అబ్రహం అకార్డ్స్: ట్రంప్ పదేపదే కోరుతున్న ఈ అగ్రిమెంట్‌ ఏంటి, పాకిస్తాన్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్‌కు, తమకు మధ్య శాంతి కుదరాలంటే అన్ని దేశాలు వెంటనే అబ్రహం ఒప్పందాల (అబ్రహం అకార్డ్స్‌)పై సంతకం చేయాలని డోనల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరిచేందుకు కుదిరిన ఒప్పందాలనే అబ్రహం ఒప్పందాలు అంటారు. 2020లో అంటే ట్రంప్ మొదటి టర్మ్‌లో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

‘‘అన్ని దేశాలు వెంటనే అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయాలని కోరుతున్నా. అలాగే అమెరికా అధ్యక్షుడిగా నాతో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటే, ఈ అపూర్వమైన ప్రపంచ కూటమిలో వారు కూడా భాగస్వాములు కావడం గౌరవంగా భావిస్తాం" అని తన 'ట్రూత్ సోషల్' పోస్టులో డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

ఈ ప్రకటనకు ముందు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, పాకిస్తాన్, తుర్కియే, జోర్డాన్, బహ్రెయిన్, ఈజిప్ట్ దేశాల నాయకులతో డోనల్డ్ ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు.

వీటిలో కొన్ని దేశాలు ఇప్పటికే అబ్రహం ఒప్పందాలపై సంతకం చేశాయి.

ఇప్పటివరకు ఈ ప్రతిపాదనపై బహిరంగంగా స్పందించిన ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే. పాక్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.

"దేశంలోని ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్న ఏ ఒప్పందంలోనూ పాకిస్తాన్ చేరదు. ఇజ్రాయెల్ మాటను నమ్మలేం" అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు.

ముస్లిం మెజారిటీ దేశాలు ఒక జట్టు, అమెరికా, ఇజ్రాయెల్ ఒక జట్టుగా ఉన్న దౌత్య వివాదాల్లో పాలస్తీనాకు దేశంహోదా, టూ స్టేట్స్ సొల్యూషన్ అంశాలు ఎప్పటి నుంచో సమస్యగా ఉన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యల వల్ల ఈ దౌత్య సంబంధాలు మరింత క్లిష్టంగా మారాయి.

ఏం జరిగింది?

2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌తోపాటు నాలుగు అరబ్ దేశాలైన బహ్రెయిన్, మొరాకో, సూడాన్, యూఏఈ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు ఏర్పడేలా ఒప్పందాలు కుదిరాయి. అప్పటివరకు ఈ ప్రాంతంలోని చాలాదేశాలు ఇజ్రాయెల్‌ను తమతో కలవనిచ్చేవికావు.

ఈ ఒప్పందంపై ట్రంప్ తొలి పదవీకాలంలో యూఏఈ, బహ్రెయిన్ మొదట సంతకం చేశాయి. దీని వల్ల పర్యటకం, వాణిజ్యం, భద్రతా సహకారం పెరిగాయి.

తర్వాత 2020, 2021లో మొరాకో, సూడాన్ వేర్వేరు ఒప్పందాలతో ఇందులో చేరాయి. 2025లో కజకిస్తాన్ కూడా ఈ ఒప్పందంలో భాగమైంది.

2020లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రణాళికను "శతాబ్దపు గొప్ప అవకాశం"గా అభివర్ణించారు. ఇది పాలస్తీనీయులతో చర్చలకు ఉపయోగపడుతుందని అన్నారు.

అయితే పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ మాత్రం ఈ ప్రణాళికను "శతాబ్దపు చెంపపెట్టు" అని కొట్టిపారేశారు.

"ట్రంప్, నెతన్యాహు ఇద్దరికీ చెబుతున్నా.. జెరూసలేం అమ్మకానికి లేదు, మా హక్కులు కూడా అమ్మకానికి లేవు, అవి చర్చకు కూడా రావు. మీ ఒప్పందం, మీ కుట్ర విజయవంతం కాదు" అని ఆయన వెస్ట్ బ్యాంక్ టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడారు.

ఈ ఒప్పందాన్ని ఇరాన్ నాయకత్వం కూడా తీవ్రంగా ఖండించింది.

కీలక అడ్డంకులేంటి?

పాలస్తీనా దేశస్థాపన అంశం అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికీ ప్రధానమైన వివాదం.

ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలకు ముందు పాలస్తీనీయులకు స్వతంత్ర దేశం కావాలి అన్న దీర్ఘకాలిక అరబ్ దేశాల ఏకాభిప్రాయాన్ని ఈ ఒప్పందం తునాతునకలు చేసింది.

ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌లోని పెద్ద భాగాలను తమలో కలిపేసుకోవడం ఆపితేనే ఈ ఒప్పందానికి తాము అంగీకరిస్తామని పాలస్తీనా స్వాతంత్య్రం విషయంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చెప్పారు.

వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం ప్రాంతాల్లో సుమారు 7 లక్షల మంది ఇజ్రాయెలీ యూదులు దాదాపు 160 సముదాయాలలో (సెటిల్‌మెంట్స్‌లో) నివసిస్తున్నారు. ఈ సెటిల్‌మెంట్లు అంతర్జాతీయ చట్టాల ప్రకారం అక్రమంగా పరిగణిస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ దీన్ని అంగీకరించడంలేదు.

తర్వాత ఏం జరిగింది?

యూఏఈతో వాణిజ్యం కొన్నేళ్లలో సుమారు 4 బిలియన్ డాలర్ల వరకు పెరగవచ్చు. దీని వల్ల 15,000కి పైగా ఉద్యోగావకాశాలు వస్తాయని 2020లో ఇజ్రాయెల్ అధికారులు అంచనా వేశారు.

2023లో ఇజ్రాయెల్, అబ్రహం ఒప్పంద దేశాల మధ్య వాణిజ్యం 4 బిలియన్ డాలర్లు దాటిందని, ఇది 2022తో పోలిస్తే 16% పెరుగుదలని ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (సీబీఎస్) గణాంకాలు చెబుతున్నాయి.

యూఏఈకి ఈ ఒప్పందం ద్వారా తమ సైనిక, వాణిజ్య లక్ష్యాలను మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం లభించింది. అలాగే యూఏఈ, బహ్రెయిన్ ఇరుదేశాలు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన హై-టెక్ రంగం కలిగిన దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్‌తో బహిరంగంగా వాణిజ్యం చేయగలిగాయి.

మొరాకోకు దౌత్య సంబంధాలు బలపడి కొంత ఆర్థిక లాభం వచ్చింది. సూడాన్ విషయం ఎక్కువగా ముందుకు వెళ్లలేదు. కజకిస్తాన్ చేరిక మాత్రం ఎక్కువగా సింబాలిక్‌గానే ఉంది.

2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడితో గాజా యుద్ధం మొదలైంది. ఆ దాడిలో సుమారు 1,200 మంది మరణించగా, 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు.

అప్పటి నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యల్లో గాజాలో 72,300 మందికి పైగా మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.

ఈ దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో దౌత్య పరిస్థితులు మారిపోయాయి. గాజా యుద్ధం వల్ల ఇజ్రాయెల్‌తో ఆ చుట్టుపక్కల దేశాల సంబంధాలు తగ్గడంతోపాటు ఉద్రిక్తతలు పెరిగాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)