జ్వరం తగ్గితే డెంగీ తగ్గినట్టేనా? - 10 ముఖ్యమైన విషయాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
వర్షాకాలం వచ్చిందంటే చాలు... ఇంటి చుట్టూ నిల్వ నీరు, దోమల పెరుగుదల, ఆ తర్వాత జ్వరాలు. వీటిలో డెంగీ అత్యంత ముఖ్యమైనది. ఈ మధ్య డెంగీ కేసులు ఎక్కువ అవుతున్నట్లు వార్తల్లో చూస్తున్నాం.
సాధారణ జ్వరంలా మొదలై కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితికి దారితీసే డెంగీ గురించి అందరికీ ప్రాథమిక అవగాహన అవసరం. ఇందుకోసం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.
రమేష్‌కు అకస్మాత్తుగా 104 డిగ్రీల జ్వరం వచ్చింది. శరీరమంతా నొప్పులు, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి ఉండటంతో సాధారణ వైరల్ ఫీవర్ అనుకున్నాడు. మూడో రోజు జ్వరం తగ్గడంతో ప్రమాదం తప్పిందని భావించాడు.
కానీ అదే సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, పదేపదే వాంతులు, నీరసం మొదలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లగా డెంగీ కారణంగా 'క్రిటికల్ ఫేజ్'లో ఉన్నట్లు తేలింది.
డెంగీలో అత్యంత ముఖ్యమైన విషయం ఇదే – జ్వరం తగ్గిందంటే వ్యాధి తగ్గిందని అనుకోవడానికి లేదు. జ్వరం తగ్గిన తర్వాత 24–48 గంటల్లో కొందరిలో తీవ్రమైన డెంగీ లక్షణాలు కనిపించవచ్చు.

1. డెంగీ అంటే ఏమిటి?
డెంగీ అనేది డెంగీ వైరస్ (DENV) వల్ల వచ్చే వైరల్ వ్యాధి. DENV-1, DENV-2, DENV-3, DENV-4 అనే నాలుగు ప్రధాన సెరోటైపులు దీనిలో ఉన్నాయి.
ఒకసారి డెంగీ వచ్చిన వ్యక్తికి జీవితాంతం అన్ని రకాల డెంగీ నుంచి రక్షణ లభించదు. అంటే ఒక వ్యక్తికి జీవితంలో ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా డెంగీ రావచ్చు. ముఖ్యంగా గతంలో డెంగీ సోకిన వ్యక్తికి మరొకసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తీవ్రత పెరగవచ్చు.
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100–400 మిలియన్ల డెంగీ ఇన్ఫెక్షన్లు సంభవిస్తున్నాయని అంచనా. 2024లో నమోదైన డెంగీ కేసులు 14.6 మిలియన్లకు పైగా ఉండగా, వీటి నుంచి 12,000కు పైగా మరణాలు నమోదయ్యాయి.
2. డెంగీకి కారణం?
డెంగీ ప్రధానంగా ఏడిస్ ఈజిప్టై (Aedes aegypti) అనే ఆడ దోమ కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఏడిస్ ఆల్బోపిక్టస్ (Aedes albopictus) దోమలు కూడా వైరస్‌ను వ్యాప్తి చేయగలవు.
ఒక డెంగీ బాధితుడిని దోమ కుట్టినప్పుడు వైరస్ దోమలోకి చేరుతుంది. ఆ వైరస్ దోమలో అభివృద్ధి చెందిన తర్వాత అది మరో వ్యక్తిని కుట్టినప్పుడు వైరస్ ఆ వ్యక్తిలోకి ప్రవేశిస్తుంది.
అయితే "డెంగీ దోమ రాత్రిపూట మాత్రమే కుడుతుంది" అనుకోవడం తప్పు.
ఏడిస్ దోమలు పగటి సమయంలో.. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయంలో చురుకుగా ఉంటాయి. ఇంటి పరిసరాల్లోనే మనుషులకు దగ్గరగా నివసించడానికి ఇవి అలవాటు పడతాయి.
ఇవి పెద్ద మురికి కాలువల్లోనే పెరగాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తంలో నిల్వ ఉన్న స్వచ్ఛమైన నీటిలో కూడా గుడ్లు పెట్టగలవు.
ఉదాహరణకు ఇంటి బయట ఉన్న పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీలు, కుండీల కింద ఉండే ప్లేట్లు, నీటి బకెట్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, విసిరేసిన ప్లాస్టిక్ డబ్బాలు, నిర్మాణ ప్రదేశాల్లో నిలిచిన నీరు - ఇలాంటి ప్రదేశాలు దోమలకు గుడ్లు పెట్టే ప్రదేశాలుగా మారవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
3. డెంగీ లక్షణాలు?
దోమ కుట్టిన వెంటనే డెంగీ లక్షణాలు కనిపించవు. సాధారణంగా ఇన్ఫెక్షన్ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్లలో నొప్పులు, వికారం, వాంతులు, నీరసం, చర్మంపై దద్దుర్లు (rash), ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ప్రారంభమవుతాయి.
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఈ లక్షణాలు సాధారణంగా 2 నుంచి 7 రోజులు ఉండవచ్చు. చాలామంది రోగులు 1 నుంచి 2 వారాల్లో కోలుకుంటారు.
4. ప్లేట్‌లెట్స్ తగ్గితే ?
ప్లేట్‌లెట్స్ తగ్గితే డెంగీ అనుకోవడానికి వీల్లేదు.
డెంగీ నిర్ధరణ కేవలం ప్లేట్‌లెట్ కౌంట్ ఆధారంగా జరగదు. రోగి లక్షణాలు, వ్యాధి దశ, పరీక్షలు, సీబీసీలో మార్పులు, అవసరమైనప్పుడు డెంగీ-ప్రత్యేకమైన పరీక్షలు వంటి అంశాల ఆధారంగా డెంగీ నిర్ధరణ జరుగుతుంది.
అలాగే ప్లేట్‌లెట్ల సంఖ్య ఒక్కటే డెంగీ తీవ్రతను నిర్ణయించే ప్రమాణం కాదు. రోగి రక్తపోటు, పల్స్, హిమటోక్రిట్, మూత్ర పరిమాణం, రక్తస్రావం, ద్రవం బయటకు లీక్ అవుతున్న సంకేతాలు వంటి అనేక అంశాలను పరిశీలించాలి.
5. డెంగీ ప్రమాదకరమా?
డెంగీను సాధారణంగా ఫెబ్రైల్ దశ (febril phase) అంటే జ్వరం ఉండే పరిస్థితి, క్రిటికల్ దశ (critical phase) అంటే క్లిష్ట దశ, రికవరీ (recovery phase) అంటే కోలుకునే దశ అనే మూడు దశలుగా చూడవచ్చు.
ఇందులో క్రిటికల్ దశ అత్యంత కీలకమైనది.
"జ్వరం తగ్గిపోయింది కాబట్టి రోగం తగ్గింది" అని చాలామంది అనుకుంటారు. కానీ కొందరిలో జ్వరం తగ్గిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో ప్లాస్మా లీకేజ్, షాక్, రక్తస్రావం వంటి తీవ్రమైన సమస్యలు మొదలవుతాయి.
ఈ హెచ్చరిక సంకేతాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
డెంగీ రోగిలో తీవ్రమైన కడుపునొప్పి, పదేపదే వాంతులు, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం, వాంతుల్లో రక్తం, మలంలో రక్తం లేదా నల్లటి మలం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన నీరసం, అసహనం లేదా అతి నిద్ర, చర్మం చల్లగా, పాలిపోయినట్లు ఉండటం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

ఫొటో సోర్స్, Getty Images
6. ప్రాణాపాయానికి దారితీస్తుందా?
తీవ్రమైన డెంగీ ప్రాణాపాయ పరిస్థితికి దారితీయవచ్చు. కాబట్టి దీనిని వైద్య అత్యవసర పరిస్థితిగా (Medical Emergency) పరిగణించాలి.
1. ప్లాస్మా లీకేజ్: రక్తనాళాల నుంచి ద్రవం బయటకు లీక్ కావడం వల్ల రక్త పరిమాణం తగ్గి షాక్‌కు గురి కావచ్చు.
2. తీవ్ర రక్తస్రావం: ముక్కు, చిగుళ్ల నుంచి, జీర్ణ వ్యవస్థలో రక్తస్రావం సంభవించవచ్చు.
3. షాక్: తీవ్రమైన ప్లాస్మా లీకేజ్ కారణంగా రక్తపోటు పడిపోయి ప్రాణాపాయం ఏర్పడవచ్చు.
4. కాలేయం దెబ్బతినడం: కొంతమందిలో కాలేయం తీవ్రంగా పాడయ్యే ప్రమాదం ఉంది.
5. ఇతర అవయవాలపై ప్రభావం: తీవ్రమైన డెంగీ వల్ల మెదడు, గుండె, మూత్రపిండాలు వంటి అవయవాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
సీడీసీ ప్రకారం డెంగీ లక్షణాలు ఉన్నవారిలో సుమారు ప్రతి 20 మందికి ఒకరిలో తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితి సంభవించవచ్చు.
7. భారత్‌లో పరిస్థితి ఎలా ఉంది?
భారత్‌లో ఏటా పెద్ద సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోస్ (NCVBDC) ప్రకారం 2025లో భారత్‌లో 1,21,824 డెంగీ కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి.
అదే కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌లో 2,686 కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో 8412 కేసులు నమోదు కాగా, ఎవరూ మరణించలేదు.
వర్షాకాలంలో నీరు నిలిచే పరిస్థితులు, పట్టణీకరణ, అధిక జన సాంద్రత, నీటి నిల్వ పద్ధతులు, దోమల నియంత్రణలో లోపాలు వంటి అంశాలు డెంగీ వ్యాప్తికి అనుకూలంగా మారవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
8. అపోహలు – నిజాలు
అపోహ: డెంగీ దోమ రాత్రిపూట మాత్రమే కుడుతుంది.
నిజం: ఏడిస్ దోమలు ప్రధానంగా పగటిపూట చురుకుగా ఉంటాయి. అందువల్ల పగలు కూడా దోమల నుంచి రక్షణ అవసరం.
అపోహ: ప్లేట్‌లెట్స్ లక్ష కంటే తక్కువైతే తప్పనిసరిగా ప్లేట్‌లెట్లు ఎక్కించాలి.
నిజం: ప్లేట్‌లెట్ల సంఖ్యను మాత్రమే చూసి పేట్‌లెట్లను ఎక్కించడం (platelet transfusion)పై నిర్ణయం తీసుకోరు. రక్తస్రావం, రోగి ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య పరీక్షల ఫలితాలు, తదితర అంశాలను వైద్యుడు పరిగణనలోకి తీసుకుంటారు.
అపోహ: జ్వరం తగ్గితే డెంగీ ప్రమాదం పూర్తిగా పోయినట్లే.
నిజం: జ్వరం తగ్గిన తర్వాత కూడా క్రిటికల్ దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మరింత జాగ్రత్త అవసరం.
అపోహ: బొప్పాయి ఆకురసం తాగితే డెంగీ నయం అవుతుంది.
నిజం: బొప్పాయి ఆకురసం డెంగీకి చికిత్స అనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. డెంగీ చికిత్స ప్రధానంగా సహాయక సంరక్షణ (supportive care)పై ఆధారపడి ఉంటుంది.
అపోహ: యాంటీబయాటిక్ తీసుకుంటే డెంగీ తగ్గుతుంది.
నిజం: డెంగీ వైరస్ వల్ల వస్తుంది. యాంటీబయాటిక్స్ వైరస్‌ను చంపవు. బ్యాక్టీరియల్ కో-ఇన్ఫెక్షన్ వంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వైద్యుడు యాంటీబయాటిక్స్‌ను సూచించవచ్చు.
అపోహ: డెంగీ వచ్చిన వ్యక్తి నుంచి నేరుగా నాకు వ్యాధి వస్తుంది.
నిజం: సాధారణంగా డెంగీ మనిషి నుంచి మనిషికి నేరుగా వ్యాపించదు. ఇన్ఫెక్షన్ ఉన్న ఏడిస్ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. అరుదుగా రక్త సంబంధిత ఉత్పత్తుల ద్వారా, అవయవ మార్పిడి ద్వారా, తల్లి నుంచి శిశువుకు వ్యాప్తి చెందినట్లు గతంలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
9. డెంగీ నుంచి రక్షణ ఎలా?
డెంగీ నియంత్రణలో దోమల నియంత్రణే అత్యంత ముఖ్యమైన ఆయుధం.
- ఇంటి వద్ద వారానికి కనీసం ఒకసారి నీటి నిల్వ పాత్రలను ఖాళీ చేసి శుభ్రం చేయాలి.
- నీటి ట్యాంకులపై మూతపెట్టాలి.
- పూల కుండీల కింద నిలిచే నీటిని తొలగించాలి.
- పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు వంటి నీరు నిలిచే వస్తువులను తొలగించాలి.
- ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.
- దోమతెరలు, కిటికీ తెరలు ఉపయోగించాలి.
పగటి సమయంలో కూడా ఈ కింది జాగ్రత్తలు అవసరం.
- శరీరాన్ని పూర్తిగా కప్పేలా దుస్తులు ధరించడం
- మస్కిటో రిపెల్లెంట్లను ఉపయోగించడం
- ఇంట్లో అవసరమైన చోట ఆవిరి కారకాలు (vaporizers) లేదా ఇతర దోమల నియంత్రణ చర్యలు చేపట్టడం
- పగటి సమయంలో నిద్రించే పిల్లలు, వృద్ధులకు దోమ తెరలను ఉపయోగించడం
- DEET, picaridin లేదా IR3535 వంటి నిర్దిష్ట రిపెల్లెంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
10. డెంగీ వచ్చినప్పుడు ఏం చేయాలి?
డెంగీ అనుమానం ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. తగినంత ద్రవాలు తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం.
సొంతంగా మందులు వాడకుండా, డాక్టర్ సలహాను తీసుకోవాలి.
డెంగీ వచ్చిన వ్యక్తిని కూడా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
డెంగ్యూ అంటే భయపడాల్సిన వ్యాధి కాదు.. కానీ నిర్లక్ష్యం చేయకూడని వ్యాధి.
ఓ చిన్న నీటి గుంటలో పెరిగిన ఒక దోమ అనేక కుటుంబాలకు అనారోగ్యాన్ని తెచ్చిపెట్టగలదు. అందుకే డెంగీ నియంత్రణ కేవలం ప్రభుత్వా బాధ్యత కాదు... ప్రతి ఇంటి బాధ్యత.
(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























