శుభ్రశ్రీ-రీనా బెనర్జీ: ఈ ఇద్దరు మహిళలు నేపాల్ సరిహద్దు దాటారా, చైనాలోకి ప్రవేశించారా?

ఫొటో సోర్స్, Sudipto Bhattacharya/Dwaipayan Mukherjee
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
బుధవారం తెల్లవారుజామున సుదీప్తో భట్టాచార్య తన భార్య శుభ్రశ్రీ చక్రవర్తి నుంచి ఓ మెసేజ్ అందుకున్నారు. ఆమె తన పాస్‌పోర్టుపై డిపార్చర్ ముద్ర పడిన ఫోటోను ఉదయం 7.57 గం.లకు పంపారు. నేపాల్ సరిహద్దు వద్ద ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయిందని ఆ డిపార్చర్ ముద్రకు అర్థం.
ఈ మెసేజ్ వచ్చిన 6 నిమిషాల తరువాత 8.03గం.లకు నిమిషాలకు "చైనాలోకి ప్రవేశించేందుకు మేం వేచి ఉన్నాం’’ అని మెసేజ్ చేశారు. ఆపైన ఆమె నుంచి ఎటువంటి సందేశాలు రాలేదు.
శుభ్రశ్రీ చక్రవర్తి, ఆమెతో కలిసి ప్రయాణిస్తున్న బృందం కైలాస పర్వత యాత్రలో తదుపరి దశ కోసం టిబెట్‌లోకి ప్రవేశించడానికి వేచి ఉన్నారు.
శివుని నివాసంగా, పవిత్ర స్థలంగా హిందువులు భావించే కైలాస పర్వతాన్ని సందర్శించాలని శుభ్రశ్రీ ఎన్నో ఏళ్లుగా కలలుకంటున్నారు.
నేపాల్-టిబెట్ సరిహద్దు వెంట ఆకస్మికంగా భీకర వరదలు సంభవించిన తర్వాత కనిపించకుండా పోయినట్ నమోదైన సుమారు 290 మంది భారతీయుల్లో 43 ఏళ్ల శుభ్రశ్రీ కూడా ఉన్నారు.


ఫొటో సోర్స్, Sudipto Bhattacharya
ఆచూకీ తెలియని వారిలో చాలామంది కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లినవారే. కోవిడ్ మహమ్మారి, ఆ తర్వాత భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన ఈ యాత్ర గత ఏడాది తిరిగి ప్రారంభమైంది. ఎన్నో ఏళ్లుగా వేలాది భారతీయులు కైలాసగిరి దర్శనానికి వెళుతున్నారు.
శుభ్రశ్రీ తన కుటుంబంతో కాకుండా దాదాపు 30 మంది ఉన్న బృందంతో ప్రయాణిస్తున్నారు. నగరంలోని ఒక ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో మెడికల్ టెక్నాలజిస్ట్‌గా పనిచేసే ఆమెకు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం అలవాటైన పని. సీపీఆర్, ఇంటెన్సివ్ కేర్ విధానాలు ఆమెకు తెలుసు. శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఆమె భర్త తెలిపారు.
అయితే ఇవేవీ ఆమె చివరి సందేశం తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆమె భర్త సుదీప్తో భట్టాచార్యకు ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోయాయి. "ఉదయం 08:03 తర్వాత ఏం జరిగిందో మాకేమీ తెలియదు" అని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Sudipto Bhattacharya
ఎన్నో ఏళ్ల ఎదురుచూపు
శుభ్రశ్రీ ఎన్నో ఏళ్లుగా ఈ ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆమె కనిపించకుండా పోవడానికి కొద్దిరోజుల ముందు కాఠ్‌మాండూ నుంచి ఇంటికి పంపిన ఫోటోలు, ఆమె ఉత్సాహాన్ని కొంతవరకు తెలియజేస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాలు ఎంతో అందంగా ఉన్నాయని ఆమె తన భర్తకు చెప్పారు.
‘‘ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఇది ఆమె కలల ప్రయాణం’’ అని ప్రభుత్వ అధికారి అయిన భట్టాచార్య చెప్పారు. ఆమె ప్రయాణం ఆగస్టు 21, శుక్రవారం ప్రారంభమైంది.
ఆమె కోల్‌కతా నుంచి మిథిలా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ఆగస్టు 22న రక్సౌల్ చేరుకున్నారు. అక్కడి నుంచి సరిహద్దు దాటి బీర్‌గంజ్ చేరుకుని, బస్సులో కాఠ్‌మాండూకు వెళ్లారు. ఆ రాత్రే అక్కడికి చేరుకున్నారు.
కాఠ్‌మాండూలో మూడు రాత్రులు బస చేసి, అక్కడి ప్రదేశాలను సందర్శించారు.
ఆ తర్వాత ఆగస్టు 25 ఉదయం, ఆ బృందం కాఠ్‌మాండూ నుంచి బస్సులో స్యాబ్రుబేసీకి బయలుదేరింది. కాఠ్‌మాండూకు ఉత్తరంగా దాదాపు 122 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న పర్వత ప్రాంతం లాంగ్‌టాంగ్‌లో ట్రెక్కింగ్ కేంద్రానికి ప్రవేశద్వారం వంటిది. ఈ ప్రయాణానికి దాదాపు 12 గంటలు పట్టింది. అయితే ప్రయాణం సాఫీగా సాగలేదు.
కొండచరియలు విరిగిపడటంతో వారి మార్గం దాదాపు నాలుగు గంటల పాటు మూసివేశారు. సైన్యం రహదారిని క్లియర్ చేసిన తర్వాత వారు ముందుకు సాగారు. అయితే శుభ్రశ్రీ తన భర్తతో మాట్లాడినప్పుడు ఆకాశం నిర్మలంగా ఉందని చెప్పారు.
రాబోయే ప్రమాదాన్ని సూచించేలా పెద్దగా ఏమీ కనిపించలేదు.
‘‘వాతావరణం బాగానే ఉందని ఆమె పదేపదే చెప్పేవారు, చాలా వెచ్చగా ఉందని, అప్పుడప్పుడు వర్షం పడుతోందని చెప్పారు’’ అని ఆయన అంటున్నారు.
మరుసటి రోజు ఉదయం, ఆగస్టు 26న, శుభ్రశ్రీ 07:00 గంటలు దాటిన కొద్దిసేపటికే హోటల్ నుంచి బయలుదేరారు.
భట్టాచార్య ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ సందేశాలు పంపుకుంటూనే ఉన్నారు. దాదాపు గంట తర్వాత నేపాల్ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయిందని, బృందం టిబెట్‌లోకి ప్రవేశించేందుకు వేచి ఉన్నామని ఆమె చెప్పారు.
నేపాల్ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, యాత్రికులు కాలినడకన సరిహద్దు దాటి చైనాలోని గ్యిరోంగ్‌లో ఉన్న ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి చేరుకుంటారు.

ఫొటో సోర్స్, Bhattacharya
వరదలు వచ్చినప్పుడు తన భార్య చైనా ఇమ్మిగ్రేషన్ భవనంలో లేదా దానికి సమీపంలో ఉండి ఉండవచ్చని భట్టాచార్య భావిస్తున్నారు.
"టిబెట్ వైపు వెళ్లిన తర్వాత కమ్యూనికేషన్ సమస్యలు ఉంటాయని నాకు తెలుసు. అందుకే తదుపరి మెసేజ్ కోసం వేచి చూశా’’ అని ఆయన చెప్పారు.
మధ్యాహ్నం సుమారు 3గంటలకు మీడియాలో వరదల వార్తలను ఆయన చూశారు. వెంటనే ఆమె బృందంలోని యాత్రికులకు ఫోన్ చేయడం ప్రారంభించారు. ఎవరూ స్పందించలేదు.
ఆ తర్వాత టూర్ ఆపరేటర్‌కు, బృందంతో పాటు ఉన్న ఇద్దరు మేనేజర్లకు ఫోన్ చేశారు. ఎవరూ స్పందించలేదు.
అప్పటి నుంచి శుభ్రశ్రీ గురించి కుటుంబానికి ఎలాంటి సమాచారం అందలేదు.
‘‘వారిని రక్షించారా? చైనాలో రక్షించిన వారిలో ఈ బృందం కూడా ఉందా? మాకు మరింత సమాచారం కావాలి’’ అని ఆయన అడుగుతున్నారు.
వరదలు సంభవించేలోపే తన భార్య, ఇతరులు చైనా భూభాగంలోకి ప్రవేశించి ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే సరిహద్దు దాటి ఎవరు వెళ్లగలిగారు, ఆ తర్వాత వారికి ఏమైందనే విషయంపై ఆయనకు ఎలాంటి నిర్థరణ లభించలేదు.
‘‘చైనా ప్రభుత్వం నుంచి నాకు ఒక జాబితా ఇప్పించండి. కనిపించకుండా పోయినవారు, మరణించినవారు, కాపాడినవారి ఇలా అందరి వివరాలు కావాలి. మాకు తాజా సమాచారం కావాలి’’ అని ఆయన అడుగుతున్నారు.
‘‘మేం నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఫోన్‌లోనే మా సమయం గడుపుతున్నాం’’ అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
అనిశ్చితిలో రీనా కుటుంబం
రీనా బెనర్జీ (54) కుటుంబం పరిస్థితి మరింత అనిశ్చితంగా ఉంది. సంప్రదింపులు తెగిపోయినప్పుడు ఆమె సరిహద్దుకు ఏ వైపున ఉన్నారో కూడా కుటుంబానికి తెలియదు.
కోల్‌కతాకు చెందిన అవివాహిత, ప్రైవేట్ ట్యూటర్ అయిన రీనా, అదే కైలాస యాత్ర బృందంలో భాగంగా టూర్ ఆపరేటర్‌తో కలిసి ఒంటరిగా ప్రయాణిస్తున్నారు.
అప్పటివరకు ఆమె ప్రయాణం సాఫీగానే సాగుతున్నట్లు కనిపించింది. ఆమె కాఠ్‌మాండూలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఆమెతో వీడియో కాల్స్‌లో మాట్లాడినట్టు మేనల్లుడు ద్వైపాయన్ ముఖర్జీ చెప్పారు.
"ఆమె సంతోషంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత ఆమె ఒక ప్రయాణానికి వెళ్లారు" అని ఆయన చెప్పారు. "
రీనాకు పర్వతాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆమె కొండ ప్రాంతాలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ట్రెక్కింగ్ కూడా చేశారు.
"ఆమె చాలా ఆరోగ్యంగా ఉండేవారు. మేం కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లాం. కొండ ప్రాంతాలకు వెళ్లడం మాకు అలవాటే" అని ముఖర్జీ చెప్పారు. "
మునుపటి రోజు ప్రయాణంలో ఎదురైన కొండచరియల ఘటన గురించి ఆమె ఆయనకు చెప్పారు. దాదాపు నాలుగు గంటల పాటు బృందం అక్కడే చిక్కుకుపోయిందని ఆమె తెలిపారు.
మరుసటి రోజు ఉదయం టూర్ ఆపరేటర్ బృందం ఫోటోను పంపారు. అందులో రీనా నేపాల్ ఇమ్మిగ్రేషన్ కేంద్రం వెలుపల నిలబడి ఉన్నారు.
శుభ్రశ్రీలాగే రీనాకు కూడా డిపార్చర్ ముద్ర లభించిందని ముఖర్జీ చెప్పారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదు.
"వారు సరిహద్దు దాటారో లేదో తెలియదు. వాళ్లు చైనా వైపున ఉన్నారా, నేపాల్ వైపున ఉన్నారా అనేది కూడా మాకు ఇంకా తెలియడం లేదు" అని ముఖర్జీ అంటున్నారు.

ఫొటో సోర్స్, Dwaipayan Mukherjee
శుభ్రశ్రీకి రెండు వారాల ఈ ప్రయాణం తొలి తీర్థయాత్ర. ఎన్నో ఏళ్లుగా ఆమె కల కూడా అదే. రీనాకు కూడా ఈ ప్రయాణం చేయాలని చాలా కాలం నుంచి కోరిక . ఆమెకు పర్వత ప్రాంతాలు కొత్తేమీ కాదు.
ఇద్దరూ జీవితకాలంలో ఒక్కసారైనా చేయాలనుకున్న ఈ తీర్థయాత్ర కోసం ఒక బృందంలో చేరారు. ఇద్దరూ నేపాల్ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. ఇద్దరూ సరిహద్దు దాటి ఉంటారని భావిస్తున్నారు.
ఇప్పుడు వారి పేర్లు నేపాల్ ప్రభుత్వం విడుదల చేసిన గల్లంతయిన వారి అధికారిక జాబితాలో ఉన్నాయి. అయితే దాంతో పెద్దగా స్పష్టత ఏమీ రాలేదు. వారు ఎక్కడ ఉన్నారో, సురక్షితంగా ఉన్నారో లేదో కూడా వారి కుటుంబాలకు తెలియడం లేదు. ఆ బృందం పరిస్థితిపై తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని కోల్‌కతాకు చెందిన టూర్ ఆపరేటర్ చెబుతున్నారు.
ఇరు కుటుంబాల విషయంలోనూ ఈ ప్రయాణం ఒకే సమాధానం లేని ప్రశ్నతో ముగిసింది. ఆ మహిళలు సరిహద్దు దాటి వెళ్లగలిగారా?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























