ఇండోనేషియా: బద్దలైన అగ్నిపర్వతం, 50 వేల అడుగులకు ఎగసిన బూడిద, చిక్కుకుపోయిన లక్షన్నరమంది ప్రయాణికులు

ఫొటో సోర్స్, EPA
- రచయిత, టోబీ మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇండోనేషియాలోని 'అనక్ క్రకటోవా' అగ్నిపర్వతం బద్దలవడంతో అధికారులు ఆరు విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
దీంతో లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.
ఆదివారం ఉదయం జకార్తాలోని సోకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో అగ్నిపర్వత బూడిదను గుర్తించడంతో ముందు ఈ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. ఇప్పటివరకు దాదాపు 467 విమాన సర్వీసులపై దీని ప్రభావం పడిందని రవాణా శాఖ మంత్రి డుడీ పురవాగంది తెలిపారు.
కొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విమానయాన సంస్థలకు సూచించారు.


ఫొటో సోర్స్, Reuters
పెల్లుబుకుతున్న లావా, ప్రకంపనలు
శుక్రవారం రాత్రి నుంచే ఈ అగ్నిపర్వతం పేలడం ప్రారంభమైంది. అప్పటినుంచి పరిసర ప్రాంతాల్లో నిరంతర భూప్రకంపనలు, లావా ఎగసిపడటం, భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున కూడా మరో రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. అగ్నిపర్వత బూడిద పశ్చిమ జావా వైపు వేగంగా విస్తరిస్తుండటంతో మరికొన్ని విమానాశ్రయాలను కూడా తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందని మంత్రి వివరించారు.
విమానాశ్రయాల మూసివేత వల్ల ప్రధానంగా సింగపూర్, దోహా, సిడ్నీ, కౌలాలంపూర్ వంటి అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విమానాలు రద్దయిన ప్రయాణికులకు టిక్కెట్ రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి విమానయాన సంస్థలను ఆదేశించారు.
విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించేందుకు రాబోయే విమాన సర్వీసుల వివరాలను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.

ఫొటో సోర్స్, EPA
50వేల అడుగుల ఎత్తుకు బూడిద మేఘాలు
అగ్ని పర్వతం నుంచి వెలువడుతున్న బూడిద మేఘాలు జావా వైపు 20వేల అడుగుల ఎత్తుకు, సుమత్రా వైపు ఏకంగా 50వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాయని ఇండోనేషియా వాతావరణ సంస్థ తెలిపింది.
జావా, సుమత్రా దీవుల మధ్య ఉన్న సుండా జలసంధిలో ఈ అగ్నిపర్వతం ఉంది. అయితే ఈ పేలుడు వల్ల ప్రస్తుతానికి ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.
బూడిద తీవ్రత కారణంగా శ్వాసకోశ, కళ్లు, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి కోరారు.
బూడిద వల్ల కళ్ల మంటలు రావడంతో శనివారం పలు పాఠశాలలు తరగతులను రద్దు చేసినట్లు స్థానిక పత్రిక 'కొంపాస్' పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆపేశారు.
"శుక్రవారం సాయంత్రం నుంచి కళ్లల్లో చిన్న చిన్న ఇసుక రేణువులు పడినట్లు అనిపిస్తోంది. ఉపశమనం కోసం ఐ-డ్రాప్స్ వాడుతున్నాను. దుమ్ము ఎంత దట్టంగా ఉందంటే, ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఇంటి ముందరి భాగాన్ని ఊడ్చాల్సి వస్తోంది" అని స్థానికుడు ఆల్డి కాండ్రా ప్రయాగి ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, EPA
క్రకటోవా చరిత్ర ఏమిటి?
అనక్ క్రకటోవా అంటే 'క్రకటోవా బిడ్డ' అని అర్థం. 1883లో మౌంట్ క్రకటోవా భారీ పేలుడు తర్వాత ఏర్పడిన పగుళ్ల నుంచి గత శతాబ్దం ప్రారంభంలో ఈ అగ్నిపర్వతం సముద్రం నుంచి పైకి ఉద్భవించింది.
అప్పటినుంచి ఇది అప్పుడప్పుడు బద్దలవుతూనే ఉంది.
డిసెంబర్ 2018లో ఈ అగ్నిపర్వతం కూలిపోవడంతో సంభవించిన భారీ సునామీ కారణంగా సుమత్రా, జావా తీర ప్రాంతాల్లో 400 మందికి పైగా మరణించారు.
వేల మంది గాయపడ్డారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు.
ఆ సమయంలో సుమారు 70-90 మీటర్ల ఎత్తున్న రాతి బండలు విరిగిపడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇండోనేషియా పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉంది.
పసిఫిక్ మహాసముద్రం చుట్టూ దక్షిణ అమెరికా అంచు నుంచి న్యూజిలాండ్ వరకు దాదాపు 40వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ జోన్‌లో భారీ సంఖ్యలో అగ్నిపర్వతాలు, భూకంప కేంద్రాలు ఉన్నాయి.
ప్రపంచంలో వచ్చే భూకంపాలలో దాదాపు 90 శాతం ఈ ప్రాంతంలోనే సంభవిస్తాయి. భూమిపై ఉన్న క్రియాశీల అగ్నిపర్వతాలలో 75 శాతం అంటే దాదాపు 452 అగ్నిపర్వతాలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌లోనే ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























