‘సల్వార్‌ను విప్పడానికి ప్రయత్నించడం’ అత్యాచార యత్నం కాదన్న పట్నా హైకోర్టు, ఇలాంటి తీర్పులు ఎందుకు వస్తున్నాయి?

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images)
- రచయిత, సీటు తివారి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
పట్నా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, లైంగిక నేరాల విషయంలో న్యాయమూర్తులు మరింత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది.
ఛాతీని నొక్కడం, పైజమా నాడాను లాగడానికి ప్రయత్నించడం అత్యాచార యత్నం పరిధిలోకి రావని జూలై 9న ఒక కేసు విచారణలో భాగంగా పట్నా హైకోర్టు వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాది శోభా గుప్తా పట్నా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్టు లైవ్ లా వెబ్సైట్ కథనం పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు వి.మోహన, జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు పట్నా హైకోర్టు తీర్పు ప్రస్తావనకు వచ్చింది.
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఇలాంటి తీర్పునే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. అలహాబాద్ హైకోర్టు 2025 మార్చిలో ఇచ్చిన ఒక తీర్పులో "బాధితురాలి రొమ్ములను తాకడం, పైజామా నాడాని లాగడం అత్యాచారం లేదా అత్యాచార యత్నంగా పరిగణించలేం" అని పేర్కొంది.
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై 2025 మార్చి 26న సుప్రీంకోర్టు స్టే విధించింది.
తీర్పు వెలువరించేముందు తగినంత పరిశోధన చేయకపోవడంపై సూర్యకాంత్ విచారం వ్యక్తం చేశారు. పట్నా హైకోర్టు తీర్పుపై ధర్మాసనం సమగ్ర ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు.


ఫొటో సోర్స్, Getty Images
పట్నా హైకోర్టు తీర్పు దేనిపైన?
ఈ కేసు బిహార్‌లోని బాంకా జిల్లాకు సంబంధించినది. నిందితుడు హిమాంశు కుమార్ పాఠక్ అలియాస్ మిథియా పాఠక్ ఆ జిల్లాలో ఒక ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నారు.
జనవరి 19, 2008 సాయంత్రం 4.30 గంటల సమయంలో ఒక యువతి తన తండ్రితో కలిసి ఫొటో తీయించుకోవడానికి స్టూడియోకు వచ్చారు.
హిమాంశు కుమార్ పాఠక్ ఆ యువతిని స్టూడియోలోకి తీసుకెళ్లి ఫొటో తీశాక, కంప్యూటర్లో ఫొటో ఎలా వచ్చిందో చూడడంటూ ఆమె తండ్రిని బయటకు పంపి స్టూడియో తలుపు మూసేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ తర్వాత హిమాంశు యువతి శరీరాన్ని తాకుతూ, ఆమె పైజామాను విప్పడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈలోగా యువతి కేకలు వేయడంతో ఆమె తండ్రి స్టూడియో తలుపు తెరవడానికి ప్రయత్నించారు. అయితే నిందితుడు తలుపు తెరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటికే అక్కడకి చుట్టుపక్కలవారు చేరుకున్నారు.
ఈ కేసులో దిగువ కోర్టు 2013 నవంబర్‌లో తీర్పు వెలువరించింది.
ట్రయల్ కోర్టు హిమాంశును అత్యాచారయత్నం, అక్రమ నిర్బంధానికి సంబంధించి ఐపీసీ సెక్షన్లు 376/511, 342 కింద దోషిగా నిర్థరించింది. సెక్షన్ 376/511 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా, సెక్షన్ 342 కింద ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించింది.
ఈ తీర్పును హిమాంశు పాఠక్ పట్నా హైకోర్టులో సవాలు చేశాడు. అక్కడ హిమాంశు తరఫు న్యాయవాదులు అజయ్ ముఖర్జీ, గణేశ్ శర్మ దిగువ కోర్టు తీర్పు తప్పని, అన్యాయమని వాదించారు.
అలాగే ఘటన జనవరి 19న జరిగితే, ఎఫ్ఐఆర్ జనవరి 20న ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి సరైన కారణం చెప్పలేదని వాదించారు.
మరోవైపు హిమాంశుపై మోపిన అభియోగాలు తీవ్రమైనవని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభయ్ కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసులో బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు, దర్యాప్తు అధికారి, ఒక ప్రత్యక్ష సాక్షి సాక్షులుగా ఉన్నారు. అయితే విచారణ సమయంలో ప్రత్యక్ష సాక్షి తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఈ కేసులో న్యాయమూర్తి పూర్ణేందు సింగ్ ఇచ్చిన 23 పేజీల తీర్పులో లైంగిక ప్రవేశం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. అత్యాచార యత్నంగా పరిగణించదగిన స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవన్నారు. వైద్యపరమైన నిర్ధరణ లేకపోవడం వల్ల ఈ కేసులో సెక్షన్ 376/511ను వర్తింపచేయలేమని పేర్కొన్నారు.
అయితే నిందితుడు యువతిని స్టూడియోలో బంధించేందుకు బలవంతంగా ప్రయత్నించాడని, ఆమె సల్వార్ విప్పడానికి ప్రయత్నించాడని, ఛాతీని నొక్కాడని, కోర్టు అంగీకరించింది.
"ఉద్దేశపూర్వకంగా ఓ మహిళపై దౌర్జన్యంగా ప్రవర్తించడం, ఆమె గౌరవానికి భంగం కలిగిస్తుందనే అవగాహన నిందితుడికి ఉందని, అందువల్ల ఈ కేసుకు ఐపీసీ సెక్షన్ 354 వర్తిస్తుందని " అని కోర్టు పేర్కొంది.
సెక్షన్ 354 మహిళ గౌరవాన్ని అవమానపరిచే ఉద్దేశంతో దాడి చేయడం లేదా దౌర్జన్యానికి దిగడాన్ని సూచిస్తుంది.

ప్రాసిక్యూషన్ బలహీనంగా ఉందా?
ఈ కేసులో యువతికి వైద్య పరీక్షలు నిర్వహించలేదు.
ఐపీసీ సెక్షన్ 376/511 కింద ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిరూపించడంలో విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ కేసులో సాక్షి, దర్యాప్తు అధికారిగా ఉన్న కైలాశ్ ప్రసాద్ చాలా తక్కువ కాలం మాత్రమే కేసు బాధ్యతలు నిర్వహించారు. ఆయన సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయలేదు. తుది అభియోగపత్రం కూడా దాఖలు చేయలేదు.
ఈ కేసులో తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని కోర్టు ఒక 'స్వతంత్ర సాక్ష్యం'గా పరిగణించలేదు.
న్యాయవాది ప్రతిమ కుమారి దళిత మహిళలపై హింసకు సంబంధించిన కేసులపై పనిచేస్తున్నారు.
"ప్రాసిక్యూషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం వల్ల నేరస్తులకు ప్రయోజనం కలుగుతోంది. దళిత మహిళల కేసుల్లో ఈ నిర్లక్ష్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో అత్యాచారం ఆరోపణల నిందితులు నిర్దోషులుగా తేలుతున్నారు, హత్య కేసులో మాత్రమే శిక్షను ఎదుర్కొంటున్నారు" అన్నారు.
ఈ కేసులో హైకోర్టు, దిగువ కోర్టు తీర్పును రద్దు చేసి, అన్ని ఆరోపణల నుంచి నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
సున్నితత్వం లోపించిందా?
మహిళలకు సంబంధించి ఇలాంటి కేసులలో హైకోర్టులు వెలువరిస్తున్న తీర్పులలో వివాదాస్పదంగా పరిగణిస్తున్నవి గత కొంతకాలంగా వెలుగులోకి వస్తున్నాయి.
దుస్తులపై నుంచి మైనర్ బాలిక ఛాతీభాగాన్ని తాకడం లైంగిక దాడిగా పరిగణించలేమని 2021లో బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. స్కిన్-టు- స్కిన్ కాంటాక్ట్ లేదని కోర్టు పేర్కొంది.
అలహాబాద్ హైకోర్టు 2025 ఏప్రిల్‌లో ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ, ఆ కేసులో మహిళే సమస్యను కొనితెచ్చుకుందని వ్యాఖ్యానించింది.
అంతకుముందు 2025 ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు రొమ్ములను తాకడం, పైజామా నాడను లాగడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం పరిధిలోకి రావని పేర్కొంది.
2026 ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు లైంగిక ప్రవేశం లేకుండా, వీర్యస్కలనం జరగడం అత్యాచారంగా పరిగణించలేమని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఇలాంటి తీర్పులు మహిళలు, వారి కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
"పట్నా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు న్యాయ వ్యవస్థలో ఉన్నవారిలో సున్నితత్వం లోపించిందనే విషయాన్ని మాత్రమే కాదు, మహిళల గౌరవం, వారి హక్కులు, వారి భద్రత ఎంతవరకు రాజీకి గురవుతున్నాయో కూడా ఎత్తిచూపుతోంది" అన్నారు.
"ఇలాంటి తీర్పులు మహిళలకు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఇది వారి మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరం. అత్యాచార బాధితులకు కౌన్సెలింగ్ ఏర్పాటు ఉంది. కానీ న్యాయ వ్యవస్థే ఇలాంటి తీర్పులిస్తే మహిళలు ఏం చేయాలి?" అని ఆమె ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Samarth Kumar
"మహిళలను న్యాయమూర్తులుగా నియమించకపోతే ఇలాంటి తీర్పులే వస్తాయి"
పట్నా హైకోర్టును 1916లో స్థాపించారు.
"హైకోర్టు వందేళ్ల చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ మహిళా న్యాయమూర్తులు పదిమంది కూడా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం హైకోర్టులో 44 మంది న్యాయమూర్తులు ఉండగా, వారిలో ఇద్దరు మాత్రమే మహిళలు" అని ఈ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఒక మహిళ, తన పేరు వెల్లడించకూడదనే షరతుతో బీబీసీతో అన్నారు.
"వారిలో ఒకరు తెలంగాణకు చెందినవారు కాగా, మరొకరు స్థానికులు. మహిళలను కీలక స్థానాల్లోకి రానివ్వకపోతే ఇలాంటి సున్నితత్వం లేని తీర్పులే వస్తాయి" అని ఆమె అన్నారు.
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఇచ్చిన సమాధానం ప్రకారం, 2026 మార్చి 17 నాటికి దేశంలోని హైకోర్టుల్లో పనిచేస్తున్న మొత్తం 803 మంది న్యాయమూర్తుల్లో 113 మంది మాత్రమే మహిళలు ఉన్నారు.
"ఇలాంటి కోర్టు తీర్పులకు రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది పితృస్వామ్య భావజాలం. దాని నుంచి మన న్యాయమూర్తులు కూడా పూర్తిగా బయటపడలేకపోతున్నారు. రెండోది మహిళా న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటం" అని దేశంలోని పది రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్ అధ్యక్షురాలు కె. శాంతా అన్నారు.
"సల్వార్ విప్పేందుకు ప్రయత్నించడం అత్యాచార యత్నం కాదని ఏ మహిళా న్యాయమూర్తి అయినా చెప్పగలరా? సమస్య ఏంటంటే మహిళలకు సామర్థ్యం ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థలో వారికి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ఈ తక్కువ ప్రాతినిధ్యం న్యాయవ్యవస్థకే చేటు చేస్తోంది. ఎందుకంటే ఇలాంటి తీర్పులు సాధారణ ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో మొత్తం వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి" అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































