ఈఫిల్ టవర్ వివాదం: ఏమిటీ స్వామి నారాయణ సంప్రదాయం, వీరు మహిళలకు దూరంగా ఎందుకు ఉంటారు?

ఫొటో సోర్స్, Kenzo TRIBOUILLARD / AFP via Getty Images
- రచయిత, రాక్సీ గగడేకర్ ఛారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
పారిస్‌లోని ఈఫిల్ టవర్ దగ్గర ఇటీవల జరిగిన ఒక ఘటన చుట్టూ తలెత్తిన వివాదం స్వామినారాయణ సంప్రదాయంలోని ఒక శాఖ అయిన బోచాసనవాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్)లో మహిళల పాత్రపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఈ సంప్రదాయానికి దాదాపు 200 సంవత్సరాల చరిత్రఉంది. దీనిని స్వామి నారాయణ ప్రారంభించారు. ఆయన అసలు పేరు ఘనశ్యామ్ పాండే. ఉత్తర ప్రదేశ్‌లో జన్మించారు.
పారిస్ వివాదం ఈ శాఖలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక మతపరమైన ఆచారాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చింది.
దీనిపై కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.
స్వామినారాయణ మత గ్రంథాల్లో మహిళలగురించి అసలేం చెప్పారు? సన్యాసులు స్త్రీలకు దూరం పాటించేవిషయంలో అంత కఠిన వైఖరితో ఎందుకుంటారు?ఆశీర్వాదం కోసం సాధువుల పాదాలను తాకడానికి మహిళలను అనుమతించరని స్వామినారాయణ దేవాలయాలకు క్రమం తప్పకుండా వెళ్లే భక్తులు చెబుతుంటారు.

ఈ విషయంపై బీఏపీఎస్ అధికార ప్రతినిధితో మాట్లాడటానికి బీబీసీ ప్రయత్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
మతపరమైన ప్రదేశాలకు మహిళలను అనుమతించకపోవడం భారత్‌లో కొత్తేమీ కాదు. కేరళంలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించడంపై చాలా కాలంగా వివాదం జరుగుతోంది.
ఈ నిషేధాన్ని ఎత్తివేస్తు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ తుది తీర్పు ఇంకా వెలువడలేదు.
‘మహిళలకు దూరంగా ఉండడమే ప్రత్యేకతా..?’
" ప్రతి మతం మహిళలను అంటరానివారిగా భావించింది. కానీ స్వామినారాయణ శాఖ వంటి కొన్ని మతాలు దానిని తమ ప్రత్యేకతగా ప్రదర్శించాయన్నది నా అభిప్రాయం"అని సామాజిక కార్యకర్త, రచయిత్రి, హేతువాది అయిన స్వరూప్ ధ్రువ్ బీబీసీతో చెప్పారు.
స్వామినారాయణ శాఖ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే సమాజంలోని అణగారిన, అట్టడుగు వర్గాల ప్రజలను ఆకర్షించే లక్ష్యంతో స్వామినారాయణ సంప్రదాయం ఏర్పడిందని సామాజిక శాస్త్రవేత్త, స్వామినారాయణ సంప్రదాయంపై విస్తృతంగా పరిశోధన చేసిన గౌరాంగ్ జానీ చెప్పారు.
19వ శతాబ్దం ప్రారంభంలో హిందూమతంలో అప్పటికే అనేక శాఖలు ప్రబలంగా ఉన్నప్పుడు ఘనశ్యామ్ పాండే 1801లో ఒక కొత్త శాఖను ప్రారంభించి దానికి స్వామినారాయణశాఖ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఈ శాఖ ప్రధాన కార్యాలయం గుజరాత్లో ఉంది.
ఇటీవల జరిగిన పారిస్ వివాదం గురించి బీఏపీఎస్ ఏం చెప్పింది?
బీఏపీఎస్ సాధువులతో కూడిన ప్రతినిధి బృందం తమ కఠినమైన బ్రహ్మచర్య నియమాల కారణంగా మహిళలతో పరిమితంగా మాత్రమే మాట్లాడేలా చూడాలని కోరినట్టుగా ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఈఫిల్ టవర్ యాజమాన్యం మహిళా ఉద్యోగులను వారి పనిప్రదేశాల (వర్క్‌స్టేషన్స్)నుంచి వెళ్లిపోవాలని, వారి స్థానంలో పురుష ఉద్యోగులను ఉంచాలని, కొన్ని ప్రాంతాల్లో మహిళలు కనిపించకుండా ఉండాలని సూచించినట్టు ఆరోపణలొచ్చాయి.
భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వివాదంపై స్పందించారు.
"పారిస్‌లో బీఏపీఎస్ ఆలయ ప్రారంభోత్సవం గురించి మాకు తెలుసు. అయితే ఈఫిల్ టవర్‌కు సంబంధించిన ఈ ప్రత్యేక అంశం పూర్తిగా సంబంధిత సంస్థల మధ్య వ్యవహారం'' అన్నారు.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
‘సమానత్వం, పరస్పర గౌరవం, అందరికీ సేవ’
"సాధువుల పారిస్ పర్యటనను ఈఫిల్ టవర్ యాజమాన్యంతో ముందుగానే సమన్వయం చేసుకున్నాం. ఉద్యోగులకు, ఇతర సందర్శకులకు, టవర్ సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా సాధారణ పని వేళల్లోనే ఈ పర్యటనను ప్రారంభించేలా షెడ్యూల్ చేశాం" అని బీఏపీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
"టవర్ కార్యకలాపాలు, ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ సమన్వయం జరిగింది. పెద్దసంఖ్యలో ఉన్న బృందం టవర్ ఉద్యోగులకు లేదా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సులభంగా సందర్శించగలిగేలా చూడటమే దీని లక్ష్యం. లింగ వివక్షకు పాల్పడేలా ఏ దశలోనూ ఎలాంటి అభ్యర్థనలు చేయలేదు.
దీనికి విరుద్ధంగా ఎవరైనా చేసే వ్యాఖ్యలు మా సంస్థ లేదా మా ప్రతినిధి బృందం విలువలు, ఆలోచనావిధానాన్ని ప్రతిబింబించవు'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.
లింగం, హోదా, లేదా విశ్వాసంతో సంబంధం లేకుండా సమానత్వం, పరస్పర గౌరవం, అందరికీ సేవ అనే సూత్రాలకు బీఏపీఎస్ పూర్తిగా కట్టుబడి ఉందని ఆ ప్రకటన పేర్కొంది.
తమ సంప్రదాయ బోధనలకు ఇవే కీలకమైన విలువలని, ప్రపంచవ్యాప్తంగా తమ సామాజిక సేవాకార్యక్రమాల్లో కూడా ఇవి ప్రతిబింబిస్తాయని తెలిపింది.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
ఇతర శాఖలతో పోలిస్తే విభిన్నంగా ఉండడానికి...
మహిళల ప్రవేశాన్ని పరిమితం చేయడం లేదా వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం బీఏపీఎస్ సంప్రదాయాన్ని అనుసరించేవారికి కొత్త విషయమేమీ కాదు.
ఉదాహరణకు సామాజిక శాస్త్రవేత్త గౌరంగ్ జానీ తల్లి స్వామినారాయణ భక్తురాలు. ఆమె ప్రతిరోజూ ఆలయానికి వెళ్లేవారు. జానీ గుజరాత్ విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్ర విభాగం అధిపతిగా పనిచేసి రిటైర్ అయ్యారు.
తన తల్లికి అందరిలాగే స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదని, స్త్రీలను ఆలయంలోకి అనుమతించినప్పటికీ వారిని ఎలప్పుడూ పురుషుల నుంచి వేరుగా ఉంచేవారని ఆయన చెప్పారు.
"మతం విషయానికి వస్తే మహిళలు ఇలాంటి ఆచారాలను దేవుడి ఆదేశాలుగా భావించి అంగీకరించారని సామాజిక చరిత్ర గమనిస్తే అర్ధమవుతుంది.
మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలను ప్రశ్నించకూడదని మనకు చిన్నప్పటినుంచే బోధిస్తారు.
అందువల్ల క్రమంగా ఈ ఆచారం స్వామినారాయణ ఆలయాల్లో కూడా విస్తృతంగా ఆమోదం పొందింది. ఈ ఆలయాలకు క్రమం తప్పకుండా పెద్ద సంఖ్యలో మహిళలు దర్శనం కోసం వస్తుంటారు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
భక్తులను ఆకర్షించేందుకు పోటీపడుతున్న ఇతర మత సంప్రదాయాలకు తమను భిన్నంగా చూపించుకోవడంలో భాగంగానే బ్రహ్మచర్యానికి సంబంధించి కఠినమైన నియమాలను ఈ సంప్రదాయం పాటించిందని దీనిపై పరిశోధన చేసిన జానీ అభిప్రాయపడ్డారు.
''ఈ శాఖ వైష్ణవ శాఖవంటి ఇతర హిందూ మత శాఖలతో పోటీపడాల్సివచ్చింది. వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు. అందుకే తమను ఇతరుల నుంచి భిన్నంగా చూపించుకోడానికి కఠినమైన బ్రహ్మచర్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ శాఖలో సాధువులుగా మారాలనుకునేవారు బ్రహ్మచర్యాన్ని పాటించేలా ప్రోత్సహించడం మొదలుపెట్టారు'' అని జానీ చెప్పారు.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
స్వామినారాయణ శాఖ ఎలా ప్రారంభమైంది?
స్వామినారాయణ శాఖ 19వ శతాబ్దం ప్రారంభంలో పశ్చిమ భారతదేశంలో ఆవిర్భవించింది. దీని వ్యవస్థాపకుడైన స్వామినారాయణ్ 1781లో ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని ఛపయ్య గ్రామంలో జన్మించారు.
ఏడేళ్లపాటు భారత్ అంతా పర్యటించిన తరువాత ఆయన గుజరాత్‌కు వచ్చి 1801లో ఈ శాఖను ప్రారంభించారు.
అణగారినవర్గాల ప్రజలను ఆకర్షించడానికి ఈ శాఖను ప్రారంభించారు. తర్వాత గుజరాత్‌కు చెందిన ప్రభావవంతమైన పటీదార్ వర్గం ఈ శాఖను పెద్ద సంఖ్యలో అనుసరించాయి. వారిలో చాలామంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వలసవెళ్లారు.
ఫలితంగా భారత్‌కు స్వాతంత్య్రం రాకముందే 1945లో నైరోబీలో ఈ శాఖలో మొదటి అంతర్జాతీయ ఆలయం నిర్మితమైంది.
''స్వామినారాయణ శాఖకు చెందిన సాధువులకు రాజకీయనాయకులతో మంచి సంబంధాలున్నాయని భావిస్తారు. ఏదైనా నగర మేయర్ నుంచి మొదలుకొని అమెరికా అధ్యక్షుని వరకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు'' అని జానీ అన్నారు.
ఈ శాఖలో అత్యంత ప్రసిద్ధ సాధువైన ప్రముఖ్ స్వామి మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఆలయాలను నిర్మించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,300ఆలయాలను ఆయన నిర్మించారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రహ్మచర్యం ఎందుకు పాటిస్తారు?
స్వామినారాయణ రచించిన 212 శ్లోకాలతో కూడిన 'శిక్షాపత్రి'లో భక్తులు, మహిళలు, బ్రహ్మచర్యాన్ని పాటించే సాధువులకు సంబంధించిన ప్రవర్తనానియమాలున్నాయి.
దీని ప్రకారం మహిళలు రుతుస్రావం సమయంలో మూడు రోజుల పాటు ఏ వ్యక్తినీ, దుస్తులను లేదా పాత్రలను తాకకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించే సాధవులు మహిళలను తాకకూడదు. వారితో మాట్లాడకూడదు. ఉద్దేశపూర్వకంగా వారివైపు చూడకూడదు.
సాధువులు ప్రాపంచికకోరికలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక సాధనపై దృష్టి పెట్టేలా చేయడమే దీని ఉద్దేశమని బీఏపీఎస్ చెబుతోంది.
అయితే ఈ ఆచారాన్ని విమర్శించేవారు మతపరమైన కారణాలున్నప్పటికీ ఒక పురుష సాధువు తీసుకున్న ప్రతిజ్ఞ భారాన్ని చివరికి మహిళలపై మోపుతున్నారని వాదిస్తున్నారు.
ఈ సంప్రదాయంలో పురుషుల భావోద్వేగాలు, నియంత్రణ సామర్థ్యాన్నే ప్రశ్నించాల్సి ఉండగా చివరికి దాని ప్రభావాన్ని మహిళలే ఎదుర్కోవాల్సివస్తోందని చాలా మంది మహిళలు అభిప్రాయపడుతున్నారు.
స్వామినారాయణ సంప్రదాయంలోని కొన్ని ఇతర శాఖలకు భిన్నంగా గుజరాత్ వడోదరలోని హరిధామ్ సోఖ్డాలో మహిళలను కూడా సన్యాస సంప్రదాయంలోకి అనుమతించే ఆచారం ఉంది.
ఈ సంస్థను దివంగత హరిప్రసాద్ స్వామి స్థాపించారు. ఆయన బీఏపీఎస్ నుంచి విడిపోయారు. అప్పటినుంచి హరిధామ్లో మహిళలు కూడా మతపరమైన సన్యాసినులుగా అంటే సాధ్విలుగా ఉంటున్నారు.
దీనిపై ఆ సంస్థ అధికార ప్రతినిధి సాధక్ స్వామితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

ఫొటో సోర్స్, Reuters
మహిళలు ఏమంటున్నారు?
సాధువులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం వల్లే తమ శాఖలో మహిళలతో ఇలా వ్యవహరిస్తున్నారని హేతువాది, సామాజిక కార్యకర్త స్వరూప్ ధ్రువ్ అభిప్రాయపడుతున్నారు.
మతాల్లో మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా రచనలు, వీధిప్రదర్శనల ద్వారా గళం వినిపిస్తున్నారు ధ్రువ్ .
మహిళల విషయంలో తమ భావోద్వేగాలను, ఆలోచనలను సాధువులు నియంత్రించుకోలేకపోతున్నారని, అందుకే వారు స్త్రీలను చూడకూడదు, తాకకూడదు, చిరవరకు మహిళల ఫోటోలను కూడా చూడకూడదనే నియమాలు పెట్టారని ఆమె అంటున్నారు. కాబట్టి సమస్య మహిళల్లో లేదని ఈ శాఖకు చెందిన సాధువుల దగ్గరే ఉందని విమర్శించారు.
జరిగిపోయింది, జరుగుతున్నది పూర్తిగా తప్పేనని ప్రముఖ సాంస్కృతిక కళాకారిణి, సామాజిక కార్యకర్త మల్లికా సారాభాయ్ కూడా అభిప్రాయపడ్డారు.
''ఒక మహిళను చూసిన తర్వాత పురుషులు తమ భావోద్వేగాలను, భావాలను నియంత్రించుకోలేకపోతే దానికి మహిళలు ఎందుకు శిక్ష అనుభవించాలి? పురుషులు కళ్ళు మూసుకోవాలి లేదా మహిళలు ఉండే ప్రదేశాలకు వెళ్ళకూడదు. నేను శాకాహారిని కాబట్టి నేను బయటకు వెళ్ళినప్పుడు నా చుట్టూ ఉన్న మాంసాహార దుకాణాలన్నింటినీ మూసివేయాలని డిమాండ్ చేయడంలాంటిదే ఇది'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, KEYSTONE-FRANCE/Gamma-Rapho via Getty Images
ఫ్రాన్స్ చరిత్ర, మహిళల హక్కులు
స్వామినారాయణ సంప్రదాయంలో మహిళలతో వ్యవహరిస్తున్నతీరుపై భారత్‌లో కొంతకాలంగా చర్చ, ఆందోళన కనిపిస్తోంది. ఇప్పుడు అదే విధానం పారిస్‌లోనూ పాటించారనే ఆరోపణలు రావడంతో అక్కడ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.
ఫ్రాన్స్‌లో మహిళల హక్కుల కోసం గళం విప్పిన బలమైన స్త్రీవాద సంప్రదాయం ఉండటం వల్లే అక్కడ ఈ విషయంపై ఎక్కువ చర్చ జరిగిందని భావిస్తున్నారు.
1791లో డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ విమెన్ అండ్ ఆఫ్ ది ఫిమేల్ సిటిజన్ అనే ప్రకటనను ప్రచురించిన ఒలింప్ డి గూజ్ వంటి బలమైన మహిళాహక్కుల ఉద్యమకారుల వారసత్వం ఫ్రాన్స్‌లో ఉంది.
మహిళలకు ఉరిశిక్ష పడే హక్కు ఉన్నప్పుడు వారికి రాజకీయ వేదికపై నిలబడే హక్కు కూడా ఉండాలని ఆమె అన్నారు.
ఆధునిక యూరప్ ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన ఆలోచనలు 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఫ్రాన్స్‌లో పుట్టాయి. అయితే ఒక శతాబ్దానికి పైగా మహిళలను రాజకీయ రంగం నుంచి క్రమపద్ధతిలో దూరం ఉంచారనే ఆరోపణలున్నాయి.
మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించడంతో కూడిన పూర్తి ప్రజాస్వామ్యం 20వ శతాబ్దం మధ్యవరకు సాధ్యం కాలేదు. ఆ తర్వాత కూడా మహిళలకు వారి శరీరాలపై హక్కులు, ఆర్థిక స్వాతంత్య్రం హక్కుల కోసం దశాబ్దాల పాటు న్యాయ పోరాటాలు జరిగాయి.
లూయిస్ వైస్ వంటి మహిళా హక్కుల ఉద్యమకారులు 1930ల్లో 'లా ఫెమ్ నోవెల్' (ది న్యూ ఉమెన్) అనే ఉద్యమాన్ని ప్రారంభించారు.
అహింసా మార్గంలో చట్టాన్ని ధిక్కరించడం, పెద్ద బహిరంగ కార్యక్రమాల్లో నిరసనలు, ప్రదర్శనలు చేయడం, పదవులు చేపట్టేందుకు చట్టపరంగా అనుమతి లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేయడంవంటి మార్గాల్లో ఉద్యమాలు చేశారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రెంచ్ ప్రతిఘటన ఉద్యమానికి మహిళలు చేసిన అపారమైన కృషిని గుర్తించి జనరల్ చార్లెస్ డి గాల్ 1940ల్లో మహిళలకు ఓటు వేసే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించే ఆదేశంపై సంతకం చేశారు.
ఫ్రాన్స్ మహిళలు 1945లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు వేశారు.
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో లింగ సమానత్వ పరిస్థితి మెరుగుపడింది.
యూరోస్టాట్ అధికారిక గణాంకాల ప్రకారం ఫ్రాన్స్ జాతీయ ప్రభుత్వంలో సీనియర్, జూనియర్ మంత్రులు సహా మహిళల ప్రాతినిధ్యం 48.6 శాతంగా ఉంది. అంటే ఇది దాదాపు పూర్తిస్థాయి లింగ సమానత్వానికి దగ్గరగా ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























