షార్క్‌ దాడి:‘‘అప్పుడు నాకు డైనోసార్‌తో పోరాడుతున్నట్లు అనిపించింది’’ అంటూ గుర్తు చేసుకున్న మహిళ

ఆస్ట్రేలియా, షార్క్ చేప, లియా స్టీవర్ట్, సిడ్నీ బీచ్

ఫొటో సోర్స్, Supplied

ఫొటో క్యాప్షన్, సిడ్నీలోని కూజీ బీచ్‌లో లియా స్టీవర్ట్‌ను సొరచేప తీవ్రంగా గాయపరిచింది. (ఫైల్ ఫోటో)
    • రచయిత, లానా లామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

సిడ్నీకి చెందిన ఓ మహిళ తాను షార్క్‌తో పోరాడిన అనుభవాన్ని వివరించారు.

నాలుగు మీటర్ల పొడవైన గ్రేట్ వైట్ షార్క్‌ను తాను ఎదుర్కొన్న సమయంలో, తనను వదిలిపెట్టడానికి దానికి పదే పదే పిడికిలితో పంచ్‌లు ఇవ్వాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.

లియా స్టీవర్ట్ (34) ఈ యేడాది జూన్‌లో కూజీ బీచ్‌లో ఈత కొడుతుండగా షార్క్ చేప ఆమె తొడను, చేతులను పట్టుకుని నీటిలోకి లాకెళ్లే ప్రయత్నం చేసింది.

ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు, రక్తస్రావం‌ జరిగాయి. డాక్టర్లు ఆమె ఎడమ చెయ్యిని తొలగించాల్సి వచ్చింది.

ఒక బిడ్డకు తల్లినైన తాను ఆ బిడ్డకోసం బతకాలనే ఉద్దేశంతోనే గట్టిగా పోరాడానని ఆమె ఆదివారం నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

‘‘షార్క్ గురించి నా మనసులో ఒకటే అనుకున్నా. 'నువ్వు నా కూతురు నుంచి నన్ను దూరం చేయలేవు' అని. అందుకే అది దాడి చేయగానే దానికి పంచ్‌లు ఇవ్వడం మొదలుపెట్టా. ఆ పోరాటం అచ్చం డైనోసార్‌తో పోరాడినట్టే ఉంది’’ అని ఆమె చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దాడికి కొన్నిక్షణాల ముందు, ఆమె బీచ్‌లో ఈతకొట్టి తిరిగి వస్తుండగా వెనక నుంచి ఎవరో చిన్నపిల్ల అరిచినట్లు అనిపించిందని గుర్తు చేసుకున్నారు.

"వెనక్కి తిరిగి చూసా. నా వెనక ఒక భారీ ఫిన్ (చేపలకు ఉండే రెక్క) కనిపించింది. అది చాలా పెద్దగా ఉంది’’ అని ఆమె నైన్ నెట్‌వర్క్‌ ప్రసారం చేసే 60 మినిట్స్ కార్యక్రమంలో చెప్పారు.

‘‘దాని సైజును చూసి అది డాల్ఫిన్ కాదని అర్థం చేసుకున్నా. అది నేరుగా నా దగ్గరికి వస్తోంది, అలా దగ్గరకు వస్తూనే ఉంది’’ అని లియా చెప్పారు.

ఆస్ట్రేలియా, షార్క్ చేప, లియా స్టీవర్ట్, సిడ్నీ బీచ్

ఫొటో సోర్స్, Corbis via Getty Images

ఫొటో క్యాప్షన్, 2026 జనవరి 22న సిడ్నీ బీచ్‌లో షార్క్ చేపలు దాడి చేయడంతో బీచ్‌ను మూసేస్తున్నట్లు బోర్డు పెట్టారు.

నల్లని చిన్న కళ్లు, భీకరమైన దాని నోరు, పళ్లతో షార్క్ ముఖం భయంకరంగా ఉందని లియా గుర్తు చేసుకున్నారు. ‘‘ఒక షార్క్‌ను చాలా దగ్గరగా చూశా ’’ అన్నారామె.

ఎడంచేతి వాటం వ్యక్తిని కావడంతో ఎడం చేత్తో దాన్ని నెట్టబోయానని, కానీ అది తన చేతిని చీల్చేసిందని లియా చెప్పారు.

‘‘నా చేతిని పట్టుకుని చర్మం, కండరాలు, అన్నింటినీ చీల్చేసింది. ఆ తర్వాత నా కాలు పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లడం మొదలుపెట్టింది. ఇక నేను చనిపోవడం ఖాయం అనుకున్నా. వెంటనే నా కూతురు గురించి ఆలోచించడం మొదలుపెట్టా. తల్లిలేని పిల్ల ఎలా పెరుగుతుందోనని ఆందోళన కలిగింది’’ అంటూ కన్నీళ్లతో వివరించారు లియా.

‘‘నా కూతురును ఒంటరిగా వదిలేసి వెళ్లే ప్రసక్తే లేదు అనుకున్నా. ఈ మాటలు మీకు వింతగా అనిపించవచ్చు. కానీ, నన్ను నేను తిరిగి బతికించుకున్నట్లే అనిపించింది’’ అన్నారామె.

షార్క్‌తో పోరాడటం ఒక గోడను ఢీకొడుతున్నట్లుగా, డైనోసార్‌తో పోరాడుతున్నట్లుగా అనిపించిందని, అయినా తాను ఆ పోరాటం ఆపలేదని ఆమె గుర్తు చేసుకున్నారు.

‘‘నేను చివరిసారిగా ఒక గట్టి పంచ్ ఇచ్చాను. దాంతో అది నన్ను వదిలేసింది. అలా బయటపడ్డా" అని ఆమె వివరించారు.

తర్వాత చుట్టుపక్కల ఉన్న ఈతగాళ్లు ఆమెను తీరానికి చేర్చారు. ఆమెకు కనీసం 10 సర్జరీలు చేయాల్సి వచ్చింది.

ఈ భయానక అనుభవం తర్వాత తనను బీచ్‌లో షార్క్ దాడికి గురైన మహిళగా గుర్తించడానికి ఆమె ఇష్టపడటం లేదు.

‘‘నేను షార్క్‌ను ఢీకొట్టిన మహిళను’’ అని ఆమె గర్వంగా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)