కిమ్ జోంగ్ ఉన్ తన తల్లి గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు?

- రచయిత, సంగ్మీ హాన్
- హోదా, బీబీసీ న్యూస్ కొరియన్, సియోల్ నుంచి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ చుట్టూ ఎన్నో మిస్టరీలు ఉన్నప్పటికీ, ఆయన తల్లి గురించి ఎప్పుడూ ప్రస్తావించకపోవడం మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది.
అధికారంలోకి వచ్చిన 15 ఏళ్ల కాలంలో కిమ్ తన తల్లి పేరును ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రస్తావించలేదు.
ఈ వంశపారంపర్య నియంతృత్వ చట్టబద్ధత "మౌంట్ పేక్టూ" వంశంపై ఆధారపడి ఉంది. కొరియా ద్వీపకల్పంలోని అత్యంత ఎత్తైన పర్వతమైన మౌంట్ పేక్టూ ఆధారంగా ఈ పేరు వచ్చింది.
దీనిని కొరియా ప్రజల పురాణ జన్మస్థలంగా కొలుస్తారు. అలాగే, కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్.. జపాన్ వలస పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం సాగించిన ప్రదేశంగా కూడా చెబుతారు.
ఈ పాలక వంశంలోని కంగ్ పాన్ సోక్ (కొరియా స్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ తల్లి), కిమ్ జోంగ్ సుక్(కిమ్ జోంగ్ ఇల్ తల్లి) ఇద్దరినీ "కొరియా తల్లులు"గా గౌరవిస్తారు. కానీ, కో యాంగ్ హుయ్‌కి మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. ఆమె గౌరవార్థం కూడా దేనికీ పేరు పెట్టలేదు.
కో యాంగ్-హుయ్ గురించి ఈ మౌనం ఆమె సామాజిక నేపథ్యం, ఆమె అధికారికంగా భార్య కాకపోవడం వల్ల కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయాలు పాలక వ్యవస్థ ప్రతిష్ఠకు లేదా స్థిరత్వానికి సవాలుగా మారే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.


ఫొటో సోర్స్, Cheong Seong-chang
కో యాంగ్ హుయ్ 1952లో, జపాన్‌లోని ఒసాకాలో జన్మించారని, ఆమె తల్లిదండ్రులు ప్రస్తుత ప్రత్యర్థి భూభాగమైన దక్షిణ కొరియాలోని జెజు ఐలాండ్‌కు చెందినవారని చరిత్రకారులు చెబుతున్నారు.
జపాన్‌లో నివసించిన కారణంగా, కో కుటుంబాన్ని "జైనిచి కొరియన్లు" అని పిలిచేవారు. వీరు 1910 – 1945 మధ్య కొరియా ద్వీపకల్పం జపాన్ వలస పాలనలో ఉన్న సమయంలో జపాన్‌కు వలస వెళ్లిన కొరియన్ల సంతతి వీరు.
ఉత్తర కొరియాకు తిరిగి వచ్చిన ఈ కుటుంబాలను మొదట్లో ప్రజలు అసూయతో చూసేవారు. ఎందుకంటే, వారు పెట్టుబడిదారీ దేశమైన జపాన్ నుంచి నగదు, దుస్తులు, గృహోపకరణాలు తీసుకొచ్చేవారు.
అయితే వారిని "జేపో" అనే అవమానకరమైన పేరుతో కూడా పిలిచేవారు. విదేశీ, ప్రమాదకరమైన భావజాలాల ప్రభావానికి లోనైనవారని భావించేవారు.
ఉత్తర కొరియాలో ఉన్న కఠినమైన సామాజిక వర్గీకరణ వ్యవస్థను "సోంగ్బున్" అంటారు. ఇందులో జపాన్ నుంచి వచ్చిన కొరియన్లు పూర్తిగా నమ్మదగిన వర్గంలో కాకుండా, పూర్తిగా శత్రువర్గంలో కాకుండా మధ్యస్థ వర్గంలో ఉండేవారు.
అందువల్ల వారిపై నిఘా ఎక్కువగా ఉంటుంది. వారికి ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లేదా ఉన్నత ఉద్యోగాలు దొరకడం కష్టమవుతుంది.
ఉత్తర కొరియా సమాజం చాలా స్థాయిలుగా విభజితమై ఉంటుంది. ఇది కొంతవరకు కులవ్యవస్థ లాంటిదని కొందరు నిపుణులు అంటున్నారు.
అలాగే, ఒక కుటుంబ సభ్యుడు చేసిన తప్పు వల్ల మొత్తం కుటుంబం ఇబ్బందులు లేదా శిక్షలు ఎదుర్కొనే పరిస్థితి అక్కడ ఉంటుందని డాంగ్యాంగ్ యూవర్సిటీకి చెందిన డాక్టర్ జియాంగ్ యాంగ్-టే చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Yoji Gomi
"సిండ్రెల్లా" కథ
కో యాంగ్ హుయ్ సుమారు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఉత్తర కొరియాకు వలస వెళ్లింది.
1959 నుంచి 1984 మధ్య, సుమారు 93,000 మంది కొరియన్లు జపాన్ నుంచి కమ్యూనిస్టు దేశమైన ఉత్తర కొరియాకు వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని "ప్యారడైజ్ ఆన్ ఎర్త్" (భూమిపై స్వర్గం) క్యాంపెయిన్ అని పిలిచేవారు. తిరిగి వచ్చిన వారికి ఉచిత వైద్యం, విద్య, ఉద్యోగాల్లాంటి మంచి జీవితం ఉంటుందని వాగ్దానం చేశారు.
అయితే, కో యాంగ్ హుయ్ మాత్రం తనలాంటి ఇతర జైనిచి కొరియన్లు ఎదుర్కొన్న కఠిన జీవితం నుంచి తప్పించుకున్నారు. అందుకు కారణం ఆమె అప్పటి నాయకుడు కిమ్ జోంగ్ ఇల్ దృష్టిని ఆకర్షించడమే.
కిమ్ జోంగ్ ఇల్ కూడా తన భార్య లేదా భాగస్వామిని ఎప్పుడూ బహిరంగంగా చూపించలేదు. ఆయన అప్పటికే కిమ్ యాంగ్ - సూక్ అనే సైనిక ఉన్నతాధికారి కుమార్తెను వివాహం చేసుకున్నారని సమచారం. ఆ పెళ్లి ఆయన తండ్రి కిమ్ ఇల్ సంగ్ కుదిర్చిందని చెబుతారు.
"మన్సుడే ఆర్ట్ ట్రూప్" అనే ప్రతిష్టాత్మక కళా బృందంలో కో యాంగ్ హుయ్ సభ్యురాలు. ఆమె సహజ సౌందర్యం, నృత్య నైపుణ్యాల వల్ల కిమ్ జోంగ్ ఇల్ దృష్టిని ఆకర్షించారని, 2025లో కో యాంగ్ హుయ్ గురించి పుస్తకం రాసిన జపాన్ రిపోర్టర్ యోజి గోమి తెలిపారు.

ఫొటో సోర్స్, Cheong Seong-chang
కో యాంగ్ హుయ్ అధికారికంగా సుప్రీం లీడర్‌ను పెళ్లి చేసుకోకపోయినప్పటికీ, ప్రభుత్వం అధికారికంగా వారి సంబంధాన్ని గుర్తించనప్పటికీ, ఆమె "సిండ్రెల్లా వంటి జీవితం" గడిపారని గోమి అంటారు.
కిమ్ జోంగ్ ఇల్ అప్పటికే అధికారికంగా వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు కిమ్ యాంగ్ సూక్. ఈమె ఒక ఉన్నత స్థాయి సైనిక అధికారి కుమార్తె. ఈ వివాహాన్ని కిమ్ ఇల్ సంగ్ స్వయంగా నిర్ణయించారు.
యాంగ్ హుయ్‌ను కిమ్ జోంగ్ ఇల్ చాలా ప్రేమించేవారు. తర్వాతి కాలంలో ఆమె దేశ రాజకీయాలపై కూడా ఆసక్తి చూపినట్టు వార్తా కథనాలు చెబుతున్నాయి.
అయితే, అధికారిక భార్య కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో ఉండగా.. కో యాంగ్ హుయ్, ఆమె ముగ్గురు పిల్లలు సుమారు 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీరప్రాంత నగరం వోన్సన్లో ఉండేవారు.
"కిమ్ జోంగ్ ఉన్ అధికారిక భార్యకు పుట్టిన కుమారుడు కాదు, కో యాంగ్ హుయ్‌కి కలిగిన అక్రమ సంతానం" అని నార్తర్న్ రీసర్చ్ అసోసియేషన్‌కు చెందిన కిమ్ హ్యుంగ్ సు పేర్కొన్నారు.
"ఉత్తర కొరియాలో పేక్టూ వంశాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు, కాబట్టి తమ నాయకుడు ఒక జేపో కొడుకు అనే ఆలోచనను కూడా అంగీకరించలేరు."
వివాహేతర సంబంధాల వల్ల పుట్టిన పిల్లలపై అక్కడ తీవ్ర అపహాస్యానికి గురవుతారు. కమ్యూనిస్ట్ వ్యవస్థగా చెప్పుకున్నప్పటికీ, అక్కడి సమాజం కన్ఫ్యూషియన్ ( చైనా, కొరియా, జపాన్, వియత్నా వంటి తూర్పు ఆసియా దేశాల్లో కుటుంబ వ్యవస్థ, సామాజిక క్రమశిక్షణ వంటి అంశాలపై తీవ్ర ప్రభావం చూపిన కన్ఫూషియన్ తత్వం) విలువలతో బలంగా ప్రభావితమై ఉంటుంది. పితృభక్తి, విశ్వాసం వంటి భావనలను ప్రజల్లో బలంగా నాటుతారని నిపుణులు చెబుతున్నారు.
కో యాంగ్ హుయ్ కుమారుడు కిమ్ జోంగ్ ఉన్ రాజధానికి దూరంగా పెరిగారని గోమి చెబుతున్నారు.
"ఆ సమయంలో వోన్సన్ నుంచి జపాన్‌కు ఫెర్రీ నడిచేది. అందువల్ల అక్కడికి వచ్చే వ్యక్తులను కలవడం, జపాన్ వస్తువులు తీసుకోవడం ఆమెకు చాలా తేలిక.
కో యాంగ్ హుయ్ జపాన్‌లోని తన ఇంటిని చాలా మిస్ అయ్యేవారు. ఆమె తన పిల్లలకు జపనీస్ భాష కూడా నేర్పించారు."
కిమ్ జోంగ్ ఉన్ జపనీస్ పాటలు బాగా పాడేవారని, జపాన్ ఆర్థిక అభివృద్ధిని ఇష్టపడేవారని కిమ్ జోంగ్ ఇల్ వద్ద 1988 నుంచి 2001 వరకు సుషీ చెఫ్‌గా పనిచేసిన కెంజీ ఫుజిమోటో తన పుస్తకంలో రాశారు.
అలాగే, చిన్న వయసులో కిమ్ జోంగ్ ఉన్ తన అన్నతో కలిసి జపాన్‌లోని టోక్యో డిస్నీలాండ్‌ను సందర్శించినట్లు అప్పట్లో అధికారులను ఉటంకిస్తూ జపాన్ మీడియా రాసింది.
కో యాంగ్ హుయ్ కూడా తన సెక్రటరీతో కలిసి విడిగా జపాన్ను సందర్శించినట్టు గోమి రాశారు.

ఫొటో సోర్స్, Cheong Seong-chang
వారసత్వం
"కో యాంగ్ హుయ్‌ను తన కోడలిగా కిమ్ ఇల్ సంగ్ అధికారికంగా ఎన్నడూ గుర్తించలేదు" అని ప్రవాసంలో ఉన్న ఉత్తర కొరియా దౌత్యవేత్త రియూ హ్యూన్ వూ తన 'కిమ్ జోెంగ్ ఉన్ సీక్రెట్ వాల్ట్' అనే పుస్తకంలో రాశారు.
ఒకవేళ యాంగ్ హుయ్కు కిమ్ ఇల్ సంగ్ ఆమోదం లభించి ఉంటే.. కిమ్ ఇల్ సంగ్‌తో మనవడు కిమ్ జోెంగ్ ఉన్ ఫోటోలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి ఉండేవని సెజోంగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ చెయోంగ్ సియోంగ్ చాంగ్ అంటున్నారు.
అయితే, అలా జరగనప్పటికీ కో యాంగ్ హుయ్ దేశానికి ప్రథమ మహిళగా వ్యవహరిస్తూ, తన భర్తతో పాటు సైనిక తనిఖీలకు వెళ్లేవారు. ఆయన పరివారంతో కూడా స్నేహంగా ఉంటూ కిమ్ జోంగ్ ఇల్ నమ్మకాన్ని సంపాదించుకున్నారు.
కిమ్ జోంగ్ ఇల్ మరణం (2011) తర్వాత రూపొందించిన ఒక అధికారిక డాక్యుమెంటరీలో కూడా ఆమె కనిపించారు. కానీ, అందులో ఆమె పేరుగానీ లేదా నేపథ్యంగానీ ప్రస్తావించలేదు.
ఆ డాక్యుమెంటరీని బహిరంగంగా విడుదల చేయలేదని, 2012 జూన్‌లో కేవలం ఉన్నతాధికారులకు మాత్రమే చూపించారని డాక్టర్ చెయోంగ్ చెప్పారు. అయితే, ఆ తర్వాత అది లీకై ప్రజల్లోకి వెళ్లింది. దీంతో కో యాంగ్ హుయ్ గురించి ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొనడంతో ఆ డాక్యుమెంటరీని ఉపసహంహరించుకున్నారని అన్నారు. అలాగే, ఆమె నేపథ్యం ప్రభుత్వ చట్టబద్ధతను ప్రశ్నించగలదని అన్నారు.
ఆమె నిజంగా తన కుమారుడు కిమ్ జోంగ్ ఉన్ వారసుడిగా ఎదగడానికి కృషి చేశారని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు.
ఒకవైపు కిమ్ జోంగ్ ఇల్ పెద్ద కుమారుడు కిమ్ జోంగ్ నామ్ వారసత్వాన్ని విమర్శించినందున ఆయన్ని తొలగించారు. ఆయన విదేశాల్లో చదువుకుని అనేక దేశాలు తిరిగారు. అందువల్ల ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారని చెబుతారు.
మరోవైపు ఇంకొక కుమారుడు కిమ్ జోంగ్ చుల్‌కు మాదకద్రవ్యాల అలవాటు ఉండడంతో వారసుడిగా పరిగణించలేదని కొన్ని కథనాలు చెబుతున్నాయి.
చివరికి కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం వల్ల తన తండ్రికి ఇష్టమైన వారసుడయ్యారు.
స్విట్జర్లాండ్‌లో చదువుతున్న కిమ్ జోంగ్ ఉన్ను, ఆయన అన్నను చూసుకునే బాధ్యత కో యాంగ్ హుయ్ సోదరి, ఆమె భర్త తీసుకున్నారు. కానీ, యాంగ్‌కు క్యాన్సర్ వచ్చాక 1998లో వారు అమెరికాకు వెళ్లిపోయారు. ప్రభుత్వానికి ఇక తమ అవసరం ఉండకపోవచ్చని వారు భయపడ్డారని 2016లో వచ్చిన వాషింగ్టన్ పోస్ట్ ఇంటర్వ్యూలో ప్రచురించారు.
తరువాత పరిస్థితులు చాలా మారాయి. కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి వచ్చాక వారు భయపడింది నిజమే అనిపించింది. ఎందుకంటే, వారి బంధువులలో ఒకరికి మరణశిక్ష కూడా అమలు చేశారని, అలాగే ఆయన అన్న కిమ్ జోంగ్ నామ్‌ను మలేషియాలో హత్య చేసినట్టు వార్తలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Yoji Gomi
కిమ్ జోంగ్ ఇల్ కంటే ముందే కో యాంగ్ హుయ్ మరణించారు. ఆమె ఫ్రాన్స్‌లోని ఒక ఆసుపత్రిలో చనిపోయాక కూడా, ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు.
కిమ్ జోంగ్ ఉన్ పుట్టుక, కుటుంబ నేపథ్యం చాలా రహస్యంగా ఉంచండం వల్ల, ఆయన పుట్టిన రోజు కూడా తాత, తండ్రిలా జాతీయ సెలవు దినంగా ప్రకటించలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆయన పుట్టుక గురించి ఎక్కువగా మాట్లాడితే ఆయన తల్లి ఎవరు, ఆయన్ను ఎందుకు రాజధాని ప్యాంగ్యాంగ్లో పెంచలేదు అనే ప్రశ్నలు వచ్చేవని అంటారు. అందుకే "నిజం బయటపడితే అనుమానాలు వేగంగా వ్యాపిస్తాయి" అని ఒక పరిశోధకుడు చెప్పారు.
ఆయన నేపథ్యం కారణంగా ఆయన సామాజిక స్థానం అధికారికంగా తక్కువగా పరిగణించే ప్రమాదం ఉండేదని కొంతమంది రచయితల అభిప్రాయపడ్డారు.
ఈ గోప్యత కారణంగానే ఆయన తన భార్య రి సోల్ జును మొదట్లో బహిరంగంగా చూపించారు. అలాగే భవిష్యత్ నాయకురాలు కిమ్ కూతురు కిమ్ జు ఏ అని కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు.
రియి సోల్-జు గురించి సమాచారం ప్రకారం, ఆమె ప్యాంగ్యాంగ్లో ఉన్న ఉన్నత మధ్యతరగతి కుటుంబానికి చెందిన మాజీ గాయని. ఆమె తండ్రి యూనివర్సిటీ ప్రొఫెసర్ అని కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆమెను చైనాలో శాస్త్రీయ సంగీతం చదవడానికి ప్రభుత్వం పంపింది. ఇది మంచి సామాజిక స్థాయికి సూచనగా భావిస్తారు.
చివరగా విశ్లేషకుల ప్రశ్న ఏమిటంటే, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తన తల్లి మూలాల గురించి ప్రస్తావించగలరా?
ఇది ఉత్తర కొరియా ప్రచార యంత్రాంగానికి సైతం పెద్ద సవాలే.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























