చైనా, రష్యా మధ్యలో ఉత్తర కొరియా: ఈ ముక్కోణపు ప్రేమకథలో ఎవరి మనసు ఎవరివైపు ఎక్కువగా ఉంది?

షీ జిన్‌పింగ్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు
    • రచయిత, లేనీ బారన్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పింగ్ రెండు రోజుల ఉత్తర కొరియా పర్యటన ముగిసింది. 2019 తర్వాత ఆయన ఉత్తర కొరియాను సందర్శించడం ఇదే మొదటిసారి.

సోమవారం ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు చేరుకున్న షీ జిన్‌పింగ్‌కు, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా స్వాగతం పలికారు.

రెడ్ కార్పెట్ దగ్గర నుంచి విన్యాస ప్రదర్శనల వరకు ప్రతి కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన పక్కనే ఉన్నారు.

ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కెసీఎన్ఏ (KCNA) కథనం ప్రకారం, ఈ పర్యటనలో ఎలాంటి స్పష్టమైన ఒప్పందాలు కుదరలేదు. అయితే ఈ పర్యటన ప్రాధాన్యాన్ని కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తావించారు.

ఈ ఏడాది తన మొదటి విదేశీ పర్యటన కోసం ప్యాంగ్యాంగ్‌ను ఎంచుకోవడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలకు షీ ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో స్పష్టమవుతోందని కిమ్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇటీవలి కాలంలో రష్యాతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్న ఉత్తర కొరియాతో వ్యూహాత్మక సంబంధాలను మళ్లీ మెరుగుపరుచుకోవాలనే ప్రయత్నమే చైనా అధ్యక్షుడి ఈ పర్యటన అజెండా అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పర్యటనతో ఉత్తర కొరియాకు ప్రధాన భాగస్వామి ఇప్పటికీ చైనాయే అనే సందేశాన్ని షీ జిన్‌పింగ్ ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. మరోవైపు, ఇటీవల డోనల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వంటి ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇచ్చిన చైనా అధ్యక్షుడు స్వయంగా తమ దేశానికి రావడమంటే, అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ తమ వెంట ఒక కీలక మిత్రదేశం ఉందన్న విషయాన్ని కిమ్ జోంగ్ ఉన్ కూడా గ్రహించే అవకాశం ఉందని విశ్లేషకులు నమ్ముతున్నారు.

సోమవారం సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో చైనా-ఉత్తర కొరియా సంబంధాల ప్రాధాన్యాన్ని షీ జిన్‌పింగ్ ప్రస్తావించారు. చైనా ప్రభుత్వ వార్తా సంస్థ వజిన్హువా కథనం ప్రకారం "చైనా, ఉత్తర కొరియా పర్వతాలు, నదులతో అనుసంధానమైన పొరుగు దేశాలు. ఈ రెండు దేశాల గమ్యం కూడా ఒక్కటే" అని ఆయన అన్నారు.

దీనితో కిమ్ జోంగ్ ఉన్ ఏకీభవిస్తూ, చైనాతో స్నేహాన్ని ఉత్తర కొరియా అత్యున్నత ప్రాధాన్యంగా పరిగణిస్తుందని చెప్పారు. అలాగే చైనా ప్రతిపాదించే "వన్ చైనా" విధానానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

అంతర్జాతీయ సంబంధాలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహబంధాన్ని ప్రతిబింబిస్తోందని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు.

అత్యంత ప్రణాళికబద్ధంగా నిర్వహించే బహిరంగ సమావేశాలకు అతీతంగా, ఈ సమావేశం బీజింగ్ (చైనా రాజధాని), ప్యాంగ్యాంగ్ (ఉత్తర కొరియా రాజధాని) రెండింటికీ "రక్త సంబంధంతో ఏర్పడిన" తమ భాగస్వామ్యానికి సరికొత్త జీవం పోసేందుకు ఒక అవకాశాన్ని అందిస్తుంది.

ఈ రెండు దేశాలు తమ మధ్య బంధాన్ని వివరించేందుకు ఈ పదాన్ని తరచూ ఉపయోగిస్తుంటాయి. గతంలో కొన్ని సంక్లిష్టతలు ఉన్నప్పటికీ, చైనా విదేశాంగ మంత్రి కూడా ఇటీవల దీనిని ఉపయోగించారు. "రక్త సంబంధంతో ఏర్పడిన" భాగస్వామ్యం అంటే.. ప్రాణ త్యాగాలతో, యుద్ధభూమిలో ఏర్పడిన అత్యంత బలమైన, విడదీయరాని బంధం అని అర్థం.

ప్రేమ-ద్వేష బంధం

ప్రారంభం నుంచి ఈ రెండు సామ్యవాద దేశాలు తమ పలుకుబడికి, స్వతంత్రతకు మధ్య ఒక సున్నితమైన సమతుల్యతను పాటిస్తూ వచ్చాయి.

ప్యాంగ్యాంగ్‌కు ఉత్తరాన ఉన్న మరో పొరుగు దేశమైన మాస్కోతో సంబంధాల వల్ల ఈ సమతుల్యత మరింత సంక్లిష్టంగా మారింది.

కొరియా యుద్ధం (1950-53) సమయంలో, ఉత్తర కొరియా కోసం చైనా లక్షలమంది సైనికులను పోగొట్టుకుంది. "పెదవులు లేకపోతే, పళ్లు రక్షణ కోల్పోతాయి లేదా చల్లబడతాయి" అని చైనా నేత మావో జెడాంగ్ ఉత్తర కొరియా వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరిస్తూ అన్నారు.

ఒకరి భద్రత మరొకరి మనుగడపై ఆధారపడి ఉంటుందని చెప్పేందుకు పైన జాతీయాన్ని వాడతారు.

అంటే, ఈ రెండు దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

కానీ, ఉత్తర కొరియా వ్యవస్థాపక నాయకుడు కిమ్ ఇల్ సంగ్ మరింత బలమైన సైనిక హామీలను కోరుకుని, 1961లో సోవియట్ యూనియన్‌తో అధికారిక కూటమిని ఏర్పాటు చేశారు.

మరికొద్ది రోజులకే, ఆయన చైనాతో కూడా మరో సైనిక ఒప్పందంపై సంతకం చేశారు.

రెండు అగ్రరాజ్యాల నుంచి సైనిక మద్దతు ఉండటం వల్ల, ఉత్తర కొరియా వాటిలో ఒకదానికి శాటిలైట్ స్టేట్‌గా (పూర్తిగా వేరే దేశంపై ఆధారపడే లేదా వారి నియంత్రణలో ఉండే దేశంగా) మారే ప్రమాదం తగ్గింది.

ఆ సమయంలో, సాయం, చమురు కోసం సోవియట్ యూనియన్‌పై ఉత్తర కొరియా ఆధారపడేది.

షీ జిన్‌పింగ్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కరోనా మహమ్మారికి ముందు 2019 జూన్‌లో ఉత్తర కొరియాను సందర్శించిన షీ జిన్‌పింగ్

మరోవైపు, తీవ్ర కరువుతో, చైనా పౌరులు తుమెన్ నది సరిహద్దును దాటి ఉత్తర కొరియాలోకి వలస వెళ్లారు. ఉత్తర కొరియా విద్యా వ్యవస్థ విశిష్టమైనదిగా భావించి, వారిలో చాలామంది అక్కడే స్కూల్‌కు కూడా వెళ్లారు.

కానీ, 1991లో సోవియట్ యూనియన్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, యూఎస్ఎస్ఆర్) పతనం తర్వాత, ఉత్తర కొరియా తన సైనిక మిత్రదేశాన్ని, ప్రధాన ఆర్థిక మద్దతును కోల్పోయింది. అదే సమయంలో, ప్యాంగ్యాంగ్‌కు ప్రధాన ఆర్థిక సహాయక దేశంగా మారడానికి ఎదుగుతున్న చైనాకు ఈ పరిణామం మార్గం సుగమం చేసింది.

ఇప్పటికీ ఉత్తర కొరియాకు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా చైనానే కొనసాగుతోంది. తన పొరుగు దేశ స్థిరత్వం కోసం పెట్టుబడులు పెడుతూ... అమెరికా మద్దతు ఉన్న దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.

"ప్రభుత్వం కూలిపోకుండా కాపాడటానికి చైనా కేవలం సరిపడా ఆర్థిక సహాయం అందిస్తుంది. కానీ, ఉత్తర కొరియాను పూర్తిగా స్వయం సమృద్ధిగా మార్చే పెట్టుబడులను మాత్రం నివారిస్తుంది" అని హార్వర్డ్ యూనివర్సిటీ ఆసియా సెంటర్‌లోని విజిటింగ్ స్కాలర్ సియోంగ్-హ్యోన్ లీ బీబీసీకి తెలిపారు.

బదులుగా, చైనా 'క్యాలెండర్ డిసిప్లిన్'ను ఆశిస్తుందన్నారు. ఇదొక రకమైన అలిఖిత నియమం. అంటే ముఖ్యమైన చైనా దేశీయ లేదా దౌత్యపరమైన సంఘటనల సమయంలో ప్యాంగ్యాంగ్ పెద్దగా రెచ్చగొట్టే చర్యలు తీసుకోకూడదని ఆయన అన్నారు.

అయితే, అన్ని వేళలా ఉత్తర కొరియా ఈ నిబంధనలకు కట్టుబడి లేదు.

చైనా ప్రధానమంత్రి జౌ ఎన్‌లాయ్ (ఎడమవైపు), కొరియా వ్యవస్థాపక నాయకుడు కిమ్ ఇల్ సంగ్ (కుడివైపు)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా ప్రధానమంత్రి చౌఎన్‌లై (ఎడమవైపు), కొరియా వ్యవస్థాపక నాయకుడు కిమ్ ఇల్ సంగ్

అణు లక్ష్యాలను అమలు చేయడం

అణ్వాయుధ రహిత కొరియా ద్వీపకల్పాన్ని చైనా కోరుకుంది. కానీ, ఉత్తర కొరియా ఇప్పటికీ తమ అణు లక్ష్యాలను కోరుకుంటుంది.

1964లో యాంగ్‌బ్యాన్‌లో అణు పరిశోధన కేంద్రాన్ని తెరవడం ద్వారా.. ప్రపంచంలోనే అతి చిన్న అణ్వాయుధాగారానికి పునాది వేశారు కిమ్ ఇల్ సంగ్.

1985లో ఇంటర్నేషనల్ న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటే అంతర్జాతీయ అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకం చేసినప్పటికీ.. దాని నిబంధనలను ఉల్లంఘించి, ఫ్లూటోనియం నిల్వ చేశారు.

అయితే, తన దేశానికి ఒక పనిచేసే అణ్వాయుధం చేరడం చూడకముందే ఆయన మరణించారు.

కొడుకు కిమ్ జోంగ్ ఇల్ 1994లో పదవిలోకి వచ్చినప్పుడు, తాను కొత్తగా సృష్టించిన అణు కార్యక్రమాన్ని ఒక దౌత్యపరమైన ఆయుధంగా ఉపయోగించారు. ఆర్థిక సహాయానికి బదులుగా లేదా అమెరికాతో సన్నిహిత సంబంధాల అవకాశానికి బదులుగా రాయితీలను రాబట్టడానికి ప్రయత్నించారు.

ఉత్తర కొరియా 2003లో ఎన్‌పీటీ నుంచి వైదొలిగింది. మూడేళ్ల తర్వాత, ఉత్తర కొరియా తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. దీనిపై ఐక్యరాజ్యసమితి తక్షణమే స్పందించి, కఠినమైన ఆంక్షలను విధించింది.

చైనా సమ్మతి లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. కానీ, చైనా దీన్నొక ''ఘోరమైన'' చర్యగా వర్ణించింది. ఈ ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితం చేయడాన్ని సమర్థించింది. కానీ, ఉత్తర కొరియాను అణ్వాయుధాలు వదులుకునేలా బలవంతం చేయడానికి తన ఆర్థిక శక్తిని పూర్తిగా ఉపయోగించడానికి మాత్రం వెనక్కి తగ్గింది.

"ఉత్తర కొరియా పతనం లేదా తీవ్ర అస్థిరత బీజింగ్‌కు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. శరణార్థుల వలసలు, అణు అనిశ్చితి, అమెరికా లేదా దక్షిణ కొరియా సైనిక ప్రభావం ఉత్తర కొరియాకు వ్యాపించే అవకాశం ఉంది. ప్యాంగ్యాంగ్ అణు కార్యక్రమం పట్ల బీజింగ్‌కు ఉన్న అసంతృప్తి కంటే ఈ ఆందోళనలే చాలా ముఖ్యమైనవి" అని రీసెర్చ్ ఫెలో యూన్-జు చోయ్ అన్నారు.

2011కో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చైనా నియంత్రణ భావనను తొలగించేందుకు క్షిపణి కార్యక్రమాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లారు.

అధికారాన్ని చేపట్టాక.. రాజ్యాంగంలో ఉత్తర కొరియాను అణ్వాయుధ దేశంగా ప్రకటించారు. చైనా నాయకత్వం మార్పు చెందే సున్నితమైన సమయంలో వరుస పేలుళ్లను చేపట్టారు.

"రెచ్చగొట్టే ఎత్తుగడలకు పాల్పడినప్పుడు కూడా, కిమ్ జోంగ్ ఇల్ సాధారణంగా చైనా దౌత్య వ్యూహాలను హుందాగా గౌరవించారు" అని లీ అన్నారు. "కానీ దీనికి విరుద్ధంగా, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చైనాకు ఇబ్బంది కలిగించే సమయాలనే (టైమ్‌టేబుల్‌నే) ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారు" అని చెప్పారు.

2013 మార్చిలో షీ జిన్‌పింగ్ అధ్యక్షుడు అయ్యే సమయంలో కూడా కిమ్ తన మూడవ అణ్వాయుధ పరీక్షను చేపట్టారు. అంతేకాకుండా, చైనాకు రాయబారిగా పనిచేసిన తన మామ, సంస్కరణవాది జోంగ్ సాంగ్-థాయెక్‌ను కూడా హతమార్చారు.

దీనికి స్పందనగా.. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను కఠినతరం చేయాలని షీ జిన్‌పింగ్ వాదించడమే కాకుండా, దక్షిణ కొరియా నాయకుడికి అండగా నిలిచారు. ఉత్తర కొరియా అణు ఆశయాలను "ఎట్టి పరిస్థితుల్లోనూ" అంగీకరించబోమని ఆయన ప్రకటించారు.

ఉత్తర కొరియా, రష్యా

ఫొటో సోర్స్, KCNA via Reuters

ఫొటో క్యాప్షన్, పుతిన్ యుక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన అనంతరం రష్యాతో సంబంధాలు బలపర్చుకున్న ఉత్తర కొరియా

సరికొత్త మిత్రుడు 'రష్యా'

యుక్రెయిన్‌పై పుతిన్ దాడి చేసినప్పటి నుంచి రష్యాతో ఉత్తర కొరియా తన సంబంధాలను మరింత బలపరుచుకుంది.

తన బద్ధ శత్రువు, అత్యంత సన్నిహిత దేశం రెండూ ఏకమై వ్యతిరేకతను ప్రకటించడంతో.. బీజింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కిమ్ ప్రయత్నిస్తున్నారు.

అయితే, సంబంధాలను పునరుద్ధరించడానికి సమయం పట్టినప్పటికీ, రష్యా అందుకు సంతోషంగా అంగీకరించడాన్ని ఆయన గమనించారు.

2014 ఏప్రిల్‌లో.. ఉత్తర కొరియాకు చెందిన 11 బిలియన్ డాలర్ల విలువైన రుణంలో 90 శాతం క్రెమ్లిన్ రద్దు చేసింది. పలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది.

యుక్రెయిన్ యుద్ధం ఈ సంబంధాలను మరింత సన్నిహితంగా మార్చింది. పుతిన్‌కు ఆయుధాలు, మానవ వనరులు కావాల్సి ఉంది. కానీ, కిమ్‌కు సాయం, వాణిజ్యం, సైనిక సాంకేతికత అవసరం ఉంది.

అమెరికా చెబుతున్న వివరాల ప్రకారం.. యుక్రెయిన్‌ యుద్ధంలో వాడేందుకు మాస్కోకు పది లక్షలకు పైగా మందుగుండు సామాగ్రిని, గ్రాడ్ రాకెట్లను కిమ్ విక్రయించారు. మరోవైపు, రష్యా కోసం పోరాడుతూ 2,300 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు మరణించినట్లు బీబీసీ దర్యాప్తులో తేలింది.

2024 జూన్‌లో పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంబంధం చైనా దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం చైనాకు ఏకైక అధికారిక సైనిక మిత్రదేశం ఉత్తర కొరియాయే.

''2024లో ఉత్తర కొరియా, రష్యా మధ్యలో సంబంధాలు బలపడుతున్నప్పటి నుంచి ప్యాంగ్యాంగ్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు చైనా గట్టి ప్రయత్నాలు చేస్తుంది'' అని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లోని అసెసింగ్ చైనా ప్రాజెక్ట్ కో-డైరెక్టర్ పాట్రిసియా ఎం.కిమ్ చెప్పారు. మాస్కో తన స్థానాన్ని తీసుకోవాలని చైనా కోరుకోవడం లేదన్నారు.

విక్టరీ డే పరేడ్ సందర్భంగా సెప్టెంబర్‌లో కిమ్, పుతిన్‌లకు కలిపి షీ జిన్‌పింగ్ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఈ దౌత్యపరమైన చొరవ ఊపందుకుంది.

ఈ కార్యక్రమంలో షీ పక్కనే కిమ్ కూర్చున్నారని, ఇది ఒక అరుదైన, ప్రతిష్ఠాత్మకమైన స్థానమని విశ్లేషకులు అంటున్నారు.

ప్రయాణికుల రైళ్ల పునఃప్రారంభం, ఎయిర్ చైనా ద్వారా ప్రత్యక్ష విమాన సర్వీసులు, అలాగే చైనా ప్రీమియర్ లీ కియాంగ్, విదేశాంగ మంత్రి వాంగ్ యిలు ప్యాంగ్యాంగ్‌లో పర్యటించడం కూడా ఈ చొరవలో భాగమే.

షీ జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు

ఫొటో సోర్స్, KCNA via Getty Images

ఉత్తర కొరియా కొత్త అణు విధానానికి చైనా ఇటీవల అందిస్తున్న పరోక్ష మద్దతు.. తోటి కమ్యూనిస్ట్ దేశం పట్ల దాని వైఖరిలో మార్పులను చూపిస్తోందని లీ అన్నారు.

"మే 14-15 తేదీలలో జరిగిన ట్రంప్-షీ జిన్‌పింగ్ సమావేశం తర్వాత ఈ విషయం స్పష్టమైంది. ఆ సమావేశంలో బీజింగ్ తన అధికారిక ప్రకటన నుంచి 'అణు నిరాయుధీకరణ' అనే పదాన్ని తొలగించింది. ఇది వాషింగ్టన్ వైఖరికి పూర్తి విరుద్ధం" అని ఆయన అన్నారు.

ఉత్తర కొరియాకు బలమైన వైఖరి తీసుకోవడం వల్ల వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. తమకు మద్దతు ఇచ్చే దేశంతో సంబంధాలు తెంచుకోవడానికి ఎటువంటి కారణం లేదు.

"మారుతున్న ఈ వ్యూహాత్మక త్రికోణంలో ఉత్తర కొరియానే అతిపెద్ద లబ్దిదారు" అని పాట్రిసియా కిమ్ అన్నారు.

"ప్యాంగ్యాంగ్‌ను తమ వైపునే ఉంచుకునేందుకు మాస్కో, బీజింగ్ రెండింటికీ బలమైన కారణాలు ఉన్నాయి" అని చెప్పారు.

వాస్తవానికి బీజింగ్‌ను గమనిస్తే ఇది ప్యాంగ్యాంగ్‌ను పూర్తిగా కోల్పోలేదని, కేవలం దానిపై ఉన్న తన ఏకాధిపత్యాన్ని మాత్రమే కోల్పోయిందని గ్రహిస్తుందని లీ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)