అన్నామలై: ‘రజినీకాంత్ పిలిచినా వెళ్లలేదు.. అవసరమైతే బీజేపీతోనూ విభేదిస్తా’

ఫొటో సోర్స్, X/Annamalai
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి.
బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు.
శుక్రవారం సోషల్ మీడియా లైవ్‌లో మాట్లాడిన అన్నామలై.. కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమం నిదానంగా రాజకీయ పార్టీగా మారుతుందని తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
తాను ఇదివరకు భాగస్వామిగా ఉన్న 'వి ది లీడర్' అనే ఉద్యమంలో చేరాలని ఈ లైవ్‌లో అన్నామలై పిలుపునిచ్చారు. ఆయన ప్రకటన తర్వాత ఆ సైట్లో చాలామంది చేరుతున్నారు.
ఈ నేపథ్యంలో, అన్నామలై ప్రకటనపై విలేఖరులతో మాట్లాడిన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, "బీజేపీలో అంతర్గత సమస్యల గురించి అన్నామలై చేసిన ఆరోపణలు అవాస్తవం" అన్నారు.


ఫొటో సోర్స్, Annamalai
అన్నామలై ఏం మాట్లాడారు?
సోషల్ మీడియా లైవ్ ద్వారా మాట్లాడిన అన్నామలై.. "కొత్త దారి, కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభించాలనేది నా అతిపెద్ద కోరిక" అని తెలిపారు.
"తమిళనాడు ప్రజల కోసం 6 సంవత్సరాలు పనిచేసేందుకు బీజేపీ అవకాశం ఇచ్చింది. ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చాను" అన్నారు.
"2009లో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేలో మూడు నెలలు విద్యార్థిగా ఇంటర్న్‌షిప్ చేశాను. ఆ తర్వాత 2020లో బీజేపీలో చేరాను. ఈరోజు కొత్త ఉద్యమాన్ని మీ ముందుకు తెస్తున్నాను. నా గురించి చాలా వార్తలు వస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలనే ఇప్పుడు మాట్లాడుతున్నాను" అన్నారు అన్నామలై.
'రజినీకాంత్ పిలిచారు'
గతంలో తన ఉద్యమంలో చేరాలని నటుడు రజినీకాంత్ నుంచి పిలుపు వచ్చిందని అన్నామలై అన్నారు.
"బీజేపీలో చేరుతానని సంతోష్‌కి(బీఎల్ సంతోష్) హామీ ఇచ్చాను. 2020లో బీజేపీలో చేరడానికి ఒక రోజు ముందు రజినీకాంత్ నన్ను పిలిచారు. కానీ, నేను నిరాకరించాను" అన్నారు.
"ఇండియన్ అనే గుర్తింపుతో గర్వించదగ్గ తమిళుడిగా ఉన్నాను" అన్నారు అన్నామలై.
"తమిళనాడు అభివృద్ధిని అందరూ ముందుకు తీసుకెళ్లాలి. బీజేపీ తమిళ గుర్తింపుతో ఉండాలనే ఉద్దేశంతోనే ఒంటరిగా వెళ్లాలని చెబుతూ వచ్చాను" అన్నారు.
"నాకు ఉన్న అభిప్రాయ భేదాలను 18 నెలలుగా చెబుతూ వచ్చాను. రాజీనామా చేయబోతున్నట్లు గత డిసెంబర్ 5నే బీజేపీ నాయకత్వానికి సమాచారం ఇచ్చాను" అన్నారాయన.
తమిళనాడులో ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నానని, తదుపరి సాధారణ ఎన్నికల్లో ఒక పార్టీగా పోటీ చేయబోతున్నట్లు అన్నామలై ప్రకటించారు.
'వెబ్సైట్లో రిజిస్టర్, కోయంబత్తూరులో శిక్షణ'
"తమిళనాడుకు ఇంకొక రాజకీయ పార్టీ కావాలి. ఈ ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. కోయంబత్తూరులో ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం" అని అన్నామలై అన్నారు.
తమ ఉద్యమం తరపున ఎన్నికల్లో పోటీ చేసేవారు "ఈ శిక్షణ కేంద్రంలో పద్ధతిగా రాజకీయ శిక్షణ పొందిన తర్వాతే ఎన్నికలను ఎదుర్కొంటారు. వారికి అన్నిరకాల శిక్షణలు ఇస్తాం" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, PTI
'అలాంటి పరిస్థితి వస్తే బీజేపీతోనైనా విభేదిస్తాను'
బీజేపీ, నరేంద్ర మోదీ గురించి అన్నామలై మాట్లాడుతూ, "ప్రధాని మోదీపై గౌరవం ఉంది. త్రిభాషా విధానం వంటి విషయాల్లో బీజేపీతో విభేదించాల్సిన పరిస్థితి వస్తే కచ్చితంగా విభేదిస్తాం. పద్ధతి ప్రకారం రాజీనామా చేయాలనే ఉద్దేశంతోనే అమిత్ షాను నేరుగా కలిశాను" అన్నారు.
''ఒక స్థాయి వచ్చినప్పుడు, నిరంతరం మనమే సమస్యగా మారకూడదు. ఏదైనా ఒక హద్దు వరకే చెప్పగలం. గత 18 నెలలుగా బీజేపీ నాయకులకు చాలా ఓపికగా చెబుతూ వస్తున్నాను. పార్టీని వీడుతున్నట్లు 2025 డిసెంబర్ 4నే బయటకు చెప్పేశాను. ఎన్నికల పని పూర్తి చేసి వెళ్లమన్నారు. మే చివరి వరకు నా పని పూర్తి చేసిన తర్వాతే బయటకు వచ్చాను'' అని ఆయన అన్నారు.
డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే, తమిళనాడు రాజకీయ నాయకులు అందరినీ చూసినట్లే బీజేపీని, ఆ పార్టీ నాయకులను కూడా చూస్తానని చెప్పిన అన్నామలై, ''ఎవరికి వారు తమ పార్టీని ముందుకు తీసుకెళ్లినట్లే, మనం మన ఉద్యమ విధానాలను ముందుకు తీసుకెళ్తాం. ప్రజలే ఎన్నుకోనివ్వండి'' అన్నారు.
"సోషల్ మీడియా ద్వారా మీ అందరినీ కలిసి, అభిప్రాయాలను పంచుకోవడానికి, మనసు విప్పి మాట్లాడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని అన్నామలై తెలిపారు.
కాగా, అన్నామలై రాజీనామాను ఆమోదిస్తున్నట్లు శుక్రవారం(05.06.2026) ఉదయం బీజేపీ నాయకత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వ బాధ్యతల నుంచి అన్నామలై రాజీనామా చేయడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించినట్లు ఆ ప్రకటన పేర్కొంది.
రాజీనామాకు ముందు దిల్లీ వెళ్లిన అన్నామలై, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి మాట్లాడారు.

ఫొటో సోర్స్, Nainar Nagendran
బీజేపీ ఏమన్నది?
అన్నామలై ప్రసంగం అనంతరం విలేఖరులతో మాట్లాడిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. "దాని గురించి నేను ఎటువంటి అభిప్రాయాన్ని చెప్పాలనుకోవట్లేదు. బీజేపీపై ఉన్న అసంతృప్తి గురించి మీరు ఆయననే అడగాలి" అన్నారు.
అన్నామలై రాజీనామా గురించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, "బీజేపీ సిద్ధాంత ఆధారిత పార్టీ. అన్నామలై వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం లేదు" అన్నారు.
"ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా తమిళం గురించి, తమిళ గొప్పతనం గురించి మాట్లాడుతుంటారు. పార్టీని ఎవరైనా ప్రారంభించవచ్చు, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. ప్రాంతీయ సమస్యలకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వలేదనడం తప్పుడు ఆరోపణ" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Annamalai/X
2021లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా..
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై బాధ్యతలు చేపట్టారు. అనంతరం బీజేపీ.. ఏఐఏడీఎంకే కూటమి నుంచి విడిపోయి 2024 పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. అప్పుడు ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయినప్పటికీ, అంతవరకు ఒకే అంకెలోనే ఉన్న బీజేపీ ఓట్ల శాతం 11 శాతాన్ని దాటింది.
అనంతరం 2025లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అన్నామలై తప్పుకున్నారు. ఆ తర్వాత నైనార్ నాగేంద్రన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐఏడీఎంకేతో బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో అన్నామలై పోటీ చేస్తారని ఆశించినప్పటికీ, ప్రచారం మాత్రమే చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ ఓట్ల శాతం మళ్లీ 3 శాతం కంటే తక్కువకు పడిపోయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























