లోక్‌సభ సీట్ల పెంపు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు.. ఈ బిల్లులపై విమర్శలు ఎందుకు? దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఏమిటి?

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 'నారీ శక్తి వందన్ అధినియం' బిల్లును 2023లోనే ఆమోదించారు.
    • రచయిత, శుభాంగి మిశ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి గరిష్టంగా 850 వరకు పెంచడం.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడో వంతు సీట్ల రిజర్వేషన్.

కేంద్రప్రభుత్వం మంగళవారం ఎంపీలకు పంపిణీ చేసిన మూడు ముసాయిదా బిల్లులలో ఈ రెండు కీలక మార్పులను ప్రతిపాదించింది.

ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2026, రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026.

ఈ బిల్లులు 2023లో ఆమోదించిన 'నారీ శక్తి వందన్ అధినియం'కు కొనసాగింపుగా తీసుకొచ్చినవే.

ఈ చట్టం ప్రకారం, చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలి. కానీ, మహిళా కోటా అమలును భవిష్యత్తులో జరిగే జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టారు. దీనివల్ల మహిళా కోటాను అమలు చేయడానికి పదేళ్లకు పైగా సమయం పట్టొచ్చని అప్పట్లో చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఒకవేళ మంగళవారం ప్రతిపాదించిన ఈ మూడు బిల్లులు ఆమోదం పొందితే, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే మహిళా కోటా అమలుకు మార్గం సుగమం అవుతుంది.

ఈ మూడు బిల్లులను ప్రతిపక్షాలు మంగళవారం విమర్శించాయి.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.

ముఖ్యంగా, లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కు పెంచాలనే ప్రతిపాదనపై ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించే ప్రమాణాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి దారితీస్తాయని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ మూడు బిల్లుల్లోని ప్రతిపాదనలు, వాటికి సంబంధించిన వివాదాలను వివరంగా చూద్దాం.

పార్లమెంట్ భవనం

ఫొటో సోర్స్, Government of India

లోక్‌సభ సభ్యుల సంఖ్య పెంపుదల

లోక్‌సభలో గరిష్ఠంగా 850 సీట్లు ఉండొచ్చని రాజ్యాంగ (131 సవరణ) బిల్లు-2026 ప్రతిపాదిస్తోంది. ఇందులో రాష్ట్రాల నుంచి 815 సీట్లు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 35 సీట్లు ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లు ఉన్నాయి. లోక్‌సభ సభ్యుల గరిష్ఠ పరిమితిని 550 సీట్లుగా రాజ్యాంగం పరిమితి విధించింది.

దీంతో ఈ రాజ్యాంగబద్ధ గరిష్ఠ పరిమితిని సడలించేందుకు వీలుగా, 1971 జనగణన ఆధారంగా లోక్‌సభ సీట్ల సంఖ్యను పరిమితం (ఫ్రీజ్ చేసిన) చేసిన రాజ్యాంగంలోని 81వ ఆర్టికల్‌ను కూడా సవరించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.

ఈ 81వ ఆర్టికల్‌లోని ప్రొవిజన్ల వల్లే 1976 నుంచి లోక్‌సభ సీట్ల సంఖ్య మారకుండా అలాగే ఉంది.

అంటే, ఇప్పుడున్న లోక్‌సభ సీట్ల సంఖ్యకు 1971 నాటి జనగణన ప్రామాణికం అయితే, మరి ఇప్పుడు పెంచబోయే సీట్ల సంఖ్యకు ఏది ప్రాతిపదిక అవుతుంది?

ఈ ప్రశ్నకు నియోజవర్గాల పునర్విభజన-2026 బిల్లులో సమాధానం దొరుకుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును కూడా ప్రవేశపెడతారు.

చివరగా నమోదు చేసిన జనగణన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడతామని ఈ బిల్లు లక్ష్యాల్లో పేర్కొన్నారు. అంటే 2011 జన గణనను ప్రాతిపదికగా తీసుకుంటారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

ఫొటో సోర్స్, x/mkstalin

ఫొటో క్యాప్షన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

దక్షిణాది రాష్ట్రాల ఆందోళన

ఈ అంశంపైనే దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా చేస్తే తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందంటున్నాయి.

ఒక రాష్ట్ర జనాభాకు, దాని ఎంపీ సీట్ల సంఖ్యకు మధ్య ఉండే నిష్పత్తి.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంచుమించు ఒకేలా ఉండాలనే నియమం ఆధారంగా ప్రతీ రాష్ట్రానికి పార్లమెంటరీ నియోజకవర్గాలను కేటాయిస్తారు.

కొన్నేళ్లుగా భారత్‌లో జనాభా వృద్ధి రేటు అసమానంగా ఉంది. కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను కేటాయించే ప్రస్తుత ప్రాదిపదికనే అమలు చేస్తే, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బలహీనపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

'దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా కుటుంబ నియంత్రణ పాలసీలను అనుసరించాయి. చిన్న కుటుంబాలను ప్రోత్సహించాయి. జనాభా వృద్ధిని అరికట్టడానికి తాము శ్రద్ధగా చేసిన ప్రయత్నాలే ఇప్పుడు తమకు ప్రతికూలంగా మారుతున్నాయని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తాయి' అని బీబీసీతో రాజకీయ విశ్లేషకురాలు అదితి ఫడ్నీస్ అన్నారు.

కుటుంబ నియంత్రణ విధానాలు

‘జనాభా నియంత్రణ పాటించినందుకు శిక్షా?’

పార్లమెంట్ సీట్ల కూర్పులో రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తికి ఎలాంటి భంగం కలగదని కేంద్రం పదే పదే హామీ ఇస్తోంది. అయితే, ఈ హామీని నిలబెట్టేలా ఆ మూడు బిల్లుల్లో ఎలాంటి నిబంధనలు లేవని రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ మంగళవారం ఒక ట్వీట్ చేశారు.

దక్షిణాది రాష్ట్రాల నాయకులు కూడా మంగళవారం తమ ఆందోళనలను వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం అనేది 'ప్రజాస్వామ్యంపై దాడి'గా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభివర్ణించారు.

'జనాభా వృద్ధిని అరికట్టడానికి కుటుంబ నియంత్రణ పాటించాలని కేంద్ర ప్రభుత్వం కోరినప్పుడు మేం క్రమశిక్షణతో ఆ దిశగా చర్యలు చేపట్టాం. మా బాధ్యతాయుతమైన ప్రవర్తనకు గానూ మాకు ఈ శిక్షను విధిస్తున్నారా?' అని వీడియో ప్రసంగంలో ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, X/TelanganaCMO

ఫొటో క్యాప్షన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. 'ప్రో-రాటా మోడల్ (జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు)ను తిరస్కరించడానికి దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కృషిలో భాగస్వామ్యం కావాలి' అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో రేవంత్ రెడ్డి కోరారు.

అయితే, ఈ 850 సీట్లను రాష్ట్రాల మధ్య ఎలా విభజిస్తారనే స్పష్టమైన ఫ్రేమ్‌వర్క్ ఇంకా వెల్లడి కాలేదు.

సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఉండే డీలిమిటేషన్ కమిషన్ దీనిని ఖరారు చేస్తుందని ఈ బిల్లు చెబుతోంది.

ముఖ్యంగా, భవిష్యత్‌లో డీలిమిటేషన్ ప్రక్రియకు ఏ జనగణను ప్రామాణికంగా తీసుకోవాలో నిర్ణయించే అధికారాన్ని పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీకి కట్టబెట్టాలని కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. అంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ సభ్యులు దీనికి ఒప్పుకోవాలి.

మహిళా రిజర్వేషన్ బిల్లు: పార్లమెంటు ఆమోదించింది... కానీ, అమలయ్యేది ఎప్పుడు?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చట్టసభల్లో సీట్ల రిజర్వేషన్ కోసం దశాబ్దాలుగా మహిళా సంఘాలు, మహిళా పార్లమెంటేరియన్లు డిమాండ్ చేస్తున్నారు.

33 శాతం మహిళా కోటా

చట్టసభల్లో సీట్ల రిజర్వేషన్ కోసం దశాబ్దాలుగా మహిళా సంఘాలు, మహిళా పార్లమెంటేరియన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో 78 మంది (14 శాతం), రాజ్యసభలో 42 మంది (18 శాతం) మహిళా ఎంపీలు ఉన్నారు.

సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది ప్రపంచ సగటు 27.2 శాతం కంటే చాలా తక్కువ.

మహిళలకు లోక్‌సభలో, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం కోటా కల్పిస్తూ 2023లో చట్టం చేసినప్పటికీ అది జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమలవుతుందనే నిబంధన విధించారు.

ఈ జాప్యం వల్ల ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం దెబ్బతింటుందని మంగళవారం ప్రతిపాదించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026 పేర్కొంది. అందుకే, చివరిగా నమోదు చేసిన జన గణన (2011 సెన్సస్) ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తూ ఈ కోటాను అమలు చేయాలని ప్రతిపాదించింది.

డీలిమిటేషన్ చేసిన ప్రతీసారి ఈ రిజర్వ్డ్ స్థానాలను మారుస్తారు. ఈ రిజర్వేషన్ 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. అయితే, పార్లమెంటుకు దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది.

కొత్త పార్లమెంట్ భవనంలో 880 మంది ఎంపీలు కూర్చోవచ్చు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కొత్త పార్లమెంట్ భవనంలో 880 మంది ఎంపీలు కూర్చోవచ్చు

మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సమయంలో ఈ బిల్లును తీసుకురావడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

'నియోజకవర్గాల పునర్విభజన అనే తమ అసలు ఎజెండాను రుద్దడానికి ప్రభుత్వం, మహిళలను సాకుగా వాడుకుంటోంది' అని పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు. తమ పార్టీలో 39 శాతం మహిళా ఎంపీలు ఉన్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎన్నికలు ఉన్నాయి.

''2023లో బిల్లును ఆమోదించినప్పుడే మహిళా కోటాను వెంటనే అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కానీ, ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు'' అని ఆయన ట్వీట్ చేశారు.

మంగళవారం దిల్లీలో జరిగిన ఒక విలేఖరుల సమావేశంలో సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

''2023లో నారీ శక్తి వందన్ అధినియం చట్టం ఆమోదం పొందినప్పడే అమలు చేయకుండా ఎందుకు ఆలస్యం చేశారు? జనగణన, డీలిమిటేషన్‌తో దీనికేం సంబంధం అంటూ మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. కానీ, అప్పుడు జనాభా గణన లేకుండా ఈ రిజర్వేషన్లను అమలు చేయలేమని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు కొన్ని నెలల్లోనే యూ-టర్న్ తీసుకుని జనాభాగణనతో సంబంధం లేకుండా అమలు చేస్తామంటోంది. మేం మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని కోరుతున్నాం అంతే'' అని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ చర్య ద్వారా రాష్ట్ర ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని బీజేపీ భావిస్తుండొచ్చని రాజకీయ విశ్లేషకుడు రాహుల్ వర్మ అన్నారు.

'ఈ బిల్లు వారికి స్వల్ప ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ నిర్ణయం వల్ల మహిళల ఓట్లలో 10 శాతం మార్పు వచ్చినా అది వారికి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. మామూలుగా 3-4 శాతం ఓట్ల తేడాతో ఎన్నికలు గెలుస్తుంటారు. అలాంటప్పుడు అదనంగా కేవలం 1-2 శాతం ఓట్లను సాధించగలిగితే ఫలితాలు వారికి అనుకూలంగా మారొచ్చు' అని ఆయన అభిప్రాయపడ్డారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)