'భారత్ అంగుళం భూమిని కూడా కోల్పోలేదు, ప్రధాని మోదీ చెప్పింది నిజమే" – బీబీసీ ఇంటర్య్వూలో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే

2026 ఫిబ్రవరి 2న, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇంకా పబ్లిష్‌కాని పుస్తకం ఆధారంగా కారవాన్ మ్యాగజైన్‌లో వచ్చిన కథనంలోని కొన్ని అంశాలను చదవడానికి ప్రయత్నించారు. దీనిపై కేంద్రంలోని బీజేపీ మంత్రుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
ఈ వివాదం ఎంతగా ముదిరిందంటే..ప్రచురించని పుస్తకం ప్రీ-ప్రింట్ కాపీలు సంబంధిత అధికారుల అనుమతి లేకుండా బయటకు రావడాన్ని దిల్లీ పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు.
పబ్లిష్‌కాని ఈ పుస్తకం పేరు 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'. దీన్ని రాసింది ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ (ఎంఎం) నరవణే.
గల్వాన్ లోయలో చైనా, భారత సైనికులు తలపడిన సమయంలో జనరల్ నరవణే భారత సైన్యానికి నాయకత్వం వహించారు.
బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆ పుస్తకం చుట్టూ ఉన్న వివాదం, భారత్-చైనా సరిహద్దు వివాదం, పలు ఇతర అంశాల గురించి జనరల్ ఎంఎం నరవణే మాట్లాడారు.


ఫొటో సోర్స్, Ishant Chauhan/Hindustan Times via Getty Images)
పుస్తకానికి సంబంధించిన వివాదంపై జనరల్ నరవణే ఏమన్నారు?
పార్లమెంటులోని వివాదానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు, ఈ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటిది జరగబోతోందని తనకు తెలియదని జనరల్ నరవణే సమాధానమిచ్చారు.
"నా పేరును ఉపయోగించి ఎవరైనా ఒక సమస్యను లేదా వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తే, దాంతో నాకు సంబంధం ఉందని అర్థం కాదు. ఈ విషయం మొదట నా స్నేహితుల ద్వారానే తెలిసింది, వాళ్లే నాకు ఫోన్ చేసి చెప్పారు" అని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ చదివిన పబ్లిష్‌కాని పుస్తకం జనవరి 2024లో మార్కెట్‌లోకి రావాల్సి ఉన్నప్పటికీ, రాలేదు. ఆ పుస్తకం ప్రస్తుతం సమీక్ష కోసం రక్షణ శాఖ దగ్గర ఉందని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
"2020లో తూర్పు లద్దాఖ్‌లో జరిగిన భారత్-చైనా సైనిక ఉద్రిక్తతలు, గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ, అలాగే అగ్నిపథ్ ప్రణాళిక గురించి 2020 ఆగస్టు 31 రాత్రి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సంభాషణ గురించి కూడా ఈ పుస్తకంలో ప్రస్తావన ఉంది" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన ఒక కథనం పేర్కొంది.
లోక్‌సభలో లేవనెత్తిన అంశంపై రాహుల్ గాంధీగానీ, కాంగ్రెస్ పార్టీగానీ తనను ఎప్పుడూ సంప్రదించలేదని జనరల్ నరవణే అన్నారు.
"ఈ విషయంపై ఇక చర్చ జరగకూడదు, ఎందుకంటే ఇది చాలా తక్కువ స్థాయి చర్చ. ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, వాటి గురించి చర్చిద్దాం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty Images
'మీకు ఏది సరైందనిపిస్తే అది చేయండి' అని ప్రధాని మోదీ అన్నారా?
చైనా-భారత్ ఘర్షణ సమయంలో కేంద్ర ప్రభుత్వం సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తున్నారు.
జనరల్ నరవణే రాసి, ఇంకా పబ్లిష్‌కాని పుస్తకం గురించి ఈ ఏడాది ఫిబ్రవరిలో భోపాల్‌లో జరిగిన ఒక ర్యాలీలో రాహుల్ గాంధీ మరోసారి ప్రస్తావించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ద్వారా "మీకు ఏది సరైందనిపిస్తుందో అది చేయండి" అనే సందేశాన్ని జనరల్ నరవణేకు పంపారని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీ నిజంగానే రక్షణ మంత్రితో ఈ మాట అన్నారా? అని అడగ్గా, ఆ పుస్తకం రివ్యూలో ఉందని, దాని గురించి చర్చించడం తగదని జనరల్ నరవణే బదులిచ్చారు.
"అంతిమంగా, ఏం చేయాలో, ఏం చేయకూడదో అనేది ఒక సైనిక నిర్ణయం. అటువంటి ఆదేశాలు అందినప్పుడు, దాని అర్థం ఏంటంటే, ప్రభుత్వం తన సైన్యంపైనా, దాని అధిపతిపైనా పూర్తి నమ్మకం ఉంచిందని అర్థం. వారు తీసుకునే ఏ చర్య అయినా, ఏ నిర్ణయమైనా పూర్తిగా సరైందే అవుతుందని అర్థం" అని ఆయన చెప్పారు.
"దీన్ని ఒక సమస్యగా మార్చాలని ప్రయత్నిస్తున్న వారి దృక్కోణం నుండి కాకుండా, ఈ దృక్కోణం నుంచి చూడాలి" అని ఆయన అన్నారు.
'చైనాను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు'
భారత వ్యూహాత్మక వర్గాల్లో చైనా గురించి లోతైన అవగాహన ఉందా? అన్న ప్రశ్నకు జనరల్ నరవణే ఏమన్నారంటే, "చైనాను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అది ఒక విశాలమైన దేశం. వారి వ్యవస్థలు భిన్నంగా ఉంటాయి, పని చేసే విధానాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అందుకే ఉన్నత స్థాయిలో చైనాను మరింతగా అధ్యయనం చేయడం అవసరం".
చైనాను అర్థం చేసుకోవాలంటే, భారత్‌లోని చైనా నిపుణులకు మాండరిన్ భాష తెలిసి ఉండాలని జనరల్ నరవణే అభిప్రాయపడుతున్నారు.
"మన మేధావులు, పాత్రికేయులు, విద్యావేత్తలు చైనాలో నివసించి, అక్కడ చదువుకుని, పనిచేసినప్పుడే మనకు చైనా గురించి లోతైన జ్ఞానం లభిస్తుంది. కానీ వ్యూహాత్మక, సైనిక స్థాయిలో కొరత లేదు" అని ఆయన అన్నారు.
చైనాతో సంబంధాలను మెరుగుపరచుకోవాలంటే, ముందుగా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలని జనరల్ నరవణే అభిప్రాయపడ్డారు. భారత్ తన సరిహద్దును ఒక విధంగా భావిస్తే, చైనా మరో విధంగా భావిస్తుందని చెప్పారు.
"రెండు దేశాల మధ్య సంభాషణ పెరిగితే, విభేదాలు తగ్గుతాయి. ఇది క్రమంగా మాత్రమే సాధ్యమవుతుంది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP via Getty Images
భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా?
భారత్ తన భూభాగాన్ని ఏమాత్రం కోల్పోలేదని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ నరవణే అన్నారు.
"మనం ఏమీ కోల్పోలేదని నేను మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నా. భారత్ అంగుళం భూమిని కూడా కోల్పోలేదని ప్రధాని మోదీ ఒక ప్రసంగంలో చెప్పారు. అది నిజమే" అని ఆయన అన్నారు.
చొరబాటు జరగకపోతే, చైనాతో వివాదం పెట్టుకోవడంలో అర్థం ఏమిటి? అన్న ప్రశ్నకు, ఇది కేవలం భూభాగంపై ఉన్న దృక్కోణంలో భేదం అని నరవణే సమాధానమిచ్చారు.
"భారత్ తన సరిహద్దు ఎక్కడ ఉందని భావిస్తుందో అక్కడికి వరకు వెళ్తుంది. అదే విధంగా, చైనా తన సరిహద్దు ఎక్కడ ఉందని భావిస్తుందో అక్కడికి వరకు వస్తుంది. ఈ కారణంగా పెట్రోలింగ్ సమయంలో రెండు సైన్యాలు ఎదురెదురుగా రావడం సహజం. కొన్నిసార్లు ఈ ఎదురుపడటం శాంతియుతంగా జరుగుతుంది, మరికొన్నిసార్లు చిన్నపాటి ఘర్షణలకు దారితీస్తుంది" అని ఆయన అన్నారు.
చైనా, భారత సైన్యాలు ఒకదానికొకటి ఎదురుపడటం ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా జరిగిందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
పాకిస్తాన్ గురించి ఏం చెప్పారు?
చైనా, పాకిస్తాన్‌ల మధ్య వ్యత్యాసం ఉందని, ఇరు దేశాలతో వేర్వేరు పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారని జనరల్ నరవణే అభిప్రాయపడ్డారు.
"మనకు పాకిస్తాన్‌తో ఉగ్రవాద సమస్య ఉంది, కానీ చైనాతో లేదు. ఉగ్రవాద ముప్పు ఉంటే, సరిహద్దులో అయినా లేదా జమ్మూకశ్మీర్‌లో అయినా పాకిస్తాన్‌పై కాల్పులు జరపడానికి మనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కానీ చైనా విషయంలో అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదమనే ప్రసక్తే లేదు. అందువల్ల, ఈ వ్యత్యాసం సహజం" అని ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























