ఎల్‌జీబీటీక్యూ యాప్ పరిచయాలతో బంగారం దోపిడీ.. దొంగలెలా దొరికారంటే?

ఫొటో సోర్స్, Malkajgiri Police
‘‘హైదారాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతం. ఓ సాయంత్రం ట్రాన్స్‌జెండర్ పర్సన్ ఒకరు మరో ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్’ కోసం తన గదిలో ఒంటరిగా ఎదురుచూస్తున్నారు. అక్కడికి రానున్న వ్యక్తి తనకు ఓ యాప్ ద్వారా పరిచయమయ్యారు. తనను నేరుగా కలవడం అదే తొలిసారి’
తన వ్యక్తిగత ఆసక్తి వల్ల ప్రత్యేకంగా ఎల్జీబీటీక్యూ వ్యక్తుల నెట్‌వర్కింగ్ చేసే యాప్ ద్వారా కొత్త వ్యక్తిని కలవబోతున్నారు.
ఇందులోకి వచ్చే వారంతా స్వలింగ సంపర్కులే అని నమ్మిన జీడిమెట్ల ట్రాన్స్‌జెండర్ పర్సన్.. యాప్ ద్వారా పరిచయమైన కొత్త బంధం కోసం ఎదురు చూపుల్లో ఉన్నారు.
ఎట్టకేలకు రావల్సిన వారు వచ్చారు. తమతో బీరు సీసాలు కూడా తీసుకువచ్చారు. వచ్చిన కొత్త ట్రాన్స్‌జెండర్ పర్సన్‌తో శారీరకంగా కలవాలని ఎదురుచూస్తున్న ఈ ట్రాన్స్‌జెండర్ పర్సన్‌కు నిరాశే ఎదురైంది. తను ఎంత ప్రయత్నించినా, వచ్చిన వ్యక్తి అందుకు సుముఖంగా లేరు. దీంతో గొడవ అయింది. పోలీసులను పిలిచారు. కేసు పెట్టారు. వచ్చిన ట్రాన్స్‌జెండర్ పర్సన్ పారిపోయారు’’..
ఇదంతా మల్కాజ్‌గిరి కమిషనరేట్ పోలీసులు చెప్పిన ఘటన. ఆ కేసు తరువాత పోలీసులు గట్టి నిఘా పెట్టారు.

పోలీసుల నిఘా తరువాత పెద్ద డొంకే కదిలింది. ఆ ప్రత్యేక యాప్ కేంద్రంగా ఎల్జీబీటీక్యూ వర్గాల వారే లక్ష్యంగా దొంగతనాలు చేసే ముఠా దొరికిందని పోలీసులు తెలిపారు.
ఒకటీరెండూ కాదు, 14 కేసుల్లో వీరు నిందితులు అంటున్నారు పోలీసులు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబరులో మరో ఘటన.
''ఆ యాప్‌లో హర్ష అనే పేరుతో ఒకరు పరిచయం అయ్యారు. రాత్రి 8.30 ఒక బీరు ఒక బ్రీజర్‌తో ఇంటికి వచ్చారు. కూర్చుని తాగాలనుకున్నారు. బీరు రెండు సిప్పులు తాగగానే నిద్రపోయాను. మరునాడు 3 గంటల ప్రాంతంలో మెలకువ వచ్చింది. చూసుకుంటే గొలుసు, ఉంగరం, 5 వేల నగదు పోయాయి'' అని ఫిర్యాదు చేశారు ఒక వ్యక్తి.
మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో 3, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3, విశాఖపట్నంలో ఒకటి.. దాదాపు ప్రతి ఫిర్యాదులోనూ ఇలాంటి కథే.
''ఎల్జీబీటీక్యూ వ్యక్తులను కొత్తగా వచ్చినవారు ముందుగా కలవగానే, వారికి నమ్మకం కలిగేలా ప్రవర్తిస్తారు. కౌగిలించుకుంటారు. ముద్దు పెడతారు. తాము గే అని ఎదుటివారు నమ్మేలా ప్రవర్తిస్తారు. కానీ వాస్తవం ఏంటంటే, ఈ ముఠాలో ఎవరూ గే కాదు. కానీ దొంగతనాల కోసం ఈ పద్ధతి ఎంచుకున్నారు. తమ టార్గెట్ పర్సన్‌ను ఎంచుకున్న తరువాత వారి ఇంటికి వెళతారు. మాటల్లో పెడతారు. ముందుగా తమతో పాటు తెచ్చిన బీరు ఇస్తారు. వారిని మాటల్లో పెట్టి ఆ బీర్లో మత్తు మందు కలుపుతారు. వారు మత్తులోకి వెళ్లగానే ఒంటిపై బంగారం, ఇంట్లోని బంగారం, డబ్బు ఎత్తుకెళ్తారు'' అంటూ ఈ దొంగతనాల తీరును వివరించారు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి.
తమకు యాప్‌లో పరిచయమైన ప్రతి ఒక్కరినీ వీరు మోసం చేశారని పోలీస్ కమిషనర్ సుమతి చెప్పారు. ఐదుగురు నిందితుల నుంచి 36 తులాల బంగారం రికవరీ చేశామన్నారు.
ఈ కేసులో నవంబర్ 16న ఐదుగురు అరెస్ట్ కాగా, ఒకరు పరారీలో ఉన్నారు. వీరిలో ఒక డాక్టర్, 18, 21 ఏళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు.
''ఆ డాక్టర్ పలు ఆసుపత్రుల్లో పనిచేశారు. అయితే ఆయనకు ఒకటే కిడ్నీ ఉండడం వల్ల ఎక్కువ పనిచేయలేకపోతున్నారు. దీంతో ఈజీ మనీ కోసం ఈ దారి ఎంచుకున్నారు'' అని మీడియాకు చెప్పారు కమిషనర్ సుమతి.
బాధితులు అంతా దాదాపు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులేనని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Malkajgiri Police
ఎలా మొదలైంది?
మల్కాజ్‌గిరి కమిషనరేట్ పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. ‘‘మొయినాబాద్‌కి చెందిన ఒక వ్యక్తి కృష్ణా నగర్‌లో సినిమా రంగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.
అక్కడ చిన్న వేషాలు వేసే అమ్మాయిలను స్నేహం పేరుతో కలసి, మద్యం తాగించి, వారి దగ్గర బంగారం ఎత్తుకెళ్లాలని ప్రణాళిక వేశారు.
అలా ఇద్దరితో ప్రయత్నించారు కానీ, ఒక అమ్మాయి దగ్గర అసలైన బంగారం లేదు.
మరో అమ్మాయి దగ్గర తన కుట్ర సాగలేదు. ఆ ప్రయత్నం ఫలించకపోయినా, ఆలోచన మానలేదు.
ఆ క్రమంలో అతనికి ఒక గే వ్యక్తి పరిచయమై, యాప్ గురించి చెప్పి, అక్కడ కొత్తవారిని పరిచయం చేసుకోవచ్చు అని చెప్పడంతో, ఆ యాప్‌ను ఇలా దొంగతనాలకు వాడుకోవాలని ప్రణాళిక వేశాడు'' అని మీడియాకు తెలిపారు పోలీసులు.
ఆ క్రమంలో మరో విద్యార్థి, చిరుద్యోగి, ఒక డాక్టర్... వీళ్లంతా ఆ మొదటి వ్యక్తికి పరిచయం అయ్యారు.
వీరెవరూ ఎల్జీబీటీక్యూ పర్సన్స్ కాదని.. ఈ యాప్ ద్వారా తమను తాము గే అని చెప్పుకుంటూ ముందుగా మంచి ప్రొఫైల్స్ ఎంచుకుని వలవేయడం ప్రారంభించి మోసాలకు పాల్పడ్డారని చెప్పారు పోలీసులు.
"తాము ఎంచుకున్న ప్రొఫైల్ వారితో ముందుగా వీడియో కాల్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వారి ఒంటిపై ఎంత బంగారం ఉంది అని చూస్తారు. వారు ఒంటరిగా ఉంటున్నారా లేదా అన్నది చూస్తారు. ఇతరత్రా అన్ని అనుకూలతలు చూసుకుని వారిని మాటలతో మభ్య పెట్టి స్నేహం చేస్తారు. త్వరలోనే కలుద్దాం అని చెప్పి, వారు ఉండే చోటుకు నిందితులు వెళ్తుంటారు" అని చెప్పారు పోలీసులు.
''నిందితుల దగ్గరకు వెళ్లడం, మత్తు కలిపిన బీరు తాగించడం, వారిని దోచుకుని బయట పడడం… ఇదే వీరి మోడల్. అయితే ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా వీరు పోలీసులకు దొరకలేదు. మోసాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో ప్రధాన వ్యక్తి, త్వరలో వేరే కొత్త వాళ్లతో మరో గ్యాంగ్ కూడా ప్లాన్ చేస్తుండగా పట్టుకున్నాం'' అని మీడియాకు చెప్పారు కమిషనర్ సుమతి.
ఈ యాప్‌ను ఉపయోగించుకుని బాధితులను ఎలా కాంటాక్ట్ చేశారు అన్న టెక్నికల్ ఎవిడెన్స్ పోలీసులు సేకరిస్తున్నారు.
వారు కలుపుతున్న మత్తుమందు వల్ల ప్రాణాపాయం కూడా ఉండవచ్చని పోలీసులు చెప్పారు.
''మేం డేటింగ్ యాప్స్ మానిటర్ చేస్తున్నాం. అందులో చాలా సమాచారం దుర్వినియోగం అవుతోంది. చానెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎవరు కలుస్తున్నారు. ఒకరే చాలా మందిని కలవడం, పరిచయం చేసుకునేది ఒకరు, కలిసేది వేరొకరు అవడం, ఇలాంటి పాటర్న్ మొత్తం మేం గమనించాం. టెక్నాలజీ ద్వారా తప్పు చేస్తే దొరకం అని ఎవరైనా అనుకుంటే పొరబాటే. ప్రజలు కూడా సంప్రదాయ నేరాలతో పాటు ఇలాంటి ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి" అని పోలీసులు సూచించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 13 కేసుల్లో, విశాఖపట్నంలో ఒక కేసులో వీరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ అన్ని ఘటనల్లో దాదాపు 370 గ్రాముల బంగారం దోచుకున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లలో నమోదు చేశారు.
వీరు చేసిన అన్ని నేరాల్లోనూ ఒకే పద్ధతి పాటించారని పోలీసులు తెలిపారు.
వీటిలో ఎక్కువ ఘటనలు 2026లోనే జరిగాయి.
ఈ ఘటనల్లో బాధితుల దగ్గర బంగారం ఉందా? వారి అలవాట్లు ఏంటి? చిరునామా, వారు ఒంటరిగా ఉంటున్నారా, లేదా? వంటి వివరాలు సేకరిస్తున్నారని తేల్చిన పోలీసులు, వ్యక్తిగత సమాచారం కొత్తవారితో ఆన్‌లైన్‌లో పంచుకోవద్దని సూచిస్తున్నారు.
ఇటువంటి నేరాల బారిన పడకుండా ప్రజలకు కొన్ని సూచనలు చేశారు మల్కాజ్‌గిరి పోలీసులు.
- వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకునే ముందు, కలవడానికి అంగీకరించే ముందు ఎదుటి వ్యక్తి గుర్తింపును నిర్ధరించుకోండి.
- తెలియని వ్యక్తులు పంపే ప్రొఫైల్స్, ఫొటోలు లేదా వ్యక్తిగత వివరాలను గుడ్డిగా నమ్మవద్దు.
- ఇంటి చిరునామా, పని ప్రదేశం, ఆర్థిక సమాచారం వంటి సున్నితమైన వివరాలను అపరిచితులతో పంచుకోవద్దు.
- మీరు ఒంటరిగా నివసిస్తున్నారా లేదా ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయా అనే వివరాలను వెల్లడించవద్దు.
- కొత్త పరిచయస్తులను ఇంటికి ఆహ్వానించకుండా, బహిరంగ ప్రదేశాల్లో కలవడానికి ప్రాధాన్యం ఇవ్వండి.
- బ్లాక్‌మెయిల్ లేదా బెదిరింపులకు ఉపయోగపడే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, సంభాషణలను పంచుకోవద్దు.
- డేటింగ్ అప్లికేషన్లలో లైవ్ లొకేషన్ లేదా ఇతర లొకేషన్ సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి.
- అనుమానాస్పద ప్రవర్తన, బెదిరింపులు లేదా బ్లాక్‌మెయిల్ ఎదురైతే చాట్స్, స్క్రీన్‌షాట్లు, ఫోన్ నంబర్లు, ప్రొఫైల్ వివరాలు వంటి డిజిటల్ ఆధారాలను భద్రపరిచి పోలీసులకు ఫిర్యాదు చేయండి.
- మీకు అవసరం లేని సందర్భాల్లో అప్లికేషన్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దు.

ఫొటో సోర్స్, Malkajgiri Police
"సాధారణ డేటింగ్ యాప్‌ల కంటే, ఎల్జీబీటీక్యూ నెట్‌వర్కింగ్ యాప్‌ల విషయంలో జాగ్రత్త మరింత అవసరం. ఎల్జీబీటీక్యూ వ్యక్తులు సమాజంలోని టాబూ కారణంగా తమను తాము ఎల్జీబీటీక్యూ వ్యక్తులుగా ప్రకటించుకోవడానికి ఇష్టపడరు. అదే సమయంలో... తమవంటి వారితో చాలా తేలికగా కలసి, తొందరగా నమ్మే స్వభావం ఉంటుంది. అదే ఈ నిందితులకు బలం అయింది. చాలా మంది ఈ విషయంలో ఫిర్యాదు కూడా చేయలేదు. విచారణలో మాకు కొన్ని ఘటనలు తెలియడంతో, మేం కొందరిని ఫిర్యాదు చేయమని అడగాల్సి వచ్చింది. పైగా ఇలాంటి వారితో కలవడానికి సిద్ధపడే వారు ఒంటరిగా జీవించడం లేదా ఆ రోజు ఒంటరిగా ఉండేలా చూసుకోవడం కూడా వీళ్లకు అనుకూలమైంది. ఎప్పుడైతే జీడిమెట్లలో కేసు నమోదైందో, అప్పుడు వీళ్లను పట్టుకోవడం తేలికైంది" అని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారి తరపు వారి వాదన కోసం బీబీసీ ప్రయత్నం చేస్తోంది.
వారి స్పందన రాగానే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























