వీబీ-జీ రామ్‌జీ: దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే వేతనాలు తక్కువగా ఎందుకున్నాయి?

వీబీ-జీ రామ్‌జీ, ఉపాధి హామీ పథకం, కరవు పని

ఫొటో సోర్స్, Arijit Sen/Hindustan Times via Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

తమిళనాడు.. 345

కేరళ.. 401

కర్ణాటక.. 381

ఆంధ్రప్రదేశ్.. 312

తెలంగాణ.. 308

ఇవన్నీ ఆయా రాష్ట్రాలకు వచ్చిన ర్యాంకులు కాదు.. వీబీ-జీ రామ్‌జీ- వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్(గ్రామీణ్)లో కూలీలకు అందనున్న రోజువారీ వేతనాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రేటు కార్డు ప్రకారం, దక్షిణ భారత్‌లోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కూలీలకు చెల్లించే వేతనాలు తక్కువగా ఉన్నాయి.

''మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉన్నప్పటి నుంచే తక్కువ వేతనాలు ఉండేవి. ఇప్పుడు అవే కొనసాగుతున్నాయి'' అని లిబ్ టెక్ ఇండియా ప్రతినిధి బుద్ధా చక్రధర్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అభ్యంతరాల నేపథ్యంలోనే అమలు

వేతనాల పెంపు విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

''గత్యంతరం లేని పరిస్థితిలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే ఆలోచనతో వీబీ-జీ రామ్‌జీ చట్టాన్ని 2026 జులై 1 నుంచి తెలంగాణలో అమల్లోకి తెచ్చేందుకు నోటిఫికేషన్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది'' అని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్(గ్రామీణ్) చట్టం, 2025ను తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.

వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు తగ్గట్టుగా చట్టాన్ని తీసుకువచ్చినట్లుగా నిరుడు డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కొత్త చట్టంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా, భాజపాయేతర రాష్ట్రాలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఇందులో ప్రధానంగా నిధుల ఖర్చు విషయంలో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్రాల వాటా 40 శాతంగా ఉంది. ఇది రాష్ట్రాలపై భారం మోపడమేనని తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

''గతంలో పది శాతంగా ఉన్న రాష్ట్రాల వాటాను 40 శాతానికి పెంచడం అంటే రాష్ట్రాలపై భారం మోపడమే'' అని తెలంగాణ మంత్రి సీతక్క గతంలో బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పారు.

రాష్ట్రాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి వీబీ-జీ రామ్‌జీ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కూలీలకు చెల్లించే వేతనాలపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.

వీబీ-జీ రామ్‌జీ, ఉపాధి హామీ పథకం, కరవు పని

ఫొటో సోర్స్, I&PR Andhra Pradesh

దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లోనే తక్కువ

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో, జులై 2 కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీబీ-జీ రామ్‌జీ పథకాన్ని ప్రారంభించారు.

''యూపీఏ ప్రభుత్వం ఉండగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీ రూ.100 లభించేది. ఇప్పుడు రోజువారీ కూలీ రూ.300కు చేరుకుంది'' అని చెప్పారు.

కొత్త చట్టం ప్రకారం చూస్తే, తెలంగాణ, ఏపీలో రోజువారీ కూలీ మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది.

నరేగా పథకం కింద 2009లో రోజువారీ కనీస వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.100గా ప్రకటించిందని, తర్వాత నుంచి కేంద్రం ఏటా కూలీ రేట్లు సవరిస్తోందని హైదరాబాద్‌కు చెందిన వోక్సన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

''ఈ కూలీ రేట్లు నిర్ణయించే విషయంలో ఆయా ప్రాంతాల్లో ఉండే వినియోగ ధరల సూచీతో అనుసంధానిస్తూ ఉపాధి హామీ కూలీలకు కేంద్రం వేతనాలను ప్రకటిస్తుంటుంది'' అని అన్నారాయన.

వీబీ-జీ రామ్‌జీ, ఉపాధి హామీ పథకం, కరవు పని

ఫొటో సోర్స్, Getty Images

వీబీ-జీ రామ్‌జీ కింద పని చేసే కూలీలకు రోజువారీ వేతనం ఏపీలో రూ.312గా నిర్ణయించగా, తెలంగాణలో రూ.308గా మాత్రమే ఉంది.

ఇదే సమయంలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాలు.. కేరళలో రూ.401, కర్ణాటకలో రూ.381, తమిళనాడులో రూ.345గా ఉన్నాయి.

వేతనాల పెంపు వల్ల తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని ప్రొఫెసర్ టి.సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

''ఉపాధి హామీ పథకంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 2024-25లో రూ.300గా రోజువారీ వేతనాన్ని నోటిఫై చేశారు. ఈ లెక్కన ఏపీలో రూ.12, తెలంగాణలో రూ.8 మాత్రమే పెరిగినట్లుగా చూడాలి. అంటే, వేతనాల పెంపు సుమారు 2-4 శాతంగానే ఉంది.

ఏ రాష్ట్రాల్లో అయితే వేతనాలు తక్కువగా ఉన్నాయో, అంటే రూ.300 కంటే తక్కువగా ఉన్నాయో.. అక్కడ మాత్రం 24-30 శాతం వరకు పెరుగుదల కనిపించింది'' అని చెప్పారాయన.

అయితే, ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల కంటే అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ సహా మరికొన్ని రాష్ట్రాలలో రోజువారీ వేతనం తక్కువగానే ఉందని ప్రొఫెసర్ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

వీబీ-జీ రామ్‌జీ, ఉపాధి హామీ పథకం, కరవు పని

ఫొటో సోర్స్, Getty Images

'వ్యవసాయ కూలీ రేట్లకు లింకు పెట్టడంతోనే సమస్య'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13,372 గ్రామాల పరిధిలో 66.57 లక్షల జాబ్ కార్డులున్నాయి. 1.17 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి రోజుకు సగటున రూ.264.31 లభిస్తున్నట్లుగా వీబీ-జీ రామ్‌జీ వెబ్ సైట్ ప్రకారం తెలుస్తోంది.

ఇక, తెలంగాణలో 12,976 గ్రామాల పరిధిలో వీబీ-జీ రామ్‌జీ పథకం అమలవుతోంది. మొత్తం 52.4 లక్షల జాబ్ కార్డులుండగా, 1.08 కోట్ల మంది కార్మికులున్నారు. సగటున రూ.299 వేతనం వస్తున్నట్లుగా ఉంది.

కూలీల రేట్లు తక్కువగా ఉండటంలో రాష్ట్రాల బాధ్యత కూడా ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం అన్నారు.

''వీబీ-జీ రామ్‌జీ పథకంలో కేంద్రం వాటా కింద 60 శాతం, రాష్ట్రం వాటా కింద 40 శాతం నిధులు కేటాయించే నిబంధన పెట్టడం ఇబ్బందికరంగా మారింది. దీనివల్ల రాష్ట్రాలు కూడా తమపై ఆర్థిక భారం పడకుండా చేస్తున్నాయి. ఇది అంతిమంగా వేతనాలు పెంపు, పనిదినాలపై ప్రభావం పడుతోంది. నిర్దేశిత 125 పనిదినాలకు ఉపాధి కల్పించడం, వేతనాలు పెంచితే ఆర్థికంగా రాష్ట్రంపై భారం పడుతుందని రాష్ట్రాలు చేతులు దులుపుకొంటున్నాయి'' అని అన్నారు.

వ్యవసాయ రంగంపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతోనూ వేతనాల పెంపునకు నిర్ణయం తీసుకోవడం లేదని కె.లోకనాథం అభిప్రాయపడ్డారు.

''ఉపాధి పథకంలో వేతనాలు పెంచితే ఆ ప్రభావం వ్యవసాయ కూలీ రేట్లపై పడుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ కూలీ రేట్లు ఎక్కువగా ఉన్నాయనే భావన ఉంది. అందుకే ఉపాధి రేట్లు పెంచడం లేదు'' అని చెప్పారు.

వీబీ-జీ రామ్‌జీ, ఉపాధి హామీ పథకం, కరవు పని

ఫొటో సోర్స్, Ramesh Pathania/Mint via Getty Images

రాష్ట్రం యూనిట్‌గా హరియాణాలో అధికంగా రూ.409

2005లో జాతీయ ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చినప్పుడు, రోజు కూలీ రూ.60 తగ్గకూడదనే నిబంధన ఉంది. తర్వాత దాన్ని వినియోగ ధరల సూచీలకు తగ్గట్టుగా కేంద్రం పెంచుకుంటూ వచ్చింది.

ఏదైనా నిర్దిష్ట ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వేతన రేటును ప్రకటించే వరకు, కనీస వేతనాల చట్టం, 1948లోని సెక్షన్ 3 ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు నిర్ణయించిన కనీస వేతనమే వర్తిస్తుందని కూడా చట్టంలో పేర్కొంది.

దానివల్ల హరియాణా వంటి రాష్ట్రాల్లో అప్పటికే వ్యవసాయ కూలీ రేట్లు ఎక్కువగా ఉండటంతో దానికి తగ్గట్టుగా ఎక్కువగా ఉన్నాయి.

వీబీ-జీ రామ్‌జీలో‌ హరియాణాలో రూ.409గా రోజువారీ కూలీ రేటును నిర్దేశించింది కేంద్ర ప్రభుత్వం. గోవాలో రూ.406, సిక్కిం(కొండ ప్రాంతంలోని కొన్ని గ్రామ పంచాయతీలు) రూ.450గా రోజువారీ కూలీగా ఉంది.

అలాగే, వీబీ-జీ రామ్‌జీలో జాతీయ సగటు గతంలో ఉన్న రూ.298.8 నుంచి రూ.327.4కు పెంచినట్లుగా కేంద్రం ప్రకటించిందని పీఐబీ రిపోర్టు చేసింది.

దీనివల్ల కనీసం వేతనం సగటున రూ.28.6కు పెరిగినట్లుగా చెబుతోంది.

అయితే, పథకంలో ప్రకటించిన వేతనాలకు క్షేత్రస్థాయిలో అందే వేతనాలకు చాలా వ్యత్యాసం ఉంటోందని లిబ్ టెక్ ఇండియా ప్రతినిధి బుద్ధా చక్రధర్ అంటున్నారు.

''మేం గతంలో నరేగా ఉన్నప్పుడు సర్వే చేశాం. అప్పట్లో నోటిఫైడ్ వేతనాలకు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఇచ్చే వేతనాలకు ఏ మాత్రం సంబంధం ఉండేది కాదు.

కూలీలకు అందించే రోజువారీ వేతనాలు చాలా తక్కువ ఉండేవి. రెండింటి మధ్య వ్యత్యాసం చాలా కనిపించేది.

ఇప్పుడు కూడా వేతనాలు పెంచినా, ఏ మేరకు క్షేత్రస్థాయిలో అమలవుతాయనేది చూడాలి'' అని చెప్పారు.

వీబీ-జీ రామ్‌జీ, ఉపాధి హామీ పథకం, కరవు పని

ఫొటో సోర్స్, Getty Images

ఉపాధి కూలీలను సంఘటిత రంగంలోకి తీసుకువస్తే సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుందని కె.లోకనాథం చెప్పారు.

''ఉపాధి కూలీలను సంఘటిత రంగంలోకి తీసుకురావాలని ఎప్పట్నుంచో కోరుతున్నాం. దానివల్ల కనీస వేతనాలు పెరిగేందుకు వీలుంటుంది'' అని చెప్పారు.

వీబీ-జీ రామ్‌జీ వెబ్ సైట్ ప్రకారం, నోటిఫైడ్ వేతనాల కంటే తక్కువగానే కూలీలకు అందుతున్నట్లుగా స్పష్టమవుతోంది.

వేతనాల విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లుగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) బీబీసీతో చెప్పారు.

''వేతనాలు తక్కువగా నోటిఫై చేశారు. గతంలో ఉన్న వేతనాలకు తగ్గట్టుగా నోటిఫై చేసినట్లుగా కేంద్రం చెబుతోంది. వేతనాలు పెంచాలని కేంద్రానికి లేఖ రాస్తున్నాం'' అని సీతక్క వివరించారు.

ఏపీలో వేతనాలు తక్కువగా ఉండటంపై ఏపీ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ కృష్ణ తేజను బీబీసీ ఫోన్ కాల్ ద్వారా, మేసేజ్ ద్వారా సంప్రదించింది. వారి నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉంది. రాగానే ఈ కథనంలో అప్డేట్ చేస్తాం.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)