'ఇక్కడే పెరిగాం, తల్లిదండ్రులయ్యాం, పిల్లల పెళ్లిళ్లు చేశాం, కానీ ఇప్పుడు..' భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లిపోతున్న వారు ఏమంటున్నారంటే..

పశ్చిమ బెంగాల్, వలసదారులు, భారత్, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Uttarayan Chakraborty/BBC

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడానికి పశ్చిమ బెంగాల్‌లోని హకీంపూర్ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్దకు ప్రతిరోజూ చాలామంది వస్తున్నారు.
    • రచయిత, అమితాబ్ భట్టాచార్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

అక్రమ మార్గాల్లో భారత దేశానికి వచ్చిన వారు 'స్వచ్ఛందంగా' తిరిగి వెళ్లాలనుకుంటే వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

అయితే, ఈ ప్రకటనకు ముందే ప్రతిరోజూ ఎంతోమంది సరిహద్దులు దాటి బంగ్లాదేశ్‌కు వెళ్లడానికి సత్‌ఖీరా, పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇదే సరిహద్దు వద్ద నాకు బచ్చు మున్షీ అనే వ్యక్తి కలిశారు.

"నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రుల చెయ్యి పట్టుకుని భారతదేశానికి వచ్చాను. ఇక్కడికి వచ్చి దాదాపు 38 ఏళ్లు అవుతోంది, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, పిల్లలు పుట్టారు. వారి పెళ్లిళ్లు కూడా ఇక్కడే చేశాను" అని ఆయన చెప్పారు.

కోల్‌కతాలోని దమ్‌దమ్ విమానాశ్రయం సమీప ప్రాంతంలో తాము నివసించేవాళ్లమని బచ్చు మున్షీ తెలిపారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపూర్ సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్దకు చేరుకున్నారు. వారి స్వస్థలం బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లా అని ఆయన చెప్పారు.

ప్రతిరోజూ ఆయనలాంటి ఎంతోమంది పురుషులు, మహిళలు, చిన్నారులు హకీంపూర్ సరిహద్దుకు చేరుకుంటున్నారు. కొందరు బంగ్లాదేశ్‌లోని జెస్సోర్, మరికొందరు ఖుల్నా, ఇంకొందరు సత్‌ఖీరా నుంచి భారత్‌కు వచ్చామని చెబుతున్నారు. వారిలో కొందరు రెండేళ్ల కిందట వస్తే, మరికొందరు ఐదారేళ్ల కిందట వచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొన్నిరోజులకే ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఒక ప్రకటన చేశారు.

'బంగ్లాదేశ్ చొరబాటుదారులను' ఇకపై ఇక్కడ ఉండనివ్వబోమని, వారిని తిరిగి పంపించేస్తామని అన్నారు.

ఆ తర్వాత నుంచి, గత వారం రోజులుగా ప్రతిరోజూ ఉదయం ఎంతోమంది తమ దేశానికి తిరిగి వెళ్లడానికి సరిహద్దుల వద్దకు చేరుకుంటున్నారు.

హకీంపూర్ నివాసి హసనూర్ గాజీ మాట్లాడుతూ, "ప్రారంభంలో ప్రతిరోజూ 10-12 మంది వచ్చేవారు, ఆ తర్వాత ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. మూడు రోజుల నుంచి ఆ సంఖ్య వందల్లోకి చేరింది" అని అన్నారు.

తాము 'అనధికారికంగా' భారతదేశానికి వచ్చామని, పశ్చిమ బెంగాల్‌లో 'అక్రమంగా' ఉంటూ పనులు చేసుకుంటున్నామని సరిహద్దుల వద్దకు వచ్చిన చాలామంది చెప్పారు.

పశ్చిమ బెంగాల్, వలసదారులు, భారత్, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Uttarayan Chakraborty/BBC

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌కు వెళ్లడానికి చాలామంది సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు.

సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఒక రోజు

హకీంపూర్ ప్రాంతం ఉత్తర 24 పరగణాలలోని స్వరూప్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. బీఎస్‌ఎఫ్ చెక్‌పోస్ట్‌ దాటిన తర్వాత తరాళీ గ్రామం, ఆపై సోనాయ్ నది వస్తాయి. ఆ నదికి అవతలి వైపు బంగ్లాదేశ్‌లోని సత్‌ఖీరా జిల్లా ఉంది.

హకీంపూర్ స్థానిక నివాసి ముస్తఫా షావోజీ మాట్లాడుతూ, "బంగ్లాదేశ్ చొరబాటుదారులు రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని ముఖ్యమంత్రి ప్రకటించారు, అప్పటి నుంచి చాలామంది బంగ్లాదేశ్ తిరిగి వెళ్లడానికి ఇక్కడకు వస్తున్నారు" అని చెప్పారు.

సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద మొదట వారిని ఒక పాడుబడిన ఇంట్లో వేచి ఉండాలని కోరడం కనిపించింది. అక్కడి నుంచి పోలీసులు ప్రతి కుటుంబాన్ని పిలిచి వారి పత్రాలను తనిఖీ చేస్తున్నారు. వారి వద్ద బంగ్లాదేశ్ గుర్తింపు కార్డు ఉందో లేదో చూస్తున్నారు. పేరు, గుర్తింపు, బంగ్లాదేశ్‌లోని ఏ జిల్లాలో వారి పూర్వీకుల ఇల్లు ఉండేది వంటి వివరాలన్నీ నమోదు చేసుకుంటున్నారు. ఫోటోలు కూడా తీస్తున్నారు.

ఇదంతా పూర్తయ్యాక, వారు సరిహద్దు చెక్‌పోస్ట్ సమీపంలో వేచి ఉంటున్నారు.

వారిని బంగ్లాదేశ్‌కు ఎలా పంపుతున్నారనే దానిపై స్థానిక ప్రభుత్వ యంత్రాంగం లేదా బీఎస్‌ఎఫ్ అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయితే, తాము అంతా గమనిస్తున్నామని హకీంపూర్ ప్రజలు చెబుతున్నారు.

పశ్చిమ బెంగాల్, వలసదారులు, భారత్, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Uttarayan Chakraborty/BBC

ఫొటో క్యాప్షన్, కొందరు రెండు - నాలుగేళ్లుగా, మరికొందరు చాలాకాలంగా భారత్ అక్రమంగా నివసిస్తున్నారు.

హకీంపూర్ నివాసి, వ్యాపారి హసనూర్ గాజీ మాట్లాడుతూ, "చెక్‌పోస్ట్ వద్ద వీరి పత్రాలను తనిఖీ చేస్తున్నారు, బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత బీఎస్‌ఎఫ్ వీరిని సరిహద్దు వైపు తీసుకువెళుతుంది. ఇక్కడికి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో అమోదియా అనే కాలినడక సరిహద్దు ఉంది, అక్కడి నుంచే దాటిస్తున్నారు. ఇది పగటిపూట జరుగుతుంది, కొన్నిసార్లు రాత్రి వరకు కూడా అవుతుంది. చాలా పత్రాలు తనిఖీ చేస్తున్నారు" అని వివరించారు.

బీబీసీ బంగ్లా గత బుధవారం హకీంపూర్ సరిహద్దు చెక్‌పోస్ట్‌కు చేరుకున్నప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. పత్రాలను తనిఖీ చేసిన తర్వాత, బంగ్లాదేశ్ తిరిగి వెళ్లాలని అనుకునే వారిని వేచి ఉండమని చెప్పారు. సాయంత్రం వరకు వారిని అక్కడే ఉంచారు.

ఆ తర్వాత వారిని బస్సుల్లో కూర్చోబెట్టి, స్వరూప్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 'హోల్డింగ్ సెంటర్' లేదా తాత్కాలిక శిబిరాలకు తరలించారు.

పశ్చిమ బెంగాల్, వలసదారులు, భారత్, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Uttarayan Chakraborty/BBC

ఫొటో క్యాప్షన్, బచ్చు మున్షీ (కుడి వైపు నుంచి మూడవ వ్యక్తి) మాట్లాడుతూ, తనకు భారతదేశ ఓటర్ కార్డ్ కూడా వచ్చిందని, ఒకసారి ఓటు కూడా వేశానని చెప్పారు.

'భారత ఓటర్ కార్డ్ కూడా చేయించుకున్నారు'

సరిహద్దు దాటి బంగ్లాదేశ్ తిరిగి వెళ్లడానికి అక్కడ గుమిగూడిన వారిలో చాలామంది వద్ద భారత దేశానికి చెందిన వివిధ గుర్తింపు కార్డులు ఉన్నాయని స్థానిక నివాసి ముస్తఫా షావోజీ తెలిపారు.

"చాలామంది వద్ద భారత దేశ గుర్తింపు కార్డులు ఉన్నాయి, కొందరి వద్ద ఫోటోతో కూడిన ఓటర్ గుర్తింపు కార్డు కూడా ఉంది – మేం చూశాం. అందరూ బహుశా ఈ విషయం చెప్పకపోవచ్చు, కానీ కొందరు మాకు చూపించారు" అన్నారు.

తమ వద్ద భారతదేశ ఓటర్ కార్డ్ ఉందని సరిహద్దు వద్ద వేచి ఉన్న కొందరు వ్యక్తులు కూడా అంగీకరించారు. వారిలో ఒకరు బచ్చు మున్షీ. ఈయన దాదాపు 38 ఏళ్ల కిందట బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చారు.

"చాలా ప్రయత్నాలు చేసి ఓటర్ కార్డ్ చేయించుకున్నాను. ఇతర గుర్తింపు కార్డులు, పాన్ కార్డ్ కూడా చేయించుకున్నాను. మొదటిసారి నేను ఇక్కడ 2024లో ఓటు వేశాను" అని బచ్చు మున్షీ అన్నారు.

కానీ, 2026 ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) సమయంలో ఆయన కుటుంబం పేరును జాబితా నుంచి తొలగించారు.

పశ్చిమ బెంగాల్, వలసదారులు, భారత్, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Uttarayan Chakraborty/BBC

ఫొటో క్యాప్షన్, పత్రాల తనిఖీ తర్వాత బంగ్లాదేశ్ తిరిగి వెళ్లడానికి వేచి ఉన్న ప్రజలు.

ఇదే సమయంలో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటైన కొద్దిరోజులకే, ముఖ్యమంత్రి శుభేందు అధికారి కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిని ఇకపై ఉండనివ్వబోమని అన్నారు.

సరిహద్దు వద్ద ఉన్న నజ్మా మాట్లాడుతూ, "బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మమ్మల్ని ఇక ఇక్కడ ఉండనివ్వమని చెప్పారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నా దేశానికి తిరిగి వెళ్లిపోతున్నాను. బంగ్లాదేశీయులు పట్టుబడితే జైల్లో పెడతారు. ఇప్పుడు తిరిగి వెళ్లే అవకాశం ఇచ్చారు, అందుకే వెళుతున్నా" అని చెప్పారు.

తాను బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లా నివాసినని ఆమె తెలిపారు.

పశ్చిమ బెంగాల్, వలసదారులు, భారత్, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Uttarayan Chakraborty/BBC

ఫొటో క్యాప్షన్, షాహీన్ ఆలమ్ మోల్లా కుటుంబం సరిహద్దు చెక్‌పోస్ట్ వైపు వెళుతోంది. తాము బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ వాసులమని వారు చెప్పారు.

'ఇకపై ఎప్పటికీ తిరిగి రాను'

హకీంపూర్ సరిహద్దుకు చేరుకున్న మిగిలిన వారు కూడా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే, ఇకపై భారతదేశంలో నివసించడం సాధ్యం కాదనే విషయం తమకు 'అర్థమైందని' చెబుతున్నారు.

బంగ్లాదేశ్‌లోని సత్‌ఖీరా జిల్లా నివాసినని చెప్పుకుంటున్న రైసా పర్వీన్ మాట్లాడుతూ, "బీజేపీ గెలిచినప్పటి నుంచి బంగ్లాదేశీయులను ఇకపై ఇక్కడ ఉండనివ్వబోమని చెబుతోంది. అందుకే నేను నా భర్త, పిల్లలతో కలిసి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎస్‌ఐఆర్ సమయంలో పలువురితో పాటు మా తల్లిదండ్రులు కూడా బంగ్లాదేశ్ తిరిగి వెళ్లిపోయారు" అని చెప్పారు.

" ప్రభుత్వం ప్రకటన చేసింది, దాంతో పాటు మేం నివసించే ప్రాంతంలో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంటి యజమానులు కూడా ఇప్పుడు మమ్మల్ని ఉండనివ్వడం లేదు" అని షేక్ మసూద్ రానా చెప్పారు.

అఖ్తరుల్ మోరల్ అనే వ్యక్తి మాట్లాడుతూ, "పోలీసులు వచ్చి గొడవ చేస్తున్నారు, బంగ్లాదేశీయులు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. గతంలో ఎస్‌ఐఆర్ జరిగినప్పుడే వెళ్లిపోయి ఉంటే బాగుండేది" అన్నారు.

"మా దేశంలో ఎలాంటి పనులు చేసుకోగలనో చూస్తాను. కానీ, భారత్ మాత్రం తిరిగి రాను. ఒకవేళ ఎప్పుడైనా సందర్శించడానికి వచ్చినా, చట్టబద్ధమైన మార్గంలో పాస్‌పోర్ట్ చేయించుకుని మాత్రమే వస్తాను" అని షాహీన్ ఆలమ్ మోల్లా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)