తృణమూల్‌లో తిరుగుబాటు: పార్టీ ముక్కలు కాకుండా మమత వ్యూహాలేంటి?

ఫొటో సోర్స్, Sanjay Das
- రచయిత, ప్రభాకర్ మణి తివారీ
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
మమతా బెనర్జీ ఏ పార్టీనైతే స్థాపించి, తన కష్టంతో కేవలం 13 ఏళ్లలోనే శూన్యం నుంచి శిఖరానికి చేర్చారో, ఆ పార్టీ ఇప్పుడు ఆమె చేతుల్లోంచి జారిపోనుందా?
ఆమెకు తన సొంత ఇంటి(పార్టీ)లోనే నిరాశ్రయురాలయ్యే ప్రమాదం పొంచి ఉందా?.
పార్టీకి చెందిన 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు, బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా మారిన తర్వాత, పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
దీంతో పాటు మమత ఇప్పుడు ఏం చేయబోతున్నారనే అంశంపైనా ఊహాగానాలు సాగుతున్నాయి.

నాలుగు దశాబ్దాలకు పైబడిన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మమత ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు.
2004 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడం, లేదా 2006 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 29 సీట్లకు పడిపోవడం వంటివి ఉన్నాయి. కానీ, మొత్తం పార్టీ ఆమె చేతుల్లోంచి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తుండటం ఇదే మొదటిసారి.
మూడింట రెండొంతుల ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత మమత తక్షణ చర్యలు తీసుకున్నారు. పార్టీకి చెందిన అన్ని కమిటీలు, సంస్థలను రద్దు చేశారు. ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ చేస్తామని చెప్పారు.
ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, పార్టీ సీనియర్ నాయకులతో ఆమె నిరంతరం సమావేశాల్లో బిజీగా ఉన్నారు.
ఈ తిరుగుబాటుపై ఆమె ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. కానీ, పార్టీలో ఈ చీలిక వస్తుందనే విషయం ఆమెకు ముందే ఊహకు అంది ఉండవచ్చు.

ఫొటో సోర్స్, Samir Jana/Hindustan Times via Getty Images
అభిషేక్ బెనర్జీ చుట్టూ ప్రశ్నలు
అభిషేక్ బెనర్జీ, ఆయన పార్టీని నడిపించే విధానాలపైనే తమకు అసంతృప్తి ఉందని, మమతపై కాదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
కానీ, మమత ఇబ్బంది ఏమిటంటే, ఈ విషయం తెలిసినప్పటికీ ఆమె అభిషేక్‌ను వదులుకోలేరు. దానికి బలమైన కారణం కూడా ఉంది.
"పార్టీలో అభిషేక్ ప్రాధాన్యం పెరిగినప్పటి నుంచి చాలామంది పాత నాయకుల్లో అసంతృప్తి పెరగడం మొదలైంది" అని పేరు వెల్లడించడానిక ఇష్టపడని ఒక సీనియర్ లీడర్ అన్నారు.
"ఆయనతో పాటు కొత్త తరం నాయకుల్లో కూడా అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. శుభేందు అధికారి కూడా ఇదే కారణంతో పార్టీని వీడి బీజేపీ వైపు వెళ్లారు. అన్నీ తెలిసినప్పటికీ మమత, అభిషేక్‌ను పక్కన పెట్టలేరు. ఇది కేవలం కుటుంబానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు" అన్నారు.
"అభిషేక్‌ను పక్కన పెట్టడం లేదా ఆయనపై ఏదైనా చర్య తీసుకోవడం వల్ల ఆమె తిరుగుబాటుదారుల బెదిరింపులకు లొంగిపోయారనే సంకేతం వెళుతుంది. కానీ, మమతది లొంగిపోయే స్వభావం కాదు" అని చెప్పారు.
మరో టీఎంసీ లీడర్ మాట్లాడుతూ "అసెంబ్లీలో జరిగిన ఈ పరిణామాల చట్టబద్ధతను కోర్టులో సవాలు చేయాలని మమత ఆలోచిస్తున్నారు. దీనికోసం న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు. పార్టీ నుంచి బహిష్కరించిన ఒక ఎమ్మెల్యేను, అసెంబ్లీలో అదే పార్టీకి నాయకుడిగా ఎలా ప్రకటిస్తారనే ప్రశ్నను పార్టీ కోర్టు ముందు ఉంచనుంది" అన్నారు.
ఈ అంశంపై వచ్చేవారం కోల్‌కతా హైకోర్టులో పార్టీ కేసు దాఖలు చేయనుంది.

ఫొటో సోర్స్, Sanjay Das
న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న టీఎంసీ
టీఎంసీ ఎంపీ, న్యాయవాది కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ "అసలైన తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి ఏర్పడిన వర్గానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం చట్టవిరుద్ధం. రితబ్రతను పార్టీ ఎప్పుడో బహిష్కరించింది. అసలు పార్టీలో సభ్యత్వమే లేని వ్యక్తి, తృణమూల్ కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నాయకుడు ఎలా కాగలరు?" అని ప్రశ్నించారు.
"బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ చేసినలాంటి ఈ పని దేశంలో మరెక్కడా జరగలేదు. పార్టీలోనే లేని నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించారు. పార్టీ ఈ వ్యవహారాన్ని చట్టపరంగా సవాలు చేస్తుంది" అని చెప్పారు.
దీంతో పాటు, టీఎంసీ ఇప్పుడు తన ఎంపీల కదలికలపైనా నిఘా ఉంచింది.
ముఖ్యంగా, నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన కాకోలి ఘోష్ దస్తీదార్ కూడా తిరుగుబాటు చేయడంతో, ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీలో జరిగినట్లే ఇక్కడ కూడా ఎంపీలు చేజారిపోతారేమోనన్న భయాందోళనలు టీఎంసీలో వ్యక్తమవుతున్నాయి.
బుధవారం అర్ధరాత్రి మమత బెనర్జీ నివాసంలో జరిగిన టీఎంసీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.

ఫొటో సోర్స్, Sanjay Das
దిల్లీ వైపు అడుగులు
మరోవైపు, బెంగాల్‌లో అధికారం ఇప్పటికే చేజారగా.. ఇప్పుడు పార్టీ కూడా దాదాపు చేజారిపోయే పరిస్థితి రావడంతో మమత దిల్లీపై దృష్టి కేంద్రీకరించారు. అభిషేక్‌తో కలిసి జూన్ 8న దిల్లీలో జరగబోయే ఇండియా బ్లాక్ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతి సీటులోనూ ప్రతిపక్ష కూటమి తరపున ఒకే ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే ఫార్ములాను మమత గట్టిగా సమర్థించబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
"మమత ఆ సమావేశంలో ఒక కొత్త ఫార్ములాను ప్రతిపాదించబోతున్నారు" టీఎంసీ లీడర్ ఒకరు అన్నారు.
కానీ, ఆ ఈ విషయంపై వివరంగా మాట్లాడటానికి నిరాకరించారు.
"ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శుభేందు అధికారి మొదటిసారి దిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడే, అక్కడి బంగ భవన్‌లో రితబ్రత బెనర్జీ ఆయనను కలిశారు. పార్టీలో తిరుగుబాటుకు బీజాలు ఆ రోజే పడ్డాయి" అని మరొక టీఎంసీ లీడర్ అన్నారు.
అయితే బీజేపీ నాయకులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.
"ఇది తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం. దీనితో బీజేపీతో సంబంధం లేదు" అని బీజేపీ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు శమీక్ భట్టాచార్య అన్నారు.
ప్రస్తుత పరిస్థితులకు బీజేపీనే కారణమని టీఎంసీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో ఏకీభవిస్తోంది. ఈ చీలికను టీఎంసీ అంతర్గత విషయంగా బీజేపీ చెబుతున్నప్పటికీ, తెర వెనుక వారి మద్దతు లేకపోతే రితబ్రతకు తిరుగుబాటు చేసే ధైర్యం వచ్చేది కాదని, ఇంతమంది ఎమ్మెల్యేల మద్దతూ లభించేది కాదని కాంగ్రెస్, టీఎంసీలు ఆరోపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Sanjay Das
మమత పోటీ చేస్తారా?
తృణమూల్ కాంగ్రెస్ వర్గాల కథనం ప్రకారం, 1984 తర్వాత మధ్యలో ఉన్న రెండు సంవత్సరాలు మినహాయిస్తే, మమత ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా లేకుండా ఉన్న సందర్భం లేదు. కానీ, ప్రస్తుతానికి ఆమె లోక్‌సభకు లేదా అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశం ఏదీ కనిపించడం లేదు.
ప్రస్తుతం బసిర్‌హాట్ లోక్‌సభ స్థానం ఎంపీ హాజీ నూరుల్ ఇస్లాం మరణం వల్ల ఖాళీ అయింది, అక్కడ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. కానీ, ఆ స్థానంలో మమతను బరిలోకి దించే సాహసాన్ని పార్టీ చేయబోదని.. అక్కడ ఓటమి ఎదురైతే ఆమె ప్రతిష్ట, పార్టీ పరువు మరింతగా దెబ్బతింటాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
టీఎంసీలో తిరుగుబాటుకు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మమతా బెనర్జీనే బాధ్యురాలిగా పేర్కొంటున్నాయి.
"బెంగాల్‌లో వామపక్ష కూటమితో తలపడేందుకు మమతా బెనర్జీనే బీజేపీ ఇక్కడ పునాదులు వేసుకోవడానికి సాయం చేశారు. ఆ తప్పిదానికి ఇపుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. పార్టీ ఈ స్థితికి చేరడానికి ఆమే కారణం" అని సీపీఎం నాయకుడు మొహమ్మద్ సలీమ్ అన్నారు.
"ఒకప్పుడు కాంగ్రెస్‌ను చీల్చి తృణమూల్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసింది మమతా బెనర్జీనే. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతోంది. మమతా కూడా సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు" అని మమతను ఎక్కువగా విమర్శించే, కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి అన్నారు.

ఫొటో సోర్స్, Samir Jana/Hindustan Times via Getty Images
సంక్షోభం నుంచి బయటపడగలరా?
మమత తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో గతంలోనూ ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయాలు సాధించారని, కానీ ఈసారి ఆమెకు పరిస్థితులు అత్యంత కఠినంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
"మమత విజయాల రహస్యం ఏమిటంటే, ఆమె వెనుక నాయకులు, కార్యకర్తల సైన్యంతో పాటు సామాన్య ప్రజల భారీ మద్దతు కూడా ఉండటం" అని సీనియర్ జర్నలిస్ట్ పులకేశ్ ఘోష్ అన్నారు.
"కానీ, ఎన్నికల ఫలితాలను బట్టి ఇప్పుడు ఆమెకు అటు ప్రజా మద్దతు గానీ, ఇటు అంతమంది నాయకులు గానీ మిగిలి లేరని స్పష్టమవుతోంది. ఇలాంటి స్థితిలో ఈ తిరుగుబాటు ద్వారా ఎదురైన సవాలును అధిగమించడం ఆమెకు అంత సులువు కాకపోవచ్చు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతానికి మమత ముందున్న అతిపెద్ద సవాలు పార్టీ ఎంపీలను ఐక్యంగా ఉంచడమేనని, తద్వారా అసెంబ్లీ మోడల్ అక్కడ కూడా పునరావృతం కాకుండా చూసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యార్థి రాజకీయాల రోజుల నుంచి మమత రాజకీయ ఒడిదొడుకులను దగ్గర నుంచి గమనించిన సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకురాలు మోనిదీపా బెనర్జీ మాట్లాడుతూ "ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత ఎంపీలు కూడా ఇదే బాటలో నడుస్తారా అనే ప్రశ్నే ఇప్పుడు మమతా బెనర్జీని వేధిస్తూ ఉండవచ్చు" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































