సరస్సులో దొరికిన ఆ పాత తుపాకీ 14ఏళ్ల కిందటి మర్డర్ మిస్టరీని విప్పుతుందా..

అన్నెసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అన్నెసీ సరస్సు (ఫైల్ ఫోటో)
    • రచయిత, హ్యూ షొఫీల్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఫ్రాన్స్‌లో 14 ఏళ్ల కిందట, బ్రిటన్‌కు చెందిన ఓ కుటుంబం హత్యకు గురైంది. ఆ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే ఘటనాస్థలికి సమీపంలోని సరస్సులో ఓ లూగర్ (ఒక మోడల్) పిస్టల్ లభించడంతో అనూహ్యంగా ఈ కేసుకు సంబంధించి కొత్త క్లూ దొరికినట్లైంది.

సాద్ అల్-హిల్లీ, ఆయన భార్య, అత్త సహా ఓ సైక్లిస్ట్ హత్యలకు సంబంధించి తేలింది ఏంటంటే.. వారందరినీ లూగర్ మోడల్ పీ06 పిస్టల్‌తో కాల్చి చంపారు. 1960ల వరకు ఈ మోడల్‌ని స్విట్జర్లాండ్ ఆర్మీ ఉపయోగించింది.

2012 సెప్టెంబర్‌లో ఈ హత్యలు జరిగాయి. ఘటనాస్థలికి కొద్ది దూరంలోనే ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని అన్నెసి సరస్సులో దొరికిన ఈ పిస్టల్.. లూగర్ బ్రాండ్‌ అని ఫ్రాన్స్‌కు చెందిన కోల్డ్ కేస్ యూనిట్ నిర్ధరించింది.

ఈ వార్తను తొలిసారి బయటపెట్టిన మారియాన్ మ్యాగజీన్ ప్రకారం.. ఆగస్టు 20న, సరస్సులో 2 మీటర్ల లోతులో బ్రిటిష్ యాత్రికులకు ఈ ఆయుధం లభించింది.

మొదట అదో వాటర్ పిస్టల్ అని వాళ్లు భావించారు. కానీ, దాని బరువును చూశాక తాము పొరబడినట్లు తెలుసుకున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అల్-హిల్లీ కుటుంబ హత్యలు

ఫొటో సోర్స్, Central News and Pictures

ఫొటో క్యాప్షన్, సాద్ అల్-హిల్లీ

ఓ క్యాంపింగ్ సైట్ దగ్గర ఈ తుపాకీని గుర్తించారు. హత్యకు గురైన అల్ హిల్లీ తన కుటుంబంతో కలిసి క్యారవాన్‌లో ఉన్నది అక్కడేనని మారియాన్ పత్రిక నివేదించింది.

ఇంతకాలం పాటు నీటిలో ఉన్నందువల్ల పిస్టల్ బాగా పాడైపోయింది. అది నిజంగా పీ06 మోడలేనా? కాదా? అని నిర్ధరించేందుకు ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు దాన్ని పరిశీలిస్తున్నారు.

దాదాపు 60వేల లూగర్ పీ06లను తయారు చేసి ఉంటారని అంచనా. అయితే అన్ని రకాల లూగర్ పిస్టల్స్ కలిపి 30 లక్షల వరకు ఉండొచ్చు.

ఫ్రాన్స్, యూకేలలో విస్తృతంగా చేపట్టిన దర్యాప్తులలో అల్ హిల్లీ హత్యలను ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు పోలీసులకు ఇప్పటికీ సమాధానం దొరక లేదు.

ఇనేళ్లుగా పలు లీడ్‌లతో దర్యాప్తును మొదలుపెట్టినా మధ్యలోనే అవి ఆగిపోయేవి.

ఇరాక్‌లో జన్మించిన బ్రిటిష్ పౌరుడైన సాద్ అల్-హిల్లీ సెలవుల్లో సరదాగా గడపడానికి తన కుటుంబంతో కలిసి తూర్పు ఫ్రాన్స్‌లోని లేక్ అన్నెసికి వచ్చారు.

సెప్టెంబర్ 5 మధ్యాహ్నం.. షెవలీన్ గ్రామానికి సమీపంలో ఓ రోడ్డుపై కారులో.. సాద్ అల్-హిల్లీ, ఆయన భార్య, అత్త చనిపోయి కనిపించారు. ఆ సమయంలో కారు ఇంజిన్ నడుస్తూనే ఉంది. అటుగా వెళ్తున్న ఓ సైక్లిస్ట్‌ని కూడా వారిలాగే కాల్చి చంపారు.

అయితే.. నాలుగు, ఏడేళ్ల వయసున్న అల్ హిల్లీ కూతుళ్లిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో పెద్ద అమ్మాయిని పిస్టల్ వెనుక భాగంతో కొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఘటన జరిగిన చాలా గంటల తర్వాతే, ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తున్న సమయంలో తల్లి దుస్తుల చాటున ఉన్న చిన్న పాపను గుర్తించారు.

పిస్టల్ వెనుక భాగంలోని ముక్కల ఆధారంగా అది లూగర్ పీ06 అని పోలీసులు గుర్తించగలిగారు. ఈ మోడల్‌ను వాడకంకన్నా, కలెక్షన్ వస్తువుగా ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఆ కుటుంబంపై జరిగింది ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసిన దాడి అన్నది నిజం కాకపోవచ్చన్న అనుమానం బలపడింది.

స్విట్జర్లాండ్‌కి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే అన్నెసి సరస్సు ఉంది. అక్కడి వృద్ధులకు వారు గతంలో అందించిన మిలటరీ సేవల కారణంగా ఈ ఆయుధం గురించి పరిచయం ఉండే అవకాశం ఉంది. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న కుటుంబాల దగ్గర ఎక్కువగా ఈ తుపాకులు ఉంటాయని ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు.

ఈ హత్యల వెనుక రకరకాల ఊహాగానాలు వినిపించాయి. డబ్బు విషయంలో కుటుంబంలో జరిగిన గొడవలే దీనికి కారణమని కొందరు; ఎలాంటి ఉద్దేశంలేని ఒక సైకో చేసిన పని అని మరికొందరు; సైకిల్ తొక్కే వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ హత్యలు చేశారని ఇంకొందరు భావించారు.

ఫ్రాన్స్‌లో ఈ దారుణ హత్యలు జరగడానికి కొన్ని గంటల ముందే, అల్-హిల్లీ భార్య మొదటి భర్త (ఒక అమెరికన్) గుండెపోటుతో మరణించిన విషయం కూడా కొంతకాలం పాటు పోలీసులలో తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)