కుళ్లిన మృతదేహాలు.. చోటు లేని ఆసుపత్రులు

నేపాల్, వరద, మృతులు, అంటువ్యాధులు

ఫొటో సోర్స్, Subaas Shrestha/NurPhoto via Getty Images

    • రచయిత, వినీత దహాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

(ఈ వార్తలో కలచివేసే అంశాలుండొచ్చు)

నేపాల్ వరదల్లో గల్లంతయిన వారి కోసం భద్రతాసిబ్బంది నిరంతరం గాలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మృతదేహాలు లభ్యమవుతుండడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పెరిగింది.

గాలింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నందున మృతదేహాలను భద్రపరచడం సవాలుగా మారిందని నేపాల్‌లోని చిత్వాన్ జిల్లా ముఖ్య అధికారి గణేశ్ ఆర్యాల్ అన్నారు.

ఇప్పటివరకు ఒక్క చిత్వాన్‌లోనే 178 మృతదేహాలు లభించాయని ఆయన చెప్పారు. వీరిలో 74 మంది పురుషులు, 41 మంది మహిళలు ఆరుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారని వెల్లడించారు.

మృతదేహాలు కుళ్లిపోవడం మొదలయిందని, దొరికినవాటిలో చాలా అలాంటి స్థితిలోనే ఉన్నాయని, దీనివల్ల అంటువ్యాధులు వ్యాపించే అవకాశముందని ఆయన అన్నారు. మృతదేహాలను సరైన విధంగా భద్రపరచడం పెద్దసవాలుగా మారిందన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నేపాల్, వరద, మృతులు, అంటువ్యాధులు

ఫొటో సోర్స్, Getty Images

ఆసుపత్రుల్లో స్థలం లేక ప్రభుత్వ కార్యాలయాల్లో మృతదేహాలు

తదుపరి చర్యలకోసం కేంద్రప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.

చిత్వాన్ ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరచడానికి స్థలం లేకపోవడంతో ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉంచుతున్నారు.

మృతదేహాల నుంచి దుర్వాసన రావడం మొదలైందని ఆ ప్రాంతంలో ఉన్న బీబీసీ ప్రతినిధి ఈశ్వర్ జోషి చెప్పారు.

"నేను ప్రస్తుతం మృతదేహాలను గుర్తించే గది ముందు ఉన్నా. మృతదేహాలు కుళ్లిపోయే స్థితిలో ఉండడంతో దుర్వాసన వస్తోంది" అని ఆయన చెప్పారు.

వరదలతో ఉప్పొంగిన భోటేకోశి నది నుంచి శుక్రవారం(ఆగస్టు 27) సాయంత్రం వరకు 579 మృతదేహాలను వెలికితీసినట్టు నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది.

ఇప్పటివరకు దాదాపు నాలుగువేల మందిని రక్షించినట్టు అధికారులు చెబుతున్నారు.

నేపాల్‌లో గల్లంతైన వారి సంఖ్య వేలల్లోకి పెరిగిందని ఎన్‌డీఆర్ఆర్ఎంఏ తెలిపింది.

గల్లంతయిన వారిలో విదేశీ పర్యాటకులతో పాటు నేపాల్ ప్రజలు, పోలీసులు, సైనిక, సాయుధ పోలీసు బలగాలు, కస్టమ్స్, ఇమిగ్రేషన్ కార్యాలయాల సిబ్బంది కూడా ఉన్నారు.

నేపాల్, వరద, మృతులు, అంటువ్యాధులు

ఫొటో సోర్స్, RSS

ఫొటో క్యాప్షన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో లభ్యమవుతున్న మృతదేహాలను భద్రపరచడం సవాల్‌గా మారిందని స్థానిక అధికారులు చెబుతున్నారు.

అంటువ్యాధులు వ్యాపించకుండా ఏం చేస్తున్నారు?

మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతుండడంతో మృతదేహాలను భద్రపరిచేవిధానంపై సంబంధిత జిల్లాలతో సమన్వయం చేసుకుంటున్నట్టు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

"రసువా, నువాకోట్, ధాడింగ్, గోర్ఖా, చిత్వాన్, నావల్పరాసి జిల్లాల్లో మృతదేహాలు లభిస్తూనే ఉన్నాయి. ఆ మృతదేహాలను ఆయా జిల్లాల్లోనే భద్రపరచాలా లేక కాఠ్‌మండూకు తరలించాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి" అని హోం శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి రమా ఆచార్య సుబేది బీబీసీతో చెప్పారు.

"మృతదేహాలు లభ్యమైన చోట వాటిని ఎలా భద్రపరచాలనేదానిపై చర్చలు జరుగుతున్నాయి" అని సుబేది అన్నారు.

నేపాల్, వరద, మృతులు, అంటువ్యాధులు

ఫొటో సోర్స్, Getty Images

మృతదేహాలను భద్రపరచడం పెద్ద సవాల్

ప్రభావిత జిల్లాల్లో మృతదేహాల సంఖ్య పెరగడం అంటువ్యాధుల వ్యాప్తిని నివారించడంలో సవాలుగా మారిందని అంటువ్యాధుల నియంత్రణ విభాగం తెలిపింది.

మృతదేహాల పరిస్థితి, గుర్తింపు పూర్తయ్యేవరకు వాటిని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచడం అవసరమని, అయితే ఇది ఒక పెద్ద సవాలుగా మారిందని ఆ విభాగం డైరెక్టర్ అనుజ్ భట్టాచన్ చెప్పారు.

మృతదేహాలను సరైన ప్రదేశంలో ఉంచడం, ఒకేసారి పెద్ద సంఖ్యలో మృతదేహాలు రావడం, సామర్థ్యం పరిమితంగాఉండడం వంటివి సవాళ్లను పెంచుతున్నాయని ఆయన అన్నారు.

"ధాడింగ్‌లో లభించిన మృతదేహాలను కాఠ్‌మండూ, పోఖరాలకు తరలించాల్సిరావడానికి ఇది కూడా ఒక కారణం. మరోవైపు చాలా మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. వాటిని గుర్తించడం కోసం ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్లలో ఉంచడం సవాలుగా మారుతోంది" అని ఆయన తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)