబట్టే తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మేము పార్టీని బలోపేతం చేస్తే, చివరి నిమిషంలో మాకు టికెట్ నిరాకరించి కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారు'' అని సురేఖ వ్యాఖ్యానించారు.
తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2023లో ఎమ్మెల్యేగా గెలిచి, రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి చేపట్టారు సరేఖ.

ఫొటో సోర్స్, konda surekha/facebook
‘కుమార్తెకు టిక్కెట్ కోసం’
చాలా సందర్భాల్లో సురేఖ దంపతుల అసమ్మతికి జిల్లాలో ఆధిపత్యంతో పాటు, తమ ఇంట్లో రెండో పదవి కోరుకోవడం, పాత కాలపు హీరోయిక్ విధానాలు వంటివి కారణమని విశ్లేషిస్తారు కొందరు పాత్రికేయులు. ముఖ్యంగా గతంలో అయితే తన భర్త మురళి, ఇప్పుడు కుమార్తె సుస్మిత టికెట్ కోసం ఆమె తాపత్రయం అనేది వారి వాదన.
''ఈ వ్యవహారాన్ని జిల్లాలపై ఆధిపత్య వివాదంగానే చూడాలి. ఉమ్మడి వరంగల్ మీద పెత్తనం ఎవరిది అన్నది ప్రశ్న. పొంగులేటి, కడియం, భట్టి.. ఇలా ఇంతమంది మధ్య తమకు అసలైన అధికారం ఇవ్వలేదనే అసంతృప్తి వారిలో ఉంది. దానికితోడు ముందు నుంచీ కొండా దంపతులు తమ కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. గత ఎన్నికల్లో రెండు ఇవ్వలేం అంటే, ఒకటి తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా కుమార్తెను ఎమ్మెల్యే చేయాలని, తమ వారసురాలిగా నిలపాలన్నది వారి తాపత్రయం. తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కన పెట్టినా, రేవంత్ రెడ్డి తన సొంతం అనుకున్న వారికే వరంగల్ పెత్తనం ఇవ్వడం కూడా వీరి అసమ్మతి కారణం. ఇందులో ఓసీ-బీసీ కోణం కూడా చూడాలి. అయితే సురేఖ పార్టీ మారితే అగ్రెసివ్ డెసిషన్ అని మాత్రం చెప్పలేం. రాజకీయాల్లో ఆ అగ్రెసివ్నెస్ కూడా పనిచేస్తుంది. రేవంత్‌లో అదే అగ్రెసివ్నెస్ ఏఐసీసీకి కావల్సి వచ్చింది కదా?'' అన్నారు సీనియర్ పాత్రికేయుడు దుర్గం రవీందర్.
''ఆ కుటుంబం తమను హీరోయిక్ గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఏదో రూపంలో వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత తరాలు అటువంటి వాటిని ఆదరిస్తారా అన్నది చెప్పలేం'' అని వ్యాఖ్యానించారు పేరు వెల్లడించడానికి ఇష్టపడని వరంగల్ జిల్లాకు చెందిన మరో పాత్రికేయుడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























