RCB vs GT: 16వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ మధ్య వాగ్వాదం జరిగిందా?

ఫొటో సోర్స్, Reuters
ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మాన్ విరాట్ కోహ్లీ, మరోసారి చేజింగ్‌లో మాస్టర్ అని నిరూపించుకున్నాడు.
ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే, ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గానే కాకుండా.. అతను మరో కారణం వల్ల కూడా చర్చనీయాంశంగా మారాడు.
అదే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోహ్లీల మధ్య మైదానంలో జరిగిన 'వాదోపవాదాలు'.

గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశిత 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ ఛేదించే క్రమంలో.. మ్యాచ్ 16వ ఓవర్లో మైదానంలో తీవ్ర ఉత్కంఠభరితమైన డ్రామా చోటు చేసుకుంది.
ఈ సమయంలో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఒకరికొకరు వాదించుకున్నట్లుగా కనిపించడం కోట్లమంది క్రికెట్ అభిమానులు టీవీల్లో చూశారు.

ఫొటో సోర్స్, ANI
కోహ్లీ, గిల్ మధ్య వాగ్వాదం
16వ ఓవర్ చివరి బంతితో కోహ్లీ ఇన్నింగ్స్ అక్కడే ఆగిపోయేలా కనిపించింది.
కోహ్లీ 63 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా, గుజరాత్ టైటాన్స్ బౌలర్ అర్షద్ ఖాన్ వేసిన బంతి గాల్లోకి లేవగా, దాదాపు నేలను తాకుతున్న ఆ బంతిని పట్టుకోవడానికి శుభ్‌మన్ గిల్ ముందుకు డైవ్ చేశాడు.
దీంతో, విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడని శుభ్‌మన్ గిల్, గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు.
అదే సమయంలో, మరోవైపు నిల్చున్న జితేష్ శర్మ వద్దకు వెళ్లిన విరాట్ కోహ్లీ, అవుట్ అయ్యానా? అని అడిగినట్లు వీడియోలో కనిపించింది.
అంపైర్ నితిన్ మేనన్ కూడా విరాట్ కోహ్లీ అవుట్ అయినట్లు ప్రకటించారు. అంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని టీవీ అంపైర్‌కు ఇచ్చారు.
ఒక పెద్ద తెరపై భిన్న కోణాల్లో దాన్ని రీప్లే చేశారు. గిల్ ముందుకు డైవ్ చేసి, బంతిని తన వేళ్ల మధ్య పట్టుకోవడానికి ప్రయత్నించగా... బంతిలోని కొంత భాగం నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది.
బంతి పూర్తిగా గిల్ చేతుల్లో లేదు.
దీంతో, పెవిలియన్‌కు తిరిగి వెళ్లే విరాట్ కోహ్లీ కూడా వెనక్కి అడుగు వేశాడు. ఆ తర్వాత వెంటనే టీవీ అంపైర్ విరాట్ కోహ్లీ నాటౌట్ అని ప్రకటించారు.
ఆ సమయంలో కోహ్లీ టీవీ స్క్రీన్ వైపు వేలు చూపిస్తూ గాలిలో పిడికిలి బిగించాడు. గిల్ వద్దకు కూడా వెళ్లి, అతనితో ఏదో చెప్పినట్లు కనిపించాడు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























