తృణమూల్ కాంగ్రెస్‌ చీలిపోతోందా? జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి?

తృణమూల్ కాంగ్రెస్, మమతాబెనర్జీ, పశ్చిమ బెంగాల్, బీజేపీ, కాంగ్రెస్, ఎన్డీఏ

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌ ఐక్యంగా ఉండడం ఓ సవాల్‌లా కనిపిస్తోంది.

రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎంపీ సుఖేందు రాయ్ రాజీనామా చేశారు.

ఇప్పుడు ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తీదార్ తనతో పాటు 20 మంది ఎంపీలు ఉన్నారని, వారిని సభలో విడిగా కూర్చోబెట్టాలని లోక్‌సభ స్పీకర్‌ను డిమాండ్ చేశారు.

లోక్‌సభలో తృణమూల్‌కు 28 మంది ఎంపీలు ఉన్నారు. 20 మంది ఎంపీల మద్దతు ఉండటంతో పార్టీ నుంచి విడిపోయినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్గం ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యల నుంచి తప్పించుకోగలదు.

విడిపోయిన వర్గాన్ని అసలైన తృణమూల్ కాంగ్రెస్‌గా గుర్తించే అవకాశం కూడా ఉంది. 20 మంది ఎంపీల లేఖను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల్లో గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. వాటిలో చీలిక వర్గానికే అసలు పార్టీగా గుర్తింపు లభించింది.

తృణమూల్ కాంగ్రెస్‌ బహిష్కరించిన రీతబ్రత బెనర్జీని అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే ప్రతిపక్ష నాయకునిగా గుర్తించారు.

పార్టీ సీనియర్ నాయకుడు శోవన్‌దేవ్ ఛటోపాధ్యాయను ప్రతిపక్ష నాయకునిగా నియమించినప్పటికీ 80 మంది ఎమ్మెల్యేల్లో 58 మంది ఆయనను ప్రతిపక్షనేతగా అంగీకరించడానికి నిరాకరించారు.

పార్టీలోని చాలామంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని, తమ వర్గమే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని రీతబ్రత బెనర్జీ వాదిస్తున్నారు. పార్టీలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిపత్యాన్ని ఈ వర్గం వ్యతిరేకిస్తోంది.

ఈ బృందం అభిషేక్‌ను వ్యతిరేకిస్తున్నప్పటికీ, పార్టీ ముఖ్య సలహాదారుగా మమతా బెనర్జీ దిశానిర్దేశం చేయాలని కోరుకుంటోంది.

తృణమూల్ కాంగ్రెస్, మమతాబెనర్జీ, పశ్చిమ బెంగాల్, బీజేపీ, కాంగ్రెస్, ఎన్డీఏ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, లోక్‌సభలో తమ పార్టీ ఎంపీలు 20మంది తన వెంట ఉన్నారని కాకోలీ ఘోష్ అంటున్నారు.

కాకోలీ ఘోష్ నేతృత్వంలో తిరుగుబాటు?

లోక్‌సభ‌లో తమ ఎంపీలు 20 మంది తనతో ఉన్నారని, వారు ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తృణమూల్ ఎంపీ, పార్టీ సీనియర్ నాయకురాలు కాకోలీ ఘోష్ దస్తిదార్ సోమవారం(జూన్ 8) చెప్పారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తమ నిర్ణయం తెలియజేశారు.

"కాకోలీ ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని చీలిక వర్గం బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో సమావేశమైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి కూడా అక్కడే వారిని కలిశారు. దస్తిదార్ నేతృత్వంలోని ఎంపీలకు విడిగా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేయాలని ఈ సమావేశంలోనే నిర్ణయించారు" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది.

తృణమూల్ ఎంపీ శతాబ్దీ రాయ్ దిల్లీ నివాసానికి శుభేందు అధికారి వెళ్లారని ఏఎన్ఐ తెలిపింది. ఆ సమయంలో అక్కడ కొందరు తృణమూల్ ఎంపీలు కూడా ఉన్నట్టు సమాచారం ఉందని పేర్కొంది.

"20 మంది ఎంపీలు సంతకాలు చేశారని నాకు తెలిసింది. కానీ వాస్తవానికి మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఎంపీలు సంతకాలు చేశారు. వారు ఎందుకు ఇలా చేశారో నాకు పూర్తి సమాచారం లేదు. కానీ నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం"

"నేను వాళ్లతో మాట్లాడలేదు. భవిష్యత్ ప్రణాళికలు ఏంటో కూడా నాకు తెలియదు. వాళ్ల వైఖరి మా వైఖరికి భిన్నంగా ఉండొచ్చు. నేను వారి వెంట నిలబడలేకపోవచ్చు. కానీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం మాట్లాడినందుకు నేను వాళ్లను అభినందిస్తున్నాను" అని రీతబత్ర బెనర్జీ ఏఎన్ఐతో చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అంతర్గత వ్యవహారాలపై బీజేపీ అధికార ప్రతినిధిగా తానేమీ స్పందించబోనని సంబిత్ పాత్ర చెప్పారు.

''అయితే మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. మీడియా ఇలాంటి కథనాలను ప్రచురిస్తున్నప్పుడు, నాయకుల నుంచి ప్రకటనలు వెలువడుతున్నప్పుడు, టీఎంసీ ఎంపీల రాజీనామా లేఖలు ఉన్నప్పుడు, టీఎంసీలో అంతా సవ్యంగా లేదని స్పష్టమవుతోంది'' అని తెలిపారు.

తృణమూల్ కాంగ్రెస్, మమతాబెనర్జీ, పశ్చిమ బెంగాల్, బీజేపీ, కాంగ్రెస్, ఎన్డీఏ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఎంపీలుగా రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై గెలవాలని చీలికవర్గం నేతలకు మహువా మోయిత్ర డిమాండ్ చేశారు.

‘బీజేపీ టికెట్‌పై గెలవాలి’

ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కొందరు తీవ్రంగా స్పందించారు.

"ఈ ఎంపీలు 2024లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) టికెట్‌పై గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. ప్రజలు వారిని టీఎంసీ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు ఎన్డీఏ ప్రతినిధులుగా కాదు" అని పార్టీ ఎంపీ మహువా మోయిత్రా పోస్ట్ చేశారు.

''తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వీడాలనుకునే స్వార్థపరులు, అవకాశవాదులు ఎవరైనా నిరభ్యంతరంగా బీజేపీలో చేరవచ్చు. కానీ ముందుగా వారు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఆ తర్వాత బీజేపీ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేయాలి. అప్పుడే వారు నిజంగా ఎంత గొప్ప నాయకులో, ప్రజలు వారితో ఉన్నారో లేదో తెలుస్తుంది'' అని అన్నారు.

"ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు అయిన వారు, తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికల్లో గెలిచి, 'దీదీ' నినాదాన్ని ఉపయోగించి ఈ స్థానాన్ని పొందారు. కొన్ని రోజుల క్రితం వరకు వారు 'దీదీ, దీదీ, దీదీ' అని నినాదాలు చేశారు. ఇప్పుడు వారు ఎన్డీఏలో చేరడానికి సిద్ధమవుతున్నారని వింటున్నాం. ఇవేం రాజకీయాలు?" అని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కునాల్ ఘోష్ అన్నారు.

ఈ మొత్తం వ్యవహారం ఓ నాటకమని పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌధురి అభివర్ణించారు. "వీళ్ళు నేరుగా ఎన్‌డిఏలో చేరి ఉంటే బాగుండేది. మే 4వ తేదీ వరకు వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు తృణమూల్ ఓటమితో బీజేపీ శిబిరంలో చేరాలని భావిస్తున్నారు. దేశ ప్రగతి కోసం బీజేపీకి సహాయం చేయాలనుకుంటున్నామని వారే చెబుతున్నారు'' అని అని వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.