మటన్ లివర్ తింటే మన లివర్‌కు మంచిదా? ఎవరు తినకూడదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
"మటన్ లివర్ తింటే, మన లివర్‌కు బాగుంటుంది" - ఇది ఒక సినిమాలోని కామెడీ డైలాగ్.
కానీ, ఇందులో నిజం ఉందా? కోడి లేదా మేక/పొట్టేల్ కాలేయం తింటే మనుషుల కాలేయ సమస్యలు తగ్గుతాయా?
కేవలం కోడి, మేక మాత్రమే కాకుండా.. ఆవు, పంది కాలేయంలో కూడా విటమిన్లు, ఐరన్, ప్రోటీన్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది.
అదే సమయంలో గర్భిణులు కాలేయాన్ని తినకూడదని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
అసలు మటన్ లివర్ తినొచ్చా? ఎవరు తినొచ్చు? ఎవరు తినకూడదు? ఎంత తినొచ్చు? వంటి విషయాల గురించి బీబీసీ వైద్యులను అడిగి తెలుసుకుంది.


ఫొటో సోర్స్, Getty Images
లివర్ తినడం వల్ల లాభాలేంటి?
"మనకు సులభంగా దొరికే కోడి లేదా మేక కాలేయంలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఉదాహరణకు, మన శరీరం త్వరగా గ్రహించే హీమ్ ఐరన్ ఇందులో అధిక మోతాదులో ఉంటుంది. ఇది రక్త ప్రసరణకు సహకరిస్తూ రక్తహీనతను నివారిస్తుంది" అని మధుమేహ నిపుణులు డాక్టర్ ప్రశాంత్ అరుణ్ చెప్పారు.
ఎర్ర రక్త కణాల తయారీ, నరాల ఆరోగ్యం, మెదడు ఎదుగుదల, జ్ఞాపకశక్తిలో లివర్‌లో ఉండే విటమిన్ బి12 కీలకపాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.
"జంతువుల లివర్‌లో నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. కండరాల మరమ్మతుకు, ఎదుగుదలకు ఇది ముఖ్యం. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి కూడా ఈ ప్రోటీన్ తోడ్పడుతుంది" అని ప్రశాంత్ అరుణ్ పేర్కొన్నారు.
బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం.. లివర్‌లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇచ్చే రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి ఈ విటమిన్ ఏ అవసరం.
అంతేకాకుండా కంటి చూపు, చర్మ ఆరోగ్యం, ముక్కు వంటి భాగాల్లో ఉండే సున్నితమైన పొరలు ఆరోగ్యంగా ఉండటానికి కూడా విటమిన్ ఏ సహాయపడుతుంది.
పాలు, చీజ్, గుడ్లు, కొన్నిరకాల చేపల్లో విటమిన్ ఏ ఉన్నప్పటికీ.. జంతువుల కాలేయంలోనే ఇది అత్యధికంగా ఉంటుందని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలకు లివర్ తినిపించొచ్చా?
"సాధారణంగా మాంసాహారంలో ఉండే 'హీమ్ ఐరన్' లివర్‌లో అధిత మోతాదులో ఉంటుంది. కాబట్టి 5 నుంచి 10 ఏళ్ల పిల్లలకు వారానికి ఒకసారి 50 గ్రాముల వరకు, 10 నుంచి 15 ఏళ్ల పిల్లలకు వారానికి ఒకసారి 50 నుంచి 100 గ్రాముల వరకు వండి ఇవ్వవచ్చు" అని పోషకాహార నిపుణులు ధరిణీ కృష్ణన్ చెప్పారు.
ఇందులోని విటమిన్ బి12 పిల్లల ఎదుగుదలకు చాలా ముఖ్యమని, అయితే పిల్లలకు దీనిని పరిమితంగా ఇవ్వడమే మంచిదని ఆమె పేర్కొన్నారు.
అయితే, పిల్లలకు దీనిని నూనెలో వేయించి (ఫ్రై చేసి) ఇవ్వకూడదని ధరణీ కృష్ణన్ సూచిస్తున్నారు.
"వేయించినప్పుడు అందులోని విటమిన్ బి12 నశించిపోతుంది. కాబట్టి, గ్రేవీ లేదా సూప్‌లా వండి ఇవ్వడమే శ్రేయస్కరం" అని ఆమె వివరించారు.
అలాగే, పెద్దలు వారానికి ఒకసారి 100 నుంచి 200 గ్రాముల వరకు లివర్ తింటే సరిపోతుందని ధరిణీ కృష్ణన్ పేర్కొన్నారు.

లివర్ ఎవరు తినకూడదు?
లివర్‌లో విటమిన్ ఏ అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి గర్భిణులు తినకూడదని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది. విటమిన్ ఏ మోతాదు మించితే గర్భంలోని శిశువుకు హాని కలిగే ప్రమాదం ఉందని తెలిపింది.
విటమిన్ ఏ విషయానికి వస్తే.. 19 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న పురుషులకు రోజుకు 700 మైక్రో గ్రాములు, మహిళలకు రోజుకు 600 మైక్రో గ్రాముల విటమిన్ ఏ అవసరం.
అయితే, చాలా ఏళ్లపాటు సగటున రోజుకు 1,500 మైక్రో గ్రాముల కంటే ఎక్కువ విటమిన్ ఏ తీసుకోవడం వల్ల ఎముకలపై ప్రభావం పడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ ఎముకలు సులభంగా విరిగే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా ఎముకలు బలహీనపడే 'ఆస్టియోపోరోసిస్' ముప్పు ఎక్కువగా ఉన్న వృద్ధులు, మహిళలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
"శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు లివర్ తినకపోవడమే మంచిది. అలాగే రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు కూడా దీనిని ఇవ్వకూడదు. అలర్జీ ఉన్నవారు సైతం దూరంగా ఉండటం ఉత్తమం" అని డాక్టర్ ప్రశాంత్ అరుణ్ సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోడి లివర్ లేదా మేక లివర్ - ఏది మంచిది?
"సాధారణంగా జంతువుల కాలేయాలన్నీ పోషకాలతో నిండినవే. ఏది సులభంగా దొరికితే దానిని పరిమితంగా తీసుకోవడం ఉత్తమం" అని పోషకాహార నిపుణులు ధరిణీ కృష్ణన్ అంటున్నారు.
అదే సమయంలో, కోడి, మేక లివర్‌లో సమానమైన పోషకాలు ఉంటాయని శిశువైద్య నిపుణులు డాక్టర్ అరుణ్ కుమార్ చెబుతున్నారు.
"ప్రతి 100 గ్రాముల కోడి, మేక లివర్‌లో 160 నుంచి 170 కేలరీలు, 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు ఉంటుంది" అన్నారాయన.
"100 గ్రాముల మేక లివర్‌లో 6000 యూనిట్ల విటమిన్ ఏ ఉంటుంది. మనకు రోజువారీ అవసరమైన 5000 యూనిట్ల కంటే ఇది ఎక్కువే" అని డాక్టర్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
అయితే, " కోడి లివర్‌లో ఏకంగా 16,000 యూనిట్ల విటమిన్ ఏ ఉంటుందని, ఇది ఒక రోజుకు అవసరమైన దానికంటే మూడు రెట్లు ఎక్కువ" అని ఆయన తెలిపారు.
"ఎక్కువ మొత్తంలో విటమిన్ ఏ లేదా లివర్ తీసుకోవడం వల్ల 'హైపర్ విటమినిసిస్ ఏ' వంటి సమస్యలు తలెత్తవచ్చు. లేదా అదనపు పోషకాలు మనుషుల కాలేయంలో పేరుకుపోయి కాలేయం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది" అని డాక్టర్ అరుణ్ కుమార్ హెచ్చరించారు.
"కాబట్టి పిల్లలకు కోడి లివర్ కంటే మేక లివర్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అది కూడా వారానికి ఒకసారి 50 గ్రాముల కంటే ఎక్కువ ఇవ్వకూడదు" అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
మనుషుల కాలేయ సమస్యలను జంతువుల కాలేయం నయం చేస్తుందా?
"మనుషుల కాలేయానికి కలిగే నష్టాన్ని జంతువుల కాలేయం సరిచేయదు. ఇది చాలామందిలో ఉన్న అపోహ తప్ప, దీనికి శాస్త్రీయ ఆధారం లేదు" అని డాక్టర్ ప్రశాంత్ అరుణ్ స్పష్టం చేస్తున్నారు.
"డీ-టాక్సిఫై (శరీరాన్ని శుభ్రపరచడం) పేరుతో దీనిని చూడకూడదు. ఎందుకంటే కాలేయం అనేది స్వతహాగానే శరీరాన్ని శుద్ధిచేసే అవయవం. అది తనను తాను శుభ్రపరుచుకోగలదు. దానికి ప్రత్యేకంగా జంతువుల కాలేయం అవసరం లేదు" అని ఆయన వివరించారు.
"సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర.. ఇవి మాత్రమే కాలేయాన్ని కాపాడతాయి" అని డాక్టర్ ప్రశాంత్ అరుణ్ పేర్కొన్నారు.
కాబట్టి, జంతువుల కాలేయానికి, మనుషుల కాలేయానికి ఉన్న ఒక ముఖ్యమైన సంబంధం ఏమిటంటే.. ఒకవేళ జంతువుల కాలేయాన్ని అధిక మొత్తంలో తీసుకుంటే, అందులోని విపరీతమైన 'విటమిన్ ఏ' కచ్చితంగా మనుషుల కాలేయంపై ఒత్తిడిని పెంచుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































