దిల్లీ: సత్యనికేతన్ మార్కెట్లో కూలిన ఐదంతస్తుల భవనం, ఇద్దరి మృతి, సాయం కోసం శిథిలాల కింద నుంచి కేకలు

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోని సత్యనికేతన్ మార్కెట్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ట్రామా సెంటర్‌కు ఏడుగురిని తీసుకువచ్చారని, వారిలో ఇద్దరు మృతి చెందారని ఎయిమ్స్ మీడియా సెల్ ఇన్చార్జ్ డాక్టర్ ప్రొఫెసర్ రీమా దాదా బీబీసీ న్యూస్ హిందీకి చెప్పారు.
మోతీ బాగ్-2 లోని శివ మందిర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
" స్థానిక విచారణలో ఆ భవనం 40-50 ఏళ్ల నాటిదని, అందులో ఒక బేస్మెంట్, ఐదు పై అంతస్తులు ఉన్నాయని వెల్లడైంది. దానిని పీజీ హాస్టల్‌గా ఉపయోగిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బేస్మెంట్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం శిధిలాల కింద గాలింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి" అని పోలీసులు తెలిపారు.
"లోపల ఉన్న కొందరు విద్యార్థులు ఫోన్లు చేస్తున్నారు. లోపల మరికొంత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది" అని ఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ చెప్పారు. దిల్లీ ప్రభుత్వం తరపున సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్ (CATS) నోడల్ అధికారి బల్రాజ్ సింగ్, ఐదుగురిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు .

ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో భవనం కూలినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
సమాచారం అందిన వెంటనే ఫైర్ బ్రిగేడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించాయని ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం తెలిపింది.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, ANI
ఈ ప్రమాదంలో ఎంతమందికి ఏం జరిగిందనేది ఇంకా అధికారికంగా తెలియలేదు.
ఘటనా స్థలానికి ఐదు ఫైర్ టెండర్లు, పోలీసు బృందాలను పంపినట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు చెప్పారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
తన స్నేహితులు చాలా మంది ఆ హాస్టల్లో ఉంటున్నారని, ప్రస్తుతం వారితో మాట్లాడలేకపోతున్నానని ఒక విద్యార్థి 'ఐఎన్ఎస్' వార్తా సంస్థకు తెలిపారు.
"మృతుల సంఖ్య సుమారు 40 వరకు ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక నిర్ధరణ లేదు" అని ఆ విద్యార్థి చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
దిల్లీ సీఎం ఏమన్నారంటే?
ఈ సంఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు
"ఆర్కే పురంలోని సత్య నికేతన్‌లో భవనం కుప్పకూలిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. డీడీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఢిల్లీ పోలీస్, ఎంసీడీ, క్యాట్స్, సివిల్ డిఫెన్స్ బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి" అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో రాశారు.
ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాన్ని ఖాళీ చేయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
"దిల్లీలోని మోతీ బాగ్ సత్య నికేతన్‌లో భవనం కూలిపోయిన వార్త అత్యంత బాధాకరం. ఆందోళనకరం. విద్యార్థులతో సహా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉండటం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది" అని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ నేత అభిషేక్ దత్ ఎంసీడీ అవినీతిపై ఆరోపణలు చేశారు.
"దిల్లీలో భవనాలు కూలిపోవడం, పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళనకరం. ప్రభుత్వం విద్యార్థులకు, వారి కుటుంబాలకు వీలైనంత త్వరగా సహాయం అందించాలి" అని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, ANI
'శిథిలాల కింద విద్యార్థులు, కార్మికులు'
భవనం కూలిపోయిన సమయంలో ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించింది.
పేలుడు వంటి శబ్దం వినబడగానే ప్రజలు బయటకు పరుగులు తీశారని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన విద్యార్థి ఒకరు ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
"హఠాత్తుగా భూకంపం వచ్చినట్లు శబ్దం వచ్చింది. మేం వెంటనే బయటకు పరిగెత్తాం. అంతటా దట్టమైన పొగ, ధూళి అలుముకున్నాయి. భవనం మొత్తం కుప్పకూలిపోయింది" అని ఆయన చెప్పారు.
"శిథిలాల లోపలి నుంచి ఇప్పటికీ కేకలు వినిపిస్తున్నాయి. 'మమ్మల్ని కాపాడండి, కాపాడండి!' అంటూ పిల్లలు అరుస్తున్నారు. లోపల కనీసం 25-30 మంది పిల్లలు ఉండవచ్చు. పక్కనే బాయ్స్, గర్ల్స్ పీజీలు ఉన్నాయి. నలుగురైదుగురిని రక్షించారు. వారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, శ్వాస తీసుకుంటున్నారు" అని ఆ విద్యార్థి చెప్పారు.
ఈ భవనం బేస్మెంట్లో మరమ్మతులు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు
"ఈ భవనాలను 100 ఏళ్ల లీజుకు ఇచ్చారు. తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వారు బేస్మెంట్లను నిర్మిస్తున్నారు. పైన భవనాన్ని బలంగా నిర్మించారు కానీ కింది పిల్లర్లు బలహీనంగా ఉన్నాయి. దీనివల్లే భవనం కూలిపోయింది" అని ఆ విద్యార్థి అన్నారు.
"బేస్మెంట్లో కొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు. భవనం ముందు పండ్లు తదితర వస్తువులు అమ్ముకునే వీధి వ్యాపారులు కూడా శిథిలాల కింద చిక్కుకున్నారు" అని ఆ విద్యార్థి తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
"బాధ్యులపై చర్యలు తీసుకోవాలి"
కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
దిల్లీ యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులు ఈ భవన శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని ఎన్ఎస్యూఐ ఆందోళన వ్యక్తం చేసింది.
"దిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో భవనం కుప్పకూలిన వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డీయూ విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం వస్తోంది" అని ఎన్ఎస్యూఐ తన ఎక్స్ ఖాతాలో మెసేజ్ పోస్ట్ చేసింది.

ఫొటో సోర్స్, ANI
అభిజీత్ దీప్కే ఏమన్నారంటే..
ఈ ఘటన జరిగిన వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన ఒక వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు.
"శిథిలాల కింద విద్యార్థులు చిక్కుకున్నారు. స్థానిక ప్రజలు తమ చేతులతోనే వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులెవరూ కంటికి కనిపించడం లేదు. ప్రాణాలు కాపాడటానికి ప్రతి నిమిషం ఎంతో విలువైనదైనప్పుడు, యంత్రాంగం ఎక్కడ ఉంది? ఇదంతా ఇంకెంత కాలం సాగుతుంది?" అని ఆయన ఆ వీడియోలో ప్రశ్నించారు.
మరొక పోస్ట్‌లో అభిజీత్ "నిన్ననే ప్రధాని డీయూని సందర్శించి రాజకీయ ప్రసంగం చేశారు, 'మెంటల్ నక్సల్స్' అనే పదాన్ని కూడా వాడారు, కానీ మన విద్యా వ్యవస్థ దుస్థితి గురించి తక్కువ మాట్లాడారు. ఈ రోజు సౌత్ క్యాంపస్‌లో ఒక హాస్టల్ భవనం కూలిపోయింది. విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నారని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా తెలియదు" అని పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























