జనాభా లెక్కలు 2026-27: ఇల్లు లేక రోడ్ల పక్కన పడుకునే వారినీ లెక్కిస్తారా? - 12 ప్రశ్నలు, సమాధానాలు

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 11 నిమిషాలు

జనాభా లెక్కల సందడి మొదలైంది.

భారతదేశ చరిత్రలో మొదటిసారిగా వాయిదా పడి 2021కి బదులు 2026-27లో ఈ జనాభా లెక్కలు జరుగుతున్నాయి.

ఇంతకీ మీ పేరు జనాభా లెక్కల్లో లేకుండా పోయే ప్రమాదం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు జనాభా లెక్కల్లో మీ పేరు లేకపోతే దేశానికి వచ్చే నష్టం ఏంటి?

ఈసారి కొత్తగా పెట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ అంటే ఏంటి? అదెలా చేసుకోవాలి?

ఇలాంటివి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్, ఐఏఎస్ అధికారి భారతి హోలీకేరీ వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అంటే ఏంటి? జనాభా లెక్కల వారు ఇంటికి వస్తారు కదా.. మళ్లీ పౌరులు సొంతంగా నమోదు చేసుకోవడం ఎందుకు?

సమాధానం:

ఈసారి సెన్సస్ డిజిటల్ రూపంలో జరుగుతోంది. అంటే యాప్‌లోనే వివరాలు నమోదు చేస్తారు. అందుకు వీలుగా చట్టసవరణ చేశారు.

ఇంటి గణన వివరాల కోసం ఎన్యుమరేటర్ మీ ఇంటికి రాకముందే, మీరు ఆన్‌లైన్ ద్వారా ఆ వివరాలు నమోదు చేసుకోవచ్చు. దాన్నే సెల్ఫ్ ఎన్యుమరేషన్ అంటున్నారు.

దానివల్ల ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు మీరు ఎక్కువ సమయం ఇవ్వక్కర్లేకుండా పని పూర్తి చేసుకోవచ్చు. అలాగే కచ్చితమైన సమాచారం అందించవచ్చు.

ఇందులో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. సరళమైన పోర్టల్ ద్వారా ఆ వివరాలు మీరు ఎంటర్ చేసి సేవ్ చేయవచ్చు. అయితే ఆ తరువాత కూడా జనగణన అధికారి మీ ఇంటికి వస్తారు.

కాకపోతే అప్పుడు మీరు 33 ప్రశ్నలకూ సమాధానం ఇవ్వక్కర్లేకుండా, అప్పటికే మీరు పూర్తి చేసిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ ఇస్తే వారు దాన్ని మన ముందు చదివి, వెరిఫై చేసి, సింక్ చేసుకుని వెళ్లిపోతారు.

ఆన్‌లైన్‌లో మీరు ఏవైనా తప్పులు రాసినా, వారికి ఎడిటింగ్ చేసే అవకాశం ఉంటుంది.

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఎలా చేసుకోవాలి?

సమాధానం:

దీనికోసం https://se.census.gov.in/ వెబ్ సైట్‌లోకి వెళ్ళాలి.

ముందుగా మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని, కాప్చా ఎంటర్ చేసి, ప్రొసీడ్ అవ్వాలి.

తర్వాత ఇంటి యజమాని (హెడ్ ఆఫ్ ద హౌస్‌హోల్డ్) పేరు అడుగుతుంది.

ఆపై మొబైల్ నంబర్ అడుగుతుంది.

హెడ్ ఆఫ్ ద హౌస్‌హోల్డ్ ఒకసారి ఎంటర్ చేశాక మార్చడానికి వీలుండదు. ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు కూడా మార్చడానికి వీలు ఉండదు.

మొబైల్ నెంబర్ కూడా ఒక ఇంటికి ఒకటే నెంబర్ వాడగలుగుతారు. వేరే ఇంటికి ఆ మొబైల్ నెంబర్ వాడలేరు.

16 భాషల్లో మీకు నచ్చిన భాష ఎంపిక చేసుకోవచ్చు. ఒకసారి ఎంపిక చేసుకున్నాక ఇక మార్చలేరు.

తర్వాత ఇంటి అడ్రస్ ఇవ్వాలి. మీరిచ్చిన అడ్రస్‌ను బట్టి ఇల్లు ఉన్న ప్రాంత మ్యాప్ చూపిస్తుంది. అక్కడ మ్యాపులో సరిగ్గా మీరుండే ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడ పిన్ చేయాలి.

ఇంటి పాయింటింగ్ పూర్తయ్యాక ఓటీపీ ఎంటర్ చేయాలి.

తరువాత 33 ప్రశ్నలు అడుగుతుంది.

అన్నీ ఒకేసారి సమాధానం ఇచ్చేంత సమయం లేకపోతే వీలైనన్ని ప్రశ్నలు పూర్తి చేసి సేవ్ చేసుకోవచ్చు. మళ్లీ అవకాశం ఉన్నప్పుడు మిగతావి పూర్తి చేయవచ్చు. ప్రివ్యూ చూసుకున్న తరువాతే సబ్మిట్ చేయవచ్చు.

సబ్మిట్ తరువాత మాత్రం మార్పులు చేసే అవకాశం పౌరులకు ఉండదు. తరువాత ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడీ చూపించాలి.

సెల్ఫ్ ఎన్యుమరేషన్ తప్పనిసరి కాదు. అందులో ఏదైనా సమస్య ఉంటే, ఎన్యుమరేటర్ మాన్యువల్‌గా చేస్తారు. అంటే మీరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసినా చేయకపోయినా ఇంటికి జనగణన అధికారి తప్పకుండా వస్తారు.

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్, se.census.gov.in, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్, ఐఏఎస్ అధికారి భారతి హోలీకేరీ
ఫొటో క్యాప్షన్, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్, ఐఏఎస్ అధికారి భారతి హోలీకేరీ
జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

ఏయే తేదీల్లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చు?

సమాధానం:

సెల్ఫ్ ఎన్యుమరేషన్ తేదీలు:

తెలంగాణ: ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు

ఆంధ్రప్రదేశ్: ఏప్రిల్ 16 నుంచి 30 వరకు

ఇంటి గణన తేదీలు:

తెలంగాణ: మే 11 నుంచి జూన్ 9 వరకు

ఆంధ్రప్రదేశ్: మే 1 నుంచి మే 30 వరకు

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

అధికారి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోతే?

సమాధానం:

ఇళ్ల ఎన్యుమరేషన్‌కు 30 రోజుల గడువు ఉంటుంది.

ప్రతి ప్రాంతాన్నీ చిన్న చిన్న భాగాలుగా విభజించి బాధ్యతలు అప్పగించాం. వారిపైన పర్యవేక్షించే అధికారులు ఉంటారు.

ఎన్యుమరేటర్ 30 రోజుల్లో ఎప్పుడైనా మీ ఇంటికి రావచ్చు. మీరు వచ్చినప్పుడు తాళం వేసి ఉంటే, అది శాశ్వతంగా తాళం వేసి ఉందా లేక తాత్కాలికంగా ఏదైనా పనికోసం, యాత్ర కోసం, కార్యక్రమం కోసం వెళ్లారా అని చుట్టుపక్కల ఆరాతీస్తారు.

శాశ్వతంగా తాళం వేసి ఉంటే అదే రాసుకుంటారు.

పనిమీదో, యాత్రకో వెళ్తే మీ నంబర్ తీసుకుని ఎప్పుడు వస్తారో కనుక్కుని ఆ సమయంలో వచ్చి ఎన్యుమరేషన్ చేస్తారు. అందుకోసం వారు ఎన్నిసార్లు రావాలి అనేది రూల్ లేదు.

కానీ మిస్ అవ్వకుండా కచ్చితంగా చేయాలి అని రూల్ ఉంది కాబట్టి ప్రతి ఇంటినీ కచ్చితంగా లెక్కిస్తారు.

''వితౌట్ ఒమిషన్ – వితౌట్ డూప్లికేషన్'' అంటే ఏ ఇంటినీ వదలకూడదు.. ఏ ఇల్లూ రెండోసారి నమోదు చేయకూడదు అనేది మా నినాదం.

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్, se.census.gov.in,
జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

మా ఇంటికి ఎవరూ రాలేదు, మా ఇల్లును ట్యాగ్ చేయలేదు అనే అనుమానం ఉంటే ఏం చేయాలి?

సమాధానం:

ప్రతి బ్లాక్‌కీ ఒక ఎన్యుమరేటర్ ఉంటారు.

ఆరేడుగురు ఎన్యుమరేటర్లపైన ఒక సూపర్‌వైజర్ ఉంటారు.

ఆ సూపర్‌వైజర్లపైన గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్లు, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ అధికారులు చార్జ్ ఆఫీసర్లుగా ఉంటారు.

వాళ్లను మానిటర్ చేయడానికి పైఅధికారులు ఉన్నారు.

ఎవరూ ఏ ఇంటినీ వదిలే పరిస్థితి రాదు.

ఒకవేళ మీ ఇంటికి ఎవరూ రాలేదని అనిపిస్తే 1855 అనే నంబరుకు కాల్ చేయవచ్చు, లేదా స్థానిక అధికారులను సంప్రదించవచ్చు.

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

ఫొటో సోర్స్, Getty Images

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

అద్దె ఇంట్లో ఉండేవారు అదే ఇంట్లో నమోదు చేసుకోవాలా?

సమాధానం:

33 ప్రశ్నల్లో అద్దె ఇల్లా సొంత ఇల్లా అనే ప్రశ్న కూడా ఉంటుంది.

మీది అద్దె ఇల్లు అయినా, సొంత ఇల్లు అయినా అదే ఇంట్లో మీరు నమోదు చేసుకోవాలి.

వేర్వేరు పోర్షన్లు ఉంటే వేర్వేరు పోర్షన్లలో నమోదు చేస్తారు.

అద్దె ఇంట్లో ఉంటూ వేరే చోట సొంతిల్లు ఉంటే ఆ ప్రశ్న అడుగుతారు.

హాస్టల్‌లో ఉంటే, అదే చెప్పాలి. అలాగే ఏ ఇల్లూ లేకపోతే కూడా షెల్టర్‌లెస్ పాపులేషన్ కింద నమోదు చేస్తారు.

మీది గుడిసె అయినా, భవనం అయినా, అద్దె ఇల్లు అయినా, సొంతిల్లు అయినా, సొంతూరు అయినా, పక్క ఊరు అయినా, ఉద్యోం చేసే ఊరు అయినా, మీరు సాధారణంగా ఎక్కడ నివాసం అంటున్నారో అక్కడే రాయించుకోవాలి.

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్
జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

చాలామంది తల్లిదండ్రులు సొంతూళ్లో, పిల్లలు వేరే ఊళ్లో ఉద్యోగాల్లో ఉంటారు. లేదా తాత్కాలిక ఉద్యోగం కోసం పెళ్లికాని పిల్లలు ఒక నగరంలో తల్లిదండ్రులు వేరే నగరంలో ఉంటారు. ఓటు, ఆధార్ అన్నీ ఒకచోట, ఉద్యోగం ఒకచోట ఉంటుంది. తల్లిదండ్రులు ఒకచోట, పెళ్లైన తరువాత పిల్లలు ఒకచోట ఉంటారు… ఇలాంటి సందర్భాల్లో ఎవరు ఎక్కడ నమోదు చేయించుకోవాలి?

సమాధానం:

ఒకటే సమాధానం. సాధారణంగా ఎక్కడ నివసిస్తున్నారు అంటే నార్మల్ రెసిడెన్స్ ఏది అయితే అదే.

మీ ఓటు, ఆధార్, రేషన్ ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మీరు రోజువారీగా ఎక్కడ ఉంటున్నారో అక్కడే జనాభా లెక్కలు రాయించాలి.

జనాభా లెక్కల కోసం మీ పత్రాలు ఏవీ అడగం. కాబట్టి సాధారణంగా ఎక్కడుంటే లెక్క అక్కడే.

మీ తల్లిదండ్రులు గ్రామంలో, మీరు నగరంలో ఉంటే, వారక్కడ, మీరిక్కడ రాయించండి.

మీకు గ్రామంలో సొంతిల్లు ఉండి, నగరంలో అద్దెకుంటే అలాగే రాయించండి.

మీ పిల్లలు వేరే చోట ఉంటే, వారి పేర్లు మీరు రాయించకండి, వారున్నచోట వారు, మీరున్న చోట మీరు రాయించుకోండి.

మీ సొంతూళ్లకి, తల్లిదండ్రులకి, పొలాలకి, ఓటర్, రేషన్, ఆధార్... దేనితోనూ లింకు లేకుండా మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడే రాయించాలి.

పిల్లలు చదువుల కోసం వేరే నగరంలో ఉన్నా, రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నా ఇదే వర్తిస్తుంది.

ఈ వివరాలన్నీ సిబ్బంది ప్రశ్నించిన తరువాతే నమోదు చేసుకుంటారు. ప్రజలు ఉన్నదున్నట్టు చెప్పాలి.

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్, se.census.gov.in,

ఫొటో సోర్స్, Census India 2027/X.com

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

భారతీయులు చాలా మంది ప్రభుత్వ సిబ్బందికి తమ ఆస్తులు, ఆదాయం గురించి కచ్చితమైన సమచారం ఇవ్వడానికి ఇష్టపడరు. ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయనో, పన్నులు అదనంగా పడతాయనో భయం ఉంటుంది. మీకెన్ని ఇళ్లు ఉన్నాయి అంటే అందరూ సమాధానం చెప్పకపోవచ్చు కదా.. అంతేకాదు తమ ఇంట్లో వారి సంఖ్య తక్కువ చెబితే, పథకాలు పోతాయేమో అని చాలా మంది భయపడుతుంటారు...

సమాధానం:

ఇది మీ ఆస్తులు, ఆదాయ గణన కాదు. కానీ సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలియచెప్పే గణన.

ఉదాహరణకు మిమ్మల్ని అడిగే 33 ప్రశ్నల్లో మీ ఇంటి పైకప్పు, గోడలు దేనితో చేసినవి, సొంతిల్లా అద్దె ఇల్లా, ఇంట్లో ఎంత మంది ఉంటారు, పెళ్లైన జంటలు ఎన్ని? ఇంటి యజమాని కులం ఏంటి? నీటి సౌకర్యం ఉందా లేదా? బాత్రూం, వంటగది ఉన్నాయా లేదా? నీటి కనెక్షన్, కరెంటు కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా? రేడియో, టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ ఉన్నాయా? టూ వీలర్, ఫోర్ వీలర్ ఉందా? ఇవన్నీ అడుగుతారు.

అంతేకాదు మీరు ప్రధాన ఆహారంగా వరి తింటారా, గోధుమ తింటారా లేక మరేదైనా తింటారా అని అడుగుతారు.

ఇవన్నీ కూడా వారి పరిస్థితులు అంచనా వేయడానికే తప్ప ఆస్తుల వివరాల కోసం కాదు.

ఒకటి వాస్తవం. సంక్షేమ పథకాలకీ, ప్రభుత్వం అందించే సౌకర్యాలకీ, ఈ లెక్కలకీ సంబంధం లేదు.

ఇప్పుడు మీరు పొందుతున్న వాటికిగానీ, కొత్తగా ఇచ్చేవాటికిగానీ ఈ లెక్కలతో సంబంధం లేదు.

ఈ సెన్సస్ వివరాలు చాలా రహస్యంగా ఉంచాలని చట్టమే ఉంది.

ఒక్కమాటలో సరళంగా చెప్పాలంటే ఆ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వారికిగానీ, ప్రభుత్వానికిగానీ, ప్రభుత్వ అధికారులకుగానీ ఆ సమాచారం అందదు.

కేవలం ఆ సమాచారాన్ని క్రోడీకరించి తయారు చేసిన నివేదికలు మాత్రమే ఇస్తాం.

నివేదికల్లో 300 రకాలు ఉంటాయి. అందులో మొత్తంగా డేటా ఉంటుంది తప్ప వ్యక్తుల గురించి వ్యక్తిగత డేటా ఉండదు.

ఏ వ్యక్తి వివరాలూ తెలియవు. అంటే ఫలానా వ్యక్తి దగ్గర కారు ఉందా లేదా అని ప్రభుత్వం ఈ డాటా నుంచి తెలుసుకోలేదు.

అన్నిటికీ మించి సమాచార హక్కు చట్టం ద్వారా కూడా దీన్ని తీసుకోలేరు. అలాగే కోర్టులో సాక్ష్యంగా ఈ డాటా పనికిరాదు.

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

ఫొటో సోర్స్, Getty Images

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

ఏ ఇల్లూ లేకుండా రోడ్లపై తిరిగే వారినీ లెక్కిస్తారా?

సమాధానం:

రెండోదశలో అదికూడా చేస్తాం. దానికీ ఒక ప్రొసీజర్ ఉంది.

రెండో విడత జనగణన చివర్లో ఒకే రోజు ఒకే రాత్రి దేశవ్యాప్తంగా ఈ గణన జరుగుతుంది.

పగటి పూట ఎక్కడైనా తిరుగుతారు. అందుకని ఆ రోజు రాత్రి దేశమంతా ఒకేసారి రోడ్లపై పడుకునేవారు, ఇల్లు లేని వారి గణన చేస్తారు.

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

కులగణన ఎప్పుడు చేస్తారు? ఏయే ప్రశ్నలు అడుగుతారు?

సమాధానం:

కులగణన రెండో విడతలో ఉంటుంది. రెండో విడత ప్రశ్నలు ఇంకా అధికారికంగా రాలేదు.

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్, se.census.gov.in,

ఫొటో సోర్స్, Census India 2027/X.com

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

ప్రస్తుతం జనాభా లెక్కలు మొదలయ్యాయి అన్నారు. కానీ మళ్లీ 2027 అంటున్నారు. రెండు విడతలు అంటున్నారు. ఏంటిదంతా?

సమాధానం:

ఎప్పుడూ జనాభా లెక్కలు రెండు విడతలగానే జరుగుతాయి.

దానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మొదటి విడతను హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అంటారు.

రెండో విడతను పాపులేషన్ ఎన్యుమరేషన్ అంటారు.

మొదటి దశలో భవనం నుంచి గుడిసె వరకూ ప్రతి నిర్మాణాన్నీ జాబితాలోకి ఎక్కిస్తాం. రెసిడెన్షియల్ అవ్వచ్చు, నాన్ రెసిడెన్షియల్ అవ్వచ్చు. ఆఫీసులు, షాపులు, బడులు, గుడులు.. దేనికి వాడుతున్నారు అనేదాంతో సంబంధం లేకుండా ప్రతి నిర్మాణాన్ని గుర్తించి, లిస్ట్ చేస్తాం. అలాగే ప్రతి ఇల్లూ కూడా.

ఇళ్లను రెండు రకాలుగా చూస్తారు. మొదటిది నార్మల్.. అంటే సాధారణంగా ఉండే ఇల్లు.

రెండోది ఇన్‌స్టిట్యూషనల్ అంటే ప్రైవేటు హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హోటళ్లు, అనాథ - వృద్ధాశ్రమాలు.. ఇలా..

హాస్టళ్లు, ఆశ్రమాలలో ఉండేవారు అక్కడే తమ జనాభా రాయించుకోవాలి.

మొదటి విడతలో ఆ నిర్మాణంలో ఉండే మొత్తం సంఖ్య మాత్రమే రాస్తారు. అంటే ఫలానా ఇంట్లో ఐదుగురు ఉంటే, ఐదు నంబర్ వేసుకుంటారు. ఇతర వివరాలు తీసుకోరు.

ఇంటికి, భవనానికి సంబంధించిన వివరాలు మాత్రం తీసుకుంటారు.

ఇక రెండో విడతలో వ్యక్తిగత సమాచారం అంతా తీసుకుంటారు.

పేరు, వృత్తి, ఆదాయం, కులం ఇలాంటివన్నీ.. మొదటి జాబితాలో భవనాల లెక్క ఉంటుంది, రెండో జాబితాలో ఆ ఇళ్లన్నింటికీ మిస్ కాకుండా వెళ్తారు.

రెండో విడత 2027లో జరుగుతుంది. ఇంటి గణన సమయంలో ఇళ్లను మార్కింగ్ చేస్తారు.

తరువాతే ఆ ఇళ్లకు వెళ్తారు. ఇంటి గణన ఏ దశలో మొదలుపెట్టి ఎలా చేయాలి? ఏఏ ప్రశ్నలు అడగాలి? డాటా ఎలా సింక్ చేయాలి? ఇలాంటి వాటిపై స్పష్టంగా సిబ్బంది అందరికీ శిక్షణ ఇచ్చాం.

దేశవ్యాప్తంగా మొత్తం సుమారు 30 లక్షల మంది సిబ్బంది ఈ విధులు నిర్వహించబోతున్నారు. 1872 నుంచి రెండు విడతల పద్ధతిలో చేస్తున్నారు.

ఇది భారత్‌లో 16వ జనగణన.

మొదటి విడత లెక్కల ఆధారంగా ఇంకా అదనపు సిబ్బందిని పెట్టాలా వంటివన్నీ చూస్తారు.

ఇంట్లో ఉండే మొత్తం మనుషుల సంఖ్య చూస్తాం కాబట్టి ఒక అంచనా వస్తుంది.

మొత్తం అంచనా జనాభా వచ్చిన తరువాత అవసరమైతే రెండో విడతకు అదనంగా బ్లాకులు విభజించడం వంటివి చేయవచ్చు.

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

ఫొటో సోర్స్, Getty Images

జనాభా లెక్కలు 2026-27, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెల్ఫ్ ఎన్యుమరేషన్, సెన్సస్

జనాభా లెక్కల్లో మన వివరాలు నమోదు చేయించుకోకపోతే, లేదా తప్పు వివరాలు చెబితే ఏం నష్టం?

సమాధానం:

మీ సమాచారం ప్రభుత్వం సహా ఎవరూ తీసుకోలేరు, కాబట్టి భయపడవద్దు.

రెండోది ప్రభుత్వం ఏ పథకాలు సిద్ధం చేయాలన్నా, ఏ పాలసీలు పెట్టాలన్నా, పన్ను రూపంలో ప్రజలు చెల్లించే డబ్బు వృథా కాకూడదు అన్నా, ఏ ప్రాంతానికీ, గ్రామానికీ, పట్టణానికీ, నగరానికీ ఏం అవసరమో ప్రభుత్వం తెలుసుకోవాలన్నా, ప్రజలకు ఏ అవసరాలు ఎక్కువ ఉన్నాయి, వాటికి ఏం చేయాలి అని ప్రభుత్వాలు ఆలోచించాలన్నా, అన్నిటికీ ఈ జనగణన సమాచారమే కీలకం.

అందుకే దీన్ని 'మదర్ ఆఫ్ ఆల్ సర్వేస్' అని పిలుస్తారు.

ఇందులో కచ్చితమైన సమాచారం వస్తే, వాటి ద్వారా మంచి పథకాలు చేసి ప్రజాధనం వృథా అరికట్టవచ్చు.

ఇది పౌరుల బాధ్యత కూడా. ఇది భావితరాల కోసం కీలకమైనది.

ఈ లెక్కలు, వాటి ద్వారా చేసే పాలసీల ప్రభావం 50 ఏళ్లపాటు ఉంటుంది.

అద్దం ఎలా ప్రతిబింబిస్తుందో దేశం గురించి ఈ లెక్కలు అలా ప్రతిబింబించాలి.

అందరూ సరైన సమాచారం ఇస్తే దేశ అభివృద్ధి సరైన దిశలో జరుగుతుంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)