వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026 - ఎంట్రీకి వచ్చిన వాటిలో అబ్బురపరిచే 10 ఫోటోలివే...

ఫొటో సోర్స్, Audun Rikardsen
- రచయిత, మాడీ మల్లోయ్
- హోదా, క్లైమేట్ అండ్ సైన్స్ ఫోటోగ్రాఫర్
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఆర్కిటిక్‌లోని అత్యంత శక్తివంతమైన వేటాడే జంతువులలో ఒకదానితో ముఖాముఖిగా ఎదురైతే ఎలా ఉంటుంది?
ఈ అద్భుతమైన ఫోటో ఒక సీల్ దృష్టికోణం నుంచి జీవితాన్ని చిత్రీకరిస్తుంది.
నార్వేకు చెందిన వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆడున్ రికార్డ్సెన్ తీసిన ఈ చిత్రం, లండన్‌లోని యూకే నేచురల్ హిస్టరీ మ్యూజియం నిర్వహించిన ఈ ఏడాది వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీలో 'హైలీ కమెండెడ్' ఎంట్రీలలో ఒకటిగా నిలిచింది.
ఆర్కిటిక్ వైల్డ్‌లైఫ్ టూర్స్‌లో గైడ్‌గా పనిచేస్తున్నప్పుడు, రికార్డ్సెన్ ఒక సీల్ శ్వాస రంధ్రం కింద మోషన్ సెన్సర్ పెట్టి, నీళ్లలో కూడా పనిచేసే కెమెరాను అమర్చారు. తెల్లవారు జామున 4 గంటలకు, ఒక ఆడ ధ్రువపు ఎలుగుబంటి అక్కడికి వచ్చి కిందికి తొంగి చూసింది.
ఆ తర్వాత ఆ ఎలుగుబంటి వెళ్లిపోయే వరకు 8 గంటలు వేచి చూశారు రికార్డ్సెన్స్.


ఫొటో సోర్స్, Sora Miyazawa
టైటిల్: అర్బన్ వాండరర్ , ఫోటో గ్రాఫర్: సోరా మియాజావా, ప్రదేశం: టోక్యో జపాన్
వర్షం కురిసిన తర్వాత మియాజావా టోక్కో నగరంలోని ఒక వీధిలో వెళుతున్నప్పుడు ఈస్ట్రన్ జపనీస్ జాతి కప్పను చూశారు. అది తిరిగి పొదల్లోకి దూకక ముందే, తన కెమెరాతో స్లో షట్టర్ స్పీడ్‌తో దానిని ఫోటో తీశారు.
ఈస్ట్రన్ జపనీస్ కప్పలు తూర్పు జపాన్‌లోని అడవులు, గడ్డి మైదానాలు, ఇతర ఆవాసాలలో కనిపిస్తాయి. అయితే, పట్టణ వాతావరణానికి కూడా అద్భుతంగా అలవాటుపడగలవని అవి నిరూపించుకున్నాయి.

ఫొటో సోర్స్, Vegard Byrkjeland Aasen
టైటిల్: లిఫ్టెడ్ టు ది సర్ఫేస్
ఫోటో గ్రాఫర్: వేగార్డ్ బిర్క్జీలాండ్ ఆసెన్
ప్రదేశం:క్వానాన్జెన్, నార్వే
ఒక సర్వే కోసం డ్రోన్‌ను ఎగురవేస్తున్నప్పుడు ఒక నార్వేజియన్ ఫ్యోర్డ్లో చనిపోయిన పిల్ల ఓర్కా (ఒక రకమైన తిమింగలం)ను మోసుకెళుతున్న పెద్ద ఓర్కాను ఫోటోగ్రాఫర్ ఆసెన్ గమనించారు.
ఆ ఓర్కా తన పిల్లను పదేపదే మునిగిపోనిస్తూ, మళ్ళీ పైకి తీసుకువస్తోంది. చూడటానికి అది ఒక బాధాకరమైన దృశ్యమే అయినా, దానిని రికార్డు చేయడం ముఖ్యమని ఆసెన్ భావించారు.
ఈ ప్రవర్తన అది తన పిల్లను బతికించడానికి చేసే ప్రయత్నం కావచ్చు. లేదంటే చనిపోయిన పిల్లను మోసుకెళ్లడం కావచ్చు.
కిల్లర్ వేల్స్ చనిపోయిన తమ పిల్లలను మోసుకెళతాయని సైంటిస్టులు గమనించారు. ఒక సందర్భంలో, సదరన్ రెసిడెంట్ అనే ఆడ కిల్లర్ వేల్ తన చనిపోయిన పిల్లను కనీసం 17 రోజుల పాటు ఇలా మోసుకెళ్లింది.

ఫొటో సోర్స్, Andrea & Maceo Grammatico
టైటిల్: బైటింగ్ బ్యాక్
ఫోటో గ్రాఫర్: ఆండ్రియా, మాసియో గ్రామాటికో
ప్రదేశం: సీర్పే, కోస్టారికా
ఆండ్రియా, మాసియో గ్రామాటికో అనే కవలలు తమ కెమెరాలో బంధించిన ఫోటోలను రివ్యూ చేస్తున్నప్పుడు వారికి ఒక అద్భుతమైన ఫోటో తారసపడింది.
ఫెర్ డీ లాన్స్ వైపర్ అనే పాము తలపై విశ్రాంతి తీసుకుంటున్న దోమ వారి కెమెరాకు చిక్కినట్లు వారు గుర్తించారు.
‘‘మేం ఇప్పటి వరకు సృష్టించిన అత్యంత కష్టతరమైన ఫోకస్ స్టాక్‌లలో ఇది ఒకటి" అని వారు ఆ ఫోటోను వర్ణించారు ఆ కవలలు.

ఫొటో సోర్స్, Andrew Parkinson
టైటిల్: వింగ్స్ ఆఫ్ డార్క్నెస్
ఫోటో గ్రాఫర్: ఆండ్రూ పార్కిన్సన్
ప్రదేశం: నార్తర్న్ పంటనాల్, బ్రెజిల్
బ్రెజిల్‌లోని పంటనాల్ చిత్తడి నేలల్లో, తన పడవను దూరంగా ఉంచి, పొడవైన టెలిఫోటో లెన్స్‌ను ఉపయోగించి చనిపోయిన ఒక యాకరే కైమాన్ (ఒకరకం మొసలి) మీద వాలిన నల్ల రాబందును ఫోటో తీశారు ఫోటోగ్రాఫర్ పార్కిన్సన్ .
ఆ రాబందు ఎగిరిపోయిన తర్వాత, ఫ్రేమ్ దూరంగా వేచి చూస్తున్న ఒక జాగ్వార్ ఆ కళేబరాన్ని తినడానికి బయటకు వచ్చింది.
అప్పుడే పార్కిన్సన్ ఆ కైమాన్ తల వెనుక భాగంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న గాయాన్ని గమనించారు. బహుశా వేగంగా వస్తున్న పడవ ఢీకొట్టడం వల్ల అది ఏర్పడి ఉండవచ్చని ఆయన అనుమానం.

ఫొటో సోర్స్, Dewald Tromp
టైటిల్: ఐ ఆఫ్ ది స్ట్రామ్
ఫోటో గ్రాఫర్: డివాల్డ్ ట్రాంప్
ప్రదేశం: నమీబ్ ఎడారి, నమీబియా
నమీబ్ ఎడారిలో ఒక నమాక్వా ఊసరవెల్లిని ఫోటోలు తీస్తుండగా, అకస్మాత్తుగా గాలి తీవ్రమై, ఇసుక తుపాను రావడంతో విజిబిలిటీ తగ్గిపోయి, శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది ఫోటో గ్రాఫర్ ట్రాంప్కు.
ఈ ఊసరవెల్లులు ఎడారిలో జీవించడంలో నిపుణులు. గాలి నుంచి నేరుగా తేమను పొందగలవు. వాటి చర్మంపై మంచు బిందువులు చేరి, సూక్ష్మమైన గాడుల ద్వారా వాటి నోటి వైపుకు వెళ్తాయి.
అదే సమయంలో, వాటి నాలుకలు మొక్కలు, ఇసుక, రాళ్లపై ఘనీభవించిన పొగమంచు నుంచి కూడా నీటిని సేకరించగలవు.

ఫొటో సోర్స్, Ernest Porter
టైటిల్: మ్యూచువల్ ఫ్రెండ్స్
ఫోటో గ్రాఫర్: ఎర్నెస్ట్ పోర్టర్
ప్రదేశం:ఎంపుమలాంగా, సౌత్ ఆఫ్రికా
అభయారణ్యంలో వన్యప్రాణుల కోసం వెతుకుతున్నప్పుడు, మిట్టమధ్యాహ్నం ఒక తెల్ల ఖడ్గమృగం చర్మానికి తన ముక్కును రుద్దుతున్న ఎర్ర ముక్కు ఆక్స్పెక్కర్ పక్షిని పోర్టర్ ఫోటో తీశారు.
ఈ పక్షులు ఖడ్గమృగాలపై నివసించే కీటకాలను తింటాయి. ప్రమాదం సమీపించినప్పుడు తమ మిత్రుల్లాంటి ఈ జంతువులను అరుస్తూ అలర్ట్ చేస్తాయి.
స్వాహిలీ భాషలో, ఎర్రముక్కు ఆక్స్పెక్కర్ను 'అస్కారి వా కిఫారు' అని పిలుస్తారు. దీని అర్థం "ఖడ్గమృగం రక్షకుడు" అని.

ఫొటో సోర్స్, Jens Cullmann
టైటిల్: స్ప్లిట్ సెకండ్ ఎస్కేప్
ఫోటో గ్రాఫర్: జెన్స్ కల్మాన్
ప్రదేశం: సెంట్రల్ కల్హారి గేమ్ రిజర్వ్, బోట్స్వాన్
ఒక ఆఫ్రికన్ బుల్‌ఫ్రాగ్ బాబుల్ సీతాకోకచిలుక మీదకు దూకింది, కానీ గురితప్పింది.
కల్మాన్ గత పర్యటనలో, భారీ వర్షాల తర్వాత టాడ్‌పోల్స్ (తలకప్పలు లేదా కప్ప పిల్లలు)ను గమనించారు. మరుసటి నెల తిరిగి వచ్చి చూడగా, చెరువులు, నీటి గుంటలు చిన్న బుల్‌ఫ్రాగ్ (ఒక రకం కప్పలు)లతో నిండి ఉన్నాయి. రెండు వారాలకు పైగా ఆ చిన్న కప్పలు ప్రతి కదలికలను గమనిస్తూ గడిపారు కల్మాన్.
పెద్దయ్యాక, ఆఫ్రికన్ బుల్‌ఫ్రాగ్‌లు 12 సెం.మీ. పొడవు వరకు పెరుగుతాయి. ఇవి సంవత్సరంలో సుమారు 10 నెలల పాటు భూగర్భంలో నిద్రావస్థలో ఉండి, వర్షాల తర్వాత సంతానోత్పత్తి చేయడానికి, విపరీతంగా ఆహారం తినడానికి బయటకు వస్తాయి.

ఫొటో సోర్స్, Gil Wizen
టైటిల్: హిడెన్ డ్రాగన్
ఫోటో గ్రాఫర్: గిల్ వైజెన్
ప్రదేశం: నాపో ప్రావిన్స్, ఈక్వెడార్
కేవలం 15 మిల్లీమీటర్ల పొడవుండే ఒక లైకెన్ డ్రాగన్ క్యాటిడిడ్ (ఒక రకం మిడత)ను వైజెన్ ఫోటో తీస్తున్నారు. అయితే దానిచుట్టూ ఉన్న గడ్డి నుంచి దానిని వేరుగా గుర్తించడం చాలాకష్టమైంది. అది కదిలినప్పుడు మాత్రమే అది కీటకమని గుర్తించగలిగారాయన.
ఈక్వెడార్‌లోని ఆండీస్ పర్వతాలలో మాత్రమే కనిపించే ఈ జీవి, తన చుట్టూ ఉన్న ముళ్ల కవచం, ఒక ప్రదేశానికి తగ్గట్టుగా మారిపోయే దాని స్వభావం కారణంగా వేటాడే జంతువుల నుంచి తనను తాను రక్షించుకుంటుంది.

ఫొటో సోర్స్, Pietro Rojas
టైటిల్: ది షో గోస్ ఆన్
ఫోటో గ్రాఫర్: పీట్రో రోజాస్
ప్రదేశం: దోహా, ఖతార్
నగరంలో సర్కస్ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లిన ఫోటోగ్రాఫర్ రోజాస్కు సర్కస్‌లోకి ప్రవేశించగానే ఒక దృశ్యం కనిపించింది.
మూతిని గట్టిగా కట్టేసి ఉన్న ఒక గోధుమ రంగు ఎలుగుబంటి ఒక చిన్న మోటార్ సైకిల్ మీద తిరుగుతోంది. ఆయన దృష్టిలో ఆ దృశ్యం జంతువు ఆటవిక స్వభావానికి, దానిపై మనుషులు రుద్దిన వాతావరణానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని స్పష్టం చేసింది.
జంతువులపై హింస జరుగుతోందన్న ఆందోళనల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలు సర్కస్‌లలో జంతువుల వాడకాన్ని నిషేధించడమో, లేదా తగ్గించడమో చేశాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


































