చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం''-ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆయన పదేపదే ఎందుకు చెబుతున్నారు?

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, Telugudesamparty/X

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

పిల్లలే సంపదని, ప్రజలు అధిక సంతానం కనాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

జనాభా పెంచుకోవాలన్న అంశాన్ని తరచూ ప్రస్తావిస్తున్న చంద్రబాబు నాయుడు, ఎక్కువమంది సంతానం కన్నవారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని శనివారం నాడు ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు, మూడో సంతానం కన్నవారికి రూ. 30 వేలు, నాలుగో సంతానం కన్నవారికి రూ.40 వేలు అప్పటికప్పుడే ప్రోత్సాహకం(ఇన్సెంటివ్)గా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించారు.

ఎక్కువమంది పిల్లల్ని కనడం భారమని చాలామంది భావిస్తుంటారని, అది నిజంకాదని చంద్రబాబు అన్నారు.

జనాభా నియంత్రణ, దాని ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు ఏదో ఒక రూపంలో తమ స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌లు గత కొన్నేళ్లుగా ఈ వాదనను ముందుకు తీసుకువస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య

వృద్ధుల సంఖ్య పెరుగుతోందా?

‘‘దక్షిణాది రాష్ట్రాల్లో యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది’’ అని గతంలో పలుమార్లు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

జపాన్, చైనా వంటి అనేక దేశాలు ఈ సమస్యతో ఎలా పోరాడుతున్నాయో కూడా ఆయన ప్రస్తావించారు.

రాష్ట్రాభివృద్ధి కోసం రూపొందిస్తున్న విజన్‌-2047లో జనాభా మీద ‘‘ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన ఇంతకు ముందే చెప్పారు.

2014 నుంచే ఆయన దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు. జనాభా పెరిగితేనే మానవ వనరులు వృద్ధి చెంది సంపద పెరుగుతుందని చెబుతూ వచ్చారు.

‘‘సంతానోత్పత్తి రేటు 1.8 కంటే తక్కువగా ఉంటే సంబంధిత దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుంది’’ అని ముంబయిలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌)కి చెందిన ప్రొఫెసర్‌ గోలి శ్రీనివాస్‌ గతంలో బీబీసీతో అన్నారు.

2001లో ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధుల జనాభా 12.6 శాతం. కొంత కాలంగా అది పెరుగుతూ వస్తోందని డేటా చెబుతోంది.

‘‘భారత రిజిస్ట్రార్ జనరల్ గణాంకాల ప్రకారం ఈ జనాభా 2011లో 15.4 శాతంగా ఉండగా 2021లో 18.5 శాతం, 2031 నాటికి 24.7 శాతానికి పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు’’ ప్రొఫెసర్ గోలి శ్రీనివాస్ అన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి

వృద్ధుల జనాభా పెరుగుతోంది అంటే పని చేసే జనాభా తగ్గుతోందని అర్థం. ఇది ప్రధానంగా మానవ వనరుల కొరతకు దారి తీస్తుంది. సౌత్ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను సౌత్ కొరియా ప్రకటించింది. జపాన్‌ అయితే మ్యారేజ్‌ బడ్డెట్‌ కేటాయించింది.

‘‘అభివృద్ధి చెందిన దేశాల్లోనే అలా ఉంటే, ఇంకా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగా మేల్కోవడం మంచిదే కదా. ప్రస్తుత లెక్కల ప్రకారం మగవాళ్ల సగటు ఆయుర్దాయం 67 ఏళ్లు కాగా, మహిళల సగటు ఆయుర్దాయం 72. ఇక దేశంలో ఆధారపడుతున్న వృద్ధుల శాతం 20 శాతంగా నమోదైంది’’ అని ప్రొఫెసర్‌ గోలి శ్రీనివాస్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖకు చెందిన 2020 నివేదిక అంచనా ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరుగుతోంది.

‘‘ఏపీలోనే కాదు దక్షిణాదిలోనే సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. 1980 ప్రాంతంలో ఆయా రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్‌ పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇప్పుడు యువశక్తి తగ్గి ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది’’ అని విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా పరిశోధనా కేంద్రం (పాపులేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌) డైరెక్టర్, ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి. మునిస్వామి అన్నారు.

భారత పార్లమెంట్

ఫొటో సోర్స్, Government of India

పార్లమెంటులో ప్రాతినిధ్యం

దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఆగిపోవడం వల్ల పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంకే స్టాలిన్ ఇదే అంశాన్ని పదే పదే చెప్పారు.

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖకు చెందిన 2020 నివేదిక ప్రకారం, 2011తో పోలిస్తే 2036 నాటికి దేశ జనాభా 31.1 కోట్లు పెరుగుతుంది. ఇందులో సుమారు 17 కోట్ల జనాభా బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్‌లలోనే ఉంటుంది. ఇది మొత్తం పెరిగిన జనాభాలో సుమారు 54 శాతం.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో పెరిగే జనాభా 2.9 కోట్లు. అంటే ఇది మొత్తం పెరిగిన జనాభాలో కేవలం 9శాతం.

జనాభా సంఖ్యను బట్టే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య తగ్గితే రాజకీయ బలం తగ్గిపోతుంది. ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు తమ డిమాండ్లు సాధించుకోవడంలో ముందుంటాయి..

‘‘సంతానోత్పత్తి తగ్గుదల ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోంది. దాంతో డీలిమిటేషన్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో లోక్ సభ సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఓ అంచనా ప్రకారం, 2026 నాటికి అవి 20కి తగ్గుతాయి. తెలంగాణలో 17 నుంచి 15 సీట్లకు తగ్గుతాయి. తమిళనాడులో 39 నుంచి 30, కేరళలో 28 నుంచి 26 కి, కర్ణాటకలో 20 నుంచి 14కి తగ్గే అవకాశం ఉంది’’ ప్రొఫెసర్ గోలి శ్రీనివాస్ తెలిపారు.

అయితే, డీలిమిటేషన్ కారణంగా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

సంతానోత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు
జనాభా పెరుగుదల

జనాభాను పెంచడం సులువేనా?

ఒకప్పుడు జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది.

పంచవర్ష ప్రణాళికల్లో లక్ష్యాలు పెట్టుకుని కుటుంబ నియంత్రణ అమలు చేశారు.

‘‘చిన్న కుటుంబం- చింతలేని కుటుంబం’’ అనే స్లోగన్ అప్పట్లో చాలా పాపులర్.

కేంద్రం చేపట్టిన జనాభా నియంత్రణను ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాలు బాగా అమలు చేశాయి.

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఆ రాష్ట్రం ప్రకటించింది.

కానీ దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అమలు చేయలేదు. దాంతో ఆ అంతరం నేటికీ కొనసాగుతూనే ఉంది.

మరి ఇప్పుడు సంతానోత్పత్తిని పెంచడం అంత సులభం కాదు అని నిపుణులు అంటున్నారు.

‘‘ఆర్థికం, కెరియర్ వంటి కారణాల వల్ల నేడు చాలామంది ఒకరిద్దరు పిల్లలు ఉంటే చాలనే పరిస్థితికి వచ్చారు. ఈ తీరును మార్చడం అంత సులభం కాదు’’ అని ప్రొఫెసర్‌ గోలి శ్రీనివాస్‌ అన్నారు.

‘‘ఉద్యోగాలు, స్వశక్తితో వ్యాపారాలు చేసుకునే మహిళలు పిల్లలను కని ఇంట్లోనే ఎక్కువకాలం ఉండిపోలేరు. చిన్న పిల్లల పెంపకంలో పురుషులు కూడా బాధ్యత తీసుకోవాలి. అప్పుడే మహిళలు పిల్లలను కనేందుకు ముందుకు వస్తారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

జనాభా పెరుగుదల

ఫొటో సోర్స్, Getty Images

జీవన ప్రమాణాల మాటేమిటి?

జనాభా పెరుగుదల గురించి మాట్లాడేటప్పుడు జీవనప్రమాణాల గురించి కూడా మాట్లాడాలని గతంలో చంద్రబాబు వ్యాఖ్యలను విశ్లేషిస్తూ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.

‘‘ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్య అందించినప్పుడే జనాభా పెరిగినా ఇబ్బందులు తలెత్తవు. సంపన్నులు ఎంతమంది పిల్లలను కన్నా వారిని చక్కగా చూసుకునే సామర్థ్యం ఉంటుంది. కానీ రెక్కాడతేగానీ డొక్కాడని ఓ పేద జంట నలుగురు పిల్లలని కంటే పోషించడానికే చాలా ఇబ్బందులు పడాలి. ఇక ఆ పిల్లల జీవన, విద్యా ప్రమాణాల సంగతేంటి? వీటన్నింటి గురించి పాలకులు ఆలోచించాలి’’ అని ఆయన అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)