మీ దంతాలపై కాఫీ, టీ, బిర్యానీ మరకలు పడుతున్నాయా, వాటిని నివారించే మార్గాలు ఏమిటి..

ఫొటో సోర్స్, Getty Images
సూపర్‌మార్కెట్లో టూత్‌పేస్టులు వరుసగా ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. వాటి ప్యాకెట్లు, బాక్సులపై ఉన్న వ్యాపార ప్రకటనలు చూస్తే.. అవి మీ దంతాలను తెల్లగా చేస్తాయని ఉంటుంది.
అంటే.. అంతకుముందు కంటే మనం ఎక్కువగా దంతాలు తెల్లగా మారడంపై మరింత శ్రద్ధ చూపుతున్నట్లు అనిపిస్తుంది.
ఓరల్ హెల్త్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో.. తమ చిరునవ్వు విషయానికొస్తే.. దంతాల రంగును తెల్లగా మార్చుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు 42 శాతం మంది ప్రజలు తెలిపారు.
అయితే, పళ్లను తెల్లగా మార్చే ఉత్పత్తులు మాత్రమే దీనికి ఏకైక మార్గమా? లేక మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా పళ్ల సహజమైన తెల్లదనాన్ని కాపాడటంలో సాయపడగలవా?
దంతాలపై రెండు రకాల మరకలు ఉంటాయని, దానిలో ఒకటి లోపలి నుంచి ఏర్పడే మరకలు (ఇంట్రిన్సిక్ స్టెయిన్స్), మరొకటి బయట నుంచి దంతాలపై ఏర్పడే మరకలు (ఎక్స్‌ట్రిన్సిక్ స్టెయిన్స్) అని యూకే నేషనల్ హెల్త్ సర్వీసులో దంత వైద్యుడిగా పనిచేసే టోబీ హాన్కాక్ చెప్పారు.

దంతాలపై మరకలు దేనివల్ల ఏర్పడతాయి?
పళ్ల లోపల నుంచే రంగు మారే దాన్ని ఇంట్రిన్సిక్ స్టెయినింగ్ అంటారు.
ఇది దంతాల ఎనామెల్ రంగును ప్రభావితం చేసే అమెలోజెనిసిస్ ఇంపర్ఫెక్టా వంటి జన్యుపరమైన రుగ్మతల వల్ల లేదా కొన్ని మందులకు శరీరం స్పందించే తీరు వల్ల ఇవి ఏర్పడవచ్చు.
పేరు సూచించినట్లు పంటి బయటి భాగాల్లో ఏర్పడేవి ఎక్స్‌ట్రిన్సిక్ స్టెయిన్స్. అంటే, పొగ తాగడం, దంతాల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, తినే ఆహారం, తాగే పానీయాలు వంటివి దీనికి కారణం కావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
దంతాలపై మరకలు ఏర్పడానికి ఏ ఆహార పదార్థాలు కారణమవుతాయి?
మనకు తెలిసిన కొన్ని పానీయాలు దంతాలపై మరకలు ఏర్పడేందుకు ప్రధాన కారకంగా ఉంటున్నాయని హాన్కాక్ చెప్పారు.
మొక్కల్లో సహజంగా గుర్తించే రసాయన పదార్థం టానిన్ ఉన్న డ్రింక్స్ ఇందులో ఉన్నాయని అన్నారు.
''రెడ్ వైన్, కాఫీ, టీ వంటివి దంతాలపై మరకలు ఏర్పడేందుకు సాధారణ కారకాలు. ముఖ్యంగా ఎస్‌ప్రెసో కాఫీ పళ్లపై మరకలు ఏర్పడేందుకు ఎక్కువగా ప్రభావం చూపుతుంది'' అని తెలిపారు.
ఇతర రంగుల పానీయాలు, పానీయాలు కూడా పళ్లపై మరకలు ఏర్పడేందుకు కారణంగా మారుతున్నాయని హెల్త్ సర్వీసు కంపెనీ బూపా రిపోర్టులు తెలిపాయి. వాటిల్లో కోలా, డార్క్ బెర్రీస్, బాల్సామిక్ వెనిగర్, బీట్‌రూట్ వంటివి ఉన్నాయి.
టమాటాలతో తయారు చేసిన సాస్‌లు, సోయా సాస్‌లు కూడా దంతాలపై పసుపు రంగు మరకలు ఏర్పడటానికి కారణమవుతాయని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.
మసాలా దినుసుల్లో ఉండే కొన్ని పదార్థాలు, అలాగే మనం కొనుగోలు చేసి రెస్టారెంట్లలో తినే ఆహార పదార్థాలు కూడా మన పళ్ల రంగు మారడానికి మరో కారణంగా ఉంటున్నాయి.
''కర్రీ సాస్ అనేది దంతాలపై మరకలు ఎక్కువగా ఏర్పరుస్తుంది'' అని హాన్కాక్ చెప్పారు. ఎందుకంటే, దీనిలో ఉండే పసుపేనని అన్నారు.
బిర్యానీ తిన్న తర్వాత గిన్నెల్లో పేరుకుపోయే పసుపు రంగు మరకలను మనమందరం చూసి ఉంటాం.
ఇదే మంచి ఉదాహరణ.. మన పళ్లపై కూడా ఇదే రకమైన డ్యామేజ్‌ను ఇది కలిగిస్తుంది.
"పింగాణీ పాత్రల నిర్మాణం, పళ్లపై ఉండే ఎనామెల్ పొర నిర్మాణానికి చాలా దగ్గరగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ, ఈ నిర్మాణం మరకలు సులభంగా అంటుకునేలా చేస్తుంది. మీ ప్లేటుపై మరకలు కలిగించగల ఏ పదార్థమైనా మీ పళ్లపై కూడా మరకలు ఏర్పరచగలదు" అని ఆయన వివరించారు.
ఈ ఆహార పదార్థాలు, పానీయాలన్నింటినీ పూర్తిగా నివారించడం వల్ల మీ పళ్ల తెల్లదనాన్ని కాపాడుకోవచ్చు. అయితే, వాటన్నింటికీ పూర్తిగా దూరంగా ఉండటం ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు.

ఫొటో సోర్స్, BBC Food
పళ్ల రంగు మారడాన్ని నివారించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఏమిటి?
దంతాలపై మరకలు పడకుండా ఉండాలి అంటే తిన్న తర్వాత వెంటనే బ్రష్ చేసుకోవడం ఉత్తమమైన విధానం. అయితే, ఇది అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు.
అయితే, మీదగ్గర టూత్‌బ్రష్ అందుబాటులో లేకపోయినా మీ పళ్లపై మరకలు పడకుండా కాపాడుకునేందుకు, ఒక మార్గం ఉందని హాన్కాక్ అన్నారు. కరకరలాడే ఆహార పదార్థాలను తినడం దీనికి సమాధానం కావొచ్చని హాన్కాక్ చెప్పారు.
''ఈ ఆహార పదార్థాలు ఎంత గట్టివైనా, మీ పళ్లను సహజపద్ధతిలో శుభ్రం చేసేందుకు ఇవి సాయపడతాయి. మీరు పచ్చి క్యారెట్ లాంటి వాటిని కొరికినప్పుడు, అవి ఒక పార లాగా పనిచేసి, మీ దంతాలపై పేరుకుపోయిన 'ప్లాక్' అనే బ్యాక్టీరియా పొరను గీకి తొలగిస్తాయి" అని తెలిపారు.
పండ్లు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, వాటిల్లో ఉండే యాసిడ్‌లు.. దంతాలకు రక్షణగా ఉండే బాహ్య పొరను దెబ్బతీయొచ్చు.
దీంతో, దంతాలు ఎక్కువగా మరకలు బారిన పడే అవకాశం ఉంది. చీజ్ లాంటివి తిన్నప్పుడు ఎలాంటి హానీ జరగదు. అయితే, మంచి రకమైన చీజ్‌ను మీరు ఎంపిక చేసుకోవాలి.
''హార్డ్ చీజ్ పళ్లను శుభ్రం చేసేందుకు చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని మీరు కొరికినప్పుడు, దానిపై స్పష్టమైన మీ పళ్ల మార్కులు కనిపించవచ్చు. కానీ, సాఫ్ట్ చీజ్ అయితే, అదే రకమైన ప్రయోజనం లభించదు. ఎందుకంటే, అది మీ దంతాలపైనే అతుక్కునే అవకాశం ఉంటుంది'' అని హాన్కాక్ చెప్పారు.

ఫొటో సోర్స్, BBC Food
దంతవైద్యులు ఆమోదించిన చిట్కాలు
పళ్లను తెల్లగా ఉంచుకోవడానికి ఉత్తమమైన మార్గం మొదటి నుంచే వాటిని శుభ్రంగా ఉంచుకోవడమని హాన్కాక్ అన్నారు.
కనీసం రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవడం పాటించాల్సిన నియమం. అంతేకాక, భోజనం చేసిన తర్వాత పళ్లను తోముకోవడం కూడా సాయపడుతుంది.
''మీ పళ్లపై ఎనామెల్ పొర మెరుస్తూ.. నునుపుగా ఉంటే.. దానిపై మరకలు ఏర్పడటం కష్టమవుతుంది'' అని చెప్పారు.
ఉదాహరణకు... బాగా శుభ్రం చేసిన టీ కప్పు లోపలి భాగంపై మరకలు ఏర్పడటం కష్టం. కానీ, ఆ కప్పు మురికిగా ఉండి, ఉపరితలం గరుకుగా ఉంటే, దానిపై మరకలు చాలా సులభంగా ఏర్పడతాయి.
దంతాలపై మరకలు పడకుండా కాపాడుకునేందుకు ఉత్తమమైన మార్గం మరకలను నివారించడమే.
ముఖ్యంగా.. పళ్లను తెల్లగా మార్చుకునే చికిత్సల ఖర్చును కనుక తీసుకుంటే... చికిత్స కంటే నివారణే మెరుగైనది అని అర్థమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
టానిన్ అధికంగా ఉండే పానీయాలు తాగడానికి ఇష్టపడేవారికి, మరకలను నివారించడానికి మరికొన్ని ఆశ్చర్యకరమైన సులభమైన మార్గాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
"మీరు కాఫీ చివరి చుక్క తాగడం పూర్తయిన వెంటనే కప్పును కడగండి. ఆ తర్వాత కప్పులో కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక గుక్క తాగండి. ఆ నీటిని నోటిలో పుక్కిలించి ఉమ్మేయండి. ఇలా చేయడం వల్ల టీలో ఉండే కొన్ని రసాయన పదార్థాలు తొలగిపోవడానికి సహాయపడుతుంది" అని హాన్కాక్ సూచిస్తున్నారు.
జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా పళ్ల ఆరోగ్యానికి, తెల్లదనాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని బూపా సంస్థ చెబుతోంది.
టీకి, కాఫీకి పాలను యాడ్ చేయడం వల్ల ఈ మరకలు పడటాన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా, ముదురు రంగు సాఫ్ట్ డ్రింక్‌లను తాగేటప్పుడు స్ట్రాను వాడటం కూడా ఈ మరకలకు తగ్గించుకోవచ్చు. ఎలాగంటే.. మీరు తాగే పానీయం నేరుగా గొంతులోకి వెళ్తుంది. దానివల్ల పళ్లపై ఎలాంటి మరకలు పడవు.
తాజాదనంతో కూడిన ముత్యాల్లాంటి తెల్లని చిరునవ్వును పొందాలనుకుంటే, పళ్లు తెల్లగా మార్చే చికిత్సల కోసం డబ్బు ఖర్చు చేయడానికి ముందే, ఈ మరకలను నివారించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























