సౌర విద్యుత్ వినియోగం పెరగడంతో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి?

- రచయిత, Carrie Davies
- హోదా, పాకిస్తాన్ కరస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
నగలు, మెరిసే వెండి వస్తువులు, సోఫాలు, ఏసీ యూనిట్.
పాకిస్థాన్‌లోని పంజాబ్ గ్రామీణ ప్రాంతంలో నివసించే ఫైసల్ షాజాద్ ఇల్లు తన భార్య కుటుంబం కట్నంలో భాగంగా ఇచ్చిన బహుమతులతో నిండిపోయింది.
అయితే వీటన్నింటిలో అత్యంత విలువైన వస్తువు మాత్రం మంచం కింద భద్రంగా ఉంది. అది 340 వాట్ల సోలార్ ప్యానెల్.
"వేసవిలో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం వరకు దాంతోనే విద్యుత్ అవసరాలు తీర్చుకున్నాం. పగటిపూట అసలు మామూలు కరెంటు వాడాల్సిన అవసరమే రాలేదు. రోజంతా ఎయిర్ కూలర్‌ను దానిపైనే నడిపించాం" అని షాజాద్ చెప్పారు.
దిగుమతి చేసుకున్న సోలార్ ప్యానెళ్ల వినియోగం పాకిస్థాన్‌లో భారీగా పెరిగింది. ఇళ్ల పైకప్పులపైనే కాకుండా ఆస్పత్రులు, రైతుల పొలాలు, పారిశ్రామిక సముదాయాలపై కూడా ఈ ప్యానెళ్లు కనిపిస్తున్నాయి.

2018 నుంచి 2025 మధ్య పాకిస్తాన్‌లో సౌర విద్యుత్ వాటా ఒక శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని పాకిస్తాన్‌కు చెందిన థింక్ ట్యాంక్ రెన్యూవబుల్స్ ఫస్ట్ తెలిపింది. ప్రస్తుతం సుమారు 70లక్షల కుటుంబాలకు సోలార్ ప్యానెళ్లు ఉన్నాయి.
"గతంలో పెళ్లిళ్లలో మోటార్‌బైక్‌లు లేదా ఇతర గృహోపకరణాలు బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పుడు సోలార్ ప్యానెల్, ఎయిర్ కూలర్ ఇస్తున్నారు. ఇవి దాదాపు తప్పనిసరి అయిపోయాయి" అని షాజాద్ చెప్పారు.
విద్యుత్ అవసరాల కోసం షాజాద్ సోలార్ ప్యానెల్‌తో పాటు జాతీయ విద్యుత్ గ్రిడ్‌పైనా ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నారు. ఆయన కుటుంబంతో పాటు సోదరుల కుటుంబాలు కూడా కలిసే ఉంటాయి. అందువల్ల ఒకేసారి అనేక విద్యుత్ పరికరాలు ఉపయోగిస్తుంటారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
‘విద్యుత్ గ్రిడ్ పతనం’
పాకిస్తాన్‌లో సగటు వేతనం నెలకు 40,000 పాకిస్తానీ రూపాయల (145 డాలర్లు) కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. విద్యుత్ బిల్లులు భరించలేనట్టుగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నెలకు 15 నుంచి 18వేల రూపాయల వరకు బిల్లులొస్తున్నాయి.
అందుకే ప్రజలు ప్రత్యామ్నాయలవైపు మొగ్గు చూపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. సౌరశక్తి వినియోగానికి పాకిస్తాన్ ఒక ఆదర్శంగా నిలిచినప్పటికీ జాతీయ గ్రిడ్ వ్యవస్థపై పరోక్షంగా దాని ప్రభావాలు పడుతున్నాయి.
పాకిస్తాన్‌లో సౌర విద్యుత్ వినియోగం ఇంతగా పెరగడానికి ప్రభుత్వ విధానాలు కారణం కాదు. వ్యక్తిగతంగా ప్రజలు తీసుకున్న నిర్ణయాలే దీనికి ప్రధాన కారణం.
అధిక విద్యుత్ బిల్లులు, కరెంట్ కోతలను తప్పించుకోడానికే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్నామని బీబీసీతో మాట్లాడినవాళ్లల్లో చాలామంది చెప్పారు.
గత కొన్నేళ్లలో విద్యుత్ ఛార్జీలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయని, అదే సమయంలో చైనా సోలార్ ప్యానెళ్ల ధరలు 93శాతం తగ్గాయని రెన్యూవబుల్స్ ఫస్ట్ సంస్థలో పరిశ్రమల సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న మహమ్మద్ హసన్ దజానా అంటున్నారు.
"ప్రజలు తమ జీవనం సాగించడానికి మరో మార్గాన్ని కనుగొన్నారు. ఇది చాలా మంచి పరిణామం. పరిస్థితులకు అనుగుణంగా మనం మార్పు చెందాం. ప్రజలు స్పందించి, ఆర్థికంగా సాధ్యమైన, సమర్థమైన మార్గాన్ని ఎంచుకున్నారు" అని పాకిస్థాన్ ఇంధన శాఖ మంత్రి అవైస్ అహ్మద్ లెఘారీ చెప్పారు.
సౌర విద్యుత్ వినియోగం పెరగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పాకిస్థాన్ వంటి దేశానికి ఇది ఉపయోగకరమైనప్పటికీ కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి.
పాకిస్థాన్ విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రభావితం చేసే 'యుటిలిటీ డెత్ స్పైరల్' అనే పరిస్థితిని నివారించాల్సి ఉంది.
జాతీయ గ్రిడ్ నుంచి తక్కువ విద్యుత్‌ను కొనుగోలు చేస్తే దాని నిర్వహణకయ్యే స్థిర వ్యయాలను భరించడానికి తక్కువ మంది వినియోగదారులు ఉంటారు.
దీంతో విద్యుత్ ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా మరింత మంది సోలార్ విద్యుత్ వైపు మళ్లుతారు.
కాలక్రమంలో ఇది విద్యుత్ వ్యవస్థను రెండు వర్గాలుగా విభజించే ప్రమాదం ఉంది. సోలార్ ప్యానెళ్లను కొనుగోలు చేయలేని వారు నిరంతరం పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారాన్ని మోయాల్సి వస్తుంది. అదే సమయంలో జాతీయ విద్యుత్ గ్రిడ్ ప్రభుత్వానికి పెనుభారంగా మారుతుంది.
"ఎక్కువ ప్రజాధనం ఖర్చు చేస్తే తప్ప మనుగడ సాగించలేని ప్రభుత్వ రంగ సంస్థ రూపంలో ఒక తెల్ల ఏనుగులా మిగిలిపోతుంది" అని మహమ్మద్ హసన్ దజానా అంచనావేశారు.

ఈ సమస్యకు సంబంధించిన ఖర్చుల ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది.
"గత రెండేళ్లలోనే విద్యుత్ గ్రిడ్ వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో మిగిలిన వినియోగదారులపై ఏటా 500 మిలియన్ డాలర్ల అదనపు భారం పడుతోంది. ఇది చాలా పెద్ద మొత్తం" అని లెఘారీ చెప్పారు.
ప్రజలను సోలార్ విద్యుత్ వినియోగం నుంచి దూరం చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, జాతీయ గ్రిడ్‌ను మరింత పోటీతత్వంతో తీర్చిదిద్ది తక్కువ ధరలకు విద్యుత్ అందించాలన్నదే లక్ష్యమని ఆయన వివరించారు.
జాతీయ గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా చేసే ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఖర్చుతోకూడిన, మార్పులకు అవకాశం లేని ఒప్పందాల ద్వారా దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయని పాకిస్తాన్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
అయితే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మాత్రం గ్రిడ్ నిర్వహణ సరిగా లేకపోవడం వంటి విస్తృతమైన వ్యవస్థాగత సమస్యలే విద్యుత్ బిల్లులు పెరగడానికి కారణమని చెబుతున్నాయి. చాలా ఒప్పందాలను ప్రభుత్వం ఇప్పటికే పునఃసమీక్షించి, తిరిగి చర్చలు జరిపిందని లెఘారీ చెప్పారు. మెరుగైన విద్యుత్ నిల్వ వ్యవస్థలు, తక్కువ నష్టాలు, కొత్త ఆవిష్కరణల ద్వారా గ్రిడ్‌ను మరింత సమర్థవంతంగా మార్చడంపై ఇప్పుడు దృష్టి పెట్టినట్టు తెలిపారు.
2036 చివరి నాటికి దేశంలో 90 శాతం వరకు స్వచ్ఛమైన విద్యుత్‌ను వినియోగించాలన్నది లక్ష్యం. ఇందులో పునరుత్పాదక ఇంధన వనరులతోపాటు అణు విద్యుత్ కూడా ఉంటుంది. అదే సమయంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని 26 శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సౌరవిద్యుత్‌తో పరిశ్రమలు
అయితే ప్రభుత్వం గ్రిడ్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పరిశ్రమల్లోనూ సోలార్ విద్యుత్ వినియోగం విస్తృతంగా పెరుగుతోంది.
భారీసంఖ్యలో ఏర్పాటుచేసిన నీలిరంగు సోలార్ ప్యానెళ్లతో నడిచే ఇస్లామాబాద్‌లోని కోహినూర్ టెక్స్‌టైల్స్ మిల్స్ ఇందుకు ఒక ఉదాహరణ. మరిన్ని ప్యానెళ్ల కోసం భూమిని చదును చేస్తున్న నిర్మాణ పనులను చూపిస్తూ వాటిని తన ‘‘బిడ్డ’’ అని యుటిలిటీస్ మేనేజర్ సబావూన్ ఖాన్ వాటిని అభివర్ణించారు.
ఎండ ఉన్నప్పుడు మిల్లులలోని వందలాది యంత్రాలు పూర్తిగా సౌరవిద్యుత్‌తోనే నడుస్తాయని ఖాన్ చెప్పారు. గతంలో వాటికోసం ఉపయోగించిన హెవీఫర్నేస్ఆయిల్ ఇంజన్లు ఒక గిడ్డంగిలో మూలన పడి ఉన్నాయి.
అయితే దీనికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆకాశం మరీ మేఘావృతమై ఉన్నప్పుడు లేదా వాతావరణ కాలుష్యం కారణంగా సూర్యరశ్మి సరిగా లేనప్పుడు అలాగే రాత్రి వేళల్లో ఈ సంస్థ జాతీయ గ్రిడ్ నుంచి ఎక్కువ విద్యుత్‌ను తీసుకుంటుంది.
ఈ పరిశ్రమ కూడా ఇతర సంస్థల మాదిరిగానే రాబోయే వారాల్లో అదనపు సౌర విద్యుత్‌ను నిల్వ చేసుకునేందుకు పారిశ్రామిక బ్యాటరీలను ఉపయోగించడం ప్రారంభించనుంది.
"మా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఇదొక మార్గం. అయితే, పూర్తిగా జాతీయ విద్యుత్ గ్రిడ్ నుంచి బయటపడాలన్నది మా ప్రణాళిక కాదు’’ అని ఆ మిల్లుల సీఈఓ తౌఫీక్ సయీద్ సైగోల్ స్పష్టం చేశారు.
‘‘దురదృష్టవశాత్తూ ప్రభుత్వానికి తగిన వనరులు లేవు కాబట్టి అన్నింటికీ ప్రభుత్వాన్నే నిందించలేం. మనం చేయగలిగిన కొన్ని పనులను మనమే చేసుకోవాలి’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సోలార్ విద్యుత్ విధానంలో మార్పులపై విమర్శలు
సౌర విద్యుత్ విషయంలో ప్రభుత్వం తరచూ నిబంధనలు మారుస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఇళ్లలో అవసరానికి మించి ఉత్పత్తి అయిన సౌర విద్యుత్‌ను జాతీయ గ్రిడ్‌కు సరఫరా చేసి అందుకు బదులుగా క్రెడిట్లు పొందే అవకాశం ఉండేది. సూర్యరశ్మి లేని సమయంలో గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకున్నప్పుడు ఆ క్రెడిట్లను ఉపయోగించి బిల్లులను తగ్గించుకునేవారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఆ విధానంలో మార్పులు చేశారు.
"ప్రారంభంలో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం చాలా ఉపయోగకరంగా ఉండేది. కానీ ఆ తర్వాత విధానం మారిపోయింది. ఇప్పుడు మా నుంచి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి, తిరిగి మాకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు" అని ఫైసలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అరిఫ్ ఎహ్సాన్ మాలిక్ చెప్పారు.
దీనివల్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలపై గణనీయమైన ప్రభావం పడుతోందని ఆయన అన్నారు.
అయితే, గతంలో అమలులో ఉన్న విధానంలో ఖర్చులు, ఆదాయాల మధ్య సమతుల్యత లేదని లెఘారీ వాదించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారులు గ్రిడ్‌కు సరఫరా చేసే విద్యుత్ ధర తక్కువగా ఉండగా, తిరిగి గ్రిడ్ నుంచి తీసుకునే విద్యుత్ ధర ఎక్కువగా ఉండేదని చెప్పారు.
"ఆ లాభాలన్నీ గ్రిడ్‌లోని మిగతా వినియోగదారుల ఖర్చుతోనే వచ్చేవి. ఆ నిబంధనలను మార్చకపోయి ఉంటే, మరో రెండేళ్లలో మిగతా వినియోగదారులపై ఏటా 150 నుంచి 200 బిలియన్ రూపాయల వరకు అదనపు భారం పడేది" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
సౌర విద్యుత్ వినియోగం తమ ప్రణాళికలను మించిపోతుందనే ఆందోళన తమకు లేదని లెఘారీ చెప్పారు. రాబోయే పదేళ్ల అంచనాల్లో ఇప్పటికే దీనిని పరిగణనలోకి తీసుకున్నామని, విద్యుత్ గ్రిడ్‌ను వీడుతున్న వినియోగదారుల సంఖ్య కూడా తగ్గిందని తెలిపారు.
సోలార్ విద్యుత్ రంగంలో పాకిస్థాన్‌కు భారీ లక్ష్యాలున్నాయి. దేశవ్యాప్తంగా సోలార్ బ్యాటరీ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రణాళికలు ఉన్నాయి
అయితే ఇది ఒక కీలక సంధి దశలో ఉంది.
"ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సౌర విద్యుత్, జాతీయ గ్రిడ్ సమాంతరంగా పనిచేసే భవిష్యత్తు. ఇంధన పరివర్తన క్రమంగా ఎలా విజయవంతం కాగలదో ఇది చూపిస్తుంది. రెండోది భారీ ఖర్చులతో క్షీణిస్తున్న విద్యుత్ గ్రిడ్ వల్ల పాకిస్తాన్ ఇతర దేశాలకు ఒక హెచ్చరికగా మిగిలిపోయే పరిస్థితి" అని దజానా చెప్పారు.
పంజాబ్ గ్రామీణ ప్రాంతంలో నివసించే షాజాద్ మాత్రం తన ఇంట్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని మరింత పెంచాలన్న ఆలోచనతో ఉన్నారు.
మరో 10-15 సోలార్ ప్యానెళ్లను తెచ్చి వాటిని పైకప్పు మీద ఏర్పాటు చేయాలనుకుంటున్నామని అన్నారు. ఆ తర్వాత బ్యాటరీలు, బ్యాకప్ సదుపాయంతో పూర్తి వ్యవస్థను ఏర్పాటుచేస్తామని కూడా తెలిపారు.
మొత్తంగా విద్యుత్ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నదే లక్ష్యమని షాజాద్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























