ఆంధ్రప్రదేశ్: అక్షరాస్యతలో రాష్ట్రం దేశంలోనే అట్టడుగున ఎందుకుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
ఆంధ్ర ప్రదేశ్‌లో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత శాతం సాధించామని.. అందులోనూ ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకున్న 13 మందికి పైగా విద్యార్థులు 595కి పైగా మార్కులు సాధించారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆ క్రమంలోనే సహజంగా కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఇచ్చుకునే అడ్వర్టైజ్మెంట్స్ (ప్రకటనలు) తరహాలో మొదటిసారి ప్రభుత్వం కూడా సర్కారీ స్కూళ్ల విద్యార్థుల ఫలితాలపై వార్తా పత్రికల మొదటి పేజీల్లో ప్రకటనలిచ్చింది.
అయితే, పాఠశాల విద్య ప్రగతిపై నీతి ఆయోగ్ 'స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా: టెంపోరల్ అనాలిసిస్ అండ్ పాలసీ రోడ్‌మ్యాప్' పేరిట ఓ సమగ్ర నివేదికను 2026 మేలో విడుదల చేసింది.
గత పదేళ్ల (2014–15 నుంచి 2024–25) విద్యా విధానాలు, మౌలిక వసతులు, అభ్యాస స్థాయిలను ఈ నివేదిక విశ్లేషించి, ఏపీ విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపింది.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం..
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్మీడియట్‌కు వెళ్లే విద్యార్థుల సగటు 76 శాతంగా ఉంది. జాతీయ సగటు (75.1 శాతం) కంటే ఇది కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ, 24 శాతం మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు.
మాధ్యమిక (సెకండరీ) స్థాయిలో చదువు మానేస్తున్న వారి సంఖ్య 15.5 శాతంగా అత్యధికంగా ఉంది.
ప్రాథమికోన్నత స్థాయిలో (6 నుంచి 8వ తరగతి మధ్యలో) 3.7 శాతం మంది చదువు మానేస్తున్నారు.
విద్యార్థుల ప్రాథమిక అభ్యసన సామర్థ్యాలు, నాణ్యత పడిపోతున్నాయని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉచిత నిర్బంధ విద్య పదో తరగతి తర్వాత అమలు కాకపోవడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోందని వెల్లడించింది. దాంతో పాటు వివిధ సామాజిక కారణాలతో చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని పేర్కొంది.
పదేళ్ల క్రితంతో పోలిస్తే గణితం, భాషా నైపుణ్యాల్లో జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రంలోనూ అభ్యాస ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొంది. అయితే ఇదే సందర్భంలో మౌలిక వసతుల్లో మాత్రం ఒకింత ముందంజలోనే ఉందని పేర్కొంది.
2014–15లో కేవలం 12.3 శాతం బడుల్లో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉండగా, 2024–25 నాటికి అది 99 శాతానికి చేరుకుందని పేర్కొంది. బాలికల విద్య, ప్రాథమికోన్నత స్థాయిలో బాలికల స్థూల ప్రవేశాల నిష్పత్తి 102%కి పెరిగి బాలికల విద్యలో రాష్ట్రం మెరుగైన పనితీరును కనబరిచిందని పేర్కొంది.

అక్షరాస్యతలో చివరి స్థానంలో ఏపీ
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే– పీఎల్ఎఫ్ఎస్ 2023 - 24 గణాంకాల ప్రకారం.. అక్షరాస్యత రేటులో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ చివరి స్థానం (35)లో ఉంది. రాష్ట్రంలో సగటు అక్షరాస్యత రేటు 72.6 శాతంగా నమోదైంది. జాతీయ సగటు అక్షరాస్యత రేటు 80.9 శాతంగా ఉంది. ఈ జాబితాలో మిజోరం (98.2 శాతం) అగ్రస్థానంలో ఉంది.
దేశంలోని అక్షరాస్యతపై లోక్‌సభలో జనార్దన్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్రశ్నకు నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరి 2025 జూలై 21న సమాధానమిచ్చారు.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం, గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ నమూనా సర్వే కార్యాలయం విడుదల చేసిన 2023 – 24 వార్షిక నివేదిక ప్రకారం.. దేశంలో ఏడు సంవత్సరాలు, అంతకంటే పైబడిన వయస్సు గల ప్రజల అక్షరాస్యత శాతం 80.9 గా నమోదైంది.

ఫొటో సోర్స్, Getty Images
బిహార్ కంటే వెనుక...
అక్షరాస్యతలో అట్టడుగునున్న ఏపీ.. 2017–18 నుంచి అదే స్థానంలో కొనసాగుతూ వస్తోంది.
నేషనల్ శాంపిల్ సర్వే 2017–18 సంవత్సరానికి విద్యారంగంపై చేసిన సర్వేలో అక్షరాస్యతలో కేరళ ముందుండగా, ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి స్థానంలో ఉంది. ఈ సర్వే ప్రకారం ఏపీలో 66.4 శాతం మంది అక్షరాస్యులు ఉండగా, బిహార్‌లో 70.9 శాతం ఉన్నారు. తెలంగాణలో 72.8 శాతం ఉన్నారు.
ఆర్థికంగా బాగా వెనకబడినవిగా చెప్పుకునే మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, రాజస్థాన్ల కన్నా కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. ఈ సర్వే ప్రకారం జాతీయ అక్షరాస్యత 77.7 శాతం. దాని కంటే కూడా ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడి ఉంది.
ఇక రాష్ట్ర విభజనకు ముందు జరిగిన 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా... అక్షరాస్యతలో ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడి ఉంది. ఆ లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యత 67.02 శాతం. 2001లో 60.47 శాతం అక్షరాస్యత ఉండేది. ఆ సమయంలో జాతీయ అక్షరాస్యత 74 శాతం.
''నిజానికి బిహార్ అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కంటే వెనుకబడి ఉంది. కానీ, గత పదేళ్లలో బిహార్ కంటే దిగువన, అందరి కంటే అట్టడుగున ఉండటం ఆందోళన కలిగించే విషయమే'' అని విశాఖకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ శ్రీనివాస్ బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.
ఏపీలో 12912 ఏకోపాధ్యాయ బడులు
2024 – 25 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 12,912 ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయని, వీటిలో దాదాపు రెండు లక్షల మంది పిల్లలు చదువుతున్నారని ఈ నివేదిక పేర్కొంది.
ప్రాథమిక స్థాయిలో 21 మంది విద్యార్థులకు ఒకే ఒక టీచర్ ఉండగా, ప్రాథమికోన్నత స్థాయిలో 15 మందికి ఒకరు, సెకండరీలో పదిమందికి ఒకరు, హయ్యర్ సెకండరీలో 30 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని వివరించింది.
ప్రధానంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడితో బోధన వల్ల అభ్యసన స్థాయిలు పడిపోతున్నాయని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, UGC
‘అందుకే అక్షరాంధ్రకు శ్రీకారం’
అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం 'అక్షరాంధ్ర'కు శ్రీకారం చుట్టిందని, వయోజన విద్య కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఏపీ పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా బీబీసీకి తెలిపారు.
''ఈ ఏడాది 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. వచ్చే నాలుగేళ్లలో మొత్తం 81 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం'' అని అన్సారియా వివరించారు.
అంటే మొత్తంగా రాష్ట్రంలో 81 లక్షల మందికి చదవడం, రాయడం తెలియదని, అంకెలపై అవగాహన లేదని సర్వేలు పేర్కొంటున్నాయని ఆమె వివరించారు.
అక్షరాంధ్రలో ఏం చేస్తారంటే..
''అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా 15 నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి చదవడం, రాయడం, చిన్నపాటి లెక్కలను నేర్పుతారు. స్థానికంగా ఉన్న టెన్త్, ఆ పైతరగతుల విద్యార్థులు, స్వయం సహాయక బృందాల్లో చదువుకున్న వారిని ఇన్స్ట్రక్టర్లుగా నియమిస్తారు.
వర్ణమాల, సరళమైన పదాలు, వాక్యాలు నేర్పిస్తారు. వెయ్యి వరకు అంకెలు, కూడికలు, తీసివేతలు, భాగహారాలు, కిలోలు, లీటర్లు, మీటర్ల వంటి కొలతలతో పాటు గడియారం, క్యాలెండర్లను చూసి అర్థం చేసుకోవడం, బస్టాండ్ల లాంటి ప్రాంతాల్లో డిజిటల్ అంకెలను గుర్తించడంపై అవగాహన కల్పిస్తారు. బ్యాంకుల్లో డిపాజిట్, విత్‌డ్రా ఫాంలు నింపడం వంటి శిక్షణ ఇస్తారు.
వంద గంటల పాటు పాఠాలు చెప్పిన అనంతరం ప్రతి సంవత్సరం సెప్టెంబరు, మార్చిలో పరీక్షలు నిర్వహించి వారిని అక్షరాస్యులుగా ప్రకటిస్తారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు'' అని అన్సారియా వివరించారు.

ఫొటో సోర్స్, UGC
‘అట్టడుగు స్థానం నుంచి ముందుకొచ్చాం’
''పీఎల్ఎఫ్ఎస్ గణాంకాల ప్రకారం మనం చివర్లో ఉన్నాం. కానీ గత రెండేళ్లలో మంత్రి లోకేష్ నిర్దేశంలో ఎలాగైనా ముందుకు రావాలని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాం. గతేడాది మనం ఉన్న 72.6 శాతం నుంచి 82 శాతానికి చేరుకున్నాం. జూన్, జూలైలోనే మళ్లీ ర్యాంకులు ప్రకటిస్తారు. ఆ ప్రకటనల్లో కచ్చితంగా మనం ముందుకొస్తాం'' అని ప్రభుత్వ కార్యదర్శి (పాఠశాల విద్య), సీనియర్ ఐఏఎస్ అధికారి కోన శశిధర్ బీబీసీతో అన్నారు.
ఈ ఏడాది 25 లక్షలు, 2026–27లో 25 లక్షలు, 2027–28లో 25 లక్షలు, 2028–29లో 6 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మొత్తంగా 2028 నాటికి వంద శాతం లక్ష్యం పూర్తి చేస్తామని శశిధర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Ravi
మాటల్లో కాదు చేతల్లో చూపాలి: ఎస్టీఎఫ్
సంపూర్ణ అక్షరాస్యత సాధనను పాలకులు మాటల్లో కాదు, చేతల్లో చూపాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శి చావా రవి బీబీసీతో వ్యాఖ్యానించారు.
ఆ మేరకు క్షేత్రస్థాయిలో పక్కాగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
''అక్షరాస్యత విషయంలో ఏపీ అట్టడుగున ఉండటానికి ప్రధాన కారణం... అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇక్కడ విద్య ప్రైవేటుపరం కావడం. ఎక్కడా లేని విధంగా ప్రై వేటు విద్యా సంస్థలు ఏపీలోనే ఎక్కువ ఉంటాయి. అదే సమయంలో ప్రభుత్వ బడుల్లో చేరికలపై దృష్టి పెట్టకపోవడంతో నిరుపేదలు విద్యకు దూరమవుతున్నారు. అలాగే డ్రాపవుట్స్ పెరగడం కూడా.
అయితే పాలకులు ఇప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టామని అంటున్నారు. కేవలం మాటలకే కాకుండా పక్కాగా చేతల్లో చూపించి స్కూళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించి, ఐదేళ్లు దాటిన పిల్లలందరూ స్కూళ్లలో చేరి, కంటిన్యూ అయ్యేలా చర్యలు తీసుకుంటే ఏపీ కూడా ఆ పరిస్థితి నుంచి గట్కెక్కుతుంది'' అని రవి అభిప్రాయపడ్డారు.
''ఆంధ్ర ప్రదేశ్ అంటే చదువులో టాప్‌లో ఉంటారని దేశవ్యాప్తంగా ఒక భావన ఉంది. కొన్నేళ్లుగా జేఈఈ, సివిల్స్ టాపర్స్‌లో తెలుగు విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు.
అలాంటి ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యత విషయంలో చిట్టచివర ఉండడం ఒక పెద్ద ఆశ్చర్యంగా, ఆవేదనగా ఉంది" అని విశాఖ జిల్లా నడుపూరు జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం రాచకొండ శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.
"ప్రభుత్వానికి మేం ఏ సహకారమైనా అందిస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, డేటా హబ్, గ్రీన్ ఎనర్జీలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలనుకునే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం... అక్షరాస్యతకు కూడా ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి దేశంలోకెల్లా ముందుండేటట్లు ప్రణాళికలు రూపొందించాలి.
సంక్షేమ పథకాల అర్హతకు సంపూర్ణ అక్షరాస్యత అనే నిబంధన ఉంటే కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Srinivasulu Reddy
ఏపీ ఇంకా అట్టడుగునే ఎందుకు ఉందంటే..
"వాస్తవానికి రాష్ట్ర విభజనకు ముందు అక్షరాస్యతలో ఏపీ కొంత వెనుకబడి ఉన్నా మరీ దేశంలోనే అట్టడుగున ఉన్న పరిస్థితి లేదు. కానీ, విభజన తర్వాత ఈ స్థితి ఎందుకొచ్చిందంటే ఏపీలో ఎక్కువభాగం ఉన్న ఏజెన్సీ, వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో విద్య, అక్షరాస్యతపై దృష్టి పెట్టకపోవడం ఓ ముఖ్య కారణం" అని రెండు దశాబ్టాలపాటు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి ఆ తర్వాత రెండుసార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చేసిన శ్రీనివాసులు రెడ్డి అభిప్రాయపడ్డారు.
"దేశంలోనే మరెక్కడా లేనన్ని ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లు ఏపీలో ఉన్నాయి. అందుకే జేఈఈ, ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు జాతీయ ర్యాంకులు కూడా సాధిస్తుంటారు. కానీ, సంపూర్ణ అక్షరాస్యత సాధనలో ఏపీ ఇంకా చివరి స్థానంలోనే ఉంది.
ఏజెన్సీ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో వసతులు కొరవడటం, తగినంత మంది టీచర్లు లేకపోవడం, ఫలితంగా మధ్యలోనే చదువు ఆపేసే వాళ్లు ఎక్కువయ్యారు. అక్షరాస్యత కార్యక్రమాలు మొక్కుబడిగా సాగడం వల్ల కూడా పరిస్థితి దిగజారింది'' అని శ్రీనివాసులు రెడ్డి బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు.
కానీ కొంతకాలంగా పాలకులు సీరియస్‌గానే దీనిపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందనీ , ఫలితాలు వచ్చేవరకూ పాలకులు ఈ విషయమై సరైన కార్యాచరణ అమలు చేయాలని ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, UGC
ఏపీ కంటే తెలంగాణ మెరుగ్గానే ఉన్నా..
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే– పీఎల్ఎఫ్ఎస్ గతేడాది గణాంకాల ప్రకారం అక్షరాస్యత రేటులో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ చివరి స్థానంలో ఉండగా, తెలంగాణ 25వ స్థానంలో ఉంది. ఏపీలో స్థూల అక్షరాస్యత శాతం 72.60 కాగా, తెలంగాణలో ఆ శాతం 76.90గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కాస్త మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ ఇంకా చాలా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్‌కి చెందిన బీఈడీ కాలేజీ కరస్పాండెంట్, సీనియర్ జర్నలిస్ట్ రామదాసు అభిప్రాయపడ్డారు.
"ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత విషయంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎప్పుడూ టాప్‌లో ఉండేవి. ఆ ప్రభావం మొత్తం ర్యాంకింగ్‌పై పడేది. విభజన తర్వాత ఆ తేడా తెలుస్తోంది.
అయితే, ఏపీ కంటే తెలంగాణ ముందున్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇంకా మెరుగైన స్థానంలోనే ఉండాలి. స్కూళ్లల్లో విద్యార్థుల నమోదు పరంగా జాతీయ స్థాయిలో రాష్ట్రం మంచి స్థానంలో ఉన్నప్పటికీ నాణ్యతతో కూడిన విద్యా విధానం ఆశాజనకంగా లేదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
2014 –15లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి 87.93 శాతం ఉండగా 2024 – 25 నాటికి అది 111 శాతానికి చేరింది. డ్రాపవుట్స్ సంఖ్య భారీగా తగ్గింది కానీ బోధన, అభ్యసన కార్యక్రమాల్లో మాత్రం పెద్దగా పురోగతి సాధించలేదని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. వాస్తవ పరిస్థితి కూడా అలానే ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది" అని రామదాసు అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























