అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల రద్దు వివాదం ఏమిటి? వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను కూటమి సర్కారు ఎందుకు రద్దు చేసింది?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్.
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఆర్–5 జోన్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాల రద్దు అంశం ఇప్పుడు చర్చనీయంగా మారింది.
రాజధాని మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా భూములు ఇచ్చారంటూ కూటమి ప్రభుత్వం ఆ కేటాయింపులతో పాటు ఆర్–5 జోన్‌నే రద్దు చేస్తూ మే నెలలో నిర్ణయం తీసుకుంది.
రద్దు చేసిన స్థలాలకు బదులుగా, లబ్ధిదారులకు వారి స్వగ్రామాల్లో లేదా సమీప ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ బీబీసీకి తెలిపారు.
అమరావతిలో పేదలు ఉండకూడదనే కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి బీబీసీతో మాట్లాడుతూ విమర్శించారు.
అసలేమిటీ భూ వివాదం? ఆ ఇళ్ల కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు అమరావతి రైతులు కోర్టుకు ఎందుకు వెళ్లారు?


ఫొటో సోర్స్, UGC
పేదలకు పట్టాలిచ్చిన వైసీపీ సర్కారు
రాష్ట్రంలో పేద మహిళలకు ఒక్కొక్కరికి సెంటు స్థలం కేటాయిస్తూ 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వం 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ప్రకటించింది.
ఆ క్రమంలోనే అమరావతి రాజధాని పరిధిలోని 900 ఎకరాల్లో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 51,000 మందికి పైగా పేద మహిళలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది.
ఆ భూములున్న కురగల్లు, కృష్ణాయపాలెం, మందడం తదితర ప్రాంతాల్లోని 900ఎకరాల స్థలాన్ని ఆర్–5 జోన్‌గా ప్రకటిస్తూ 2023 మే 9న జీవో 59 జారీ చేసింది.
అయితే ఈ కేటాయింపులపై అప్పట్లోనే స్థానిక అమరావతి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని తాము అస్సలు వ్యతిరేకించడం లేదని, అయితే స్థానికులకు కాకుండా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని దూరప్రాంతాల మహిళలకు ఇక్కడ స్థలాలు ఎలా కేటాయిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాము రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూములను స్థానిక పేదలకు కాకుండా ఇతరులకు కేటాయించడం అమరావతి రాజధాని నిర్మాణస్పూర్తికి విరుద్ధమంటూ అప్పట్లో రైతులు విమర్శలు చేశారు.
నాటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.

ఫొటో సోర్స్, UGC
"పేదల ఇళ్లకు వ్యతిరేకం కాదు. కోర్టుకు ఎందుకు వెళ్లామంటే"
దీనిపై నేలపాడుకి చెందిన ధనేకుల రామారావు బీబీసీతో మాట్లాడారు.
"నేలపాడు, నీరుకొండ, శాఖమూరు, కొండమరాజుపాలెం, వెలగపూడి.. ఈ ఐదు గ్రామాల్లో నాకు ఉన్న 50 ఎకరాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చాను. నా మాదిరే చాలామంది రైతులు అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చారు. కానీ గత వ్రభుత్వం స్థానికులకు కాకుండా ఎక్కడెక్కడి వారినో తీసుకువచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించింది. దీనికి వ్యతిరేకంగా మేం సుప్రీంకోర్టుకు వెళ్లాం" అని రామారావు వివరించారు.,
కోర్టుకు వెళ్లిన మందడం గ్రామానికి చెందిన మరో రైతు వీరాంజనేయులు బీబీసీతో మాట్లాడారు.
"నేను 5ఎకరాలను ఇచ్చాను. రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూముల్లో అర్హులైన పేదలకు ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి ఇస్తే ఎలా? అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాం' అని అన్నారు.
అప్పట్లో కోర్టుకు వెళ్లిన రైతులకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ భూముల కేటాయింపులను రద్దు చేసింది.
అసలు ఆర్–5 జోన్‌నే రద్దు చేస్తూ మేలో నిర్ణయించినట్లు తీసుకున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు.

ఫొటో సోర్స్, facebook.com/SatyaAnaganiOfficial
‘ఆర్–5 జోన్ ఏర్పాటు సరైంది కాదు. అందుకే రద్దు చేశాం’.. మంత్రి అనగాని
దీనిపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బీబీసీతో మాట్లాడారు.
ఆ భూముల బదిలీలో లోపాలు ఉన్నాయని, ఆర్–5 జోన్ ఏర్పాటు సరైంది కాదని, దీని వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్‌కి ఆటంకం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
అందుకే దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు.
అయితే పేద మహిళలకు ఇళ్ల స్థలాల కేటాయింపులో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు.
రాజధాని అమరావతిలో పేదల కోసం ప్రత్యేకంగా గృహనిర్మాణ ప్రాజెక్టులను చేపట్టాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి అనగాని బీబీసీకి వివరించారు.
అలాగే స్థానికులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిందిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయని మంత్రి వివరించారు.
రాజధానిలో ఇళ్ల పట్టాలు రద్దయిన అర్హులైన ప్రతి మహిళకీ వారి నివాస ప్రాంతాలకు దగ్గరలో పట్టా ఇస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, MARY
పేదలు అమరావతిలో ఉండకూడదనే: వైసీపీ
పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని దీనిపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాడతామని వైసీపీ అధినేత వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
ఇదే విషయమై వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి బీబీసీతో మాట్లాడుతూ "పేదలు అమరావతిలో ఉండకూడదనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది" అని ఆరోపించారు.
స్థానిక అమరావతి పేదలతో పాటు చుట్టుపక్కల కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని పేద మహిళలకు రాజధానిలో సెంటు భూమి ఇస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు.
తాడేపల్లిలో ఉంటున్న తమకు వైసీపీ ప్రభుత్వం పట్టా ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని మేరీ చెప్పారు.
"నిడమర్రులో నాకు మూడేళ్ల కిందట సెంటు స్థలం ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ స్థలం లేదు. గవర్నమెంటు స్వాధీనం చేసుకుందని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. మేము ఇళ్లల్లో పనులు చేసుకుంటూ తాడేపల్లి బోట్‌యార్డ్‌లో చిన్న షెడ్డు వేసుకుని ఉంటున్నాం. రాజకీయాల సంగతి మాకు తెలియదు. మాకు మళ్లీ పట్టా ఇస్తే అదే చాలు'' అని గతంలో పట్టా వచ్చిన మేరీ బీబీసీతో అన్నారు.

రద్దు చేసిన స్థలాలకు వెంటనే ప్రత్యామ్నాయం చూపాలి: సీపీఎం
రాజధానిలోని ఆర్–5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులను రద్దు చేసిన ప్రభుత్వం వెంటనే ఆ పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.బాబురావు కోరారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ "గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన పట్టాలను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు వేరే ప్రాంతంలోనైనా వారికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వకపోవడం సరికాదు. అమరావతి రైతులకు అక్కడే ఇవ్వాలి. మిగిలిన ప్రాంతాల మహిళలకు ఇప్పుడు వారు నివాసముంటున్న ప్రాంతాల్లో వెంటనే పట్టాలు కేటాయించాలి" అని డిమాండ్ చేశారు.
"కూటమి ప్రభుత్వం స్థలం లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్థానం చేసింది. దాని ప్రకారం ఇళ్ల స్థలాలు రద్దయిన పేదలకు సుమారు 2వేల ఎకరాలు కేటాయించాలి'' అని ఆయన కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























