పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం.. కానీ ఈ ఏడాది పొలాలకు సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదంటే?

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రకాశం, చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది కూడా చంద్రబాబునాయుడే.

1996 మార్చిలో వెలిగొండకు శంకుస్థాపన చేసిన ఆయనే ముప్పై ఏళ్ల తర్వాత 2026లో ప్రాజెక్టు ఫేజ్‌–1కు ప్రారంభోత్సవం చేశారు. ఈ మేరకు ప్రాజెక్ట్‌ ఫీడర్‌ కెనాల్‌ వద్ద గేట్లు ఎత్తి నీటిని నల్లమల సాగర్‌కి విడుదల చేశారు.

సీఎం బాబు స్థానిక రైతులతోనే బటన్‌ నొక్కించి గేట్లు ఎత్తించారు. ఈ సందర్భంగా జలహారతి ఇచ్చిన అనంతరం కెనాల్‌ ఒడ్డున కృష్ణానదికి చంద్రబాబు సాష్టాంగ ప్రణామం చేశారు.

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులోకి కృష్ణా జలాలు ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి తనకు ఎంతో సంతృప్తినిచ్చిందనీ అన్నారు.

గత 30 ఏళ్లలో రెండుసార్లు శంకుస్థాపనలు, రెండుసార్లు ప్రారంభోత్సవాలు జరుపుకున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, వాస్తవ పరిస్థితులను విశదీకరిస్తూ ఇప్పటికే బీబీసీ పలుమార్లు కథనాలను ప్రచురించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరికి నీళ్లు అందేది?

ఫేజ్‌–1 అంటే ప్రాజెక్టు ఉన్న మార్కాపురం జిల్లాతో పాటు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలోని లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. నాలుగులక్షలమంది ప్రజలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

వాస్తవానికి ప్రాజెక్టు పూర్తి లక్ష్యం మార్కాపురం, ప్రకాశం జిల్లాలతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని 4లక్షల 47వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 16లక్షలమంది ప్రజలకు తాగునీరు అందించడం.

అయితే సోమవారం ప్రారంభించిన తొలిదశలో కూడా ఈ ఏడాదికి సాగునీరు ఇవ్వలేమని, తాగునీరు ఇచ్చే అవకాశం మాత్రమే ఉందని, డెడ్‌ స్టోరేజీని నింపడమే ప్రధాన లక్ష్యమని వెలగొండ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కృష్ణారెడ్డి, మార్కాపురం జిల్లా కలెక్టర్‌ విజయ సునీత బీబీసీకి తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టు
ఫొటో క్యాప్షన్, ప్రాజెక్టు ఈఈ కృష్ణారెడ్డి

డెడ్‌ స్టోరేజీలో 10.7 టీఎంసీల నీటి నిల్వ లక్ష్యం

నల్లమల జలాశయం సామర్ధ్యం 53.8 టీఎంసీలు కాగా. ఈ ఏడాదికి మొదటి విడతగా 10.7 టీఎంసీల నీటిని నిలవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రాజెక్టు ఈఈ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు రోజుకి 5వేల నుంచి 6వేల క్యూసెక్కుల నీటిని వదులుతూ.. మొత్తంగా 25 రోజుల్లో ప్రాజెక్టు జలాశయంలో డెడ్‌ స్టోరేజీ 10.7 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేస్తామని చెప్పారు.

‘‘డెడ్‌ స్టోరేజీ నిల్వ తర్వాత ఈ ఏడాది ఎల్‌నినో ఎఫెక్ట్‌ వల్ల కేవలం తాగునీటికి మాత్రమే నీరు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఏడాది అంతా అనుకూలిస్తే సాగునీటికి కూడా విడుదల చేస్తాం’’ అని కృష్ణారెడ్డి బీబీసీకి తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టు
ఫొటో క్యాప్షన్, మార్కాపురం జిల్లా కలెక్టర్‌ విజయసునీత

ఇది ట్రయల్‌ మాత్రమే: కలెక్టర్‌

‘‘ఇప్పుడు ప్రాజెక్ట్‌ ఫేజ్‌1 మొత్తంగా ప్రారంభం కాలేదు. సోమవారం మొదలైంది జస్ట్‌ లైక్‌ ట్రయల్‌ మాత్రమే’’ అని మార్కాపురం జిల్లా కలెక్టర్‌ విజయసునీత బీబీసీతో అన్నారు. దీని వల్ల ముందు గ్రౌండ్‌ వాటర్‌ స్థాయి పెరుగుతుందని, ఆ తర్వాత క్రమక్రమంగా తాగునీటికి విడుదల చేస్తామని, ఆ తర్వాత సాగునీటికి కేటాయిస్తామని, దశల వారీగా ఫేజ్‌–1 లక్ష్యాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని ఆమె తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్ట్

కాలువల పనులు పూర్తి కాలేదా?

మరోవైపు పొలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందకపోవడానికి ప్రధాన కాలువల కింద పంపిణీ (డిస్ట్రిబ్యూషన్‌) నెట్‌వర్క్‌ పనులు, కాలువల తవ్వకాలు ఇంకా పూర్తికాకపోవడం కూడా ఓ కారణమని జలవనరుల శాఖ అధికారులు బీబీసీకి తెలిపారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ లోకి నీటిని తరలించే ఫీడర్‌ కెనాల్, హెడ్‌ రెగ్యులేటర్, టన్నెల్‌ పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రస్తుతం టన్నెళ్ల ద్వారా కృష్ణా జలాలు రిజర్వాయర్‌కు చేరుకుంటున్నాయి. ఇలా రిజర్వాయర్‌ నింపే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఆ రిజర్వాయర్‌ నుండి సాగునీటిని తీసుకెళ్లాల్సిన తీగలేరు కాలువ, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కాలువలకు సంబంధించిన అంతర్గత పంపిణీ (కెనాల్‌) పనులు ఇంకా ముగింపు దశలోనే ఉన్నాయి. అందుకే ప్రస్తుత ప్రాధాన్యత నల్లమల సాగర్‌లో కేవలం నీటిని నిల్వ చేయడమేనని అధికారులు బీబీసీకి తెలిపారు. నీరు పూర్తిస్థాయిలో ఆయకట్టు రైతులకు చేరడానికి పంపిణీ కాలువల పనులు పూర్తి కావాలని అధికారులు బీబీసీకి వెల్లడించారు.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రకాశం, చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, I&PR. AP

ముప్పై ఏళ్లుగా ప్రాజెక్టు పనులు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టుకు 1996 మార్చ్ 5న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

ఆ తర్వాత 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు.

30 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతూ వచ్చింది. కరవు పీడిత పశ్చిమ ప్రకాశానికి జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవాంతరాలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయి.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఎప్పుడు ఏ దశలో ఉందనే దాని మీద బీబీసీ గతంలో కథనాలు ప్రచురించింది. ప్రాజెక్టు నిర్మాణం గురించి స్థూలంగా ఒక అవగాహన అందించే ఈ కథనాలను మీ పరిశీలన కోసం బీబీసీ మీ ముందుకు తెస్తోంది.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రకాశం, చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో మొదటి టన్నెల్ పూర్తైన తర్వాత 2021 ఫిబ్రవరి 6న బీబీసీ ఈ కథనం ప్రచురించింది.

జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో తొలి టెన్నెల్ పనులను 2008లో వై.ఎస్.ఆర్. ప్రారంభించారు.

ఆ తర్వాత 2009లో నాటి జలవనరుల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రెండో టన్నెల్ పనులకు శంకుస్థాపన చేశారు.

మొదటి టన్నెల్ పూర్తి కావడంతో రెండో టన్నెల్ నిర్మాణం పూర్తి చేయడంపై శ్రద్ధ పెడుతున్నామని అప్పటి ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి బీబీసీతో అన్నారు.

మొదటి టన్నెల్ పూర్తైన తర్వాత బీబీసీ అందించిన పూర్తి కథనాన్ని మీరు ఈ లింక్ ఓపెన్ చేయడం ద్వారా చదవవచ్చు.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రకాశం, చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం

2021 జులై 24వ తేదీన హెడ్ వర్క్స్ దగ్గర లీకేజీ కారణంగా సుమారు వెయ్యి క్యూసెక్కుల వరకు కృష్ణా జలం వెలిగొండ మొదటి టన్నెల్‌లోకి ప్రవేశించింది.

ప్రాజెక్టు మొదటి టన్నెల్ గుండా కృష్ణా నీరు ప్రవహించడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

దాదాపుగా ట్రయల్ రన్‌తో సమానంగా ఇది ఉందని అధికారులు కూడా అంగీకరించారు.

దీనిపై బీబీసీ అందించిన కథనం ఇక్కడ చూడవచ్చు

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రకాశం, చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం

ఒక టన్నెల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే ప్రయత్నం మాత్రం జరగలేదని చెబుతూ బీబీసీ 2022 మార్చ్ 29న కథనం ప్రచురించింది.

2020 డిసెంబర్ నాటికే ఒక టన్నెల్ పూర్తికావడంతో 2021 ఖరీఫ్‌ నాటికి నీటిని విడుదల చేస్తారని చాలామంది ఆశించారు. కానీ అది జరగలేదు.

టన్నెల్ అందుబాటులోకి వచ్చింది. ఫీడర్ చానెళ్లు సిద్ధమయ్యాయి. డ్యామ్ కూడా రెడీగా ఉంది. కానీ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ అందించకపోవడంతోనే నీటిని నిల్వ చేసే అవకాశం లేకుండా పోయిందని బీబీసీ కథనంలో పేర్కొంది.

ఆ కథనాన్ని మీరు ఈ లింక్‌లో చూడవచ్చు.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రకాశం, చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి, రైతులకు నీళ్లు అందిస్తామని 2020లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

ఆ తర్వాత, 2022 ఆగస్టు నాటికి అంటూ పొడిగించారు. చివరకు 2023 ఖరీఫ్ సమయానికి వెలిగొండ కాలువల్లో నీళ్లు పారిస్తామని చెప్పారు.

ఇన్ని గడువులు ముగిసినా 2024 నాటికి కూడా ఇచ్చిన మాట నెరవేరలేదు.

రెండు టన్నెళ్ల తవ్వకాలు పూర్తయ్యాయి. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ కార్యక్రమం కూడా నిర్వహించారు.

కానీ, ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తే తమ పొలాలు సాగు చేసుకోవచ్చని ఆశిస్తున్న రైతులకు మాత్రం ఇంకా ప్రయోజనం దక్కలేదని చెబుతూ బీబీసీ రాసిన కథనం 2024 మార్చ్ 12న ప్రచురితమైన కథనాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రకాశం, చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి 30 ఏళ్లైన సందర్భంగా బీబీసీ మరో కథనం అందించింది.

ఈ ఏడాది జులై నెలాఖరు లేదా ఆగస్ట్ నాటికి కనీసం ప్రాజెక్ట్‌ తొలిదశ పూర్తి చేసి నీళ్లు విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో బీబీసీ ప్రతినిధి బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రౌండ్ రిపోర్ట్ అందించింది.

ఈ నేపథ్యంలో అసలు అక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటి? క్షేత్ర స్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయి? ప్రభుత్వం పెట్టుకున్న ఫేజ్‌–1 లక్ష్యసాధనకు మరో ఆరు నెలలే గడువు ఉన్న నేపథ్యంలో ఇంకా చేపట్టాల్సిన పనులు ఏమిటి? అంటూ 2026 ఫిబ్రవరి 12న బీబీసీ తెలుగు అందించిన కథనం ఇది.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రకాశం, చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం, వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డి

ఫొటో సోర్స్, X/YSR Congress Party

వైసీపీ అధినేత జగన్ ఏమన్నారు?

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులోకి కృష్ణా జలాలు ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.

తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు నెరవేరడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)