బహ్రెయిన్: అనేకమంది మత పెద్దలు సహా, 64 మంది షియా ముస్లింలకు కోర్టు ఎందుకు యావజ్జీవ శిక్ష విధించింది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, డేవిడ్ గ్రిట్టెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇరాన్‌తో సంబంధాలు, ఉగ్రవాద ఆరోపణలపై బహ్రెయిన్‌లో 64 మంది షియా ముస్లింలకు అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది.
వీరిలో ఎక్కువ మంది మత పెద్దలే ఉన్నారని బ్రిటన్‌కు చెందిన ఒక మానవ హక్కుల సంఘం వెల్లడించింది.
మనామాలోని హై క్రిమినల్ కోర్టు మరో ఐదుగురికి 15 ఏళ్ల చొప్పున జైలు శిక్ష వేసిందని 'బహ్రెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ రైట్స్ అండ్ డెమోక్రసీ' (బర్డ్) తెలిపింది.
ఈ తీర్పులను అక్కడి అడ్వకేట్ జనరల్ ధ్రువీకరించారు. అయితే నిందితుల సంఖ్యను కానీ వారి వివరాలను కానీ ఆయన బయటపెట్టలేదు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌తో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాద సంస్థను స్థాపించినట్టు వీరిపై అభియోగాాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ తీర్పులను బీఐఆర్‌డీ(బర్డ్) తీవ్రంగా ఖండించింది.
"నిందితులకు చిత్ర హింసలు పెట్టారు. బలవంతంగా నేరం అంగీకరించేలా చేశారు. ఆత్మరక్షణ కోసం న్యాయవాదులను పెట్టుకోవడంపై తీవ్ర ఆంక్షలు విధించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి" అని పేర్కొంది.
ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి సున్నీ ముస్లింల పాలనలో ఉన్న బహ్రెయిన్‌లో అణచివేత పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలతో అధికారులు వందల మందిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో ఎక్కువ మంది ప్రజలు ఇరాన్లో మెజారిటీగా ఉన్న షియా వర్గానికి చెందిన వారే.
ఇరాన్‌కు మద్దతు ఇచ్చారన్న కారణంతో ప్రభుత్వం డజన్ల కొద్దీ వ్యక్తుల పౌరసత్వాన్ని రద్దు చేసింది.
యుద్ధ సమయంలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న బహ్రెయిన్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాలపై ఇరాన్ వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.
ఆదివారం కూడా ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్నట్లు బహ్రెయిన్ సైన్యం ప్రకటించింది.
సోమవారం శిక్ష పడిన వారిలో 56 మందిని మే, జూన్ నెలల్లో అరెస్టు చేశారు. వీరిలో 47 మంది షియా మత గురువులు ఉన్నారని బర్డ్ తెలిపింది.
దురాజ్లోని ఇమామ్ అల్-సాదిక్ గ్రాండ్ మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేయించే షేక్ మొహమ్మద్ సంకౌర్, షేక్ అలీ అల్-సదాది కూడా వీరిలో ఉన్నారు.
రాస్ రుమ్మాన్ గ్రాండ్ మసీదు ఇమామ్ సయ్యద్ మూసా అల్-అల్వాదాయీతో పాటు మతపరమైన ప్రార్థనలు నిర్వహించే మరో తొమ్మిది మందిని కూడా అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మిగిలిన 13 మంది నిందితులు కోర్టుకు హాజరు కాకుండానే వారిపై విచారణ పూర్తి చేశారు. వీరిలో ప్రవాసంలో ఉన్న ప్రముఖ మత గురువు షేక్ ఇసా ఖాసిం కూడా ఉన్నారు. 'అయతుల్లా' హోదా ఉన్న ఈయనను బహ్రెయిన్ షియా సమాజం ఆధ్యాత్మిక నాయకుడిగా భావిస్తుంది. ఈ 13 మందిలో ఎక్కువ మంది ప్రస్తుతం ఇరాన్లో ఉన్నారని బహ్రెయిన్ అధికారులు చెబుతున్నారు.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో కలిసి ఉగ్రవాద సంస్థను నడపడం, రాజ్యాంగ నిబంధనలను పక్కనపెట్టి ప్రభుత్వ మార్పుకు పిలుపునివ్వడం వంటి అభియోగాలు వీరిపై ఉన్నాయి.
ఉగ్రవాద దాడులకు ప్రజలను రెచ్చగొట్టారని, ఇరాన్ మతపరమైన పాలనా సిద్ధాంతం 'విలాయత్-ఎ-ఫకీహ్'ను ప్రచారం చేశారని ప్రాసిక్యూషన్ వాదించింది.
అందరినీ దోషులుగా తేల్చిన హై క్రిమినల్ కోర్టు 15 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు వేసింది.
అంతేకాకుండా కొందరికి 2.65 లక్షల డాలర్ల (దాదాపు రూ. 2.48 కోట్లు) జరిమానా విధించింది.
21.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 198.11 కోట్లు) విలువైన ఆస్తులను జప్తు చేసి, వాటిని సేవా కార్యక్రమాలకు వాడాలని ఆదేశించింది.

ఫొటో సోర్స్, LightRocket via Getty Images
ఈ తీర్పులు అత్యంత అన్యాయమని బర్డ్ డైరెక్టర్ సయ్యద్ అహ్మద్ అల్వాదాయీ అన్నారు. ఇది బహ్రెయిన్‌లోని షియా ప్రజల విశ్వాసం, గుర్తింపుపై దాడి అని విమర్శించారు.
తాము ఊహించిన దానికంటే ఈ శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయని నిందితుల తరపు న్యాయవాద బృందానికి చెందిన ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.
గత వారం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్, బర్డ్ సహా 20 మానవ హక్కుల సంస్థలు బహ్రెయిన్ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశాయి.
నిందితులను కళ్లకు గంతలు కట్టి, చేతులకు సంకెళ్లు వేసి గంటల తరబడి నిలబెట్టారని, నిద్ర లేకుండా చేశారని ఆ లేఖలో పేర్కొన్నాయి.
వారిని వారి కుటుంబాలను శారీరక, లైంగిక హింసకు గురిచేస్తామని దేశం నుంచి బహిష్కరిస్తామని బెదిరించారని ఆరోపించాయి.
చదవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా బలవంతంగా సుదీర్ఘంగా ఉన్న అభియోగ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని తెలిపాయి.
ఈ ఆరోపణలను బహ్రెయిన్ ప్రభుత్వ ప్రతినిధి తోసిపుచ్చారు.
మతపరమైన అభిప్రాయాల వల్ల ఎవరినీ శిక్షించలేదని స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు రికార్డ్ చేసిన ప్రసంగాల ఆధారంగానే నేరం రుజువైందని చెప్పారు. దర్యాప్తు అంతా చట్టబద్ధంగా జరిగిందని నిందితులకు పూర్తి చట్టపరమైన హక్కులు కల్పించామని స్పష్టం చేశారు.
నిర్బంధంలో ఉన్నప్పుడు వారిని కుటుంబ సభ్యులతో మాట్లాడనిచ్చామని వైద్య సదుపాయాలు కూడా అందించామని ప్రభుత్వం తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























