‘అమెరికా ఆంక్షలు ఎదుర్కొనేందుకు మేం పూర్తిగా సిద్ధం’ అంటున్న ఇరాన్, ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు ఎంత వరకు పని చేస్తాయి?

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
- రచయిత, మైఖేల్ రేస్, మిచెల్ లాబియాక్, ఇయాన్ ఐక్మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి తమను ఏకాకి చేసేందుకు "ఎకనామిక్ డి-డే"గా అభివర్ణించిన అమెరికా విస్తృత ఆంక్షలను తాము సమర్థవంతంగా ఎదుర్కోగలమనే పూర్తి నమ్మకంతో ఉన్నట్లు ఇరాన్ తెలిపింది.
ఈ ఆర్థిక ఆంక్షలకు తెహ్రాన్ 'పూర్తిగా సిద్ధంగా' ఉందని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీ జాదే అన్నారు.
అమెరికాకు మరో ఓటమి తప్పదని హెచ్చరించారు.
ఇరాన్‌తో ఆర్థికంగా భాగస్వామిగా వ్యవహరించే ఏ దేశమైనా ఏకాకి అయ్యే పరిస్థితి వస్తుందని కొత్త ఆర్థిక ఆంక్షలను ప్రకటిస్తూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు.
అలాగే, సంబంధాలు తెంచుకోవడానికి నిరాకరిస్తే, ఇరాన్‌తో లావాదేవీలు జరిపే బ్యాంకులు, వ్యాపార సంస్థలు కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సంఘర్షణను ముగించే ప్రయత్నాలలో వైట్‌హౌస్ తన వైఖరిని మార్చుకోవడం, గడువును పొడిగించిన అనంతరం తాజా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇరాన్‌పై ఇప్పటివరకు చేపట్టిన 'అతిపెద్ద ఏకైక ఆర్థిక దాడి' ఇదేనని బెసెంట్ అభివర్ణించారు.
ఈ కొత్త ఆంక్షలు ఉచ్చును మరింత బిగించి.. ఇరాన్‌కు వచ్చే ప్రతి ఆదాయ వనరును అడ్డుకుంటాయని చెప్పారు.
ఇరాన్ వాణిజ్య భాగస్వాముల స్పందనపై ఆధారపడి ఉండటం వల్ల, తాజా ఆంక్షలు ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయనే దానిపై కొందరు ఆర్థికవేత్తలు సందేహం వ్యక్తం చేశారు.
చైనా, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు.
ఇరాన్ చమురుకు అతిపెద్ద వినియోగదారు అయిన చైనా..గతంలో అమెరికా ఆంక్షలను పట్టించుకోలేదు. తెహ్రాన్‌తో వ్యాపారాన్ని కొనసాగించింది.
తెహ్రాన్‌తో అన్ని వాణిజ్య, ఆర్థిక సంబంధాలను నిలిపివేస్తున్నట్లు యూఏఈ గతవారమే ప్రకటించింది.

ఫొటో సోర్స్, Fatemeh Bahrami/Anadolu via Getty Images
అయితే, తమ వాణిజ్య భాగస్వాములు తమతో వ్యాపారం కొనసాగిస్తారని నమ్మకం ఉందని అమెరికా ప్రకటన తర్వాత కొన్ని గంటల్లోనే ఇరాన్ పేర్కొంది.
అమెరికా చర్యలను చైనాగానీ, రష్యాగానీ అంగీకరించలేదని అలీ మదానీ జాదే చెప్పారు. అలాగే, ఇతర దేశాలు వీటిని వ్యతిరేకిస్తాయని ఆయన భావిస్తున్నారు.
''ఈ పరిణామాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికోసం రెండేళ్ల ప్రణాళిక మా దగ్గర ఉంది'' అని ప్రభుత్వ టీవీ చానెల్‌కు చెప్పారు.
ఎంతో కాలంగా తెహ్రాన్ ఈ ప్రణాళికల కోసం వేచిచూస్తోందని అన్నారు.
''మా దగ్గర కూడా సొంత సాధనాలు ఉన్నాయి. ఆటను ఎలా ఆడాలో మాకు తెలుసు'' అని చెప్పారు.
అమెరికా ప్రకటనపై స్పందించిన చైనా, "చట్టవిరుద్ధమైన ఏకపక్ష ఆంక్షల"ను తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది.
ఆంక్షలు, ఒత్తిడి వ్యూహాలు సమస్యల పరిష్కారానికి సాయపడవని, బీజింగ్ తన ప్రయోజనాలను కాపాడుకుంటుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాంగ్ చెప్పారు.
ఈ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. తాజా ముప్పు నేపథ్యంలో, యుద్ధం కొనసాగితే ఆ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులన్నింటినీ నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవద్దని నౌకలకు ఇరాన్ ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసిందని రాయిటర్స్ నివేదించింది.
"ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్" అనే దాన్ని వివరిస్తూ సోమవారం ఉదయం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ ఆర్థిక సంబంధాలపై అమెరికా "ఆర్థిక దాడి"ని ప్రారంభిస్తోందని బెసెంట్ చెప్పారు.
''ఇరాన్ ఇప్పుడు తమ ముందు కేవలం రెండు మార్గాలతో కూడిన అత్యంత స్పష్టమైన ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ప్రపంచం నుంచి వేరుపడటం లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మళ్లీ చేరే అవకాశంతో సాధారణ స్థితికి తిరిగి వచ్చే మార్గం చూసుకోవడం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Chip Somodevilla/Getty Images
అమెరికా ఇకపై ఇరాన్ ముప్పును ఎదుర్కోదని, దానికి ముగింపు పలుకుతుందని ట్రెజరీ సెక్రటరీ చెప్పారు.
ఆంక్షలను తప్పించుకుని చమురు వ్యాపారం చేయడానికి ఇరాన్ ఉపయోగిస్తున్న నెట్‌వర్క్‌లు, మధ్యవర్తులు, ఆర్థిక మార్గాలను ట్రెజరీ గుర్తించిందని బెసెంట్ చెప్పారు.
డిజిటల్ ఆస్తులు, సాంకేతికత, బంగారం, విమానయానం, షిప్పింగ్ వంటి ఐదు రంగాలపై తాము నిర్ణయాలు జారీ చేసినట్లు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. దాదాపు 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై కూడా ట్రెజరీ ఆంక్షలు విధించింది.
ఇరాన్‌కు సహకరించే లేదా వ్యాపారం నిర్వహించే ప్రభుత్వాలకు, సంస్థలకు జారీ చేసిన హెచ్చరికల్లో.. "ఇరాన్‌కు సహకరిస్తున్నామన్న విషయం మాకు తెలియదని చెప్పుకోలేరు'' అని ఆయన అన్నారు.
అయితే, ఇరాన్‌తో వ్యాపారం చేసే నిర్దిష్ట దేశాలను ప్రస్తావించేందుకు ఆయన నిరాకరించారు. ''ఇరాన్ ప్రభుత్వంతో వారి సంబంధాలను నిలిపివేయాలని ప్రత్యేకంగా అభ్యర్థిస్తూ... ''ప్రపంచ నేతలకు ట్రంప్ ఫోన్ చేయనున్నారని చెప్పారు.
కొత్త ఆంక్షలు గురించి అర్థం చేసుకునేందుకు ప్రజలకు సమయం ఇవ్వడం చాలా ముఖ్యమని ఆయన చెప్పినప్పటికీ... "మేం చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నాం, ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నామని వారు తెలుసుకోవాలి" అని కూడా తెలిపారు.

ఫొటో సోర్స్, Fatemeh Bahrami/Anadolu via Getty Images
‘ఆంక్షల ప్రభావం అంతంతమాత్రమే’
ఈ ఆంక్షల ప్రకటన ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే దానిపై క్యాపిటల్ ఎకనామిక్స్ చీఫ్ క్లైమేట్ అండ్ కమోడిటీస్ ఎకనామిస్ట్ డేవిడ్ ఆక్స్లీ సందేహం వ్యక్తం చేశారు.
"అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం ఇప్పటికే ఇరాన్ చమురు ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తుండటంతో, 'ఎకనామిక్ డి-డే' వల్ల స్వల్ప వ్యవధిలో ఇరాన్ ఇంధన సరఫరాలపై ప్రత్యక్షంగా పడే ప్రభావం పరిమితంగానే ఉంటుందని మేం భావిస్తున్నాం'' అని తెలిపారు.
ఇరాన్ చమురులో 90 శాతం చైనాకు వెళ్తోందని, గతంలో కూడా ఈ దేశం అమెరికా ఆంక్షలను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదనీ, ఈసారి కూడా వాటికి లొంగే అవకాశం లేదనీ చెప్పారు.
ఇప్పటివరకు జరిగిన ఈ సంఘర్షణలో, యుద్ధాన్ని ముగించి హార్ముజ్ జలసంధిపై ఉన్న దిగ్బంధనాన్ని తొలగించేందుకు ఇరాన్ ఒక ఒప్పందానికి రాకపోతే "ఈ రాత్రే ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది" అని ఏప్రిల్‌లో కూడా ట్రంప్ బెదిరించారు.
మధ్యవర్తిగా పాకిస్తాన్ జోక్యం చేసుకుని, దౌత్యపరంగా మరింత చర్చలు జరగాలని పిలుపునిచ్చిన తర్వాత, అమెరికా చివరికి ఆ బెదిరింపుల నుంచి వెనక్కి తగ్గింది.
ఇరాన్ ప్రభుత్వం అంతకుముందు కూడా అమెరికా నుంచి కఠినమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, పలు మిత్రదేశాలు 2015లో ఇరాన్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం, తన అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి ఇరాన్ అంగీకరించినందున, దానిపై ఉన్న అనేక ఆంక్షలను ఎత్తివేశారు.
అయితే, 2018లో ట్రంప్ ఆ ఒప్పందాన్ని "మూలంలోనే లోపభూయిష్టమైనది"గా పేర్కొంటూ దాని నుంచి వైదొలిగారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలన్నింటినీ తిరిగి విధించారు.
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఒబామా కాలం నాటి ఒప్పందాన్ని తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ, అది జరగలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


































