గుంటూరు: చిన్నాన్న చనిపోయాడని 20 ఏళ్ల తరువాత వచ్చి, భార్యాబిడ్డల కళ్లెదుటే హత్యకు గురయ్యాడు

గుంటూరు, హత్య

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మృతుడు చిన్నా
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

(ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచేవేయొచ్చు)

తన తండ్రిని హత్య చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని 20 ఏళ్ల తర్వాత కాపుకాసి హత్య చేసిన ఘటన గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌ సీఐ రాజేష్‌, మృతుడు చిన్నా కుటుంబసభ్యులు బీబీసీకి వెల్లడించిన వివరాల ప్రకారం..

‘‘గుంటూరు నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన పెండ్ర వెంకన్న అలియాస్‌ చిన్నా ఇరవై ఏళ్ల కితం స్థానికంగా నివసించేవారు.

అదే కాలనీకి చెందిన బుల్లయ్యతో చిన్నాకు వ్యక్తిగత కారణాల వల్ల ఘర్షణలు ఏర్పడ్డాయి. ఆ నేపథ్యంలోనే 2006లో బుల్లయ్య హత్యకు గురికావడంతో చిన్నాపై అనుమానం ఉండేది.

పోలీసులు చిన్నాపై కేసు నమోదు చేశారు. కానీ ఆ కేసు కోర్టులో వీగిపోవడంతో చిన్నా బయటకు వచ్చేశారు’’

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'బుల్లయ్య కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి గుంటూరు నుంచి మంగళగిరికి వెళ్లిపోయారు చిన్నా.

ఊరు దాటినా బుల్లయ్య కుటుంబ సభ్యులు తనను వదలరని భయపడి తెలంగాణలోని సూర్యాపేటకి మకాం మార్చారు.

దాదాపుగా ఇరవై ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు' అని సీఐ రాజేశ్ చెప్పారు.

‘బంధువులు ఫోన్ చేస్తే వచ్చాం’

ఈ క్రమంలో ఆగస్ట్ 29 శనివారం గుంటూరు కొండా వెంకటప్పయ్య కాలనీలో ఉండే తన బాబాయి (చిన్నాన్న) చనిపోయినట్లు సమాచారం రావడంతో చిన్నా తన భార్యాబిడ్డలతో సహా అక్కడికి వచ్చారు.

'సొంత బాబాయి చనిపోయాడని ఫోన్‌ వస్తే మేం సూర్యాపేట నుంచి శనివారం గుంటూరు వచ్చాం. నాది సూర్యాపేట. పెళ్లయినప్పటి నుంచి సూర్యాపేట దాటి రాలేదు. సొంత బాబాయి చనిపోయాడని బంధువులు ఫోన్‌ చేస్తే వచ్చి నా భర్త అన్యాయమైపోయాడు' అని చిన్నా భార్య వెంకటమ్మ బీబీసీతో అన్నారు.

పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హత్య కేసు వివరాలను మీడియాకి వెల్లడిస్తున్న పోలీసులు

'పిల్లల కళ్ల ముందే చంపేశారు'- చిన్నా భార్య వెంకటమ్మ

తాము వస్తున్నామన్న సమాచారం తెలుసుకున్న బుల్లయ్య కుటుంబ సభ్యులు కాపు కాసి ఆదివారం ఉదయం చిన్నాను హత్య చేశారని ఆయన భార్య వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజేశ్‌ తెలిపారు.

తాను చూస్తుండగానే తన పిల్లల కళ్ల ముందే తన భర్తను చంపేశారని చిన్నా భార్య వెంకటమ్మ బీబీసీతో అన్నారు.

'ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట ఏదో జరిగింది. అందులో ఈయన పాత్ర లేదని కోర్టు కొట్టేసింది. బయటకి వచ్చిన తర్వాత సెటిల్‌మెంట్‌ కూడా జరిగిందని మా ఆయన చెప్పేవారు. అప్పటి గొడవలు ఇక ఉండవనుకున్నాడు. ఇంతలో ఆదివారం ఉదయం బయటకు వెళ్లారు. మూడు బండ్ల మీద వచ్చి హత్య చేశారు. నేను, పిల్లలు వద్దని ఏడుస్తున్నా కనికరించలేదు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హత్య తర్వాత ప్రధాన నిందితుడు బుల్లయ్య కుమారుడు ఇమ్మాన్యుయేల్ రాజు సహా 11 మంది నిందితులు లొంగిపోయారని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని సీఐ రాజేశ్‌ చెప్పారు.

చనిపోయిన తండ్రి బుల్లయ్య ఫొటో ఇంట్లో ఎదురుగా పెట్టుకుని దాన్నే నిత్యం చూస్తూ కుమారుడు ఇమ్మాన్యుయేల్ పగతో రగిలిపోయే వాడని తమ విచారణలో తెలిసిందని పోలీసులు చెప్పారు.

హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న బుల్లయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసింది బీబీసీ.

అయితే నిందితులు 11 మంది రిమాండ్‌లో ఉండటం, బుల్లయ్య కుటుంబ సభ్యులు చాలా మంది పరారీలో ఉండడంతో ఎవరూ అందుబాటులోకి రాలేదు.

వారి తరఫు లాయర్‌తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. నిందితుల తరఫున ఎవరైనా అందుబాటులోకి వస్తే వారి స్పందన ఈ కథనంలో అప్‌డేట్‌ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)