రూ.కోటిన్నర పంపమంటూ కంపెనీ బాస్ నుంచి వాట్సాప్ మెసేజ్...కానీ ఆ మెసేజ్ బాస్ పంపలేదు.. ఏమిటీ ‘బాస్ స్కామ్’?

వాట్సాప్ మెసేజ్

ఫొటో సోర్స్, Getty Images/EPA

    • రచయిత, రాక్సీ గాగ్దేకర్ చారా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఓ జిప్ ఫైల్‌తో పాటు ఒక మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కంపెనీకి చెందిన కోటిన్నర రూపాయలు మరో ఖాతాకు బదిలీ అయ్యాయి. అప్పుడు తాము మోసపోయామని ఆ కంపెనీ గ్రహించింది. ఆ తర్వాత ఏం జరిగింది?

అహ్మదాబాద్‌లో వెలుగులోకి వచ్చిన 'బాస్ స్కామ్'లో.. సైబర్ నేరగాళ్లు కంపెనీ బాస్ గుర్తింపులను ఉపయోగించి ఉద్యోగులతో కంపెనీ డబ్బును మరో ఖాతాకు బదిలీ చేయించి మోసం చేస్తున్నారని తేలింది. ఈ రకమైన మోసంలో, సైబర్ నేరగాళ్లు కంపెనీ యజమాని పేరు, ప్రొఫైల్ ఫోటోను ఉపయోగిస్తారు.

ఆ తర్వాత వారు కంపెనీ అకౌంటెంట్‌కు లేదా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగికి ఒక నిర్దిష్ట ఖాతాకు వెంటనే డబ్బును బదిలీ చేయమని కోరుతూ వాట్సాప్ మెసేజ్ పంపుతారు.

ఈ మెసేజ్ నిజానికి బాస్ నంబర్ నుంచి రాదు. కానీ, ఉద్యోగి ఫోన్‌లో మాత్రం బాస్ పేరుతోనే కనిపిస్తుంది. దీనివల్ల, ఆ మెసేజ్‌ నిజమైనదో కాదో నిర్థరించుకోకుండానే డబ్బు బదిలీ చేసే అవకాశం పెరుగుతుంది.

అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జరిపిన దర్యాప్తులో ఈ మోసం వెనుక ఒక వ్యవస్థీకృత ముఠా ఉందని వెల్లడైంది. దీని కోసం నకిలీ సిమ్ కార్డులు, ఓటీపీలు, వాట్సాప్ ఖాతాలు, మాల్వేర్‌లను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పోలీసులు సుమారు 4,500 సిమ్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించి దేశంలోని 26 రాష్ట్రాల్లో దాఖలైన 251 ఫిర్యాదులపై దర్యాప్తు చేశారు.

ఇందులో 'బాస్ స్కామ్'కు సంబంధించిన 3 ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ నెట్‌వర్క్‌కు భారత్, చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌ వరకు సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

బాస్ స్కామ్

ఫొటో సోర్స్, Getty Images

'బాస్ స్కామ్' ఎలా వెలుగులోకి వచ్చింది?

ప్రవీణ్ నాగ్జీభాయ్ బావలియాకు జూన్ 23, 2026న వాట్సాప్‌లో ఒక గుర్తు తెలియని మొబైల్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ మెస్సేజ్ పంపిన వ్యక్తి తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'రిస్క్ కంట్రోల్' విభాగానికి చెందినవాడినని చెబుతూ, ప్రవీణ్ నాగ్జీభాయ్ కంపెనీకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆ అకౌంట్‌ను మూసివేస్తామని, లేదంటే ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తూ ఓ 'జిప్' ఫైల్‌ కూడా పంపారు.

"గత 6 నెలలుగా నాకు ఇలాంటి మెస్సేజ్‌లు నిరంతరం వస్తున్నాయి. మొదట్లో నేను వాటిని పట్టించుకోలేదు. కానీ ఇలాంటి సందేశాలు, లింకులు వస్తూనే ఉండటంతో, ఇవి ఆర్‌బీఐ నుంచి వచ్చిన సందేశాలు కావచ్చని భావించాను" అని ప్రవీణ్‌భాయ్ బీబీసీకి చెప్పారు.

'' నేను ఆ లింక్‌ను నా రియల్ ఎస్టేట్ కంపెనీ అకౌంటెంట్‌కు పంపాను. ఖాతా మూతపడకుండా, లేదంటే స్తంభింపచేయకుండా ఉండేందుకు వీలుగా ఆ లింకును తనిఖీ చేయమని కోరాను'' అని తెలిపారు.

అకౌంటెంట్ తన డెస్క్‌టాప్‌లో ఆ లింక్‌ను తెరిచి, దాని నుంచి ఒక ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

''ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత హ్యాకర్‌కు ప్రవీణ్ భాయ్ వాట్సాప్‌లోని కాంటాక్టులు, అలాగే ఎకౌటెంట్ డెస్క్ టాప్ నుంచి జరుగుతున్న సంభాషణలు కనిపించడం ప్రారంభమైంది’’

ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రవీణ్‌భాయ్ ఒక పెళ్లి కోసం ఉదయ్‌పూర్‌కు వెళ్లారు. ఈ విషయం హ్యాకర్‌కు కూడా తెలుసు.

మరుసటి రోజు ఉదయం కోల్‌కతాలోని ఒక గార్మెంట్ కంపెనీకి వెంటనే కోటిన్నర రూపాయలు పంపమంటూ హ్యాకర్ ప్రవీణ్‌భాయ్ పేరుతో ఆయన అకౌంటెంట్‌కు ఒక మెసేజ్ పంపాడు. అకౌంటెంట్ కూడా ఆ మెసేజ్ నిజమైదని భావించి, ఆర్టీజీఎస్ ద్వారా కోటిన్నర రూపాయలు బదిలీ చేశారని ప్రవీణ్ భాయ్ తెలిపారు.

ఈ లావాదేవీ గురించి తెలియగానే ప్రవీణ్‌భాయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు 1930 హెల్ప్‌లైన్‌లో నమోదైందని పోలీసులు తెలిపారు. ఈ మోసంలో నష్టపోయిన కోటిన్నర రూపాయల్లో ఒక కోటి 13 లక్షల 53 వేల 700 రికవరీ చేయగలిగామని, సుమారు రూ. 25 లక్షలు విదేశాలకు తరలించారని పోలీసులు తెలిపారు.

ఈ స్కామ్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇరామ్ అలీ పియాదా, ఇంజాముల్ మొల్లా అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ కేసులో నిందితులిద్దరి వాదన వినడానికి బీబీసీ వారి న్యాయవాదులను లేదా కుటుంబాలను సంప్రదించడానికి ప్రయత్నించింది. అయితే, ఈ వార్తను రాసే సమయానికి సంప్రదింపులు సాధ్యపడలేదు. వారి వాదన అందుబాటులోకి రాగానే ఇక్కడ అప్డేట్ చేస్తాం.

వాట్సాప్

ఫొటో సోర్స్, Getty Images

బాస్ స్కామ్ మెథడ్ ఏంటి?

ఈ స్కామ్ సరిగ్గా ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బీబీసీ, అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) లవీనా సిన్హాతో మాట్లాడింది.

సైబర్ నేరగాళ్లు మొదట ఆర్‌బీఐ లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ అధికారులుగా చెప్పుకుంటారు. ఆ తర్వాత, వారు వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా కంపెనీ సీఈఓ, డైరెక్టర్ లేదా ఉద్యోగికి ఒక జిప్ ఫైల్‌ను పంపుతారు.

ఈ జిప్ ఫైల్‌లో .exe లేదా .dll వంటి ప్రమాదకరమైన ఫైల్స్ ఉంటాయి. పోలీసులు చెబుతున్న ప్రకారం, వాట్సాప్ వెబ్ ద్వారా కంపెనీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో ఇలాంటి ఫైల్‌ను తెరిస్తే, సైబర్ నేరగాళ్లు ఆ వాట్సాప్ వెబ్‌ను వారి నియంత్రణలోకి తీసుకోగలరు'' అని లవీనా సిన్హా చెప్పారు.

''ఆ తర్వాత కంపెనీ సీఈఓ లేదా డైరెక్టర్ గుర్తింపును, ప్రొఫైల్ ఫోటోను ఉపయోగించి, తమ సొంత మొబైల్ నంబర్‌ను బాస్ పేరు మీద సేవ్ చేసుకుంటారు సైబర్ నేరగాళ్లు''

''నంబర్‌ను సేవ్ చేసిన తర్వాత, డబ్బును త్వరగా బదిలీ చేయమని కోరుతూ కంపెనీ అకౌంట్స్ లేదా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగికి ఒక మెసేజ్ పంపిస్తారు. ఈ మొత్తం స్కామ్‌లో నకిలీ సిమ్ కార్డులు ఓటీపీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి'' అని లవీనా సిన్హా తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం, వినియోగదారులకు తెలియకుండా వారి పేర్ల మీద తీసుకున్న సిమ్ కార్డులతో మొబైల్ నంబర్లను యాక్టివేట్ చేసి నకిలీ సిమ్ కార్డులను తయారు చేస్తున్నారు. ఈ సిమ్ కార్డులను వివిధ ఫోన్లలో ఉపయోగిస్తూ, వాటిలోని సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు.

ఈ విధంగా, సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా మోసాలకు పాల్పడేందుకు ఒక వ్యవస్థను రూపొందించుకోగలిగారు.

అహ్మదాబాద్ పోలీసులు దర్యాప్తు జరిపిన తర్వాత ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం, నిందితులలో ఒకరు సైబర్ మోసాలకు పాల్పడే వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారు.

ఈ వ్యక్తి మొబైల్ నంబర్లు, నకిలీ సిమ్ కార్డులు, వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ ఏర్పాట్లు చేసుకోవడానికి సైబర్ మోసాలకు సహాయం చేశారు.

రెండవ నిందితుడు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీలకు సిమ్ కార్డ్ అవుట్‌లెట్ సేవలు అందిస్తున్నారు.

నిందితుడు కస్టమర్ల బయోమెట్రిక్ వేలిముద్రలు, టెలికాం కంపెనీ అప్లికేషన్‌ను ఉపయోగించి వారి పేర్లతో సిమ్ కార్డులను పొందేవారని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఆయన కస్టమర్లకు తెలియకుండా వారి మొబైల్ నంబర్లను మరో సిమ్ కార్డులో యాక్టివేట్ చేసేవారని తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.

వాట్సాప్, బాస్ స్కామ్

ఫొటో సోర్స్, Getty Images

'సైబర్‌క్రైమ్-యాజ్-ఎ-సర్వీస్' అంటే ఏమిటి?

సైబర్ నేరాల ప్రపంచంలో, ప్రతి నేరస్థుడు మొత్తం సాంకేతిక వ్యవస్థను స్వయంగా నిర్మించుకోవాల్సిన అవసరం లేదు.

ఒకరు నకిలీ సిమ్ కార్డు ఇస్తారు. మరొకరు ఓటీపీ పొందుతారు. ఇంకొకరు వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత వేరొక వ్యక్తి బాధితుడితో మాట్లాడి ఆయన నుంచి డబ్బు బదిలీ చేస్తారు.

అహ్మదాబాద్ పోలీసుల పత్రికా ప్రకటన ప్రకారం, రెడీ మేడ్ డిజిటల్ సేవలు, గ్రూప్‌లు, ఇతర సాధనాలను ఉపయోగించి చేసే సైబర్ మోసాన్ని 'సైబర్‌క్రైమ్-యాజ్-ఎ-సర్వీస్' (CaaS) అని పిలుస్తారు.

అంటే, సైబర్ నేరాలకు పాల్పడటానికి అవసరమైన డిజిటల్ సాధనాలు, సేవలు కూడా రెడీ మేడ్‌గా అందుబాటులో ఉంటాయి.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సుమారు 4,500 సిమ్ కార్డుల సమాచారం ఆధారంగా, అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 26 రాష్ట్రాలకు చెందిన 251 ఎన్‌సీఆర్‌పీ ఫిర్యాదులను విశ్లేషించారు.

ఈ ఫిర్యాదులలో 194 ఆన్‌లైన్ ఆర్థిక మోసాల ఫిర్యాదులు, 3 'బాస్ స్కామ్‌ల' ఫిర్యాదులు, 29 ఆన్‌లైన్, సోషల్ మీడియా సంబంధిత నేరాల ఫిర్యాదులు ఉన్నాయి.

అంతేకాక, ఈ డేటాలో ఇతర రకాల సైబర్ నేరాలు, హ్యాకింగ్, లైంగికంగా అసభ్యకరమైన సందేశాలు, బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

ఈ దర్యాప్తులో భాగంగా 10,000కు పైగా వైరస్ సోకిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు, 1 ఎయిర్‌టెల్ రౌటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్, I4C చేసిన సాంకేతిక, నెట్‌వర్క్ విశ్లేషణ ప్రకారం.. ఈ కేసులో ఉపయోగించిన మాల్‌వేర్‌ను చైనాతో సంబంధం ఉన్న సైబర్ నేరగాళ్లు సృష్టించారని పోలీసులు అనుమానిస్తున్నారు.

వాట్సాప్, బాస్ స్కామ్

ఫొటో సోర్స్, Getty Images

తప్పించుకోవడం ఎలా?

ఇలాంటి సైబర్ మోసాలను తప్పించుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అహ్మదాబాద్ పోలీసులు సూచించారు.

తెలియని మొబైల్ నంబర్‌లు లేదా ఈమెయిల్‌ల నుంచి వచ్చిన ZIP, .exe, .dll, లేదా .apk ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయద్దు లేదా తెరవద్దు.

"వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా డబ్బు బదిలీ చేయమని మీకు మెసేజ్ వస్తే, దాన్ని మీరే స్వయంగా ధృవీకరించుకోకుండా డబ్బు బదిలీ చేయవద్దు" అని సిన్హా చెప్పారు.

''మీ బాస్ లేదా సీఈఓ మిమ్మల్ని అత్యవసరంగా డబ్బు పంపమని అడిగితే, వారికి వారి సాధారణ లేదా ప్రత్యామ్నాయ నంబర్‌కు కాల్ చేయండి, వీడియో కాల్ చేయండి లేదా వారిని వ్యక్తిగతంగా కలవండి'' అని సూచించారు.

''వాట్సాప్‌లో 'లింక్ చేసిన డివైజ్‌లను' ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. మీకు తెలియని డివైజ్ కనెక్ట్ అయి ఉన్నట్లు కనిపిస్తే, వెంటనే దాని నుంచి లాగ్ అవుట్ అవ్వండి. అలాగే, వాట్సాప్‌లో టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేస్తూ ఉండండి'' అని తెలిపారు.

తెలియని .exe లేదా .dll ఫైళ్లను తెరవకుండా నిరోధించడానికి కంపెనీలు భద్రతా చర్యలను అమలు చేయాలి. అలాగే, విండోస్, యాంటీవైరస్, ఇతర భద్రతా సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్‌ చేయాలి.

ఇలాంటి మోసాల విషయంలో సమయం చాలా కీలకం. మోసం జరిగితే, వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని అహ్మదాబాద్ పోలీసులు సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)