‘డబ్బులిస్తారా, కిడ్నీలు తీసుకోమంటారా?’- అక్రమ వలసదారులను బంధించి చిత్రహింసలు పెట్టిన మిలిషియా

కుర్దులు, లిబియా, కుర్దిస్తాన్, ఇరాక్, బ్రిటన్, వలసలు, కిడ్నాప్, నిర్బంధం

ఫొటో సోర్స్, Kurdish Regional Government

    • రచయిత, సూ మిషెల్, బెన్ మిల్నె
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

(ఈ కథనంలో మిమ్మల్ని కలిచివేసే అంశాలుంటాయి)

నిరుడు వేసవిలో బ్రిటన్‌కు చేరుకునేందుకు బయలుదేరిన 300 మందికిపైగా వలసదారులను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టడమే కాకుండా, వారి అవయవాలను తొలగిస్తామని కొందరు బెదిరించినట్లు బీబీసీ దర్యాప్తులో వెలుగుచూసింది.

ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతానికి చెందిన ఈ యువకులందరినీ లిబియాలోని ఒక మిలీషియా బృందం బందీలుగా పట్టుకుంది. వారి కుటుంబాల నుంచి ఒక్కొక్కరి కోసం 5,000 డాలర్లును డిమాండ్ చేసింది.

డబ్బు వెంటనే చెల్లించకపోతే బందీల కిడ్నీలను తొలగిస్తామని హెచ్చరించింది.

బందీలలో విడుదలైన కొందరితో బీబీసీ మాట్లాడింది. బలవంతంగా ఆపరేషన్లు చేసినట్లు సూచించే ఫోటో ఆధారాలను కూడా పరిశీలించింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విడుదలైన బందీలు తమపై జరిగిన హింసకు సంబంధించిన ఆధారాలను చూపించారు.

దాదాపు 180 మందిని ఒకే గదిలో, కిక్కిరిసినట్లుగా ఉండే ప్రాంతంలో తమను నిర్బంధించారని వారు తెలిపారు.

ఇందులో ఇప్పటికే ఒక బందీ మరణించినట్లు సమాచారం. ఇంకా ఎంతమంది నిర్బంధంలో ఉన్నారన్నది స్పష్టంగా తెలీదు.

కుర్దులు, లిబియా, కుర్దిస్తాన్, ఇరాక్, బ్రిటన్, వలసలు, కిడ్నాప్, నిర్బంధం
ఫొటో క్యాప్షన్, స్మగ్లర్ నోవా ఆరన్ ఫ్రాన్స్‌లో 10 ఏళ్ళ జైలు శిక్షను అనుభవిస్తున్నారు

ఈ వలసదారులను లిబియా గుండా మధ్యధరా సముద్ర తీరానికి చేర్చాల్సిన బాధ్యత ఆ మిలీషియాదే. అయితే ఇరాకీ కుర్దులను అక్రమంగా రవాణా చేసే నోవా ఆరన్ ఈ ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతో చెల్లింపుల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలిసింది.

ఆరన్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో మనీలాండరింగ్, అక్రమ రవాణాకు సంబంధించిన వేర్వేరు కేసుల్లో దోషిగా తేలి 10 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

నోవా లాంటి మరో అక్రమ రవాణాదారు కార్డో జాఫ్‌పై బీబీసీ ఇటీవల నిర్వహించిన దర్యాప్తులో ఈ 300 మందిని కిడ్నాప్ చేసిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దర్యాప్తు ఫలితంగానే గత నెలలో జాఫ్ అరెస్టయ్యారు.

ఈ ఇద్దరు అక్రమ రవాణాదారులు గతంలో కలిసి పనిచేసినట్లు చెబుతారు. ఇద్దరూ ఇరాకీ కుర్దిస్తాన్‌లోని రాన్యా పట్టణానికి చెందినవారే. బ్రిటన్‌కు చెందిన ఒక థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్ నివేదిక ప్రకారం, ఆ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్న అక్రమ రవాణా ముఠాలు విస్తృతంగా ఉన్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జాఫ్ గురించి సమాచారం సేకరించేందుకు బీబీసీ దర్యాప్తు బృందం రాన్యాలో ఉన్నప్పుడు, బందీలలో ఒకరి తండ్రి తన కుమారుడి గురించి చెప్పేందుకు బీబీసీని సంప్రదించారు.

బ్రిటన్‌కు చేర్చుతామని చెప్పి ఆరన్ ముఠా తమ కుటుంబం నుంచి వేలాది డాలర్లు వసూలు చేసిందని అతను చెప్పారు. ఉత్తర ఆఫ్రికా గుండా మధ్యధరా సముద్రం దాటి యూరప్ చేరుకునేలా ఈ బృందం ప్రణాళిక వేసినట్లు చెప్పారు.

ఆ మార్గం లిబియా గుండా వెళ్తుంది. లిబియాలో ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉందని ఐక్యరాజ్యసమితి సలహాదారు ఆంథోనీ డంకర్లీ అన్నారు.

దేశంలోని అనేక ప్రాంతాలు ప్రత్యర్థి మిలీషియాల ఆధీనంలో ఉండగా, అక్రమ రవాణా ముఠాలు వాటి సహకారంపైనే ఆధారపడుతున్నాయి.

2025 సంవత్సరం వేసవికాలంలో ఇరాకీ కుర్దిస్తాన్ నుంచి విమానాల్లో లిబియాకు చేరుకున్న వలసదారుల బృందాలను వరుసగా ఒక కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంగణానికి తరలించి బంధించినట్లు బీబీసీ దర్యాప్తులో బయటపడింది.

ఆ తర్వాత మిలీషియా ఒక్కో బందీ కోసం 5,000 డాలర్లు డిమాండ్ చేసింది. మునుపటి ఒప్పందానికి సంబంధించిన చెల్లింపులు ఆరన్ పూర్తి చేయలేదని వారు ఆరోపించారు. డబ్బు త్వరగా అందకపోతే ఒక కిడ్నీ రూపంలో ఆ బకాయిని వసూలు చేస్తామని కుటుంబాలను హెచ్చరించారు.

బందీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా లిబియన్ మిలీషియా బందీల కుటుంబాలకు పంపింది. వాటిలో చాలావరకు తీవ్రమైన ఆందోళన కలిగించేలా హింసాత్మక దృశ్యాలే ఉన్నాయి. ఒక వీడియోలో ఓ యువకుడిని కిడ్నీ తొలగించే శస్త్రచికిత్స కోసం వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తున్నట్లు చెబుతూ వీడియో తీశారు.

కుర్దులు, లిబియా, కుర్దిస్తాన్, ఇరాక్, బ్రిటన్, వలసలు, కిడ్నాప్, నిర్బంధం

ఫొటో సోర్స్, Instagram

రాన్యాలో బీబీసీని సంప్రదించిన వ్యక్తి వాళ్ళు అడిగనంత డబ్బుని చెల్లించానని అన్నారు. అతని కుమారుడు జనవరిలో ఇరాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో స్వదేశానికి చేరుకున్న 110 మంది బందీలలో ఒకరు.

అయితే బందీగా ఉన్న సమయంలో తన కుమారుడు పంపినట్లు చెప్పిన ఒక ఫొటోను ఆయన మాకు చూపించారు. అందులో అప్పుడే మానుతున్న సర్జరీ గాయం కనిపించింది. అది బలవంతపు అవయవ తొలగింపుకు సంబంధించినదేనేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఆయనతో మాట్లాడిన కొద్ది సేపటికే ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న మరెందరో ముందుకు వచ్చారు. వారిలో చాలామంది తమ ఫోన్లలో ఉన్న ఇలాంటి ఫొటోలను చూపించారు.

ఆ తర్వాత ఆ ఫొటోలలో ఒకదాన్ని బ్రిటన్‌లోని ఒక వైద్య నిపుణుడికి చూపించగా, ఆ గాయం మూత్రపిండ శస్త్రచికిత్సలో చేసే గాట్లలానే కనిపిస్తుందని ఆయన అన్నారు. అయితే అవయవాన్ని నిజంగానే తొలగించారా అనే విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.

లిబియా గుండా సాగే వలస మార్గాల్లో డబ్బు కోసం కిడ్నాప్‌లు జరగడం కొత్త విషయం కాదని ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ నియంత్రణ బలహీనంగా ఉండటాన్ని నేర ముఠాలు దుర్వినియోగం చేస్తున్నాయని డంకర్లీ చెప్పారు. దీంతో దర్యాప్తులు, న్యాయపరమైన చర్యలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి.

చాలామంది బందీలు ప్రస్తుతం విడుదలయ్యారు. కొందరి కుటుంబాలు వెంటనే డబ్బు చెల్లించగా, మరికొందరు తమ అవయవాల ద్వారా మూల్యం చెల్లించి ఉండవచ్చని కుర్ద్ అధికారులు అనుమానిస్తున్నారు.

స్వదేశానికి తిరిగి వచ్చిన కొంతమంది బందీలతో బీబీసీ మాట్లాడింది.

తన కాలిని కాల్చి చిత్రహింసలకు గురిచేశారని ఒక యువకుడు చెప్పాడు. దానికి సంబంధించిన మచ్చలను చూపించాడు.

178 మందితో పాటు తనని కూడా ఒక చిన్న గదిలో నిర్బంధించారని 16 ఏళ్ల బాలుడు తెలిపాడు.

ఆరు నెలల పాటు మేము సూర్యుడి మొఖం కూడా చూడలేదు అని ఆయన అన్నాడు.

అంత ఇరుకైన పరిస్థితి ఉండేదని, అందరూ కూర్చున్నట్టుగానే నిద్రపోవాల్సి వచ్చేదని వివరించాడు. బందీలందరికీ ఒకే మరుగుదొడ్డి ఉండేదని, దాన్ని ఉపయోగించేందుకు ఎక్కువ సమయం తీసుకున్నవారిని కొట్టేవారని చెప్పాడు.

బందీల కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం, రోజుకు ఒక్క రొట్టె ముక్క మాత్రమే ఆహారంగా ఇచ్చేవారు. అదీ బందీలను పట్టుకున్నవారికి అదనంగా డబ్బు చెల్లించినప్పుడే అందేది.

అయితే ఈ ప్రమాదాలన్నీ తెలిసినా ఇరాకీ కుర్దిస్తాన్ నుంచి యూరప్‌కు అక్రమంగా వలస వెళ్లే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గలేదని కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వ హోం శాఖ సీనియర్ అధికారి హెమ్న్ మెరానీ తెలిపారు.

ఈ భయానక అనుభవాలను ఎదుర్కొని తిరిగి వచ్చిన వారు తమ స్నేహితులు, బంధువులకు వాటి గురించి చెప్పాలని తాను కోరుతున్నానని ఆయన చెప్పారు. అదే మార్గంలో వెళ్లాలనుకునే వారిని నిరుత్సాహపరచడమే లక్ష్యమన్నారు.

అయితే బలవంతంగా అవయవాలు తొలగించడం వల్ల చనిపోయినట్లు అనుమానిస్తున్న ఒక యువకుడి కథను ఆయన ప్రస్తావించారు. మరో ఇద్దరు బంధువులు ఇప్పటికే యూరప్‌కు బయలుదేరిపోయిన విషయాన్ని లిబియాలో మరణించిన తన కుమారుడి అంత్యక్రియలకు హాజరైన ఓ తండ్రి అప్పుడే తెలుసుకున్నారని చెప్పారు.

ఈ వ్యవహారంలో అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే మేము ఏ గుణపాఠమూ నేర్చుకోడం లేదు అని మెరానీ వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)