ఎవరెస్ట్‌‌పైన అద్భుతం: చనిపోయాడనుకున్న గైడ్ 6 రోజుల తరువాత మంచుపై పాకుతూ వచ్చాడు

ఎవరెస్ట్ పర్వతం, బేస్ క్యాంప్, దావా షెర్పా, నేపాల్

ఫొటో సోర్స్, Sagarmatha Pollution Control Committee (SPCC)

ఫొటో క్యాప్షన్, చనిపోయి ఉంటాడని భావించిన దావా షెర్పా ( టీ తాగుతున్న వ్యక్తి) ప్రాణాలతో బతికి బయటపడ్డారు.
    • రచయిత, కమల్ పరియార్, కోహ్ ఇవే
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఎవరెస్ట్ పర్వతంపైన చనిపోయాడనుకున్న ఓ గైడ్, ఆరురోజల తరువాత పాక్కూంటూ బేస్‌క్యాంప్ వద్దకు చేరుకున్నాడు.

ఎవరెస్ట్‌ శిఖరాగ్రం చేరుకుని తిరిగి వచ్చే సమయంలో దావా షెర్పా క్యాంప్3 పైన 7500 మీటర్ల (24,600 అడుగులు) ఎత్తులో చివరిసారిగా కనిపించారు.

అంత ఎత్తులో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆయన బతికే అవకాశాలూ చాలా తక్కువ. అయితే గురువారం నాడు క్లీనింగ్ సిబ్బంది ఈ అనుభవజ్ఞుడైన షెర్పాను గుర్తించారు. అప్పటికే ఆయన చేయి హిమఘాతానికి (ఫ్రాస్ట్‌బైట్) గురైంది. అయినా, ఆయన ఆరోగ్యంగానే కనిపించారు. మెల్లిగా మంచుపై జారుతూ వస్తున్నారు.

‘‘దావా ఆరు రోజులుగా అన్ని అవరోధాలను తట్టుకుని ప్రాణాలతో ఉండటమంటే ఇది అద్భుతం కంటే తక్కువేమీ కాదు’’ ‘‘నిజమైన ఆత్మరక్షణ అంటే ఇదే’’ అని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న 8కే ఎక్స్‌పెడిషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెంబా షెర్పా అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎవరెస్ట్ పర్వతం, బేస్ క్యాంప్, దావా షెర్పా, నేపాల్

ఆత్మ శాంతి కోసం భార్య ప్రార్థన

ఈ ఏడాది ఎవరెస్ట్ ఎక్కిన వారిలో ఐదుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు పర్వతారోహలకులకు సహకరించే నేపాలీలని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. ఈ సీజన్‌లో వెయ్యి మందికిపైగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. దీంతో ఇది రికార్డు స్థాయిలో అత్యంత రద్దీ సీజన్‌గా నిలిచింది.

ప్రముఖ పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీకి గుర్తుగా దావా షెర్పాను హిల్లరీ దావా షెర్పా అని కూడా పిలుస్తారు.

దావా షెర్పా తాము చూసినప్పుడు నెమ్మదిగా పాక్కుంటూ ఖుంబూ ఐస్‌ఫాల్ మీదుగా బేస్ క్యాంప్ వైపు వస్తున్నారని పెంబా షెర్పా చెప్పారు.

"నాకు తెలిసినంత వరకు ఎవరెస్ట్ పర్వతంపై అంత ఎత్తులో ఇప్పటి వరకు ఎవరూ ఒంటరిగా ప్రాణాలతో బయటపడలేదు. 6 రోజులు ఒంటరిగా ఉండి ప్రాణాలతో కిందకు దిగడం నిజంగా అద్భుతం. అతను సురక్షితంగా ఉండేందుకు టెంట్ల లోపలే ఉండి ఉండవచ్చు" అని పెంబా షెర్పా అన్నారు.

దావా షెర్పా "స్పృహలోనే ఉన్నారని, చికిత్స పొందుతున్నారని" కాఠ్‌మాండూలోని హామ్స్ హామ్స్ ఆసుపత్రి డాక్టర్ నిశాంత్ ధకాల్ చెప్పారు.

"ఆయన నన్ను గుర్తు పట్టారు. బాగున్నారు. మాట్లాడుతున్నారు. మేం సంతోషంగా ఉన్నాం" అని దావా షెర్పాను పరామర్శించిన తర్వాత ఆయన కుమార్తె మెండో లామో షెర్పా రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

దావా షెర్పా ఆచూకీ తెలియడానికి ముందు, భర్త ఆత్మశాంతి కోసం తాను ప్రార్థనలు చేసినట్లు 52 ఏళ్ల ఆయన భార్య ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

ఎవరెస్ట్ పర్వతశిఖరం

ఇన్‌స్టాలో బ్రిటన్ పర్వతారోహకుడి వీడియో

దావా షెర్పా ఎవరెస్ట్‌పై మరణించారని భావించిన పర్వాతారోహకుడు, బ్రిటీష్ మాజీ సైనికుడు క్రిస్ థ్రాల్ ఆయనకు నివాళి అర్పిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో ఎవరెస్ట్ శిఖరానికి ముందున్న అత్యంత ఎత్తైన నాలుగో బేస్ క్యాంప్ నుంచి వారు కిందకు దిగుతున్నప్పుడు దావా షెర్పా "తన బ్యాగు తీసుకుని విశ్రాంతి కోసం అక్కడ కూర్చున్నారని" థ్రాల్ గుర్తు చేసుకున్నారు.

"నేను వెనక్కి తిరిగి 'హిల్లరీ మీరు బాగానే ఉన్నారా?' అని అడిగాను. దానికతను సమాధానమిస్తూ అవును, బాగానే ఉన్నాను క్రిస్. మీరు వెళ్లండి అన్నారు. ఇది కొత్తేమీ కాదు. నేనుముందు వెళతాను. అతను వెనుక వస్తారు" అని థ్రాల్ గుర్తు చేసుకున్నారు.

థ్రాల్ కిందకు దిగుతున్న సమయంలో వారి టీమ్‌లో ఒకరైన పోలండ్ పర్వతారోహకుడు ఇబ్బంది పడటాన్ని చూశారు. దీంతో అతనితో కలిసి థ్రాల్ కిందకు దిగారు. కానీ దావా షెర్పా వాళ్లను కలవలేకపోయారు.

"ఎవరెస్ట్ ఎక్కడం సుదీర్ఘమైన ప్రయాణం. శిఖరానికి వెళ్లి తిరిగి రావడానికి 5 రోజులు పడుతుంది. అలాంటిది మాకు 11 రోజులు పట్టింది. అక్కడ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి" అని థ్రాల్ అన్నారు.

"కాబట్టి నేను షెర్పా కోసం తిరిగి వెళ్లాలా? అతను ఇంతకు ముందు వందల సార్లు వచ్చినట్లే తిరిగి వచ్చి ఉంటాడు" అని తాను అనుకున్నట్లు థ్రాల్ చెప్పారు.

దావా షెర్పా బంధువుల్లో ఒకరైన కుంగ్ షెర్పా పర్వతం మీద దావా షెర్పా కోసం గాలింపు చర్యల మందగమనంపై అడ్వంచర్ స్పోర్ట్ పబ్లికేషన్ "అవుట్ సైడ్‌"కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే దావా షెర్పా కోసం గాలింపు చేపట్టిన 8కే ఎక్స్‌పెడిషన్స్ ఆయనను విమానంలో సురక్షిత ప్రాంతానికి తరలించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)