రాహుల్ గాంధీ ధర్నాకు దిగగానే మోదీ ప్రభుత్వంలో మంత్రులు చర్చల కోసం ఎందుకు వచ్చారు?

రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వం, లోక్ కళ్యాణ్ మార్గ్, కాంగ్రెస్ ధర్నా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ ధర్నాకు దిగగానే కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపేందుకు అక్కడకు వచ్చారు.
    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

న్యూదిల్లీలోని 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి మోదీ నివాసం ఎదుట రాహుల్ గాంధీ ఆకస్మిక ధర్నాకు దిగారు.

రాహుల్ ప్లాన్ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఆయన ధర్నాకు దిగిన తర్వాతే మీడియాకు కూడా ఆ విషయం తెలిసింది.

ప్రతిపక్ష నేతల్లో కొంతమంది కాక్రోచ్ జనతాపార్టీ, సోనమ్ వాంగ్‌చుక్ నిరసనలో పాల్గొనేందుకు జంతర్‌మంతర్ వెళుతున్న సమయంలో, రాహుల్ మాత్రం 7 లోక్‌ కల్యాణ్ మార్గ్‌లో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు.

మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆప్ నాయకుడు కేజ్రీవాల్ జంతర్‌మంతర్‌కు వెళ్లి నిరసనకారులను కలిశారు.

రాహుల్, ప్రియాంక సహా మరికొందరు కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్న లోక్ కళ్యాణ్ మార్గ్‌కు సుప్రియా సూలే వచ్చారు. కాసేపటి తర్వాత రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే రాహుల్ ధర్నాకు కూర్చోగానే మోదీ ప్రభుత్వం చర్చల కోసం ఆయనతో సంప్రదింపులు జరిపింది.

2014లో నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షాల నిరసనల పట్ల ప్రభుత్వం నుంచి ఇలాంటి స్పందన చాలా అరుదుగా కనిపిస్తుంది.

కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ రాహుల్ గాంధీతో మాట్లాడారు.

సోమవారం సీజేపీ నిరసన సందర్భంగా నీట్ పేపర్‌లీక్ గురించి పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జితేంద్ర సింగ్ అన్నారు.

రాహుల్ గాంధీతో మొదట సభలో చర్చకు అంగీకరించి తర్వాత వెనక్కి తగ్గారని జితేంద్ర సింగ్ ఆరోపించారు.

రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వం, లోక్ కళ్యాణ్ మార్గ్, కాంగ్రెస్ ధర్నా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని లోక్ కళ్యాణ్ మార్గ్ నుంచి తరలించారు.

ప్రభుత్వం ఇంత మర్యాద ఎందుకు ప్రదర్శించింది?

"మేము అక్కడికి చేరుకున్న తర్వాత నిరసన తెలిపేందుకు ఇది సరైన మార్గం కాదని రాహుల్ గాంధీని చాలా మర్యాదగా, గౌరవపూర్వకంగా అభ్యర్థించాను. నీట్ పరీక్ష, పేపర్ లీక్‌కు సంబంధించి అన్ని సమస్యలపై పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇస్తే, నిరసనను వాయిదా వేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు" అని మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.

మోదీ ప్రభుత్వపు ఈ వినయం చాలా ముఖ్యమైనదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు సిద్ధమని చెప్పడం ద్వారా తాను ఒత్తిడిలో ఉన్నాననే విషయాన్ని అంగీకరించిందని పంజాబ్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అశుతోష్ కుమార్ చెప్పారు.

"ప్రభుత్వం ఒత్తిడిలో ఉంది. దేశ జనాభా లెక్కలు చూస్తే, యువత గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వాళ్లు ఓటు కూడా వేస్తారు. యువత నుంచి మోదీకి మద్దతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీలో ఓట్లు కోల్పోతామనే భయం ఏర్పడింది. జనాభాలో 20 నుంచి 25 శాతం ఉన్న మధ్యతరగతి ప్రజలకు నీట్ ఒక ముఖ్యమైన అంశం. వీళ్లు ఇప్పటి వరకు మోదీకి మద్దతుదారులు" అని అశుతోష్ కుమార్ అభిప్రాయపడ్డారు.

"మధ్యతరగతి ప్రజలు ఆశావహులు. ప్రతిపక్షంపై ప్రేమతో కాకుండా భయంతోనే ప్రభుత్వం సత్వరం స్పందించింది. "నేను తినను, ఇతరులను తిననివ్వను" అనే నినాదం విచ్ఛిన్నమైనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింది. ఇక ఏమాత్రం భ్రమల్లో బతకకూడదని ప్రభుత్వం గ్రహిస్తోంది" అని ఆయన చెప్పారు.

"ఇది ప్రభుత్వానికి హెచ్చరిక. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ.. పట్టణ, మధ్యతరగతి వర్గాలకు నష్టం కలిగించింది. సమర్థవంతమైన, బలమైన ప్రభుత్వం అనే ప్రతిష్ఠ దెబ్బతింది. ప్రభుత్వం ఇప్పుడు చర్చలకు సిద్ధంగా ఉంది" అని అశుతోష్ కుమార్ అన్నారు.

సోమవారం సాయంత్రం అన్ని టీవీ చానెళ్లు రాహుల్ గాంధీ నిరసనను ప్రముఖంగా ప్రసారం చేశాయి. ప్రజల తీర్పును రూపొందించడంలో టీవీ చానెళ్లు కీలక పాత్ర పోషిస్తాయనే వాదన ఉంది.

రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వం, లోక్ కళ్యాణ్ మార్గ్, కాంగ్రెస్ ధర్నా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేస్తున్న ప్రాంతానికి వెళ్లకుండా రాహుల్ గాంధీ కొత్త వ్యూహంతో వ్యవహరించారు.

మోదీ ప్రభుత్వ వ్యూహం

సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ మంగళవారం సాయంత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.

"దాదాపు ప్రతి వార్తా బులెటిన్‌లో రాహుల్ గాంధీ సెంటర్ పాయింట్‌గా ఉన్న అరుదైన రోజులలో ఇది ఒకటి. ఈసారి తేడా ఏమిటంటే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడి ప్రశ్నలకు సమాధానమిస్తోంది" అని రాశారు.

రాహుల్ గాంధీతో పాటు ధర్నాలో పాల్గొన్న వారిని అక్కడి నుంచి పంపడానికి తక్షణమే చర్చలు జరపడం ప్రభుత్వ ఎత్తుగడ కావచ్చని ప్రొఫెసర్ అశుతోష్ కుమార్ భావిస్తున్నారు.

"రాహుల్ వ్యాఖ్యలు మీడియాలో రావడం మొదలైంది. మోదీ దీనిని ఎక్కువ కాలం కొనసాగనివ్వలేదు. ఆట ఇంకా కొనసాగుతూనే ఉంది" అని అశుతోష్ అన్నారు.

ప్రభుత్వం ప్రజల దృష్టిలో పడిందని ఇది చాలా ముఖ్యమైన విషయమని రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు.

"పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. సీజేపీ పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న భారీ జనసమూహాన్ని ప్రభుత్వం గుర్తించింది. ప్రతిపక్ష నాయకులు ప్రధానమంత్రి నివాసం బయట ధర్నాకు దిగారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ఎక్కువసేపు ప్రభుత్వానికి మద్దతుగా నిలవలేదు. ప్రజల దృష్టిలో ప్రభుత్వం అభాసుపాలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రభుత్వం కనీసం చర్చలకు సిద్ధంగా లేనట్లు కనిపించకూడదు" అని రాజ్‌దీప్ సర్దేశాయి బీబీసీతో చెప్పారు.

"ప్రభుత్వం చర్చలు జరపాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజల అభిప్రాయం కీలకమైనది. అందుకే కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీజేపీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో మాట్లాడటానికి వెళ్లారు" అని రాజ్‌దీప్ అన్నారు.

"బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోంది కాబట్టి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ దెబ్బతిందని నేను అనను. ప్రజలు విసిగిపోయారన్నది నిజం. వారికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. యుక్తవయస్సు వచ్చినప్పటి నుండి జెన్ జెడ్ తరం వారు నరేంద్ర మోదీ తప్ప మరెవరినీ ప్రధానమంత్రిగా చూడలేదు. ఈ విసుగు కోపంగా మారుతుందో లేదో వేచి చూడాలి" అని రాజ్‌దీప్ సర్దేశాయి తాజా సంఘటనలపై తన అభిప్రాయం చెప్పారు.

రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వం, లోక్ కళ్యాణ్ మార్గ్, కాంగ్రెస్ ధర్నా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోమవారం సీజేపీ నిర్వహించిన పార్లమెంట్‌ మార్చ్‌లో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు.

లోక్ కల్యాణ్‌ మార్గ్‌ని ఎందుకు ఎంచుకున్నారు?

నీట్ పేపర్ లీకేజ్‌పై కాక్రోచ్ జనతా పార్టీ కంటే ముందే రాహుల్ గాంధీ ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే విద్యార్థుల్లో ఎక్కువమంది సీజేపీ ఉద్యమంలో చేరారు..

ఇది రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

అభిజీత్ దీప్కేకు ఆమ్ ఆద్మీ పార్టీతో గతంలో అనుబంధం ఉంది. అంతే కాకుండా దీప్కే రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడో యాత్రను విమర్శించారు.

ఈ సమస్య కోసం పోరాడిన ఘనతను రాహుల్ గాంధీ ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడలేదని అలాగే ఆప్‌తో అభిజీత్‌కు ఉన్న అనుబంధం కాంగ్రెస్‌కు ఇబ్బంది కలిగిస్తోందని ప్రొఫెసర్ అశుతోష్ కుమార్ అంటున్నారు.

"సోమవారం జరిగిన పార్లమెంట్ మార్చ్‌లో సీజేపీ కీలక పాత్ర పోషించింది. సీజేపీలో ఒక కొత్తదనం కనిపించింది. మరోవైపు ఈ విషయాన్ని లేవనెత్తిందని కాంగ్రెస్ అని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి రోజు నుంచే సీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ సీజేపీని తన ఆధీనంలోకి తీసుకుంటుందేమోనని కాంగ్రెస్ భయపడింది. అందుకే అలా జరక్క ముందే కాంగ్రెస్ రెండో ఫ్రంట్‌ను ప్రారంభించింది" అని రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు.

"ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి ఇంటి బయట నిరసన తెలిపితే, మీడియా దానిని కవర్ చేయాల్సిందే. దీనివల్ల మంచి ఫలితం దక్కింది. మీడియా దానిని విస్మరించలేకపోయింది" అని ఆయన చెప్పారు.

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాహుల్ గాంధీ ఆయనకు గట్టి పోటీగా నిలబడగలరా అనే ప్రశ్న తరచూ వినిపించింది.

రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వం, లోక్ కళ్యాణ్ మార్గ్, కాంగ్రెస్ ధర్నా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మాట్లాడిన ప్రధాని మోదీ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.

రాహుల్‌పై విమర్శలు

రాహుల్ గాంధీపై రెండు ప్రధాన విమర్శలు ఉన్నాయి. మొదటిది ఆయన ఒక రాజకీయ వంశం నుండి వచ్చారు.

భారత రాజకీయాలు కుటుంబ రాజకీయాలను దాటి ముందుకు సాగాయని సామాన్యులు నాయకులుగా ఉద్భవించారని చెబుతున్నారు. దీనికి నరేంద్ర మోదీ ఒక ప్రధాన ఉదాహరణగా కనిపిస్తారు.

రాహుల్ గాంధీకి రాజకీయ చతురత లేదనేది మరో విమర్శ.

కాంగ్రెస్ పార్టీ ఈ లోపాలను గుర్తించడంలో విఫలమవుతోందని, లేదా కొంతమంది నాయకులు వాటిని గుర్తించినప్పటికీ, రాహుల్ గాంధీతో పాటు సోనియా, ప్రియాంక గాంధీలను వారి నాయకత్వ, విశేషాధికార పదవుల నుండి సమష్టిగా తొలగించే స్థితిలో పార్టీ లేదని వాదిస్తున్నారు.

నరేంద్ర మోదీని దీర్ఘకాలంగా విమర్శిస్తున్నచరిత్రకారుడు రామచంద్ర గుహా నుంచి ఈ వాదనకు ఇటీవల మద్దతు లభించింది.

‘ది టెలిగ్రాఫ్‌’లో ప్రచురితమైన ఒక వ్యాసంలో గాంధీ కుటుంబం మోదీకి అనుకూలంగా మారిందని గుహా వర్ణించారు. రాహుల్ గాంధీ మంచి వ్యక్తి అని అంగీకరించినప్పటికీ ఆయన రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

రాహుల్ గాంధీకి క్రమశిక్షణ, గంభీరత, పటిష్ఠమైన రాజకీయ అనుభవం కొరవడిందనేది రామచంద్ర గుహా ప్రధాన విమర్శ.

భారత్ జోడో యాత్ర జరిగిన కొద్దినెలల కాలంలో మాత్రమే రాహుల్ గాంధీ క్రమశిక్షణ ప్రదర్శించారని గుహా అంటున్నారు. ‘‘రాహుల్ గాంధీ కష్టపడి పనిచేస్తారుగానీ, నిలకడగా కాకుండా మధ్యమధ్యలో మాత్రమే’’ అంటారు రామచంద్ర గుహ.

దీనికి విరుద్ధంగా, బీజేపీలోని ఆయన ప్రత్యర్థులు అవిశ్రాంతంగా పనిచేస్తారు.

రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌పై వెచ్చించే శక్తిని క్షేత్రస్థాయిలో తన పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగించాలనేది రామచంద్ర గుహ అభిప్రాయం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)