కొత్త నేపాల్, పాత పొరుగు దేశం.. బాలేంద్ర షాకు భారత్ పరీక్ష

బాలెన్ షా, నేపాల్, భారత పర్యటన
ఫొటో క్యాప్షన్, 36 ఏళ్ల ర్యాపర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం దిల్లీకి చేరుకోనున్నారు.
    • రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా భారత్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయనే ఆశలు పెరుగుతున్నాయి.

నేపాల్‌లో కొత్త తరం రాజకీయ నాయకత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత, పొరుగున ఉన్న భారత్‌తో జరుగుతున్న తొలి ఉన్నతస్థాయి సమావేశం కావడం ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

మార్చిలో బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్‌పీ) విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

అంతకు ఆరు నెలల ముందు అవినీతి, బంధుప్రీతి ఆరోపణలకు వ్యతిరేకంగా జరిగిన జెన్ జెడ్ ఉద్యమం కారణంగా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కూలిపోయింది.

36 ఏళ్ల వయసున్న ర్యాపర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా ఆదివారం దిల్లీకి చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్థిక, ఇంధన రంగాల్లో సహకారం, కొత్త విమాన మార్గాల ప్రారంభం, ఆగస్టులో నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల తర్వాత పునర్నిర్మాణానికి సాయం వంటి విస్తృత అంశాలు ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

ఈ విపత్తులో హిమాలయ దేశమైన నేపాల్‌లో 1,450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

భారత్‌, నేపాల్ మధ్య జాతి, సాంస్కృతిక, మతపరమైన, ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య 1,750 కిలోమీటర్లకు పైగా విస్తరించిన సరిహద్దులో ప్రజల రాకపోకలకు పెద్దగా ఆంక్షలు లేవు.

బాలెన్ షా, నేపాల్, భారత పర్యటన
ఫొటో క్యాప్షన్, ఆగస్టులో నేపాల్‌లో సంభవించిన వరదల్లో 1,450 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

వ్యూహాత్మకంగా కీలకమైన దేశం

భారత్‌, చైనా మధ్య ఉన్న నేపాల్‌ వ్యూహాత్మకంగా కీలకమైన దేశం. ఈ రెండు దేశాల మధ్య బఫర్‌ దేశంగా వ్యవహరిస్తోంది. నేపాల్‌లో స్థిరత్వం భారత భద్రతపై నేరుగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే, గత కొన్ని దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భూభాగ వివాదాలు, నేపాల్ రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందనే ఆరోపణలు, దిల్లీ వ్యవహారశైలిపై నేపాల్‌లో ఉన్న అసంతృప్తి ఇందుకు కారణాలు. భారత్ తమను ఆధిపత్య ధోరణితో చూసే 'పెద్దన్న'లా వ్యవహరిస్తోందని నేపాల్‌లో చాలామంది భావిస్తున్నారు.

అయినప్పటికీ, బాలేంద్ర షా పర్యటనతో ఇరు దేశాల సంబంధాలను మళ్లీ గాడిలో పెట్టేందుకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

"గత నాయకత్వానికి ఉన్న రాజకీయ భారాలు తమకు లేవని, అభివృద్ధి, దౌత్యం, ఆర్థిక భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలని నేపాల్ కొత్త నాయకత్వం చెబుతోంది. వారు గతంలో కంటే వాస్తవిక దృక్పథంతో, తక్కువ సైద్ధాంతిక ధోరణితో కనిపిస్తున్నారు. ఇది ఆశాజనకమైన సమయమని వ్యక్తిగతంగా భావిస్తున్నాను" అని నేపాల్‌లో భారత మాజీ రాయబారి రంజిత్ రే బీబీసీతో చెప్పారు.

2008లో రాచరిక వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారినప్పటి నుంచి నేపాల్‌లో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు పాలనలో ఆధిపత్యం చెలాయించాయి.

అవి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (సీపీఎన్‌-యూఎంఎల్‌), నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్). ఈ మూడు పార్టీలతోనూ దిల్లీ సన్నిహిత సంబంధాలు కొనసాగించింది.

నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలు భావజాలపరంగా భారత్‌కు ప్రత్యర్థి అయిన చైనాకు దగ్గరగా ఉన్నాయని భావించేవారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు సమానంగా లేవంటూ అవి తరచూ దిల్లీని విమర్శించేవి.

నేపాల్ వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఉండటంతో, కఠ్మాండూపై ప్రభావం పెంచుకునేందుకు దిల్లీ, బీజింగ్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఆసియాలోని ఈ రెండు శక్తిమంతమైన దేశాలు నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అయితే, భారత్‌తో నేపాల్ సంబంధాలు కేవలం దౌత్యపరమైన, వ్యూహాత్మక ప్రయోజనాలకే పరిమితం కాలేదు.

హిందూ మెజారిటీ ఉన్న ఈ రెండు దేశాల ప్రజల మధ్య బలమైన సామాజిక సంబంధాలు ఉన్నాయి. సరిహద్దుకు ఇరువైపులా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇరు దేశాల ప్రజలు నిత్యం పరస్పరం కలుస్తూ ఉంటారు.

బాలెన్ షా, నేపాల్, భారత పర్యటన
ఫొటో క్యాప్షన్, భారత్‌, నేపాల్ మధ్య బహిరంగ సరిహద్దుతో పాటు, చాలా కాలంగా ఆర్థిక సంబంధాలు కొనసాగుతున్నాయి.

9 బిలియన్ డాలర్ల వాణిజ్యం

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 9 బిలియన్ డాలర్లకు మించిపోయింది. అయితే, ఈ వాణిజ్యంలో భారత్‌దే పైచేయి. ఇది చాలా కాలంగా కాఠ్మాండూలో అసంతృప్తికి కారణమవుతోంది. నేపాల్‌కు పెట్రోలియం ఉత్పత్తులు, పలు ఆహార పదార్థాలను సరఫరా చేసే ప్రధాన దేశం భారత్‌. ప్రపంచంలోని ఇతర దేశాలతో వాణిజ్యం సాగించేందుకు కూడా నేపాల్‌కు భారత్ కీలకమైన రవాణా మార్గంగా ఉంది.

ఇరు దేశాల మధ్య సహకారంలో జలవిద్యుత్‌ రంగం కీలకమైనది. నేపాల్ నుంచి 1,200 మెగావాట్ల వరకు విద్యుత్‌ను దిగుమతి చేసుకునేందుకు భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. భవిష్యత్తులో ఈ దిగుమతులను మరింత పెంచుకోవాలని చూస్తోంది.

"భారత్‌లో విద్యుత్‌కు భారీగా డిమాండ్ ఉంది. నేపాల్‌కు అక్కడి నీటి వనరులు, భౌగోళిక పరిస్థితుల కారణంగా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇది కేవలం ద్వైపాక్షిక సహకారానికి మాత్రమే పరిమితం కాదు. భారత్ ద్వారా నేపాల్ బంగ్లాదేశ్‌కు కూడా విద్యుత్‌ను ఎగుమతి చేస్తోంది" అని రంజిత్ రే చెప్పారు.

విభేదాలు ఎందుకు?

2015లో వచ్చిన భూకంపం, ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన ఆకస్మిక వరదలు సహా పెద్ద ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నేపాల్‌కు సాయం అందించిన తొలి దేశాల్లో భారత్‌ కూడా ఉంది.

ఇంతటి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ భారత్‌, నేపాల్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

2019లో భారత్‌ ఓ మ్యాప్‌ను విడుదల చేసింది. చైనా సరిహద్దుకు సమీపంలోని పశ్చిమ ప్రాంతంలో నేపాల్ తమదిగా పేర్కొంటున్న కొన్ని భూభాగాలను కూడా ఆ మ్యాప్‌లో భారత భూభాగంగా చూపించింది. దీంతో నేపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామంతో ఆ ప్రాంతంపై కాఠ్మాండులో అవగాహన మరింత పెరిగింది.

ఆ తర్వాత నేపాల్ కూడా తన సొంత మ్యాప్‌ను విడుదల చేసింది. అందులో వివాదాస్పద ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం మరింత ముదిరింది.

"ఈసారి నేపాల్ ప్రధానమంత్రి దిల్లీ పర్యటనలో సరిహద్దు సమస్యను ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాను. వెంటనే పరిష్కారం లభించకపోయినా, సమస్యను పరిష్కరించేందుకు చర్చలు ప్రారంభించాలి" అని నేపాల్‌కు చెందిన సీనియర్ రాజకీయ విశ్లేషకుడు కనక్ మణి దీక్షిత్ బీబీసీతో చెప్పారు.

నేపాల్ మరో డిమాండ్‌ కూడా చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. అదనపు విమాన ప్రవేశ మార్గాలను తెరవాలని భారత్‌ను కోరుతోంది. దీనివల్ల పశ్చిమ దిశ నుంచి పెద్ద విమానాలు నేరుగా నేపాల్‌లోని కొత్త విమానాశ్రయాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. బౌద్ధులకు పవిత్ర స్థలమైన లుంబినీకి సమీపంలోని భైరహవా, ప్రముఖ పర్యటక ప్రాంతమైన పోఖరాలో ఈ విమానాశ్రయాలు ఉన్నాయి.

భారత గగనతలంలోకి విమానాలకు అనుమతి లభిస్తే ప్రయాణ సమయం తగ్గుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. విమాన సర్వీసుల సంఖ్య పెరిగితే ఈ విమానాశ్రయాలు వాణిజ్యపరంగా లాభదాయకంగా మారతాయి.

అయితే, గౌతమ్ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చైనాకు చెందిన నార్త్‌వెస్ట్ సివిల్ ఏవియేషన్ ఎయిర్‌పోర్ట్ నిర్మించిందని, పోఖరా విమానాశ్రయ నిర్మాణానికి చైనా ఆర్థిక సాయం అందించిందని దిల్లీ ఆందోళన చెందుతోందని నేపాల్‌లో కొందరు భావిస్తున్నారు.

బాలేంద్ర షా ఇప్పటివరకు బీజింగ్‌తో నేరుగా ఎలాంటి సంప్రదింపులు ప్రారంభించలేదు. అయితే, భారత్ పర్యటనకు ముందు నవంబర్ 15 నుంచి 11 రోజుల పాటు చైనాలో పర్యటించేందుకు తన పార్టీకి చెందిన 20 మంది ఎంపీల బృందాన్ని పంపించారు. నేపాల్‌కు ఉన్న ఇద్దరు శక్తిమంతమైన పొరుగు దేశాలతో సంబంధాలను సమతుల్యం చేసుకునే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు.

'పరిణతి కావాలి'

తొలి ఏడాది అధికారంలో ఉన్నప్పుడు విదేశీ పర్యటనలు చేయబోనని షా గతంలో హామీ ఇచ్చారు. అయితే, ఆగస్టులో సంభవించిన భయంకరమైన వరదలు ఆయన నిర్ణయాన్ని మార్చుకునేలా చేశాయి.

వరదల తర్వాత పునర్నిర్మాణానికి దాదాపు 5 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని నేపాల్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే, ఇప్పటివరకు అంతర్జాతీయంగా ప్రకటించిన సాయం అంచనాలకు తగ్గట్టుగా లేదు.

భారత్‌లో అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ పర్యటనకు షా సన్నాహాలు ఆశించిన స్థాయిలో లేవని నేపాల్‌లో కొందరు పరిశీలకులు భావిస్తున్నారు.

"ప్రధానమంత్రి షా, ఆయన సలహాదారులు యువకులు, కొత్తవారే. కానీ వారికి అనుభవం తక్కువ. పాలనలో వారు పదేపదే పరిణతి లోపించినట్లు కనిపించారు. అత్యంత శక్తిమంతమైన పొరుగు దేశంతో దౌత్య సంబంధాలు నెరపడానికి అవసరమైన గంభీరత, పరిణతి వారికి ఉండాలి" అని కనక్ మణి దీక్షిత్ అన్నారు.

ఇప్పటికే తీసుకున్న కొన్ని నిర్ణయాలపై షా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు నిరాకరించారనే ఆరోపణలతో పోలీస్ చీఫ్ దాన్ బహదూర్‌ను పదవి నుంచి తొలగించడం వాటిలో ఒకటి.

వార్తా కథనాల ప్రసారానికి సంబంధించి కొందరు జర్నలిస్టులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పలు మీడియా సంస్థల కార్యాలయాలకు వెళ్లారు. దీంతో పత్రికా స్వేచ్ఛను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వచ్చాయి.

భారత్‌తో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కాఠ్మాండూ భావిస్తున్నప్పటికీ, షా ఈ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వెళ్లేటప్పుడు సాధించిన ఫలితాలే అసలు పరీక్షగా నిలవనున్నాయి. ఆర్థిక సాయంపై దిల్లీ నుంచి స్పష్టమైన హామీలు పొందగలిగితే అది దౌత్యపరమైన విజయంగా పరిగణిస్తారు. దేశంలో ఆయన ప్రభుత్వంపై పెరుగుతున్న విమర్శలను తగ్గించేందుకు కూడా అది ఉపయోగపడవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)