లక్షల మంది రొమ్ము క్యాన్సర్ రోగులు కీమోథెరపీ నుంచి తప్పించుకోవచ్చు - అధ్యయనం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలిసియా కర్రీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన డీఎన్ఏ పరీక్ష ద్వారా, లక్షలాది మంది రొమ్ము క్యాన్సర్ బాధితులు కీమోథెరపీ నుంచి తప్పించుకోచ్చని అధ్యయనంలో తేలింది.
అంటే, రొమ్ము క్యాన్సర్ రోగుల్లో ఎవరికి కీమోథెరపీ చేస్తే ప్రయోజనం, ఎవరికి చేయాల్సిన అవసరం లేదనేది ఈ పరీక్ష ద్వారా కచ్చితంగా గుర్తించవచ్చని తాజా క్లినికల్ ట్రయల్స్ స్పష్టం చేస్తున్నాయి.
ఈ అంతర్జాతీయ అధ్యయనంలో పాల్గొన్న వారిలో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మంది రోగులను కీమోథెరపీ దుష్ప్రభావాల నుంచి తప్పించి, వారికి కేవలం హార్మోన్ థెరపీతోనే చికిత్స చేయవచ్చని తేలింది.
కీమోథెరపీ ప్రాణాలను నిలిపినా, దానిలో వాడే ఔషధాల వల్ల నిస్సత్తువగా మారిపోవడం, వాంతులవడం, జట్టు రాలడం, రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం, సంతాన సమస్యలు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి.
యూనివర్సిటీ కాలేజీ లండన్ (యూసీఎల్) నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనంలో.. బ్రిటన్, నార్వే, స్వీడన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, థాయ్‌లాండ్ దేశాలలో 40 ఏళ్లకు పైబడిన, ఇటీవల ఈ వ్యాధి నిర్ధరణ అయిన 4 వేల మందికి పైగా రోగులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
వారిలో రొమ్ము క్యాన్సర్ వృద్ధికి కారణమయ్యే 50 జన్యువుల కార్యకలాపాల స్థాయిని కొలిచేందుకు, రోగికి ఈ వ్యాధి తిరిగి వచ్చే ప్రమాదాన్ని అంచనా వేసేందుకు ‘ప్రోసిగ్నా’ అనే జన్యు పరీక్ష చేశారు శాస్త్రవేత్తలు.

అందులో తక్కువ స్కోర్ వచ్చిన మూడింట రెండొంతుల మందికి కీమోథెరపీ చికిత్స చేయలేదు. అయినప్పటికీ, ఐదేళ్ల తర్వాత వారిలో సర్వైవల్ రేటు (బతికున్నవారు) 93.7 శాతంగా ఉంది. అదే చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేయించుకున్న రోగుల సర్వైవల్ రేటు 94.9 శాతంగా నమోదైంది.
రొమ్ము క్యాన్సర్‌కు ప్రాథమిక చికిత్స కింద తొలుత సర్జరీ చేసి కణితులను తొలగిస్తారు. ఆ తర్వాత ఇది తిరిగి వచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు తరచూ కీమోథెరపీని సిఫార్సు చేస్తారు.
అలాగే, రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశలో ఉండి, అది సమీపంలోని లింఫ్ నోడ్స్‌కు (శోషరస గ్రంథులకు) వ్యాపించిన రోగులకు కూడా సాధారణంగా కీమోథెరపీని అందిస్తుంటారు.
అత్యంత సాధారణ రకానికి చెందిన రొమ్ము క్యాన్సర్‌తో బాధపడే రోగులకు ఈ చికిత్స వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వైద్యులు ఆందోళన చెందుతున్నట్లు యూసీఎల్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రయోగ ఫలితాలతో ఏడాదికి 5 వేల మందికి పైగా రోగులు కీమోథెరపీ చేయించుకోవాల్సిన అవసరం లేదని యూనివర్సిటీ తెలిపింది.
కార్డిఫ్‌కు చెందిన కారెన్ బోన్హామ్ కూడా ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. ఫలితాలు ''ఎంతో ఉపశమనం'' కలిగించాయని, ''క్రిస్మస్ పండుగ వచ్చినట్లు'' అనిపించిందని అన్నారు.
64 ఏళ్ల ఈ మహిళ.. ప్రోసిగ్నా పరీక్ష వల్ల కీమోథెరపీ తప్పించుకున్నారు. దానికి బదులుగా ఆమె ఎనిమిదేళ్ల పాటు రేడియోథెరపీ, హార్మోన్ థెరపీని పొందారు.
''క్యాన్సర్ నిర్ధరణ కావడం, దాని చికిత్స తీవ్ర ఇబ్బందిని కలిగించవచ్చు'' అని అన్నారు.
''అది కచ్చితంగా మిమ్మల్ని అనిశ్చిత ప్రపంచంలోకి నెట్టేస్తుంది. జీవితంలోని ప్రాధాన్యతలన్నీ ఒక్కసారిగా తల్లకిందులవుతాయి. మీరు కేవలం బతికుంటే చాలని మాత్రమే కోరుకుంటారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అధ్యయన ఫలితాలను శనివారం అమెరికాలోని చికాగోలో జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ సదస్సు 'ది అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ యాన్యువల్ మీటింగ్'లో వెల్లడించనున్నారు.
''చికిత్సను మరింత పర్సనలైజ్డ్‌గా (వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లు) మార్చేందుకు ఈ ఫలితాలు ఒక ముఖ్యమైన, గణనీయమైన ముందడుగును సూచిస్తున్నాయి'' అని యూసీఎల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని బ్రెస్ట్ ఆంకాలజీ ప్రొఫెసర్, ప్రయోగానికి సంబంధించిన చీఫ్ ఇన్వెస్టిగేటర్, ప్రొఫెసర్ రాబ్ స్టెయిన్ అన్నారు.
కేవలం సంప్రదాయ వైద్య విధానాలపైనే ఆధారపడకుండా.. చికిత్సకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు ట్యూమర్ బయోలజీని ఈ ట్రయల్‌లో విజయవంతంగా ఉపయోగించారు.
ఇక రోగుల విషయానికొస్తే.. కీమోథెరపీ వల్ల కలిగే మానసిక, శారీరక వేదనను, దీర్ఘకాలిక దుష్ప్రభావాలను చాలామంది తప్పించుకోవచ్చు.
అయితే, యూసీఎల్ ప్రకారం.. 40 ఏళ్లకు లోబడిన వారికి ఈ ప్రయోగ ఫలితాలు వర్తిస్తాయో లేదో తెలియదు. ఈ ఫలితాలు రావడానికి మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























