ఏఐ బూమ్‌తో వేగంగా అడుగులేస్తున్న భారత్‌కు, సముద్రంలో సరైన ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ ఎందుకు లేదు?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
భారత్ డిజిటల్ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో ఒకటి ముంబయి అరేబియా సముద్ర తీరంలో 6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
నగరానికి వాయువ్య దిశలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతమైన వెర్సోవా పరిసరాల్లో, భారత్‌కు చెందిన 18 అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లలో కనీసం 13 కేబుళ్లు ఒకదానికొకటి ఆరు కిలోమీటర్ల పరిధిలో సముద్ర తీరంలో విస్తరించి ఉన్నాయి.
ఈ కేబుళ్లన్నీ యూరప్, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలకు భారత్ నుంచి వెళ్లే అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌లో దాదాపు 95 శాతాన్ని మోస్తున్నాయి.
"భౌగోళికంగా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండటం వల్ల ఈ నెట్‌వర్క్‌కు ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది" అని థింక్‌ట్యాంక్ సంస్థ తక్షశిల ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన అన్వేషా సేన్ చెబుతున్నారు.
"ఆ కేబుళ్లలో కొన్ని ఒకేసారి తెగిపోతే, అది ప్రమాదవశాత్తు జరిగినా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగినా, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లకు వెళ్లే భారత్ బ్యాండ్‌విడ్త్‌లో అధిక భాగం ప్రభావితమవుతుంది" అని అన్వేషా సేన్ అంటున్నారు.

అయితే, ఈ ట్రాఫిక్‌ను మరో మార్గానికి మళ్లించే అవకాశం ఉండటంతో, కేబుల్ తెగిపోవడం వల్ల దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడదు.
చెన్నై, కొచ్చి వంటి దక్షిణాది నగరాలతో పాటు ఇతర ల్యాండింగ్ పాయింట్ల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారత్‌కు చెందిన 18 సముద్రగర్భ కేబుళ్లు ముంబయి, చెన్నై, కొచ్చిన్, తూత్తుకుడి, తిరువనంతపురంలో తీరం నుంచి వెళతాయి.
ఇవి ప్రమాదానికి గురైతే, ట్రాఫిక్ మళ్లింపుల వల్ల వాటి పనితీరు తగ్గిపోవడం, అంటే డేటా ఒకచోటు నుంచి మరోచోటుకు చేరడానికి పట్టే సమయం స్వల్పంగా పెరగడం, బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, క్లౌడ్ సేవల సంస్థలు, ప్రభుత్వ నెట్‌వర్క్‌లకు సమస్య కావచ్చు. అధిక పరిమాణంలో, అత్యంత వేగంగా డేటాను బదిలీ మీద ఆధారపడే ఏఐ వ్యవస్థలపై మరింత ప్రభావం ఉండచ్చు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
ప్రపంచ డిజిటల్ ట్రాఫిక్‌లో ఇంత పెద్ద భాగం ఈ కేబుళ్లపై ఆధారపడటం కూడా పెద్ద సమస్యగా మారింది.
ఇవి ఇంటర్నెట్‌కు కనిపించని రహదారులు అనుకోవచ్చు. సముద్రపు అడుగున పరచిన ఆప్టికల్ ఫైబర్ల సమూహాలైన ఈ కేబుళ్లు, లైట్ పల్సుల రూపంలో ఖండాల మధ్య డేటాను చేరవేస్తాయి. వివిధ దేశాలు ఇప్పటివరకు దాదాపు 8.7 లక్షల మైళ్లు అంటే 14 లక్షల కిలోమీటర్ల మేర ఈ కేబుళ్లను ఏర్పాటు చేశాయి. "భూమిని కేబుళ్ళ ద్వారా అల్లేశాయి" అని సమంత్ సుబ్రమణియన్ తన కొత్త పుస్తకం 'ది వెబ్ బినీత్ ది వేవ్స్'లో రాశారు. ప్రపంచ కమ్యూనికేషన్ ట్రాఫిక్‌లో దాదాపు 99 శాతం ఈ కేబుళ్ల ద్వారానే సాగుతోంది.
చౌకైన డేటా కారణంగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్లలో ఒకటిగా మారింది. 2025 చివరి నాటికి దేశంలో సుమారు 100 కోట్లమందికి పైగా బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సేవల రంగాలు ఈ కేబుళ్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
అయితే కళ్లకు కనపడని ఈ మౌలిక సదుపాయాలపై భారత్ రోజురోజుకి ఎక్కువ ఆధారపడటం, భారత్‌లో ఉన్న పరిమిత కేబుళ్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వల్ల సమస్యగా మారే ప్రమాదముంది.
ప్రపంచవ్యాప్తంగా వినియోగించే డేటాలో దాదాపు 20 శాతం భారత్‌లోనే వినియోగమవుతోంది. అయితే ప్రపంచంలోని సముద్రగర్భ కేబుళ్లలో కేవలం 3 శాతం మాత్రమే భారత్‌తో అనుసంధానమై ఉన్నాయి.
సముద్రగర్భ కేబుళ్లు భూభాగంలోని నెట్‌వర్క్‌లకు అనుసంధానమయ్యే తీరప్రాంత కేంద్రాలు అంటే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు భారత్‌లో 21ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్లానింగ్‌లో ఉన్నవి, ఇప్పటికే పనిచేస్తున్నవి కలిపి సుమారు 1,900 ల్యాండింగ్ స్టేషన్లు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని మొత్తం ల్యాండింగ్ స్టేషన్లలో భారత్ వాటా దాదాపు 1 శాతమేనని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) తెలిపింది.
"కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల సంఖ్యను మనం అనేక రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది" అని బీఐఎఫ్ చైర్‌పర్సన్ అరుణ సుందరరాజన్ అంటున్నారు.
భారత్ డిజిటల్ వ్యవస్థలో ఇదే ప్రధాన వైరుధ్యమని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచంతో భారత్‌ను అనుసంధానించే మౌలిక సదుపాయాలపై తగినంత నియంత్రణ లేకుండానే దేశం ఇంటర్నెట్, డేటా సెంటర్ శక్తిగా ఎదుగుతోంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
తక్షశిల ఇన్‌స్టిట్యూషన్ ఇటీవల ప్రచురించిన ఒక రిపోర్ట్ ప్రకారం, భారత్‌లోని 18 అంతర్జాతీయ కేబుళ్లలో 11 కేబుళ్లు 20 ఏళ్లకు పైబడినవే. సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలకు సాధారణంగా నిర్దేశించిన 25 ఏళ్ల గడువు ముగింపు దశకు అవి చేరుకుంటున్నాయి.
"భారత్‌లో ల్యాండ్ అవుతున్న కేబుళ్లలో గణనీయమైన వాటి ఆర్థిక వినియోగ కాలం ముగింపు దశకు చేరుకుంటున్నది నిజమే. ఇది ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించాల్సిన కీలకమైన అంశం" అని డిజిటల్ మౌలిక సదుపాయాల సంస్థ లైట్‌స్టార్మ్ గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అమజిత్ గుప్తా అంటున్నారు.
మరోపక్క కేబుల్స్‌లో తలెత్తే లోపాలూ ఉన్నాయి. ఉద్దేశపూర్వక దాడుల కంటే ఇవే చాలా తరచుగా ఎదురయ్యే ముప్పు.
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 150 నుంచి 200 వరకు కేబుళ్ల సమస్యలు సంభవిస్తున్నట్లు అంచనా. వీటిలో ఎక్కువ భాగం దాడుల వల్ల కాకుండా చేపల వేట, నౌకల యాంకర్లు, ప్రకృతి వైపరీత్యాలు, పరికరాల వైఫల్యం వంటి కారణాలతోనే జరుగుతున్నాయి.
"ఎర్ర సముద్రంలో ఏర్పడిన అంతరాయాల సమయంలో ఇలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూశాం" అని గుప్తా అన్నారు. ఆ సమయంలో ట్రాఫిక్‌ను తూర్పు వైపు సింగపూర్ మీదుగా, అక్కడి నుంచి అమెరికాకు మళ్లించారు.
సముద్రగర్భ కేబుల్ తెగిపోయినప్పుడు భారత్ ఎదుర్కొనే మరో తీవ్రమైన సమస్య ఏంటంటే, దేశంలో సముద్రగర్భ కేబుళ్ల మరమ్మతుల కోసం ప్రత్యేక నౌకలంటూ ఏమీ లేవు.
మరమ్మతు నౌకలు విదేశాల నుంచి రావాల్సి ఉంటుంది. అవి భారత జలాల్లో పనిచేయడానికి అనుమతి కూడా పొందాలి.
"భారత జలాల్లో జరిగే ప్రతి కేబుల్ లోపం విషయంలో దుబాయ్ లేదా సింగపూర్ నుంచి వచ్చే విదేశీ మరమ్మతు నౌకలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఒక విదేశీ నౌకను కేటాయించిన తర్వాత, అది భారత జలాల్లో పనిచేయడానికి లైసెన్సులు పొందాలి. ఇప్పటికే ఉన్న సుదీర్ఘ ప్రక్రియకు దీనివల్ల మరికొన్ని వారాలు పడతాయి" అని సేన్ చెబుతున్నారు.
విదేశీ మరమ్మత్తుల వ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడటం భారత్‌కు మరింత పెద్ద బలహీనత.
"ఈ విషయంలో భారత్ ఎదురుకుంటున్న ప్రధాన సమస్య - ట్రాఫిక్‌ను మరో మార్గానికి మళ్లించే సామర్థ్యం కాదు. మరమ్మతులు చేయగలిగే సామర్థ్యం లోపించడం" అని గుప్తా అంటున్నారు.
"విదేశీ మరమ్మతు సామర్థ్యంపై ఆధారపడటం, నియంత్రణపరమైన అనుమతులకు పట్టే సమయం ఈ రెండీటి కాంబినేషన్ పెద్ద అడ్డంకి" అని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
అయితే మరమ్మతులనేవి మొత్తం సమస్యల్లో ఒక భాగం మాత్రమే.
భారత్ పాత కేబుళ్లను తొలగిస్తుందా లేదా అన్నది ప్రశ్న కాదని, ఏఐ ఆధారిత డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త భూభాగ, సముద్రగర్భ సామర్థ్యాన్ని పెంచగలదా అన్నదే అసలు ప్రశ్న అని గుప్తా భావిస్తున్నారు. "ఈ సామర్థ్యాన్ని బాగా వెనుకబడిన తర్వాత అందిపుచ్చుకునే ప్రయత్నాల వల్ల ఫలితం లేదు. ఎప్పుడూ ముందస్తుగా సిద్ధంగా ఉండడమే ఉత్తమం" అని ఆయన అంటున్నారు.
ఈ డిమాండ్ డేటా సెంటర్ల విస్తరణకు కూడా దారితీస్తోంది. డేటాను నిల్వ చేయడం, ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం, వాటిని అమలు కోసం జరిగే కంప్యూటింగ్ కేంద్రాలే డేటా సెంటర్లు. ఇవి కూడా ప్రపంచ క్లౌడ్, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లతో వేగవంతమైన, విశ్వసనీయమైన కనెక్టివిటీపై ఆధారపడతాయి.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశంలో ఏర్పాటు చేసిన డేటా సెంటర్ల సామర్థ్యం 2020లో 375 మెగావాట్ల నుంచి ప్రస్తుతం సుమారు 1,575 మెగావాట్లకు పెరిగింది.
దీంతో ఒక అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.
"సముద్రగర్భ కేబుల్ ప్రణాళిక రూపకల్పనకే మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఆ తర్వాత కేబుల్ పొడవును బట్టి వాటిని సముద్రంలో ఏర్పాటు చేయడానికి మరో రెండేళ్ల వరకు పట్టచ్చు" అని సుందరరాజన్ చెబుతున్నారు. "అందువల్ల రాబోయే డేటా సెంటర్ల సామర్థ్యానికి అనుగుణంగా సముద్రగర్భ కేబుల్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో కొంత జాప్యం జరగచ్చు." అంటున్నారామె.
భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద అడ్డంకి ఆ దేశ అధికార యంత్రాంగం కావచ్చు.
సముద్రగర్భ కేబుళ్ల నిర్మాణం, నిర్వహణ, మరమ్మతులకు అనుమతులు ఇవ్వడంలో టెలికాం, రక్షణ, హోం వ్యవహారాలు, నౌకాయానం, ఓడరేవులు, పర్యావరణం, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 16 సంస్థలకు సంబంధం ఉంటుందని సుందరరాజన్ చెబుతున్నారు.
ఒక్క కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికే కనీసం 16 మంత్రిత్వ శాఖల పరిధిలో సుమారు 50 అనుమతులు అవసరమవుతాయని ఆమె చెబుతున్నారు. "సాంకేతిక సామర్థ్యం లేకపోవడం సమస్య కాదు. పాలనా వ్యవస్థే ప్రధాన సమస్య" అని ఆమె అంటున్నారు.
భారత్ టెలికమ్యూనికేషన్స్ శాఖను ప్రధాన సంస్థగా చేసి, మరమ్మతు నౌకలకు అనుమతులు వేగంగా ఇచ్చేందుకు సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరుతున్నారు.
రెండు తీర ప్రాంతాల్లోనూ, దీవులున్న ప్రాంతాల్లోనూ అనేక కేబుల్ ల్యాండింగ్ ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రభుత్వం ముందస్తు అనుమతులు ఇవ్వాలని ఆమె సూచిస్తున్నారు. వీటికి ప్రామాణిక నిబంధనలు కూడా రూపొందించాలి. అలా చేస్తే కేబుల్ సంస్థలు ప్రతిసారీ మొదటి నుంచి అనుమతుల ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉండదు.
నిజమైన ప్రాంతీయ కేబుల్ హబ్‌గా ఎదగాలంటే భారత్‌కు "అంచనా వేయగలిగే నియంత్రణ విధానం, అందరికీ అందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలు, వేగవంతమైన మరమ్మతు వ్యవస్థలు" అవసరమని ఆమె చెబుతున్నారు. కేబుళ్లు, డేటా ట్రాఫిక్‌ను ఆకర్షించడంలో సింగపూర్‌కు సహాయపడింది ఇదేనని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ పూజా భట్ కూడా ఈ అసమతుల్యతను ఇకపై విస్మరించడం కష్టమవుతుందని అంటున్నారు.
‘‘జనాభాలో అధికంగా యువతే ఉండడం, డిజిటల్ ఇండియా ఆకాంక్షలు వంటి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుంటే, భద్రత, పాలనా అవసరాల కోసం దేశం తన సొంత ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించుకుని, నిర్వహించుకోవడం ఉత్తమం" అని ఆమె చెబుతున్నారు.
భారత్ ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేసింది. అంతర్జాతీయ అనుసంధానానికి సముద్రగర్భ కేబుల్ వ్యవస్థల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, వాటిని కీలక టెలికమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా ప్రభుత్వం ఇప్పుడు పరిగణిస్తోంది.
ఈ హోదా వల్ల వేగవంతమైన అనుమతులు, అత్యవసర మరమ్మతు వ్యవస్థలు, భారతదేశంలోనే కేబుల్ మరమ్మతు సామర్థ్యం ఏర్పడాలని సుందరరాజన్ అంటున్నారు. అలాగే ల్యాండింగ్ ప్రాంతాలు, కేబుల్ మార్గాల చుట్టూ ప్రొటెక్టెడ్ కేబుల్ జోన్లను ఏర్పాటు చేసి, అక్కడ యాంకర్లు వేయడం, ట్రాలింగ్ చేయడంపై ఆంక్షలు విధించాలని ఆమె సూచిస్తున్నారు.
సాంకేతికత కూడా సహాయపడచ్చు
డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సెన్సింగ్ అనే సాంకేతికత ఆప్టికల్ ఫైబర్లను సెన్సర్లుగా మార్చగలదు. తద్వారా నౌకలు, యాంకర్లు లేదా నీటిలో ప్రయాణించే వాహనాల వల్ల కలిగే ప్రకంపనలను గుర్తించచ్చు. కేబుల్ తెగిపోయే ముందే ముప్పులను గుర్తించడానికి ఇది ఉపయోగపడే అవకాశముంది.
అయితే తక్షణమే చేపట్టాల్సిన చర్యలు చాలా చిన్నవి కూడా కావచ్చు. మరిన్ని ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, భౌగోళిక వైవిధ్యాన్ని పెంచడం, అనుమతులను వేగవంతం చేయడం, కేబుల్ మార్గాలను రక్షించడం, భారత్‌లోనే మరమ్మతు సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం వంటివి అవసరం.
"పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, డిమాండ్ ఇప్పటికే ముంబయిలో కేంద్రీకృతమై ఉండటంతో చారిత్రకంగా కనెక్టివిటీ కూడా అక్కడే కేంద్రీకృతమైంది" అని గుప్తా అంటున్నారు. "అయితే ఈ పరిశ్రమకు ఇదే ప్రమాదం. అందుకే ఈ కేంద్రీకరణకు భిన్నంగా వ్యవస్థను రూపొందించాలి" అన్నారాయన.
మొదలైన మార్పు
నాలుగు కొత్త సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. మరో మూడు వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వీటిలో ఒకటైన ఐ-2సీఈఏ ను నిర్మిస్తున్న కన్సార్షియానికి లైట్‌స్టార్మ్ సంస్థ నాయకత్వం వహిస్తోంది. ఇది భారత్‌ను మలేషియా, సింగపూర్‌లతో అనుసంధానిస్తుంది. ఈ వ్యవస్థకు భారత్‌లో రెండు ల్యాండింగ్ పాయింట్లు ఉంటాయి. ఒకటి హైదరాబాద్‌కు సమీప సముద్రతీరమైన మచిలీపట్నం ఒకటి. ఇప్పటికే ఉన్న మార్గాలను మరింత మెరుగు పరుస్తూ దక్షిణ చెన్నైలోని కొత్తగా ఏర్పాటు చేయబోయే ల్యాండింగ్ ప్రాంతం రెండోది.
ఆశ్చర్యం ఏంటంటే, అత్యంత వేగంగా డేటాను వినియోగిస్తున్న దేశానికి, ఆ డేటాను మోసుకెళ్లే మౌలిక సదుపాయాలు మాత్రం బలహీనంగా ఉన్నాయి.
డేటా సెంటర్లను పెంచుకుంటూ, ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధమవుతోంది భారత్. అయితే దానికి అనుగుణంగా కేబుళ్లు, ల్యాండింగ్ స్టేషన్లు, మరమ్మతు సామర్థ్యం కూడా పెరగగలవా అన్నదే అసలైన ప్రశ్న.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































