అనన్య బిర్లా: వ్యాపారాల నుంచి సినిమాల దాకా ఈమె పేరు ఎందుకు వినిపిస్తోంది?

ఫొటో సోర్స్, Taylor Hill/Getty Images
అనన్య బిర్లా. వ్యాపారాల నుంచి సంగీతం, సినిమా రంగాల వరకు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ నిత్యం వార్తలలో నిలుస్తున్నారు.
దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఒకరైన కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా.
ఆరు తరాల బిర్లా కుటుంబం నుంచి వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టిన తొలి మహిళ.
సంగీత ప్రపంచంలో కూడా అనన్య తనదైన ముద్ర వేసి, ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన ఉనికిని చాటుకుంటున్నారు.
కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' తొమ్మిదవ సీజన్‌లోని 6వ ఎపిసోడ్లో తన వ్యక్తిగత జీవితం, పెళ్లి ప్రతిపాదనలు,వ్యాపార ప్రపంచంలోని పితృస్వామ్యం గురించి అనన్య బిర్లా మాట్లాడారు.

ఈ షోలో 'మీ కుటుంబ ప్రతిష్ఠ, బ్రాండ్ విలువ కలగలిసిపోయాయి కదా, ఇతర పెద్ద పారిశ్రామికవేత్తల కుటుంబాల నుంచి మీకెప్పుడైనా పెళ్లి ప్రతిపాదన వచ్చిందా' అని అనన్య బిర్లాను ప్రశ్నించారు.
దీనిపై అనన్య స్పందిస్తూ , 'నాకో పెద్ద పెళ్లి ప్రతిపాదన వచ్చింది, అంతేకాదు ఒకే వ్యక్తి నుంచి చాలా ప్రతిపాదనలు వచ్చాయి' అని చెప్పారు.
ఆ ప్రతిపాదన చేసిన వ్యక్తి పేరు చెప్పమంటే అనన్య నిరాకరించారు. ఇక దీనిపై ఊహాగానాలు చేయడానికి ఇంటర్నెట్కు అనుమతివ్వాలని కరణ్ జోహార్ సరదాగా వ్యాఖ్యానించారు.
పదేపదే పెళ్లి సంబంధాలు రావడంపై తన తల్లిదండ్రులు విసుక్కుంటారని, ఎందుకంటే తను ఒకసారి వద్దంటే ఆ విషయం అక్కడితో ముగిసిపోవాలని వారు భావిస్తారని అనన్య చెప్పారు.
'కాఫీ విత్ కరణ్'లో తన వ్యక్తిగత జీవితం గురించి అనన్య మాట్లాడుతూ, తనను తాను పూర్తి రొమాంటిక్ వ్యక్తిగా అభివర్ణించుకున్నారు.
తనకు సరిపోని వ్యక్తుల పట్ల తాను తరచుగా ఆకర్షితురాలవుతానని, అలాగే తాను కూడా వారికి సరిపోనని ఆమె చెప్పారు.
ఇంటర్వ్యూ సమయంలో, డేట్ కోసం ఎప్పుడైనా ఒక వెన్యూ మొత్తాన్ని ఖాళీ చేయించారా అని అడగగా, ఆమె నవ్వి అవునని సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, Raju Shinde/Hindustan Times via Getty Images
ఆరు తరాల కుటుంబంలో తొలి వ్యాపారవేత్త
అనన్య బిర్లా వయసు 32 ఏళ్లు. ఆదిత్య బిర్లా గ్రూప్ వ్యాపారంలో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
బిర్లా కుటుంబంలో తనది ఆరవ తరమని ఆమె చెప్పారు.
ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన 10 కంపెనీలలో అనన్య బిర్లా డైరెక్టర్‌గా ఉన్నారు.
మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించిన అనన్య, ఆ కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
అనన్య బిర్లా కుటుంబ మూలాలు పారిశ్రామికవేత్త స్వాతంత్య్ర ఉద్యమ మద్దతుదారు ఘనశ్యామ్ దాస్ (జిడి) బిర్లా వరకు విస్తరించి ఉన్నాయి.
అనన్య ఒక ఇంటర్వ్యూలో ,వ్యాపార రంగంలో తమ కుటుంబంలోని మహిళల పాత్ర గురించి మాట్లాడుతూ, "నేను మా కుటుంబంలో ఆరో తరానికి చెందినదాన్ని. మా అమ్మమ్మ కూడా 45-50 ఏళ్ల వయసులో సీఎస్ఆర్ పని ప్రారంభించారు. మా కుటుంబంలో పూర్తి సమయం ఉద్యోగం చేస్తున్న మొదటి మహిళను నేనే" అన్నారు.

ఫొటో సోర్స్, Prodip Guha/Getty Images
'సంగీతంపై ప్రేమను వదులుకోవాల్సి వచ్చింది'
తన వ్యాపార వృత్తికి అదనంగా, అనన్యకు సంగీత ప్రపంచంతో కూడా అనుబంధం ఉంది. 2016లో ఆమె గాయనిగా కెరీర్ ప్రారంభించారు. కానీ, 2024 మేలో ఆమె సంగీత ప్రపంచానికి విరామం ప్రకటించారు. ‘‘వ్యాపారాన్ని, సంగీతాన్ని సమన్వయం చేసుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. అందుకే ఇకపై నా దృష్టంతా వ్యాపారంపైనే పెట్టాలనే కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. ఇప్పటిదాకా నా సంగీతాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ఎక్స్‌లో రాశారు.
సంగీతానికి దూరంగా ఉన్నప్పటికీ, అనన్య వినోద పరిశ్రమలో తన ఉనికిని కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆమె బిర్లా స్టూడియోస్‌ను ప్రారంభించారు, దానికి ఆమె వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.
బిర్లా స్టూడియోస్ ద్వారా అనన్య బిర్లా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనం ప్రచురించింది.
దిల్జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా శార్వరి నటించిన ఇంతియాజ్ అలీ చిత్రం 'మై వాపస్ ఆవుంగా'తో నిర్మాతగా ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
ఆమె ఇప్పుడు రణవీర్ సింగ్ కథానాయకుడిగా, జయ్ మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న 'ప్రళయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హిందీతో పాటు, గుజరాతీ, మలయాళం ఇతర భాషలలో కూడా సినిమాలు చేయాలని అనన్య యోచిస్తున్నారు.
వాణిజ్య, వినోదంతో పాటు కొత్త కళాకారులను, కొత్త కథలను, విభిన్న రకాల సినిమాలను ప్రోత్సహించడంపై ఆమె దృష్టి సారించారు.

ఫొటో సోర్స్, Getty Images
కుమార్తెకు వారసత్వం
తన వ్యాపార ప్రయాణం వెనుక తన తండ్రి కుమార్ మంగళం బిర్లా పోషించిన పాత్ర చాలా ముఖ్యమైనదని అనన్య భావిస్తారు.
లింగం ముఖ్యం కాదని, సామర్థ్యమే ముఖ్యమని తన తండ్రే తనకు భరోసా ఇచ్చారని అనన్య చెప్పారు.
భారతీయ కుటుంబాలలో వారసత్వ బాధ్యత సాధారణంగా పురుషులకే అప్పగిస్తుంటారు కదా అని కుమార్ మంగళం బిర్లాను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తూ, కుమార్తెకు వారసత్వ బాధ్యత అప్పగించాలనే నిర్ణయం ఉద్దేశపూర్వకంగానే తీసుకున్నారా అని అడిగారు.
దీనిపై కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ "ఈ మార్పు ఇప్పుడు ప్రతిచోటా జరుగుతోందనుకుంటున్నా. మా గత తరంలో, ఈ బాధ్యత కేవలం కుమారులదే అని భావించేవారు. కానీ కాలంతో పాటు పరిస్థితులు, ప్రజల ఆలోచనా విధానం మారుతోంది. ఇది కుమారుడు, కుమార్తె అనే భేదాన్ని చూడని తరం అని నమ్ముతున్నా’’ అన్నారు.
అదే సంభాషణలో, అనన్య చిన్ననాటి సంఘటనను కూడా ఆయన పంచుకున్నారు
"అనన్య వయసు నాలుగైదేళ్లు ఉంటుంది. నేను స్కూల్లో ఆమె ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నా. అప్పుడు ఓ చిన్న అమ్మాయి ఇతర పిల్లల మధ్య నుంచి మెలికలు తిరుగుతూ బంతిని వేగంగా గోల్ చేయడం చూశాను. ఆ తర్వాత ఆ పాప అనన్య అని నాకు తెలిసింది.అప్పుడే ఆమెకు ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయనిపించింది’’ అని కుమార్ మంగళం బిర్లా చెప్పారు.
"ఆమె నిజంగా గొప్ప నాయకురాలు. ఆమెలో ఎన్నో గుణాలు ఉన్నాయి, తాను చేసే ఏ పనిలోనైనా నూటికి నూరు శాతం కృషి చేస్తుంది. ఈ రోజుల్లో కూతుళ్ళకి, కొడుకులకి మధ్య ఎలాంటి భేదం లేదనిపిస్తుంది’’ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'సంగీతం కోసం ఆక్స్ఫర్డ్ చదువును వదిలేసి’
వ్యాపారం, సంగీతం మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నంలో ఆక్స్‌ఫర్డ్‌లో చదువుతున్న ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుకు అనన్య ఫుల్స్టాప్ పెట్టేశారు. ఆ తర్వాత సంగీతంలో కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
తాను ఆక్స్ఫర్డ్ నుంచి డ్రాపవుట్ కావడానికి గల కారణాన్ని అనన్య 2026 మార్చిలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘‘చదువుకోడానికి నేను సానుకూలమే. చదువు మానేయమని ఎవరికీ సలహాలు కూడా ఇవ్వను. ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నమైనది. బహుశా నా ప్రయాణం కూడా అలా భిన్నమైనదేనేమో’’ అన్నారు.
‘‘ఆక్స్‌ఫర్డ్‌లో సీటు పొందడానికి ఎంతో కష్టపడ్డాను. కానీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు మానసిక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో గిటార్ పట్టుకుని పాటలు పాడుతూ నా భావాలను వ్యక్తపరిచేదానని’’ అని చెప్పారు.
మరో ఇంటర్వ్యూలో కూడా నాటి పరిస్థితులను ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘ ఏదో కొత్తది చేయాలనిపించడం వల్ల అక్కడి వాతావరణం నాకు సంతోషంగా అనిపించలేదు. అందుకే మ్యూజిక్ కార్యక్రమాలు లైవ్‌లో ఇవ్వడం మొదలుపెట్టాను’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అనన్య ఓ పాత వస్త్ర దుకాణంలో ప్రదర్శన ఇచ్చినప్పుడు సంగీతాన్ని కెరీర్‌గా మలుచుకోవాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రజలు తన ప్రదర్శన చూడటానికి బదులు షాపింగ్ చేయడంలో నిమగ్నమై ఉన్నారని అనన్య తెలిపారు . కానీ అనన్య తన పాటను ఆస్వాదిస్తూ పాడారు.
"సంగీతం నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను. నా జీవితాంతం దానిని కొనసాగించాలనుకుంటున్నా’’ అని చెప్పారు.
ఈ అనుభవం తర్వాత, ఆమె ఆక్స్‌ఫర్డ్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె తన సొంతంగా పాటలు రాయడం, స్వరపరచడం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తూ ఆమె పాటలు పాడేవారు.
ఈ సమయంలో, ఆమె తన సొంత పాటలలో కొన్నింటిని యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్‌కు పంపారు. ఆ తర్వాత కొద్దికాలానికే, ఆ కంపెనీ అప్పటి మార్కెటింగ్ హెడ్ సునీల్ డిసౌజా ఫోన్ చేసి, తనను కలవడానికి ముంబైకి రమ్మని అనన్యను అడిగారు.
2016లో జరిగిన ఈ సమావేశాన్ని అనన్య గుర్తుచేసుకుంటూ "నేను ముంబైకి వచ్చి యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ అధిపతికి నా 'ఐ డోంట్ వాంట్ టు లవ్' పాటను వినిపించాను. ఎంతో బాధలో ఉన్నప్పుడు నేనీ పాట రాశాను. ఆయన దాన్ని రెండుసార్లు విని, ఆ తర్వాత నన్ను తన ఆఫీస్‌కు పిలిచి, నాతో ఒప్పందం కుదుర్చుకోవడం గురించి మాట్లాడారు. అది నాకు కల నిజమైనట్లుగా అనిపించింది’’ అన్నారు.

ఫొటో సోర్స్, Anindito Mukherjee/Bloomberg via Getty Images
వ్యాపార రంగంలోనూ పురుషాధిక్యత ఉందా?
'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో, వ్యాపార ప్రపంచంలో కూడా పితృస్వామ్యం ప్రభావం చూపుతుందా అని అనన్యను ప్రశ్నించారు.
‘‘ఈ వ్యవస్థ ఇప్పటికీ చాలా వరకు పితృస్వామ్యంగానే ఉందని అనిపిస్తుంటుందని, బోర్డు రూమ్‌లో ఈ అనుభవం తనకు ఎదురవుతుంటుందని, తన సామర్థ్యం కాకకుండా, కేవలం ఎవరో ఒకరి ‘ముద్దుల కుమార్తె’ అని తెలియడం వల్లే తనతో ఏకీభవిస్తారని’ అనన్య చెప్పారు.
అయితే, కాలక్రమేణా ప్రజలు మీ సామర్థ్యాలను అంగీకరించడం ప్రారంభిస్తారని ఆమె చెప్పారు.
గణాంకాలు అబద్ధం చెప్పవని, ప్రజలు మీ పనితీరును గమనిస్తారంటూ, ఇది కూడా సినిమాల బాక్సాఫీస్ వసూళ్ల లాంటిదే, ఆ అంకెల ముందు ఎవరూ మాట్లాడలేరు అంటారు అనన్య.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































