దుర్గా పూజ: మాంసాహారం తినకూడదన్న బాగేశ్వర్ బాబా పిలుపుపై పశ్చిమ బెంగాల్లో వివాదం.. బీజేపీ ఏమంటోంది?

ఫొటో సోర్స్, @bageshwardham
దుర్గా పూజ సందర్భంగా హిందువులు కేవలం శాకాహారమే తీసుకోవాలని బాగేశ్వర్ బాబాగా ప్రసిద్ధి చెందిన ధీరేంద్ర కృష్ణ గర్గ్ (ధీరేంద్ర శాస్త్రి అని కూడా అంటారు) పశ్చిమబెంగాల్లోని హౌడాలో ఆదివారం పిలుపునిచ్చారు.
ధీరేంద్ర శాస్త్రి పిలుపుతో పశ్చిమ బెంగాల్లో వివాదం ఏర్పడింది. బెంగాల్ సంస్కృతిని ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
మరోవైపు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా దీనిపై మాట్లాడారు.
"బెంగాలీలు చేపలు, మాంసం తినకుండా ఎలా ఉండగలరు? కాళీ మాతకు మాంసాన్ని సమర్పిస్తామని స్వామి వివేకానంద కూడా చెప్పారు. వివేకానందకు ఎదురు చెప్పాలనుకోవడం ప్రమాదకరం. అది ఆయన (ధీరేంద్ర శాస్త్రి) వ్యక్తిగత అభిప్రాయం" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య సోమవారం అన్నారు.
అయితే బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (30) పేరును సామిక్ భట్టాచార్య ప్రస్తావించలేదు.

బెంగాల్‌లోని హౌడా జిల్లా లిలుహాలో మూడు రోజుల హనుమాన్ కథ కార్యక్రమానికి ధీరేంద్ర శాస్త్రి హాజరయ్యారు.
ఓ ప్రభుత్వ ఆడిటోరియంలో ధీరేంద్రకు బెంగాల్ ముఖ్యమంత్రి శనివారం రోజు విందు ఏర్పాటు చేశారు.
ఈ విందుకు కేబినెట్ మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టు చేసింది.
‘మతాన్ని అవమానిస్తున్నారు.. అలాంటి వారిని తరిమేయాలి’
లిలుహాలో ఆదివారం నాటి కార్యక్రమంలో ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ.. "ఏమీ అనుకోకండి. కానీ, నాకు బెంగాల్ గురించి ఓ విషయం నచ్చదు. నవరాత్రి, దుర్గా పూజ సమయాల్లో పూజ మండపాల వద్ద మాంసాహారాన్ని తింటున్నారు. అనేక రకాల చెత్త ఆహారాన్ని వండుతున్నారు. ఈ నవరాత్రికి ప్రతి హిందువు మేల్కొని అలాంటివారిని తరిమేయాలి. వారు అపవిత్రులు. మతాన్ని అవమానిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, @bageshwardham
బెంగాలీ హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత..
ఈ వీడియో వైరల్ అవడంతో బెంగాలీ హిందువుల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. దుర్గా పూజ మండపాల నుంచి మాంసాహారాన్ని దూరంగా పెట్టాలని ఆగస్టు 26న విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రకటించిన కొద్ది రోజులకే బాగేశ్వర్ బాబా ఈ మేరకు పిలుపునిచ్చారు.
దీంతో బెంగాలీల ఆహారానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ బీజేపీ మరోసారి వివాదంలో చిక్కుకుంది.
అంతకుముందు, మే నెలలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్ ప్రజలను బలవంతంగా శాకాహారులుగా మారుస్తుందని నాటి అధికార తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టడానికి, బీజేపీ నేతలు చేపలతో ప్రచారం చేయాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, @bageshwardham
‘బెంగాల్ ప్రజలు ఏం తినాలో ఇతరులు చెప్పకూడదు’
ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య అలాంటి ఆదేశాలను తమ పార్టీ ఎన్నటికీ జారీ చేయదని సోమవారం చెప్పారు.
"పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఏం తింటారు? ఎలాంటి దుస్తులు ధరిస్తారు? అనేది మేం చెప్పకూడదు. బెంగాలీలకు నచ్చింది, వారికి అలవాటైందే చేస్తారు. ధోతీ ధరించాలనుకునేవారు ధోతీ ధరిస్తారు. లుంగీ కట్టుకోవాలి అనుకునేవారు లుంగీనే కట్టుకుంటారు. బెంగాలీలు చేపలు తినకుండా ఎలా ఉంటారు? ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది. బయటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యల గురించి మనం ఎందుకు ఆందోళన చెందాలి?" అని అన్నారు.
"శాకాహారిగా మారాలని ఎవరైనా పిలుపునిస్తే అందులో తప్పులేదు. దానికి సంబంధించి ఓ ఉద్యమం కూడా నడుస్తోంది. వైద్యులు సహా అనేక మంది శాకాహారాన్ని సూచిస్తున్నారు. కానీ, ఒకరు తమ ఇంట్లో ఏం తినాలి? అనేది ఒక సాధువు కానీ రాజకీయ పార్టీ గానీ ఎలా చెప్పగలదు? ఆయన (ధీరేంద్ర శాస్త్రి) దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవారు. ఆయన కేవలం ఓ విన్నపం చేశారు. అంతే" అన్నారు.
‘అనాదిగా వస్తున్న ఆచారం.. ఇతరుల జోక్యం సహించం’
బెంగాలీ హిందువులకు నిబంధనలు విధించేందుకు ధీరేంద్ర శాస్త్రి ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సహా సామాజిక మాధ్యమాలలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
"పశ్చిమ బెంగాల్లో హిందూత్వపై గట్టిగా మాట్లాడే సంస్కృతి ఉంది. ఇది హిందూ జాతీయవాదానికి పుట్టినిల్లు. శక్తి ఆరాధనకి ప్రధాన కేంద్రం. కాబట్టి, దుర్గా పూజ మండపాల వద్ద మాంసాహారం తినకూడదని, బాగేశ్వర్ బాబా చేసిన విన్నపం నిరాధారమైనది. అనవసరం. అది ఎలాంటి ప్రభావం చూపబోదు" అని పాత్రికేయుడు, రచయిత అభిజిత్ మజుందార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ధీరేంద్ర శాస్త్రి విన్నపాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖలో 2017 నుంచి 2022 ఫిబ్రవరి వరకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా ఉన్న సంజీవ్ సాన్యాల్ సైతం వ్యతిరేకించారు.
"హిందూ మతంలో శక్తి ఆరాధనకు సంబంధించి మాంసం ఒక అంతర్గత భాగం. దుర్గా దేవి, కాళీ మాతకు మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. దుర్గా పూజ సమయంలో నవమి, దశమి రోజులలో భక్తులు తినే ప్రసాదంలో మాంసం కూడా ఉంటుంది. ఇలాంటి ఆచారంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు" అని సాన్యాల్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు.
'బిరించి బాబా ఈజ్ బ్యాక్'.. అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు
ధీరేంద్ర పిలుపు బెంగాలీలకు 'బిరించి బాబా'ను గుర్తు చేసింది. సత్యజీత్ రే తీసిన 'మహాపురుష్' అనే సినిమాలో మత గురువు పాత్ర అది.
దీంతో 'బిరించి బాబా ఈజ్ బ్యాక్' అని ఓ సోషల్ మీడియా యూజర్ పేర్కొన్నారు.
"నాకు సత్యజీత్ రే తీసిన 'కపురుష్ ఓ మహాపురుష్' గుర్తొస్తుంది. మీకు 'బిరించి బాబా' గుర్తున్నారా?" అని మరో యూజర్ అడిగారు. "ది న్యూ ఏజ్ బిరించి బాబా" అని ఒకరు, "బిరించి బాబా నిజంగానే ఉన్నారు" అని మరొకరు వ్యాఖ్యానించారు.
బెంగాల్లో 'బాగేశ్వర్ ధామ్' ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానం..
బెంగాల్లోనూ బాగేశ్వర్ ధామ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తనతో పాటు స్టేజిపై ఉన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆహ్వానించారు.
"దుర్గా పూజ సమయంలో బెంగాల్ సహా భారత సంస్కృతిని పరిరక్షించేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బాబా మహారాజ్జీ.. దయచేసి ఇక్కడ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. బెంగాల్లోనూ బాగేశ్వర్ ధామ్ కేంద్రం ఉండాలి. ఇది సాధువులు తిరిగే నేల. ఆధ్యాత్మిక చింతనకు నెలవు" అని శుభేందు అధికారి అన్నారు.
అయితే, ఈ వ్యవహారానికి సంబంధించి ఓ టైమ్‌లైన్‌ని కూడా ఒకరు పోస్టు చేశారు. "1920లలో 'బిరించి బాబా' గురించి రాజశేఖర్ బసు రాశారు. ఆయనను 1965లో సత్యజిత్ రే 'మహాపురుష్'గా మలిచారు. 2026లో బెంగాల్ ప్రభుత్వం బాగేశ్వర్ బాబాను స్వాగతించింది" అని అందులో ఉంది.

ఫొటో సోర్స్, @bageshwardham
దుర్గా పూజకి సంబంధించి పశ్చిమ బెంగాల్లో కొత్త మార్గదర్శకాలు..
ఈ ఏడాది దుర్గా పూజకి సంబంధించిన నూతన నిబంధనలను సోమవారం సాయంత్రం దుర్గా పూజ నిర్వాహకులతో సమావేశం సందర్భంగా సీఎం శుభేందు అధికారి ప్రకటించారు.
"బెంగాల్ అతి పెద్ద పండుగ (దుర్గా పూజ) అక్టోబర్ 16 నుంచి 21 మధ్య జరగనుంది. అయితే రెడ్ రోడ్‌పై నిర్వహించే సంప్రదాయ కార్నివాల్ ఈ ఏడాది ఉండదు. బదులుగా, రోడ్ షోలు అన్నీ కోల్‌కతా సహా బెంగాల్‌లోని ఆరు ఇతర ప్రదేశాల్లో నిర్వహించనున్నాం. అక్టోబర్ 24 కల్లా విగ్రహాల నిమజ్జనం పూర్తి కావాలి" అని శుభేందు అధికారి పేర్కొన్నారు.
ఓ ప్రత్యామ్నాయ పథకం కింద తక్కువ బడ్జెట్ కలిగిన దుర్గా పూజ నిర్వాహకులకు రూ.లక్ష వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు శుభేందు అధికారి తెలిపారు. అందుకు సంబంధించిన దరఖాస్తులను పోలీసు స్టేషన్లో సమర్పిస్తే వారు పరిశీలించి, దానిని చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి పంపిస్తారని వెల్లడించారు.
"ముఖ్యమంత్రి పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేయాలని అనుకోవడం లేదు. చిన్న చిన్న పూజా నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందిస్తామని ఇదివరకే ప్రకటించాం. పెద్ద బడ్జెట్ కలగినవారు ప్రభుత్వ నిధులను పొందకూడదని విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్థిక సహకారం లేనిదే పూజ నిర్వహించుకోలేని వారికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది" అని శుభేందు అధికారి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చేసిన పలు కీలక ప్రకటనలు:
- దుర్గా పూజ నిర్వాహకులకు ఉచిత విద్యుత్.
- మండపాల వద్ద, నిమజ్జనం సందర్భంగా డీజేకి అనుమతి లేదు.
- అక్టోబర్ 24 కల్లా విగ్రహాల నిమజ్జన కార్యక్రమం పూర్తి కావాలి.
- మహాష్టమి నాడు బార్లు, మద్యం దుకాణాలు మూసివేస్తారు.
- మతపరమైన మనోభావాలను కించపరిచే విధంగా వేడుకలు, విగ్రహాలు ఉండరాదు. కాగాపండుగ సమయంలో ఆహారానికి సంబంధించి శుభేందు అధికారి ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
దుర్గా పూజ, నవరాత్రి వేళల్లో బెంగాలీ హిందువులు మాంసాహారం తీసుకుంటారు. ఉత్తర భారతంలో ఉపవాసాలు ఉంటారు. ఓ సర్వే ప్రకారం, పశ్చిమ బెంగాల్లో 99శాతం మంది ప్రజలు మాంసాహారులే.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























