నేపాల్‌ను హిందువులు ఆధ్యాత్మిక స్వర్గంగా ఎందుకు భావిస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కె.మాయాకృష్ణన్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
నేపాల్‌ను హిందువులకు పవిత్ర భూమిగా, ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు. కైలాస మానస సరోవరానికి వెళ్లే యాత్రికులు కూడా నేపాల్ గుండానే వెళ్తుంటారు.
నదులు, సరస్సులు, లోయలు, ఎత్తయిన పర్వత శిఖరాలతో నేపాల్ సహజ సౌందర్యంతో నిండిన దేశం.
కానీ, ఈ దేశం తరచూ వర్షాలు, వరదలు, మంచు చరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాల బారిన పడే ప్రాంతంగా కూడా పేరొందింది.
ఇలాంటి పరిస్థితుల్లో, ఆగస్టు 26న బుధవారం ఉదయం నేపాల్‌లోని రసువా జిల్లాలో భోడేకోశి నది తీరంలో ఆకస్మిక వరద పోటెత్తింది. దీంతో, భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి.
ఆధ్యాత్మిక భావాలు ఉన్న వారు, ముఖ్యంగా హిందువులు నేపాల్‌కు ఎందుకు వెళ్లాలనుకుంటారు? వారు అక్కడికి ఎలా చేరుకుంటారు? ఈ కథనంలో చూద్దాం..

కైలాస మానస సరోవరం ఎక్కడుంది?
హిందువులు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే కైలాస మానస సరోవర ప్రదేశం టిబెట్‌లో ఉంది.
అయితే, మానస సరోవరం చేరుకునేందుకు మూడు మార్గాలున్నాయి. రెండు భారత్ గుండా అయితే, ఒకటి నేపాల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది.
భారత్‌లో కైలాస మానస సరోవర యాత్రను ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథు లా పాస్ అనే రెండు మార్గాల ద్వారా చేయవచ్చు. అదేవిధంగా, పశ్చిమ నేపాల్‌లోని హమ్లా ద్వారా కూడా సాగించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్ గుండా ఎలా ప్రయాణిస్తారు?
నేపాల్‌లోని హమ్లా నుంచి మానస సరోవరం సందర్శించేందుకు ఉత్తమమైన సమయం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలం. అక్టోబర్ చివరి వరకు పర్యటకులు మానస సరోవరం సందర్శిస్తారు.
మానస సరోవరం వెళ్లే ఆధ్యాత్మికుల్లో చాలామంది భారతీయులే. కాఠ్మాండూ నుంచి నేపాల్గంజ్కు వారు తొలుత ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడే ఒక రాత్రి బస చేయాలి. నేపాల్‌గంజ్ నుంచి 45 నిమిషాల ప్రయాణంలో సిమికోట్‌కు చేరుకోవచ్చు.
సిమికోట్ నుంచి హిల్సాకు ఒక చిన్న విమానంలో వెళ్లి, అక్కడి నుంచి టిబెట్‌లోని దక్లాఖోట్కు బైకుపై వెళ్లొచ్చు. అక్కడ్నుంచి మానస సరోవరానికి అసలైన ప్రయాణం మొదలవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ గుండా ఎలా వెళ్లాలి?
భారత విదేశాంగ శాఖ ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు లిపులేఖ్ పాస్ (ఉత్తరాఖండ్), నాథు లా పాస్ (సిక్కిం) అనే రెండు వేర్వేరు మార్గాల ద్వారా కైలాస మానస సరోవర యాత్రను నిర్వహిస్తుంది.
ఒక ట్రావెల్ వెబ్సైట్ ప్రకారం, లిపులేఖ్ పాస్ నుంచి ఈ యాత్రకు అయ్యే అంచనా వ్యయం సుమారు రూ.1.70 లక్షలు.
ఈ మార్గంలో 200 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఐదు బ్యాచ్‌లను పంపుతారు. ఈ దారిగుండా యాత్రను పూర్తి చేసేందుకు 22 రోజులు పడుతుంది.
ఒకవేళ నాథులా పాస్లోంచి వెళ్తే ఒక్కొక్కరికి సుమారు రూ.2.83 లక్షలు ఖర్చవుతుంది.
ఈ రూట్లో 36 కి.మీ.లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. 10 బ్యాచ్‌లకు అనుమతిస్తారు. 21 రోజుల్లో యాత్ర పూర్తవుతుంది.
కైలాస పర్వతం సముద్ర మట్టానికి 6,638 మీటర్ల ఎత్తులో ఉంది. మానస సరోవర సరస్సు బౌద్ధ, జైన మతాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
2025లో భారత విదేశాంగ శాఖ అందించిన సమాచారం ప్రకారం.. ప్రయాణం ప్రారంభానికి ముందు యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పైగా వెళ్లేవాళ్లంతా ఒకేసారి వెళ్లి, ఒకేసారి తిరిగి రావాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ తెలిపింది. అందరూ దిల్లీ నుంచే బయలుదేరాల్సి ఉంటుంది.
ఈ టూర్ ప్రారంభానికి ముందు తమ పాస్‌పోర్టును, ఆరు పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోలను, రూ.100 నోటరీ చేయించిన బాండ్‌ను విదేశాంగ శాఖలోని సంబంధిత అధికారులకు ఇవ్వాలి.
అత్యవసర సమయంలో హెలికాప్టర్లో తరలింపు కోసం అఫిడవిట్‌ను సమర్పించాలి. ఒకవేళ మరణిస్తే చైనా భూభాగంలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకార పత్రాన్ని ఇవ్వాలి.
ఈ డాక్యుమెంట్లలో ఏది లేకపోయినా యాత్రకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
కైలాస మానససరోవర యాత్రకు సంబంధించిన నిబంధనలను విదేశీ వ్యవహారాల శాఖ రూపొందించింది. దీనికి తొలి అర్హత కచ్చితంగా భారతీయ పౌరులై ఉండడం.
సెప్టెంబర్ 1 నాటికి సుమారు ఆరు నెలల వాలిడిటీతో భారతీయ పాస్‌పోర్ట్ ఉండాలి.
ఆ ఏడాది జనవరి 1 నాటికి వయసు 18 ఏళ్లు నుంచి గరిష్ఠంగా 70 ఏళ్ల మధ్య ఉండాలని భారత విదేశీ వ్యవహరాల శాఖ తెలిపింది.
ఈ యాత్రకు అత్యంత ముఖ్యమైన, కీలకమైన విషయం బీఎంఐ.. అంటే, బాడీ మాస్ ఇండెక్స్.
25 లేదా అంతకంటే తక్కువ బీఎంఐ ఉన్నవారిని మాత్రమే ఈ యాత్రకు వెళ్లేందుకు అనుమతిస్తారు. టూర్లో పాల్గొనే వ్యక్తి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం అత్యంత అవసరం.
విదేశీ పౌరులు ఈ యాత్రకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేదు. దీంతో పాటు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోలేరు.

ఫొటో సోర్స్, Subaas Shrestha/NurPhoto via Getty Images
'నేపాల్‌ను శివుని నివాసంగా భావిస్తారు'
హిందువుల ప్రథమ దైవంగా భావించే శివుని నివాసంగా నేపాల్‌ను పరిగణించడం వల్లే అదొక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారిందని తిరువణ్ణామలైలోని బోలూరుకు చెందిన గోకులకృష్ణన్ మహారాజ్ అన్నారు.
"నేపాల్ ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత రెండూ ఉన్న ఒక స్వర్గధామం. జీవితంలో ఒక్కసారైనా ఈ గడ్డపై అడుగుపెట్టి కైలాస పర్వతాన్ని చూడటం హిందువుల కల. రెండేళ్ల క్రితం నాకు అక్కడికి వెళ్లే అవకాశం లభించింది" అని బీబీసీకి తెలిపారు.
నేపాల్ రాజధాని కాఠ్మాండూలోని పశుపతి నాథ్ ఆలయం అచ్చం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం మాదిరిగానే భావిస్తారని గోకుల్‌కృష్ణన్ చెప్పారు.
"కాశీలో దహన సంస్కారాలు చేస్తే మృతదేహాలు స్వర్గానికి వెళ్తాయని నమ్మినట్లే, నేపాల్‌లో మరణిస్తే స్వర్గం ఖాయమనే నమ్మకం ఉంది. కాశీలో ప్రవహించే గంగా నదిలాగే, ఇక్కడి ఈ ఆలయం పక్క నుంచే బాగ్మతి నది కూడా ప్రవహిస్తుంది" అని వివరించారు.
అక్కడి పూజా విధానాన్ని ఆయన వివరించారు. "ఇక్కడ, ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన రెండు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు గల బాలికను ఎంపిక చేసి, దేవతగా పూజిస్తారు. పండుగల సమయంలో మాత్రమే కనిపించే ఈ కుమారిని ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది ప్రజలు సందర్శిస్తారు'' అని తెలిపారు.
''ఆ అమ్మాయి యవ్వనంలోకి చేరుకున్నాక, మరొక అమ్మాయిని కుమారిగా ఎంపిక చేస్తారు. ఈ పద్ధతిని ఇప్పటికీ నేపాల్ పాటిస్తుంది. ఆడపిల్లను ఒక దేవతగా పూజించేందుకు దీన్నొక సూచికగా చూస్తారు. అదేవిధంగా, భగవతీ దేవి ఆలయంగా ప్రసిద్ధి చెందిన మనకామన ఒక గొప్ప పుణ్యక్షేత్రం'' అని చెప్పారు.
కాఠ్మాండూ సమీపంలో నాగర్‌కోట్, చంద్రగిరి కొండ, సిసపాని వంటి అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ, తొలి సూర్యోదయాన్ని తిలకించడానికి నాగర్‌కోట్ ఉత్తమమైన ప్రదేశమని గోకులకృష్ణన్ పేర్కొన్నారు.
హిమాలయాల నుంచి ఉదయించే సూర్యుడిని, ఉదయం పూట నారింజ రంగు కాంతిలో, పర్వతాలు, లోయల సౌందర్యంలో చూడవచ్చనే హిందువుల నమ్మకం ఇందుకు ఒక కారణమని ఆయన తెలిపారు.
అలాగే, బుద్ధుని పవిత్ర జన్మస్థలమైన లుంబిని, విష్ణువుకు అంకితం చేసిన వైష్ణవ పుణ్యక్షేత్రం ముక్తినాథ్ ఆలయం, సీతాదేవి జన్మించినట్లు భావించే జనక్‌పూర్ సీతా ఆలయం కూడా నేపాల్‌లోని హిందువులకు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, BSIP/Universal Images Group via Getty Images
కైలాస పర్వతం
''కైలాస్ ప్రతి ఒక్కరి ప్రదేశం. ముఖ్యంగా సాధువులు, హిందువులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలని కోరుకుంటారు. అక్కడికి వెళ్లి, పూజలు చేయడం వల్ల ఆధ్యాత్మిక పరివర్తన వస్తుంది. అంతేకాకుండా, కైలాస ప్రదక్షిణ, పూజ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ తీర్థయాత్రలలో ఒకటి. ఈ పర్వతం మనశ్శాంతికి, సామరస్యానికి శక్తివంతమైన ప్రతీకగా చూస్తారు" అని గోకులకృష్ణన్ చెప్పారు.
హిందువుల నమ్మకం ప్రకారం.. శివుడు తన కుటుంబంతో కలిసి అక్కడే వెలసి ఉన్నాడని నమ్ముతారు. జైనులు ఈ పర్వతాన్ని అష్టపద అని పిలుస్తారు. ఇక్కడే 24 మంది తీర్థంకరులలో ప్రథముడైన రిషభనాథుడు జ్ఞానోదయం పొందాడు.
టిబెటన్ బౌద్ధ, షమన్ బోన్ మతానికి చెందిన అనుచరులు ఈ పర్వతాన్ని ఖగోళ దేవత సిపమెన్ నివాసమైన 'తైసే' అని పిలుస్తారు. టిబెటన్ బౌద్ధులు ఈ శిఖరాన్ని డెమ్చోక్, ఆయన భార్య టోర్జే బాగ్మో నివాసంగా భావించి పూజిస్తారు.
"ఆసియాలోని నాలుగు ప్రధాన నదులు, వాటి మూల హిమనీనదాలు కలిసి పర్వతం పైభాగంలో స్వస్తిక అనే అద్భుతమైన హిందూ చిహ్నాన్ని ఏర్పరుస్తాయి. ఉత్తరం నుంచి సింధు, దక్షిణం నుంచి కర్ణబి (గంగా ఉపనది), పశ్చిమం నుంచి సట్లెజ్, తూర్పు నుంచి బ్రహ్మపుత్ర నదులు ఆసియా ఖండానికి జీవనాధారం. అలాగే, కైలాస పర్వతం దగ్గర ఉన్న మానస సరోవర సరస్సును పవిత్రమైనదిగా భావిస్తారు" అని గోకులకృష్ణన్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'బ్రహ్మ మనస్సులో మానస సరోవరం వెలిసింది'
"హిందూ విశ్వాసం ప్రకారం, మానస సరోవరం మొదట బ్రహ్మ మనస్సులో వెలిసిందని నమ్ముతారు. అందుకే దీనిని మానస సరోవరం అని పిలుస్తారు. 'మానస సరోవరం' అనే పేరు రెండు సంస్కృత పదాల కలయిక. 'మానస్' అంటే 'మనస్సు' లేదా 'జ్ఞానం', అలాగే, 'సరోవరం' అంటే 'సరస్సు'," అని గోకులకృష్ణన్ చెప్పారు.
కైలాస మానస సరోవరంలో దేవతలు నివసిస్తూ తపస్సు చేస్తారనే నమ్మకం ఉందని, అంతేకాకుండా హిందువులే కాకుండా అనేక మతాలకు చెందిన ఆధ్యాత్మిక భావాలు గలవారు కూడా అక్కడికి వస్తారని ఆయన పేర్కొన్నారు.
తిరువణ్ణామలైకి చెందిన గోకులకృష్ణన్ మహారాజ్ నేపాల్ సందర్శించడానికి అక్టోబర్, నవంబర్ నెలలు మంచి సమయమని పేర్కొన్నారు.

నేపాల్ ఎలా వెళ్లాలి?
హిందువులు ప్రతి ఏడాది ఆధ్యాత్మిక దైవభూమి అయిన నేపాల్‌ను సందర్శించేందుకు ఆతృతగా వేచిచూస్తుంటారని 50 ఏళ్లుగా కుంభకోణంలో సూపర్ యాత్రా ఏజెన్సీ నిర్వహిస్తున్న సయ్యద్ సాదిఖ్ తెలిపారు.
"ఆధ్యాత్మిక పర్యాటనం కోసం మేం ప్రతి సంవత్సరం మా ఏజెన్సీ ద్వారా ప్రతినిధుల బృందాన్ని నేపాల్‌కు పంపుతాం. కొన్నిసార్లు నేను కూడా వారితో పాటు వెళ్తాను" అని సయ్యద్ సాదిఖ్ అన్నారు.
"మా ఏజెన్సీ ద్వారా ఇప్పటికే ప్రయాణించిన వారి ద్వారా మమ్మల్ని సంప్రదించే వారిని, వారి ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేస్తాం. వారి ఆరోగ్య పరిస్థితులను కూడా పరిశీలించి, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే తీసుకువెళ్తాం" అని తెలిపారు.
నేపాల్‌కు వెళ్లే మార్గాన్ని సయ్యద్ సాదిఖ్ వివరించారు. "మేం వారిని ఇక్కడి నుంచి ఎక్కువగా విమానంలో కాఠ్మాండూకు తీసుకువెళ్తాం. అక్కడ నుంచి వారిని 25 మంది చొప్పున వేర్వేరు మినీ బస్సులలో మానస సరోవరం కైలాస్ ప్రాంతానికి తీసుకువెళ్తాం" అని చెప్పారు.
నాలుగు రోజుల ప్రయాణం
"అక్కడికి వెళ్లేటప్పుడు చాలా ఓపికతో బస్సులో ప్రయాణించాలి. వృద్ధులకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. వారికి బస్సు ప్రయాణం అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. మార్గమధ్యంలో ఆరోగ్య సమస్యలు ఏవైనా తలెత్తితే, వారికి వైద్యుల నుంచి చికిత్స పొందే సౌకర్యం కూడా ఉంది. ఒకవేళ తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటే, వారిని ప్రత్యామ్నాయ వాహనంలో ఆశ్రమానికి పంపిస్తాం" అని సయ్యద్ సాదిఖ్ అన్నారు.
"నాలుగు రోజుల ప్రయాణం తర్వాత, మేం కైలాసం చేరుకున్నాక, అక్కడ దర్శనం చేసుకుని, కొందరు గిరి ప్రదక్షిణ చేసినట్లుగా పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీనికి రెండు రోజులు పడుతుంది, దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం మారుతూ ఉంటుంది. అలాగే, ఇది చల్లని ప్రాంతం, మేం వారికి తగిన దుస్తులు తొడిగించి మాతో పాటు తీసుకువెళ్తాం. అవసరమైతే వాటిని కొనిస్తాం" అని సయ్యద్ సాదిఖ్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























