ఏపీలో మెగా డీఎస్సీ చుట్టూ 'మెరిట్' వివాదం.. 'ఫస్ట్ ర్యాంకర్ పేరెందుకు తొలగించారు?'

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిరుడు నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణ, మెరిట్ జాబితాల ప్రకటనపై తాజాగా వివాదం రేగింది.
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో, ముఖ్యంగా మెరిట్ జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ తాజాగా ఆరోపణలు చేశారు.
దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీబీసీతో మాట్లాడుతూ బొత్స డిమాండ్ చేశారు.
అయితే, ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగిందని పాఠశాల విద్య శాఖ స్పష్టం చేసింది.
అసలు ఏమిటీ మెరిట్ వివాదం?

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి డీఎస్సీ నిర్వహణ..
ఏపీ సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ 2024 జూన్ 12న తొలిసంతకం మెగా డీఎస్సీ నిర్వహణ ఫైలుపైనే చేశారు.
ఈ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ కోసం ప్రభుత్వం 2025 ఏప్రిల్ 20న షెడ్యూల్ విడుదల చేసింది.
జూన్ 6 నుంచి జులై 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించారు. 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, FB/TDP
ముందే టెట్ నిర్వహణ
ఇక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే, అంటే 2024 అక్టోబర్ 3 నుంచి 21 వరకు ఏపీ టెట్ నిర్వహించారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. చాలామంది డీఎస్సీ అభ్యర్థులు మార్కులు పెంచుకునేందుకు టెట్ పరీక్షలు రాస్తారు. ఇందులో ఎక్కువగా వచ్చిన మార్కులనే డీఎస్సీలో పరిగణనలోకి తీసుకుంటారు.
అయితే, గతంలో నిర్వహించిన టెట్ స్కోర్ వివరాలు విద్యాశాఖ దగ్గర లేకపోవడంతో అభ్యర్థులనే నేరుగా ఆన్లైన్లో టెట్ స్కోరు సవరించుకోవాలని కోరింది.
ఇలా నెలరోజుల్లో దాదాపు నాలుగుసార్లు అవకాశం ఇచ్చింది. చివరగా అభ్యర్థులు ఇచ్చిన టెట్ మార్కుల ప్రకారమే, ఆగస్ట్ 13న సవరించిన టెట్ స్కోర్‌తో డీఎస్సీ స్కోరు కార్డులు విడుదల చేశారు. అనంతరం సెప్టెంబర్ 19న నియామక పత్రాలు జారీ చేస్తామని ప్రకటించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో సెప్టెంబర్ 25న ఆ కార్యక్రమం జరిగింది.

ఫొటో సోర్స్, UGC
ఫస్ట్ ర్యాంకర్ పేరును తొలగించడంతో మొదలైన వివాదం
డీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేటకి చెందిన పి. నవీన్‌కి డీఎస్సీ సోషల్ స్టడీస్ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చినట్లు తొలి జాబితాలో ఉంది. వారం రోజుల తర్వాత వెలువడిన రెండో జాబితాలో అతని పేరు లేదు. ఆ తర్వాత వచ్చిన అన్ని జాబితాల్లోనూ నవీన్ పేరు లేదు.
నవీన్ 2016 నవంబర్ నుంచి ఏపీ SCERT (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)లో ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తూ డీఎస్సీకి ముందే 2025లో అక్కడ ఉద్యోగం మానేశారు.
''డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఏపీ SCERT కూడా భాగం కావడం, ఆయన డీఎస్సీ పరీక్షల ముందు వరకు అక్కడే పని చేయడంతో ఆరోపణలు వచ్చాయి. దీంతో మేం ముందుగానే గ్రహించి మా అనుమతి లేకుండా పరీక్ష రాయడం, వెరిఫికేషన్‌కు హాజరు కాకపోవడంతో నవీన్ అభ్యర్థిత్వం రద్దు చేశాం'' అని విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన వివరణలో పేర్కొంది.
డీఎస్సీ నోటిఫికేషన్ రూల్ 20 ప్రకారం, వెరిఫికేషన్‌కు రాని అభ్యర్థిని తొలగించి ఆ స్థానంలో తదుపరి మెరిట్ అభ్యర్థికి అవకాశం ఇచ్చామని విద్యాశాఖ ఆ వివరణలో స్పష్టం చేసింది.
ఎస్సీఈఆర్టీలో పని చేసిన ఆయన, ముందుగా ఆ శాఖకు సమాచారం ఇచ్చి, సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉందని పేర్కొంది. అయితే, ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరయ్యారని, అందువల్ల ఆయన పేరును తదుపరి ఎంపిక ప్రక్రియల రికార్డు నుంచి తొలగించామని వెల్లడించింది.

ఫొటో సోర్స్, UGC
ఆ అనుమానాలపై మాట్లాడని అధికారులు..
నవీన్ దాదాపు తొమ్మిదేళ్లకిపైగా SCERTలో పనిచేశారని స్వయంగా అధికారులే అంగీకరిస్తున్నారు.
డీఎస్సీ నిర్వహణలో SCERT కీలకంగా ఉన్న నేపథ్యంలో అక్కడే ఏళ్లతరబడి పనిచేస్తున్న నవీన్, డీఎస్సీ పరీక్ష రాస్తున్న విషయం ఆ శాఖ అధికారులకు, సిబ్బందికి ముందుగానే తెలియదా?
అక్కడ నవీన్ ఉద్యోగం మానేశారని అధికారులు చెబుతున్నారు. ఆయన ఎప్పుడు రిజైన్ చేశారు? పరీక్ష నిర్వహణకు ఎన్ని రోజుల ముందు మానేశారు? లేదంటే పరీక్షల తర్వాత మానేశారా?... అనే ప్రశ్నలపై అధికారుల నుంచి సమాధానం రావడం లేదు.
ఇవే ప్రశ్నలపై డీఎస్సీ పరీక్షల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఏపీ SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు.

ఫొటో సోర్స్, UGC
కోర్టును ఆశ్రయించిన అభ్యర్థి..
నవీన్, విద్యాశాఖ అధికారుల నిర్ణయంపై కోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్ నంబర్ 26698/2025 దాఖలు చేయగా.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 సెప్టెంబర్ 25న మధ్యంతర ఉత్తర్వు ద్వారా పిటిషనర్‌ను గ్రీవెన్స్ కమిటీకి పంపింది. ఆ మేరకు ఆయన జోనల్ లెవెల్ కమిటీని ఆశ్రయించారు. తర్వాత తుది అప్పీల్‌కి వెళ్లగా, ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది.
ఈ విషయమై నవీన్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. ఆయన అందుబాటులోకి రాలేదు. నవీన్ సొంతూరు అవనిగడ్డ మండలం కొత్తపేటకి వెళ్లినా ఆయన ఎక్కడున్నాడన్నది తెలియరాలేదు. ఆయన అందుబాటులోకి రాగానే ఆయన వివరణను అప్డేట్ చేస్తాం.

ఫొటో సోర్స్, UGC
మరికొందరి అభ్యర్థుల విషయంలోనూ వివాదం..
మరోవైపు అన్నమయ్య, కడప జిల్లాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ మీడియం) పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని విద్యాశాఖ ప్రకటనలో వెల్లడించింది. ఆ పోస్టుల భర్తీ పూర్తిగా మెరిట్, రోస్టర్ నిబంధన ప్రకారమే జరిగిందని అందులో పేర్కొంది.
మరోవైపు నకిలీ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా విద్యాశాఖ వివరణ ఇచ్చింది.
స్పోర్ట్స్ కోటా, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఈ కేటగిరీలకు చెందిన అభ్యర్థులను నిర్దిష్ట రోస్టర్ పాయింట్లో సర్దుబాటు చేయాల్సి వచ్చిందని వివరించింది.
ఈ కారణంగానే వారి జనరల్ ర్యాంకు తక్కువగా ఉన్నప్పటికీ ఎంపిక పరిధిలోకి రావడం వల్ల వారిని వెరిఫికేషన్‌కి పిలిచామని పేర్కొంది. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదని, చట్టబద్ధంగా ఈ ప్రక్రియ నిర్వహించామని వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబును ట్యాగ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జగన్ పలు ప్రశ్నలను లేవనెత్తారు.
వైఎస్ జగన్ ఆరోపణలు ఏంటంటే..
- పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?
- పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?
- తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?
- టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకు కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు?
పై ప్రశ్నలన్నీ తన ట్వీట్లో జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
‘సీబీటీ ద్వారా నిర్వహిస్తే పేపర్ లీకేజీ ఎలా అవుతుంది’
వైఎస్ జగన్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తూ ఫ్యాక్ట్ చెక్ పేరిట సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో పేర్కొన్న వివరాల మేరకు,
''ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై సోషల్ మీడియా వేదికగా కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాలు. మెగా డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకమైన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో, అత్యున్నత స్థాయి డిజిటల్ భద్రతా ప్రమాణాలతో నిర్వహించాం. మల్టీ–సెషన్ పద్ధతిలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించిన ఈ పరీక్షలలో ప్రశ్నాపత్రం లీకేజ్ కావడం సాంకేతికంగా అసాధ్యం. దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు'' అని పేర్కొంది.
'డేటా డిలీట్ కాలేదు'
''మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ విడుదలైన కేవలం148 రోజుల్లోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేశాం. పరీక్షలు ముగిసిన తర్వాత 2025 అగస్టు 22న అభ్యర్థుల పూర్తి వివరాలు, మార్కులు, ర్యాంకులతో కూడిన అధికారిక మెరిట్ జాబితాలను పారదర్శకంగా వెబ్సైట్లో విడుదల చేశాం. ఆ తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాం. ఎటువంటి డేటా డిలీట్ కాలేదు. డిజిటల్ రికార్డులన్నీ మల్టీ–లెవెల్ వెరిఫికేషన్ సిస్టమ్స్ ద్వారా భద్రంగా ఉన్నాయ'' అని ఆ ప్రకటనలో వెల్లడించింది.
అభ్యర్థులు దరఖాస్తు సమయంలో స్వయంగా ఇచ్చిన 'పోస్ట్ ప్రిఫరెన్స్' ఆధారంగానే ఆటోమేటెడ్ కంప్యూటర్ వ్యవస్థ ద్వారా పోస్టుల కేటాయింపు చేశామని, ఇందులో ఎటువంటి నిబంధనల ఉల్లంఘనా లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కన్వీనర్ నియామకం కూడా ప్రభుత్వ ఉత్తర్వులకు, సేవా నిబంధనలకు అనుగుణంగానే అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగిందని పేర్కొంది.

ఫొటో సోర్స్, UGC
మేం పక్కాగా నిర్వహించాం: పాఠశాల విద్య డైరెక్టర్
దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా బీబీసీతో మాట్లాడారు.''విపక్షాలు చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు. మేం పక్కాగా సాక్ష్యాధారాలతో వివరణ ఇచ్చాం. వందశాతం నిబంధనల మేరకే పరీక్షలు, ఆ తర్వాత ప్రక్రియ జరిపాం'' అని వ్యాఖ్యానించారు.
ఆ వివరణలు సరికాదు: బొత్స
ప్రభుత్వ వివరణ చాలా మొక్కుబడిగా ఉందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బీబీసీకి చెప్పారు. మొత్తం డీఎస్సీ ప్రక్రియ వెనుక పెద్ద స్కాం ఉందనే డౌట్ వస్తోందని ఆరోపించారు.

ఫొటో సోర్స్, UGC
అవన్నీ రాజకీయ ఆరోపణలే: నిరుద్యోగ జేఏసీ
డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఆ తర్వాత ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని ఇందులో తమకు ఎక్కడా అనుమానాలు, అపోహలు లేవని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ బీబీసీతో అన్నారు.
‘‘ఎక్కడా పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు లేవు, అక్రమాలు జరిగినట్లు కూడా ఎక్కడా రుజువులు కనిపించడం లేద’’ని ఆయన అన్నారు.
విపక్ష పార్టీలు కేవలం రాజకీయం కోసమే చేస్తున్నట్టు అనిపిస్తోందని సిద్ధిక్ వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.




























