మెడనొప్పి వస్తోందా? ‘అవయవాలు మొద్దుబారక ముందే జాగ్రత్త పడండి’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షణ్ముగప్రియ సెల్వరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇటీవలి కాలంలో మెడనొప్పి ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారిందని యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ 2023లో విడుదల చేసిన ఒక అధ్యయనం చెబుతోంది.
ముఖ్యంగా శరీరంలోని వివిధ భాగాల్లో వచ్చే కండరాలు-ఎముకల సంబంధిత నొప్పులలో 8.2 శాతం నుంచి 90 శాతం వరకు కేవలం స్మార్ట్‌ఫోన్ వాడకం వల్లే వస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.
కెనడాలో స్మార్ట్ఫోన్లు వాడే విద్యార్థుల్లో 84 శాతం మంది కండరాలు-ఎముకల సంబంధిత నొప్పులకు గురయ్యారని, వారిలో ఎక్కువ మందికి మెడ భాగమే తీవ్రంగా ప్రభావితమైందని పేర్కొంది.
అంతేకాకుండా, సెల్‌ఫోన్ అధికంగా వాడటం వల్ల చేతులు, వేళ్ల పట్టు సడలిపోవడంతో పాటు చేతుల పూర్తి స్థాయి పనితీరు కూడా దెబ్బతింటుందని పరిశోధనా రిపోర్టులు చెబుతున్నాయి.
సెల్‌ఫోన్ వాడకం పెరగడం, ఎక్కువసేపు స్క్రీన్ల వైపు చూడటం వల్ల నిజానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయాలపై న్యూరో సర్జన్ డాక్టర్ విశ్వనాథన్ పంచుకున్న వివరాలను ఈ కథనంలో చూద్దాం.


1. మొబైల్ వాడకంతో ఎలాంటి నష్టం కలుగుతుంది?
విశ్వనాథన్: వేలాది సంవత్సరాల క్రితం నాలుగు కాళ్లపై నడిచే స్థితి నుంచి మనిషి శరీర నిర్మాణం క్రమంగా రెండు కాళ్లపై నడిచే విధంగా పరిణామం చెందింది. ఈ మార్పు ఫలితంగా, శరీర బరువంతా నడుము, మోకాలు, చీలమండల కీళ్ల ద్వారా నేరుగా వెన్నెముకపై పడుతుంది.
అదేవిధంగా, తల బరువును మెడ ఎముకలు మోయాల్సి వస్తోంది. చుట్టుపక్కల పరిసరాలను గమనించే అవసరం కోసం మెడ, తల నిరంతరం కదలికలకు గురవుతుండటంతో కాలక్రమేణా అవి అరుగుదలకు గురవుతాయి.
ముఖ్యంగా మొబైల్ ఫోన్, కంప్యూటర్ వాడేటప్పుడు ఎక్కువసేపు వంగి చూసే అలవాటు మెడ, వెన్నెముకలపై భారాన్ని అనేక రెట్లు పెంచుతుంది. వెన్నెముక, మెడ ఎముకల కీళ్ల మధ్య ఉండే వెన్నెముక డిస్క్‌లు క్రమంగా అరిగిపోతాయి.
తల సాధారణ బరువు కేవలం ఐదు కిలోలు మాత్రమే అయినప్పటికీ, మెడను ముందుకు వంచినప్పుడు దానిపై పడే బయోమెకానికల్ భారం 27 కిలోల వరకు పెరిగే అవకాశం ఉంది. మెడ ఎముకల చుట్టూ ఉండే కండరాలే తలను స్థిరంగా మోస్తుంటాయి. తలను ముందుకు వంచిన ప్రతిసారీ ఈ కండరాలపై ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది.
ఈ నిరంతర ఒత్తిడి ఫలితంగా మెడ బిగుసుకుపోవడంతో పాటు ఆ నొప్పి చేతుల వరకు వ్యాపించవచ్చు. సూదులతో గుచ్చినట్లు అనిపించడం, అవయవాలు మొద్దుబారిపోయే పరిస్థితి కూడా ఎదురుకావచ్చు.
మెడ భాగంలో ప్రతి స్థాయిలో వేర్వేరు నాడులు బయటకు వస్తుంటాయి. ఏ నాడి ఒత్తిడికి గురవుతుందో దాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే, చేతులు, వేళ్ల సాధారణ పనితీరు మందగించే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, Perawit Boonchu/Getty Images
2. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలేంటి?
విశ్వనాథన్: ఒకే భంగిమలో ఎక్కువసేపు సెల్‌ఫోన్ వాడేవారు, ఐటీ రంగ నిపుణులతో సహా ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారంతా ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి లేచి చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి.
ఆపకుండా అలాగే కూర్చున్నప్పుడు, శరీర బరువు తాలూకు ఒత్తిడి నడుము, మోకాలు, చీలమండల కీళ్లపై పడటానికి బదులుగా నేరుగా నడుము కింది భాగంలోని వెన్నెముకపై పడుతుంది. దీనివల్ల నడుము కింది భాగంలో డిస్క్ జారే ప్రమాదం పెరుగుతుంది.
ఈ పరిస్థితి తీవ్రమైతే, నడుము నుంచి కాళ్ల వరకు నొప్పి వ్యాపించడం, కాళ్లు మొద్దుబారడం, కాలి వేళ్లు, పాదాలు కదపడంలో బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరీ తీవ్రమైన దశలో మలమూత్ర విసర్జనపై నియంత్రణ కూడా కోల్పోయే అవకాశం ఉంది.
అదేవిధంగా, మెడ భాగంలో నాడుల సమస్య అలాగే కొనసాగితే, వెన్నుపాముపైనే ఒత్తిడి పడి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోయే సమస్యలు కూడా తలెత్తవచ్చు.
3. మెడనొప్పికి, చేసే పనికి ఉన్న సంబంధం ఏమిటి?
మెడనొప్పి రావడానికి వృత్తిపరమైన వాతావరణం కూడా ఒక ప్రధాన కారణమని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్, ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అధ్యయనం పేర్కొంది. డెస్క్ వద్ద కూర్చుని పనిచేసే వారిలో, ఎక్కువసేపు స్క్రీన్లు చూసేవారిలో మెడనొప్పి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఆ రిపోర్టు చెబుతోంది.
"కంప్యూటర్లు, డిజిటల్ సంబంధిత పనుల వల్ల ఎక్కువసేపు కూర్చోవడం, కదలికలు తగ్గడం, విశ్రాంతి తీసుకునే సమయం తగ్గిపోవడం జరుగుతుంది. మెడను నిరంతరం వంచి ఉంచడం లేదా ముందుకు వంగి చూడటం వల్ల మెడ భాగంలోని వెన్నెముకపై ఎడతెగని ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మెడ కండరాలు, చుట్టుపక్కల ఉండే మృదు కణజాలాలపై భారం పెరుగుతుంది.
ఫలితంగా అలసట, అధిక ఒత్తిడి ఒక వలయంలా మారతాయి. ఈ నిరంతర ఒత్తిడి కండరాల అసమతుల్యతకు, శరీర భంగిమపై అవగాహన తగ్గడానికి కారణమవుతుంది. అంతేగాక మెడ బయోమెకానిక్స్‌లో మార్పులు రావడం, కణజాలాలు దెబ్బతినడం వంటివి జరిగి చివరకు ఇది దీర్ఘకాలిక నొప్పికి, మెడ బిగుసుకుపోవడానికి దారితీస్తుంది" అని ఆ అధ్యయనం వివరించింది.

ఫొటో సోర్స్, Xavierarnau/Getty Images
4. రీల్స్ వల్ల కలిగే అనర్థాలు ఏమిటి?
విశ్వనాథన్: ఆధునిక జీవనశైలిలో విడదీయరాని భాగంగా మారిన మొబైల్ ఫోన్, ముఖ్యంగా రీల్స్, సోషల్ మీడియా వాడకం మెడ ఆరోగ్యానికి ప్రత్యక్ష ముప్పుగా పరిణమించాయి.
నిరంతరం తల వంచుకుని స్క్రీన్ చూడటం వల్ల, సహజంగా లార్డోటిక్ వంపులో ఉండాల్సిన మెడ ఎముక క్రమంగా కైఫోటిక్ అనే గూని స్థితికి మారుతుంది. దీనివల్ల మెడ బిగుసుకుపోవడం, కండరాలు పట్టేయడం, చేతులకు నొప్పి వ్యాపించడం, వేళ్లలో బలహీనత వంటివి కలగవచ్చు.
దీన్ని నివారించడానికి, ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి ముందుకు, వెనక్కు, ఎడమ, కుడి వైపులకు తిప్పడం, వంచడం లాంటి ఆరు ప్రాథమిక కదలికలతో కూడిన మెడ వ్యాయామాలు చేయాలి.

ఫొటో సోర్స్, Catherine Falls Commercial/Getty Images
5. నివారణ మార్గాలు ఏమిటి?
విశ్వనాథన్: వెన్నునొప్పి రాకముందే కడుపు, వెన్నెముక చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేసే ప్రాథమిక వ్యాయామాలను నిపుణుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా చేయాలి.
నేలమీద ఉన్న వస్తువులను తీసుకునేటప్పుడు నడుము వంచకుండా, మోకాళ్లు మడిచి నిటారుగా కూర్చుని తీసుకోవాలి.
కూర్చునే కుర్చీ రకం, చేతులు ఉంచే విధానం, కంప్యూటర్ స్క్రీన్ ఎత్తు సాధారణ దృష్టి రేఖకు అనుగుణంగా ఉండేలా చూసుకునే ఎర్గోనామిక్స్ పద్ధతులు వెన్నుపాము, మెడ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
చేతుల భంగిమ సరిగా లేకపోతే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉందని, అలాగే మెడను నిరంతరం వంచి ఉంచితే సర్వైకల్ స్పాండిలోసిస్ అనే మెడ అరుగుదల సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
అదేవిధంగా, చాలామందికి అలవాటుగా ఉండే మెడను విరిచే చర్యను నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తల, మెడ మధ్య ఉన్న కీలులో ఇది నరాల నష్టానికి దారితీయవచ్చు.
ముఖ్యంగా సెలూన్లలో తల మసాజ్ చేసేటప్పుడు మెడను అకస్మాత్తుగా వంచే చర్యలు, అప్పటికే ప్రారంభ దశలో స్పాండిలోసిస్ ఉన్నవారి పరిస్థితిని మరింత దిగజార్చుతాయి.
పిల్లల్లో ఎముకల ఎదుగుదల ఇంకా పూర్తి కానందున, వారిపై ఇలాంటి ఒత్తిడి కలిగించే చర్యలను పూర్తిగా నివారించాలి.
6. మెడనొప్పిని నిర్లక్ష్యం చేస్తే వచ్చే ప్రమాదం ఏమిటి?
డా. విశ్వనాథన్: నరాల సమస్యను పట్టించుకోకపోతే అది క్రమంగా నరాల పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా భుజం, మోచేతి భాగాల్లో శాశ్వత బలహీనత ఏర్పడే ప్రమాదం ఉంది.
ఎక్కువసేపు కూర్చుని పనిచేసే ఉద్యోగులు ప్రతి అరగంట లేదా గంటకోసారి లేచి చిన్నపాటి వ్యాయామాలు చేయడం ద్వారా, ఎర్గోనామిక్స్ నియమాలను పాటించడం ద్వారా, మొబైల్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా వెన్నుపాము, మెడ ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు కాపాడుకోవచ్చు.
నిరంతరం కూర్చుని పనిచేసేవారిలో వెన్నునొప్పి, మెడనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి ఆరోగ్య సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సరైన శారీరక భంగిమ, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా వీటిని అడ్డుకోవచ్చు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























